నవగ్రహా పురాణం - 1 వ అధ్యాయం - పురాణ ప్రారంభం -1

P Madhav Kumar


*పురాణ ప్రారంభం -1

నిర్వికల్పాలలో శ్లోకం శ్రావ్యంగా ధ్వనించింది ; భక్తి ప్రతిధ్వనించింది. చేతులెత్తి సూర్యభగవానుడికి నమస్కరిస్తున్నాడాయన. శిష్యులు విమలానందుడూ , శివానందుడు , సదానందుడు , చిదానందుడు గురువుగారిని అనుసరిస్తూ సూర్యుడికి నమస్కారాలు అర్పించారు.


పడమటి ఆకాశంలో గుండ్రటి సూర్యుడు దిశా సుందరి నుదురు మీద సింధూర తిలకంలా మెరిసిపోతున్నాడు.


*"గ్రహణం వీడిన సూర్యుడు ఎలా ధగధగలాడిపోతున్నాడో చూశారా?"* తదేకంగా సూర్యబింబాన్నే చూస్తూ అన్నాడు నిర్వికల్పానంద.


*"ఔను గురువుగారూ ! సూర్యభగవానుడు కళకళలాడుతున్నాడు"* విమలానందుడు చిరునవ్వుతో అన్నాడు. 


*‘'గ్రహణం' నుంచి 'మోక్షం' సిద్ధించింది కదా ! అందుకే తెగ వెలిగిపోతున్నాడు”* చిదానందుడు నవ్వాడు.


అందరూ నదిలోంచి గట్టు వైపు అడుగులు వేస్తున్నారు.


*"ఈ గ్రహణాన్నీ , మోక్షాన్నీ చూశాక ఆ సూర్యుడి చరిత్ర , పుట్టుపూర్వోత్తరాలతో సాకల్యంగా వినాలనిపిస్తోంది... గురువుగారూ ! వినిపిస్తారా ?"* సదానందుడు ఆసక్తిగా అడిగాడు.


*“ఒక్క గ్రహరాజు చరిత్ర మాత్రమే ఏమిటి , సదానందా.... గురువుగారి అమృతవాణి ద్వారా నవగ్రహాల కథ అంతా విందాం !"* శివానందుడు ఉత్సాహంగా అన్నాడు.


నిర్వికల్పానంద గట్టుమీద ఆగి శిష్యుల్ని కలయజూశాడు. *"మన శివానందుడి ఆలోచన బాగుంది. నవగ్రహాల చరిత్రలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని వుంటాయి. అందుచేత అందరి గురించీ తెలుసుకుందాం. పదండి. ఇవాళే నవగ్రహ పురాణం ప్రారంభించుదాం !"*


ఆశ్రమంలో వాతావరణం ప్రశాంతంగా వుంది. పక్షుల కిలకిలారావాల్నీ , పువ్వుల సువాసనల్నీ మోసుకువస్తూ పరవశిస్తోంది పిల్లగాలి.


నిర్వికల్పానంద అరుగు మీద కూర్చున్నాడు. శిష్యులు ఆయన ముందు వినయంగా కూర్చున్నారు. నిర్వికల్పానంద మొహం మీద చిరునవ్వు మెరిసింది.


*"నవగ్రహాల చరిత్ర వినాలని మీరు ముచ్చట పడటం చాలా మంచిది. ఒకరి చేత 'చెప్పించుకుని వినాలి' అనుకోవడమే గొప్ప విషయం. ఎందుకంటే - 'శ్రవణం , కీర్తనం , స్మరణం , పాదసేవనం , అర్చనం , వందనం , దాస్యం , సఖ్యం , ఆత్మనివేదనం' అనేవి భక్తి యోగంలో తొమ్మిది విధానాలు. ఈ తొమ్మిదింటినీ కలిపి - 'నవ విధ భక్తి' అన్నారు పెద్దలు. ఈ తొమ్మిదింటిలో 'శ్రవణం' అనేది ప్రథమ విధానం మాత్రమే కాదు. ప్రధాన విధానం కూడా ! భక్తి ప్రక్రియలలో శ్రవణానిదే పెద్దపీట !"*


*"నవగ్రహ పురాణం అనేది ఒక మహత్తర , బృహత్తర చరిత్ర. ఆ పురాణ శ్రవణం నిర్విఘ్నంగా , నిరంతరాయంగా సాగిపోవాలి. నిర్విఘ్నంగా చేసే నవగ్రహ పురాణ ప్రవచనం , శ్రవణం - నవగ్రహాల ఆరాధనతో సమానం అన్నారు విజ్ఞులు."*


*“అయితే , గురువుగారూ , నవగ్రహ పురాణ శ్రవణం ప్రారంభించి , పూర్తయ్యేదాకా మనం సంచారం వెళ్ళమన్న మాట”* విమలానందుడు ప్రశ్నించాడు.


*"ఔను. సంకల్పించాం కదా ! నవగ్రహ పురాణ శ్రవణాన్ని శుభంగా ప్రారంభించి , శుభంగా పరిసమాప్తం చేద్దాం”* నిర్వికల్పానంద అన్నాడు.


*“గురువుగారూ ! ఒక సందేహం...." సదానందుడు అన్నాడు.*


*"ఈ సదానందుడికి సదా సందేహాలే !" చిదానందుడు నవ్వుతూ అన్నాడు. శిష్యులు ఆ నవ్వుతో శృతి కలిపారు.*


*"సందేహం అనేది మానసికమైన అన్వేషణ. సందేహాలకు సమాధానాలు పొందటం కూడా సాధనలో ఒక భాగమే ! ప్రశ్నోపనిషత్తు విన్నారు కదా !”* నిర్వికల్పానంద చిరునవ్వుతో అన్నాడు. *"నీ సందేహమేమిటో అడుగు , సదానందా !”*


*"ఏం లేదు గురువుగారూ.... నవగ్రహాలు అనగానే మనిషి భయభక్తులతో పూజలు చేస్తాడు. ఎందుకంటారు?”*


*“మంచిప్రశ్న ! నిజమే ! మానవులు భయాన్నీ , భక్తినీ రంగరించి ఆరాధించేది ఒక్క నవగ్రహ దేవతలను మాత్రమే ! నవగ్రహాల ప్రభావమూ , ప్రతాపమూ అంతగొప్పవి !”* నిర్వికల్పానంద వివరిస్తూ అన్నాడు. *“మానవుడు మాతృగర్భంలో పడిన క్షణం నుండి , కాలగర్భంలో కలిసిపోయేదాకా - అతని జీవితం పూర్తిగా నవగ్రహాల ప్రభావం మీద ఆధారపడి వుంటుంది.”

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat