అమృత బిందువులు - 1 మహాశాస్తా వారి దివ్య అవతారము

P Madhav Kumar


*శ్రీ మహాశాస్తా వారి దివ్య అవతారము*

*( స్కాంద పురాణాంతర్గత సారము - క్లుప్తముగా 


పూర్వము దేవాసురులు క్షీరసాగర మధనము చేయగా లభ్యమైన అమృతమును పంచిపెట్టుటకు శ్రీ మహావిష్ణువు జగన్మోహిని రూపము దాల్చి అనురులను మోహపరచి , స్పృహ తప్పించి , అమృతమును దేవతలకు మాత్రము పంచిపెట్టెను. సర్వులను మోహ పరవశములో డోలాయమానము గావించి , అతి రూప సుందర లావణ్య మూర్తిగా కన్పించిన జగన్మోహినిని గాంచిన పరమేశ్వరుడు. మోహ పారవశ్యముతో ఆ మోహినిని గాఢ పరిష్వంగము చేయదలచి ముందుకు సాగెను. అపుడు మోహిని రూపములో నున్న శ్రీహరి , పరమేశ్వరునితో *"ఈశ్వరా ! నేను నారాయణుడను. నా మాయతో స్త్రీ వేషము దాల్చియున్నాను అంతే. పురుషుడు పురుషుని మోహించుట తగదు"* అనెను. అందులకు శివుడు *"నీవు నాకు గల నాలుగు శక్తులలో ఒకటైన మాయాశక్తివి కాదా ! పూర్వము నీ కలయికతో నేను బ్రహ్మను సృష్టించినది మరచితివో ! దారుకా వనమున నీ విట్లే స్త్రీరూపము దాల్చినది గుర్తురాలేదా. గనుక ఇప్పటి ఈ మన కలయికలో పొరబాటేమియు లేదు"* అని పలువిధములు మోహినికి నచ్చచెప్పి కలిసెను , బదరీవనమున సాల వృక్షము నీడలో ఆ మోహినీ పరమేశ్వరుల కలయిక జరిగినది.


వారిరువురి కలయిక పలు వేల సంవత్సరములు కొనసాగినది. ఆ కలయికలో వెలువడిన మోహ జలము 'గండకీ' అను నదిగా ప్రవహించినది. ఆ జలము నందు వజ్రదంతి అను పురుగులు స్వర్ణఛాయలో ఉద్భవించి ఆ నదీతీరములోని మట్టితో గూడులేర్పరచుకొని కొన్నాళ్ళు నివసించి మరణించెను. అవి మరణించిన పిమ్మట ఆ గూళ్ళు శివ చిహ్నముతోను , విష్ణు చిహ్నముతోను కనుపించును. వాటిని సాలగ్రామములని అందురు. వీటిని ప్రత్యక్ష శివ , విష్ణు రూపులుగా తలచి పూజింతురు. సాక్షాత్ శివకేశవుల ప్రణయ ప్రతిబింబముగా , ఇచ్ఛా మాత్రాన ఆయోనిజులై ఆవిర్భవించిన , అద్భుత మూర్తివంతమైన వారే *శ్రీ జగన్మోహన సుందర శాస్తావారు.* నల్లని రంగు , ఎఱ్ఱని జటా జూటము , మందహాస భరిత ముఖకవళికలు , నవరత్న ఖచిత ఆభరణములను దాల్చిన వారు గాను , 'చెండు' అను ఆయుధమును కరమున దాల్చి , కలిలో ధర్మ శాసిత మూర్తియై , హరిహర పుత్రునిగా శ్రీ అయ్యప్ప అవతారము గావించారు. అయ్యకు, అప్పుకు (శివయ్య + వెంకటప్పు) పుత్రుడయిన వాడు గనుక లోకులు వీరిని 'అయ్యప్ప' అని అందురు. వీరు పరమేశ్వరాజ్ఞాను సారము భూత గణాధి పత్య బాధ్యత వహించి , ధర్మశాసనము చేయుచు , లోక పాలనము చేయుచున్నారు. ఇలా అద్భుత అవతార మూర్తి అగు శ్రీమహాశాస్తావారు , దేవేంద్రుని ప్రార్ధన మేరకు , ఇంద్రాణిని శూర పద్మాసురుడనే రాక్షసుని బారినుండి కాపాడుట కొరకై తెల్లని ఐరావతమునెక్కి , పూర్ణా పుష్కళా సమేతులై ఇంద్రుని భార్య ఇంద్రాణికి దర్శన మొసంగి నారనియు , స్కంధదేవుడగు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారు శూర పద్మాసురుని వధించి , ఇంద్రపురి సింహాసనాన్ని ఇంద్రునికి ఒప్పజెప్పినంత వరకు శ్రీ మహా శాస్తావారు తమిళనాడు లోని శీర్గాళి అను క్షేత్రమున ఇంద్రాణికి రక్షణ యొసంగినారనియు స్కాందపురాణము , 13వ అధ్యాయమగు అసుర కాండము నందు విశదీకరించబడి యున్నది.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat