మీనాక్షి దేవి కొలువుదీరిన మదురైలోనే చెల్లూరు ప్రాంతంలోని
ఆప్పుడైయారు ఆలయం చాలా ప్రసిధ్ధి పొందిన
అద్భుతమైన దేవాలయం.
అయితే తొలిరోజుల్లో స్వామివారికి నివేదన చేయడానికి కావలసిన ఆర్ధిక స్తోమత లేక ఆలయ పూజారి అష్ట కష్టాలు పడుతున్న రోజులు.
ఆలయ పూజారే స్వయంగా శ్రమపడి
బియ్యం సేకరించి తెచ్చి దేవునికి నైవేద్య ప్రసాదం తయారు చేసేవాడు.
ఒకనాడు ఆ గుప్పెడు బియ్యం కూడా లేవు. బియ్యం లేవన్న విషయం మరచిపోయి పొయ్యి మీద ఎసరు పెట్టాడు పూజారి. కాని ఒక్క బియ్యంగింజ లేక పోయేటప్పటికి స్వామి నివేదన ఎలా జరపాలో తెలియక అల్లాడిపోయాడు.
అప్పుడు " ఓయీ !బాధపడకు, వైగైనదీ తీరానికి వెళ్ళు.
చేతినిండా అక్కడి ఇసుకను తీసుకువచ్చి అన్నపూర్ణాదేవిని మనసారా వేడుకుని, నీవు పెట్టిన ఎసట్లో పొయ్యి. భక్తిపూర్వకంగా నీవు చేసే పూజలు సత్ఫలితాలు ఇస్తాయి. నీ కష్టాలు గట్టెక్కుతాయి.నేటి నుండి నిత్యం నీవు
ఎసరుకు పిడికెడు బియ్యంపెట్టినా కుండనిండా అన్నం లభిస్తుంది. '' అని
ఒక అశరీర వాణి వినపడింది పూజారికి.
అశరీరవాణి ఆదేశం ప్రకారం వైగైనదీ తీరంలోని ఇసుక ఎసట్లో పోయగానే, దైవ కటాక్షంతో ఆ ఇసుక బియ్యమై అన్నంగా సిధ్దమైనది.
ఈవిధంగా నిస్స్వార్ధంగా అర్చించే ఓ పేద పూజారికి అన్నాన్ని కటాక్షించి యిచ్చిన ఆ కోవెల లోని ఈశ్వరుడు
"అన్న వినోదన్" అనే పేరుతో పిలువబడుతున్నాడు.
మదురైలో కొలువైవున్న
ఆప్పుడైయారు ఈశ్వరుని భక్తితో సేవిస్తే
తమ పాపాలు తొలగి పోవడమేకాక ఆ
గృహంలో ఆహారానికి కొఱత లేకుండా సుఖసంతోషాలతో సుభిక్షంగా
వుంటారు.