అమ్మ ఎవరు | Amma Yevaru

P Madhav Kumar

 


శరన్నవరాత్రులు  - 'అమ్మ' ఎవరు?

అమ్మ ఎవరు? అంటే, అమ్మ పరబ్రహ్మ ! ఆదిపరాశక్తి ! సాకార నిరాకార స్వరూపిణి ! జగత్తంతా తన శక్తితో వ్యాపించి, నడిపించేది తల్లి.  జగన్మాత గురించి 'సైషాదేవీ ఇదమగ్ర ఆసీత్' అని చెప్పారు. సా ఏషా దేవీ - ఆ పరబ్రహ్మమే ఈవిడ, ఈ జగన్మాత రూపంలోవచ్చింది. ఈవిడే అందరికంటే అన్నింటి కంటే, ముందర ఉన్నది. ఈమెయే ఆద్యాదేవి.

ఏది ప్రామాణికం ? అంటే అన్నీ ప్రమాణాలే ! ఉన్నది ఒక్క సత్యమే ! దానినే అనేక రూపాలతో, నామాలతో, అనేకులు అనేక విధాలుగా స్తోత్రించారు.
" ఏకం సద్విప్రా బహుధా వదన్తి "* అని శ్రుతి వాక్యం. " ఏకమేవాద్వితీయం బ్రహ్మ " బ్రహ్మము ఒక్కటే ఉన్నది. రెండవది లేదు, అని ఉపనిషత్తు బోధిస్తోంది.

"మాతా చ పార్వతీదేవీ
పితా దేవో మహేశ్వరః !
బాంధవాః శివ భక్తాశ్చ
స్వదేశో భువన త్రయమ్"!!
అనిశంకరభగవత్పాదులు స్తోత్రించారు.

యావద్విశ్వానికీ తల్లి పార్వతీదేవి, తండ్రి మహేశ్వరుడు. శివభక్తులందరూ బంధువులే ! ముజ్జగములు మన స్వదేశమే, అనటంలోని విశాల దృక్పథము  - దేవతలు, దానవులు, మానవులు, తిర్యక్కులు  - సర్వ ప్రాణికోటి ఒకే పరమాత్మ సంతానము అనిచెప్పటమే ! అంటే, అందరికీ మూలము, ఆధారము, అధిష్ఠానము పరమాత్మే ! ఆ పరబ్రహ్మమునే అనేక నామాలతో, రూపాలతో ఆరాధిస్తాము. నిర్గుణము, నిరాకారము, నిరంజనము, త్రిలింగాతీతము అయిన పరమాత్మను స్త్రీగా భావిస్తే, ఆమే ఆదిపరాశక్తి. అంటే, అన్నింటి కంటే, అందరి కంటే మొట్టమొదటగా ఉన్న తల్లి ! ఆమెయే, సతీదేవిగా, పార్వతీదేవిగా వచ్చింది.
  ఆ పరబ్రహ్మను పుం రూపముగా భావిస్తే, పరమేశ్వరుడు ! ఈశ్వరుడు అంటేనే శాసకుడు, సర్వమును పాలించే వాడు. పరమమైన ఈశ్వరుడు పరమేశ్వరుడు. అత్యుత్కృష్టమైన శాసకుడు. ఏ దేవుని ఆరాధించే వారికి ఆ దేవుడే పరమేశ్వరుడు, గొప్ప పాలకుడు. శివభక్తులందరూ బంధువులు అంటే - శివము అంటే మంగళము, శుభము. మనకు మంగళములను, శుభములను ఇచ్చే దైవాన్ని ఏ నామరూపాలతో  భావించినా శివుడే  !శివకేశవులకు అభేదం, సర్వదేవతలకు అభేదమే  !

కాళిదాస మహాకవి

వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే !
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ !!
  అని స్తుతించాడు. వాగర్ధౌ ఇవ సంపృక్తౌ  - వాక్కు, దాని అర్ధము ఎలా అవినాభావమో, అలా ! అంటే, ఒక పదము పలకగానే, దాని అర్థం స్ఫురిస్తుంది. అది ఫలానా అని తెలుస్తుంది. పదము దాని అర్ధము ఎలా విడదీయడానికి రావో, అలా అవినాభావంగా కలిసి ఉన్న పార్వతీ పరమేశ్వరులను, జగత్తుకు తల్లి దండ్రులైనటువంటి వారిని  , వాగర్ధ ప్రతిపత్తయే వందే  - వాక్కులు, వాని అర్ధములు చక్కగా స్ఫురించుట కొరకు నమస్కరించు చున్నాను అని ప్రార్థించాడు.

వాక్కు జ్ఞాన వ్యక్తీకరణ సాధనము. వాక్కు అంటే శబ్దము. శబ్ద బ్రహ్మము ఓంకారము. ఓంకారము లోనుండి సర్వ వర్ణాలు వచ్చాయి. అంటే అక్షరాలు. అక్షరాలు వచ్చాయంటే, అక్షరాలు, పదాలు, భాష, భాషతో చెప్పబడే వస్తు జాతము అంటే ప్రపంచము వచ్చింది. ఓంకారము, దాని నాదము ఎలా విడదీయటానికి రావో, అలా ఏకమై ఉన్న పార్వతీ పరమేశ్వరులు అని చెప్పాడు కాళిదాస మహాకవి. అంటే పార్వతిగా, పరమేశ్వరునిగా ఇద్దరుగా కనిపిస్తున్నది ఒక్కరే అని చెప్పాడు.
  ఆ ఒక్కటే అయిన శక్తిని అమ్మవారిగా కొలవ వచ్చును. అయ్యవారిలా ఆరాధించ వచ్చును. అమ్మవారు నాద రూపంలో మనలో ఉంటేనే, మనం శబ్దరూపంలో మాట్లాడ గలుగుతున్నాము. వినబడని నాదం లోంచి ఓంకారం వచ్చింది. ఓంకారం లోంచి వేదాలు, వేదాల్లోంచి శాస్త్రాలు వచ్చాయి. మూలంలో ఉన్నదే దానిలోంచి వచ్చిన వాటిలో ఉంటుంది కనుక అన్నింటిలో ఉన్నది అమ్మవారే ! జగన్మాతే !

చండీ సప్తశతి నాల్గవ అధ్యాయములో ఏడవ శ్లోకంలో అమ్మవారి గురించి ఇలా చెప్పారు -

' హేతుస్సమస్త జగతాం త్రిగుణాపి దోషైః
న జ్ఞాయసే హరి హరాదిభిరప్యపారా !
సర్వాశ్రయాఖిలమిదం జగదంశ భూత
మవ్యాకృతా హి పరమా ప్రకృతిస్త్వమాద్యా !!

మహిషాసుర వధ చేసిన చండీ దేవిని - జగన్మాతను  దేవతలు ప్రశంసిస్తున్నారు, ప్రార్ధిస్తున్నారు
 - హేతుః సమస్త జగతాం  - 'తల్లీ ! నువ్వు సమస్త జగత్తుకు కారణమైన దానివి. త్రిగుణాత్మకురాలివి.  సత్వరజస్తమో గుణాలనే త్రిగుణాలు కలిగిన దానివైనా, ఇతరులకు ఉండే దోషాల వల్ల  నీవు ఇతరుల చేత తెలియబడటము లేదు. అంటే ఎవ్వరూ కూడా నీ అసలు స్వరూపాన్ని, అసలు తత్త్వాన్ని తెలుసుకోలేక పోతున్నారు. ఎందుకంటే నీవు తెలియబడని దానివి. కనుకనే హరిహరాదులు కూడా నిన్ను తెలుసుకోలేక పోతున్నారు. నీవే ఈ సమస్త జగత్తుకు ఆశ్రయమైన దానివి. ఈ జగత్తంతా నీలోని ఒక అంశ మాత్రమే ! నీవు పరమమైన ప్రకృతివి, ఆద్యా ప్రకృతివి.'

జగన్మాత ఇక్కడ పరబ్రహ్మ స్వరూపిణి గా స్తోత్రించబడింది, ఆద్యా ప్రకృతిగా కీర్తించబడింది. సమస్త జగత్తుకు ఆవిడే కారణమంటే ఆవిడే సృష్టి కర్త్రి. '...సృష్టి కర్త్రీ బ్రహ్మ రూపా...' ఆవిడే ప్రకృతి స్వరూపిణి కనుకే త్రిగుణాత్మకురాలు. సత్వరజస్తమో గుణములతో ఉన్న ప్రకృతి అయితే హరిహరులకు ఆమె గురించి తెలిసి ఉండాలి కదా ! కానీ ఎవ్వరూ ఆవిడను తెలుసుకోలేరు ఎందుకంటే జగన్మాత మన కంటికి కనుపించే ప్రకృతి మాత్రమే కాదు, ఆద్యా ప్రకృతి, మూలప్రకృతి. సృష్టి జరగక ముందు ఉన్న సామ్యావస్ధ ఈ తల్లియే ! అంటే ప్రధానము అన్నమాట ! త్రిగుణాలతో ఉన్నా, ఈవిడ నెందుకు తెలుసుకోలేరు అంటే, దేవతలకు మానవులకు కూడా బ్రహ్మజ్ఞానం కలగటం అంత సులభం కాదు. అవిద్య, పరిమితత్వము, జ్ఞానరాహిత్యము అనే దోషాలతో ఉంటారు కనుక మానవులకే కాదు, దేవతలకు కూడా ఈవిడ తెలియబడదు. ' దేవైరత్రా2పి విచికిత్సితం కిల' అంటోంది కఠోపనిషత్తు.

మనకు కనిపిస్తున్న ఈ విశ్వమంతా అమ్మవారి లోని ఒక పాలు మాత్రమేనట  ! మూడొంతులు ఎవ్వరికీ తెలియబడకుండా ఉన్నదిట.

'పాదోస్య విశ్వా భూతాని త్రిపాదస్యామృతం 
దివి త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః 
పాదోస్యేహాభవాత్పునః....'
అని పురుష సూక్తం చెప్తోంది.
 ఋగ్వేదం విరాట్పురుషుని వర్ణిస్తూ, ఈ యావద్విశ్వమూ ఆ విరాట్పురుషునిలోని నాలుగింట ఒక పాలు మాత్రమే అనీ, మూడు పాళ్ళు విశ్వానికి అతీతంగా పైన ఉన్నదనీ చెప్పింది. ఒక పాలయిన ఈ విశ్వములోని కోటానుకోట్లలో కోటోవంతు కూడా మానవులలో ఎవరికీ పూర్తిగా తెలీదు. అంతటి అనంతమైనది ఈ విశ్వము !

దైవానికి ఇన్ని రూపాలెందుకు ? అమ్మవారికి అన్ని నామాలు, రూపాలెందుకు ?  అన్నీ ఒక్కరేనా ? అంటే అన్నీ ఒక్కటే, అందరూ ఒక్కరే ! అదే మన సనాతన ధర్మంలోని గొప్పదనం ! మన హిందూమతం లోని మహోత్కృష్టత !  ఈ సమన్వయం మనకు మహర్షులు అడుగడుగునా అందించారు. 

ఉన్న ఒక్క పరబ్రహ్మమే సృష్టి చేసేప్పుడు బ్రహ్మగా, రక్షంచేటఫ్ఫుడు విష్ణువుగా, లయకారకుడుగా రుద్రుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

ఐక్యమంత్రం ఏం చెప్తోందో చూద్దాము.
'....వేదాన్తినోనిర్వచనీయమేక
యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశన్తి
శైవా యమీశం శివ ఇత్యవోచన్యం
 వైష్ణవా విష్ణురితి స్తువన్తి.....'
అనిర్వచనీయమైన పరతత్వాన్ని వేదాంతులు బ్రహ్మమంటారు, శైవులు శివుడంటారు, వైష్ణవులు విష్ణువంటారు.

ఆ తత్త్వమే సరస్వతిగా,  లక్ష్మిగా, కాళికా ఉన్న త్రిలోక జనని ఆదిపరాశక్తి.

విద్యా ప్రదాన సమయే శశికోటిశుభ్రాం
ఐశ్వర్య దాన సమయే నవ విద్రుమాభాం !
విద్వేషి వర్గ దళనే తు తమాల నీలాం
దేవీం త్రిలోక జననీం శరణం ప్రపద్యే  !!.
  విద్యల ననుగ్రహించే జ్ఞాన  ప్రదాయినిగా ఉన్నప్పుడు కోటి  చంద్రుల వలె తెల్లగా చల్లగా ఉన్న సరస్వతీ దేవిగా, సంపదలను, శుభాలను అనుగ్రహించేటప్పుడు ప్రేమను చూపించే ఎరుపు రంగు గల పగడపు కాంతితో ప్రకాశించే శ్రీమహాలక్ష్మి గాను, శతృవులను దునుమాడి శిష్టులను, భక్తులను రక్షించేటప్పుడు తమాల వృక్షము వలె నలుపు నీలి వర్ణంతో శోభిల్లే కాళికా దేవి గానూ ప్రకాశించే మూడు లోకాలకు తల్లి వైన జగన్మాత ను శరణు కోరుతున్నాను.
  అంటే ఒక్క తల్లే మూడు రూపాలుగా కనిపిస్తూ వివిధ కార్యాలు చేస్తోంది.

మార్కండేయ పురాణాంతర్గతమైన దేవీ మాహాత్యం లేక దేవీ సప్తశతి లేక దుర్గా సప్తశతలో జగన్మాత ఆదిపరాశక్తి - చండీదేవి తన శక్తులనే తన పరివార దేవతలుగా తనలో నుంచే  పుట్టించి, మహిషాసురుడిని, చండ,  ముండులను, రక్తబీజుడిని, ధూమ్రాక్షుడిని, నిశుంభుడినీ సంహరిస్తుంది. సమస్త రాక్షసులూ చనిపోయాక, తన సోదరుడైన నిశుంభుని మరణంతో క్రుధ్ధుడైన శుంభుడు అమ్మవారి మీదకు యుద్ధానికి వచ్చి,  ' ఓ దుర్గా ! నిన్ను యుధ్ధంలో జయిస్తే... అన్నావు. కానీ నువ్వు ఒక్కత్తివీ యుద్ధం చెయ్యలేదు. ఇంత మంది సైన్యాన్ని నీ వెంట తెచ్చుకున్నావు. వారి సహాయం తో యుధ్ధం చేశావు. అదేం పెద్ద గొప్ప పని !

'అన్యాసాం బలమాశ్రిత్య యుధ్ధ్యసే...' అన్నాడు. దానికి జగన్మాత శుంభునితో

'ఏకైవాహం జగత్యత్ర ద్వితీయా కా మమాపరా !
పశ్యైతా దుష్ట ! మయ్యేవ విశన్త్యో మద్విభూతయః ' !!
అని పలికింది.

'తతః సమస్తాస్తా దేవ్యో బ్రహ్మాణీ ప్రముఖా లయమ్ !
తస్యా దేవ్యాస్తనౌ జగ్మురేకైవాసీత్తదామ్బికా ' !!
నేను కాక ఎవరున్నారు?  నేనొక్కత్తినే ఉన్నాను. ఈ దేవతలందరూ నా విభూతులు, నా శక్తులు. నేనొక్కత్తినే నా శక్తులతో నీతో యుధ్ధం చేశాను. యుద్ధం చేసింది నేనే ! ఏకంగా ఉన్న నేనే అనేకంగా వచ్చాను అంది. వెంటనే ఆమెలో నుండి వచ్చిన దేవతలందరూ జగన్మాత శరీరం లోకి ప్రవేశించారు. అప్పుడు అంబిక తానొక్కత్తే నిలిచి శుంభుని సంహరించింది.
అనేకత్వంతో భాసించే ఏకత్వం తానే అని అమ్మ చూపించింది.

ఈ విశ్వమంతా అమ్మే ! వాఙ్మయమంతా అమ్మే ! ప్రతి ప్రాణి పుట్టక ముందు ఉండేది అమ్మ లోనే ! పుట్టాక ప్రథమంగా పలికేది 'అమ్మ' అనే ! శాశ్వతంగా విశ్రాంతి పొందేది అమ్మ లోనే ! అమ్మవారిని గురించి చెప్పటానికి వేదాలకే శక్తి చాలదు. చతుర్ముఖ బ్రహ్మ కు సాధ్యపడదు. వేయి ముఖాలతో ఉన్న ఆదిశేషునికి అసలే సాధ్యపడదు.

ఆదిపరాశక్తి అయిన జగన్మాత మహాత్రిపురసుందరీ దేవి మహామాయా స్వరూపిణి గా, మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతీ స్వరూపాలతో తన లీలలు ప్రదర్శిస్తోంది.  తానే తన ఇచ్ఛతో ద్విధాకరింపబడి పరమేశ్వర పరమేశ్వరీ రూపాలతో జగత్తును సమ్మోహపరుస్తూ, సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలనే పంచ కృత్యాలను నిర్వహిస్తూ విశ్వంలో అంతర్యామిగా అంతర్లీనమై ఉంది.
  వేదాలలో అనేక విధాలుగా జగన్మాతను సూక్తాల రూపంలో స్తుతించారు. అవి శ్రీ సూక్తం, మేధాసూక్తం, సరస్వతీ సూక్తం, భూసూక్తం, నీళాసూక్తం, సంధ్యాస్తుతి  మొదలైనవి. అమ్మ వారిని బ్రహ్మ విద్యా స్వరూపిణి గా కేనోపనిషత్తు చెప్తోంది. పరబ్రహ్మ ను గురించి చెప్పగలిగినది బ్రహ్మ విద్యయే ! ఆ బ్రహ్మ విద్య ఉమాదేవిగా వచ్చి ఇంద్రాది దేవతలకు బ్రహ్మ జ్ఞానం కలిగించింది.

'స తస్మిన్నేవాకాశే స్త్రియమాజగామ బహుశోభమానాముమాం హైమవతీమ్.'
శక్తి సిధ్ధాంతమును ప్రతిపాదిస్తున్న అమ్మవారికి సంబంధించిన ఉపనిషత్తులలో ప్రధానమైనవి - త్రిపురోపనిషత్తు, త్రిపురతాపిన్యుపనిషత్తు, దేవ్యుపనిషత్తు, బహ్వృచోపనిషత్తు, భావనోపనిషత్, సరస్వతీ రహస్యోపనిషత్తు, సీతోపనిషత్తు, సౌభాగ్యలక్ష్మ్యుపనిషత్తు, సావిత్ర్యుపనిషత్తు, అన్నపూర్ణోపనిషత్తు మొదలైనవి.

దేవీ అథర్వశీర్షం దేవి గురించి చెప్తుంది. త్రిపురారహస్యం మొత్తం త్రిపుర సుందరీ దేవి గురించి చెప్తుంది. దేవీభాగవత పురాణం జగన్మాత లీలల గురించి, అమ్మ మహిమ గురించి చెప్తుంది. దశమహా విద్యలు అమ్మ రూపాలే !
  సౌందర్య లహరి సాక్షాత్తుగా జగన్మాత దత్తమై జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరాచార్యుల చేత విరచితమైన అమ్మవారి యొక్క అలౌకిక సౌందర్యానంద శ్రోతస్సును వంద శ్లోక మంత్రాలతో స్తుతించే మంత్రశాస్త్ర గ్రంథ రాజము. ప్రతి ఒక్క శ్లోకానికీ యంత్రము, బీజాక్షరాలు ఉన్నాయి. శ్రీచక్రంలో నాలుగు కోణాలు శివ పరము, ఐదు కోణాలు శక్తి పరముగా ఉన్నాయి. ఈ తొమ్మిది చక్రముల ద్వారా సృష్టి, స్థితి, లయలు జరుగుతున్నాయని చెప్తారు.
శ్రీ లలితా రహస్య సహస్ర నామాలు, లలితా త్రిశతి, కనకధారాస్తవము, మూక పంచశతి, త్రిపురా మహిమ్న స్తవం, బాలా మంత్రశాస్త్ర గ్రంథం, ఆర్యా ద్విశతి మొదలైనవన్నీ అమ్మవారి గురించే చెప్తున్నాయి. అమ్మవారి రూపాన్ని భావించాలి, నామాన్ని జపించాలి, తత్త్వాన్ని అర్ధం చేసుకోవాలి. అమ్మ తత్త్వం అర్ధమయితే ఆవిడ సగుణ, నిర్గుణ తత్త్వాలు అర్ధమవుతాయి. నిరాకారము, నిర్గుణము అయిన అమ్మ సాకార రూపిణిగా ఎలా ఉంది అంటే -
'చిన్మయస్యాద్వితీయస్య నిష్కళస్యాశరీరిణః !
ఉపాసకానాం కార్యార్ధం బ్రహ్మణో రూప కల్పనా ' 
అని ఉపనిషత్తు చెప్పింది.

పరమాత్మ ను ఆరాధించటానికి ఒక ఆధారం కావాలి. అదే సగుణ బ్రహ్మ రూపం ! జగన్మాత రూపం ! సూర్యునిలోని వేడిమి, చంద్రునిలోని చల్లదనం మొదలుకొని సర్వదేవతా శక్తి రూపములు జగన్మాతే !

'శ్రీకృష్ణశ్శ్యామలాదేవీ, శ్రీరామో లలితాంబికా ' అన్నారు.

భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పన మాటలు అమ్మ మాటలే !
10వ అధ్యాయం విభూతియోగంలో శ్రీకృష్ణ పరబ్రహ్మ ఇలా చెప్పాడు. 
'అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్ధితః !
అహమాదిశ్చ మధ్యం చ  భూతానామన్త ఏవ చ '!!
అర్జునా ! సర్వప్రాణికోటి  అంతరంగాలలో ఉండే ఆత్మను నేనే ! నేనే సమస్తానికీ ఆదిలో మధ్యలో అంతంలో ఉన్నాను.

'ఆదిత్యానామహం విష్ణుః
జ్యోతిషాం రవిరంశుమాన్ !మరీచిర్మరుతామస్మి
నక్షత్రాణామహం శశీ' !!
ఆదిత్యులలో విష్ణువును నేను,  జ్యోతిర్మయ వస్తువులలో సూర్యుడను నేను, మరుద్గణాలలో మరుత్తును, నక్షత్రాలలో చంద్రుడిని నేనే !

ఇలాసర్వ వస్తుజాలాలలోని శ్రీ, విభూతీ తానే అని చెప్పాడు.
'యద్యద్విభూతిమత్సత్త్వంశ్రీమదూర్జితమేవ వా !
తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోంశ సంభవమ్' !!
ఐశ్వర్యం తోను, కాంతులతోను, ఉత్సాహంతోను కూడిన  వస్తువులన్నీ నా తేజస్సు యొక్క అంశాలేనని తెలుసుకో !! అష్ట లక్ష్ములుగా, నవ దుర్గలుగా, నవ గౌరీ దేవతలుగా, చండీదేవిగా, చాముండేశ్వరిగా, అష్ట మాతృకలుగా, అనేకానేక రూపాలతో జగన్మాత పూజలందుకుంటోంది. ఆమె కోటి యోగినీగణ సేవిత !!

మార్కండేయ పురాణాంతర్గతమైన దేవీమాహాత్మ్యం 700 మంత్ర శ్లోకాలలో ఇవ్వబడిన అమ్మవారి యొక్క అద్భుతమైన ఉపాసనా స్తోత్రం. దీనినే దుర్గాసప్తశతి అంటారు. ఇందులో ఆరాధించ బడిన దేవి చండీదేవి. అందుకే దీనిని చండీ సప్తశతి అని కూడా అంటారు. నిగమాగమస్తుతా దేవీ అంటారు. అంటే  వేదాలలోను, మంత్రశాస్త్ర గ్రంథాలలోనూ స్తోత్రించ బడిన తల్లి అని అర్థం. దుర్గా విద్య శ్రీ విద్యే ! దేవీ ఉపాసకులు నవాక్షరీ మంత్రోపదేశం పొంది, అమ్మవారి నారాధిస్తారు. బాలా మంత్రం, దుర్గా మంత్రం, చండీ మంత్రం ఒకే జగన్మాతను వేర్వేరు నామ రూపాలతో ఆరాధించే విధానాలు.

జగన్మాత గురించి వేదాలలో ప్రస్తావించారు, కానీ ఈ దేవీమాహాత్మ్యం వేదాలలో లేదు.  నిత్యము ఎందరో చండీ మంత్రాన్ని ఉపాసిస్తారు, జపిస్తారు, చండీహోమము చేస్తారు. కానీ ఇది ఆగమాలలో లేదు. ఇదిపురాణంలో ఉంది. పురాణాల్లో  ఉన్నా, దీనిని మంత్ర శాస్త్రం లో  వినియోగిస్తున్నారు.  మార్కండేయ పురాణంలో ఉన్న దేవీ మాహాత్మ్యమునకు వేద ప్రతిపత్తి నిచ్చి, ఆగమ శాస్త్ర ప్రకారంగా మంత్ర అనుష్ఠానం, జపం, హోమం చేసి అమ్మ నారాధిస్తున్నారు, సత్ఫలితాలను పొందుతున్నారు.

ఐహికాముష్మిక అభీష్ట సిధ్ధికోసం - ఇష్ట  ప్రాప్తి కోసం, అనిష్ట పరిహారం కోసం ఈ చండీ సప్తశతి పారాయణ చేస్తారు, చండీహోమము చేస్తారు. మంత్రోపదేశము పొందిన వారు నియమ నిష్ఠలతో చండీ పారాయణ చెయ్యాలి. ఈ దుర్గా సప్తశతి పారాయణ శీఘ్ర ఫల ప్రదాయిని.  చండీహోమము చేసి, అమ్మవారిని ఆరాధిస్తే, ఎటువంటి క్లిష్ట పరిస్థితులలో ఉన్నా, రక్షింపబడతారు.
  మంత్రోపదేశము పొందని వారు కూడా చండీహోమము చూడవచ్చు. సత్ఫలితము పొందవచ్చు. దుర్గా సప్తశ్లోకీ పారాయణ చెయ్యవచ్చు. మంగళ చండికా స్తోత్రం కూడా చెయ్యవచ్చు. అందరూ మంత్రోపదేశం పొంది నియమ నిష్ఠలతో ఉపాసించలేరు కనుక సర్వ మానవాళీ చదివి తరించటం కోసం మహర్షి అత్యంత దయతో ఇంత శక్తి మంతమైన దేవీ మాహాత్మ్యాన్ని పురాణం లో చెప్పారు. ఈ దేవీమాహాత్మ్యం ఉపనిషత్తుతో సమానమైనది.

వ్యాసమహర్షి మార్కండేయ పురాణం లో 578 శ్లోకాలలో దేవీ మాహాత్మ్యాన్ని చెప్తే, ఆగమ శాస్త్రకారులు వాటిని ఎలా విభజిస్తే, అవి  మంత్రాలవుతాయో,  అలా విభజించి, 700 మంత్రాలను, 900 మంత్రాలను తయారు చేశారు. సప్త శతి, నవశతి   అని పేర్లు పెట్టారు. ఇంత పెద్ద సప్తశతిని  చదవలేని వారి కోసం దుర్గా సప్తశతి సారం ఏడు శ్లోకాలలో చెప్పి, 'దుర్గా సప్తశ్లోకీ' అన్నారు. దుర్గా సప్తశ్లోకీలోవి అని తెలియక పోయినా ఆ శ్లోకాలు చాలామంది నిత్యము జపిస్తుంటారు. అవి అమృతపు రస గుళికలలా ఉంటాయి. మహా శక్తిమంతమైనవి. లోక క్షేమం కోసం మహేశ్వరుడు జగన్మాతను ' ఓ భక్త సులభురాలా ! కలియుగంలో మానవులు తరించటానికి, సర్వ కార్యాలను సిధ్ధించుకోవటానికి ఏదైనా ఒక ఉపాయాన్ని చెప్పు ' అని అడిగాడు. అప్పుడు అమ్మవారు దుర్గా సప్తశ్లోకీ అంబాస్తుతిని చెప్పింది.

జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సా
బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి !!
అమ్మవారు మహా మాయా స్వరూపిణి. ఆ మాయ ఎంతటి జ్ఞానవంతులనైనా, బలంగా లాగి మోహవివశులను చేస్తుంది. సర్వ ప్రాణికోటినీ మోహపరవశులను చేసేదీ ఆ తల్లే, మోహం లోంచి బయట పెట్టేదీ ఆ తల్లే ! శాస్త్రాలలో ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం, అపరోక్ష జ్ఞానాల గురించి చెప్పారు. ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎంత ప్రత్యక్ష పరోక్ష జ్ఞానం ఉన్న మహాజ్ఞానులనైనా మహామాయ లాగేస్తుంది. సంసార రూప మోహగర్తంలో పడేస్తుంది. కానీ అపరోక్ష జ్ఞానం కలిగిన బ్రహ్మజ్ఞానులకు మాత్రం వశవర్తని అయి ఉంటుంది.

భగవద్గీత లో శ్రీకృష్ణపరమాత్మ కూడా 'మమ మాయా దురత్యయా ' అని చెప్పాడు.
" ఈశ్వరస్సర్వభూతానాం హృద్దేశే2ర్జున తిష్ఠతి !
భ్రామయన్సర్వ భూతాని యంత్రారూఢాని మాయయా "!!
అర్జునా ! సర్వ భూతాలనూ తన మాయచేత కీలుబొమ్మల్లా ఆడిస్తున్న ఈశ్వరుడు అందరి హృదయాంతరాళాల లోనూ ఉన్నాడు. 

దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతోః
స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి !
దారిర్ద్యదుఃఖభయహారిణి కా త్వదన్యా
సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్తా !!
  సర్వ జనులకు కూడా, దుర్గా ! అని తలుచుకోగానే భయాన్ని పోగొడతావు, వారిని స్వస్థ చిత్తులను చేస్తావు, సకల శుభాలను కలిగిస్తావు. దరిద్రాన్ని, దుఃఖాన్ని, భయాన్ని పోగొట్టడంలో నీకంటె గొప్పవారు వేరొకరు లేరు. నీవు అత్యంత దయతో ఆర్ద్రమైన మనస్సు తో సకల ఉపకారాలను చేసి, శుభాలను కలిగిస్తావు.

సర్వ మంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే !
శరణ్యే త్ర్యంబికే గౌరి నారాయణి నమో2స్తు తే !!
 సకల మంగళాలను కలిగించే సర్వ మంగళ స్వరూపిణీ !  హే శివానీ ! సకల కోర్కెలను తీర్చేదానా ! సర్వ జనులకు దిక్కైనదానా  !  శరణు కోరిన వారందరికీ ఆశ్రయమైనదానా ! మూడు కన్నులు కలిగి మూడు కాలాలను, మూడు లోకాలను, సృష్టి స్థితి లయలను మూడు క్రియలను, జాగ్రత్ స్వప్న సుషుప్తులనబడే మూడు అవస్థలను ఒకేసారి దర్శించగల శక్తి కలదానా ! నీ అచంచలమైన భక్తి తో అఖండ దీక్షతో చేసిన తపస్సు తో ఈశ్వరుని మెప్పించి, ఆయన శరీరములో సగభాగం పొందినటువంటి హే గౌరీదేవీ  ! శ్రీమన్నారాయణుని సోదరివైన నారాయణీ  ! నీకు నమస్కారములు. 

శరణాగతదీనార్త పరిత్రాణపరాయణే  !
సర్వస్యార్తిహరే  దేవి  నారాయణి నమో2స్తు తే  !!
ఆర్తులయి దీనులయి నిన్ను శరణు కోరినటువంటి వారిని రక్షించే తల్లీ ! అందరి బాధలను పోగొట్టే దేవీ ! నారాయణీ ! నిన్ను శరణు కోరుతున్నాను, నీకు నమస్కరిస్తున్నాను.

సర్వ స్వరూపే సర్వేశే  సర్వశక్తిసమన్వితే !
భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమో2స్తు తే !!
హే దుర్గాదేవీ ! నీవే సర్వ స్వరూపివి, అంటే విశ్వ రూపిణివి, అందరినీ పాలించే తల్లివి, సర్వ శక్తి మంతురాలివి. మాకు కలిగే భయాలనుంచి మమ్మల్ని కాపాడు తల్లీ ! లోకంలో జీవులకు ఎన్నో రకాల భయాలుంటాయి. అన్నింటి కంటే మించిన భయం సంసార భయం. జనన మరణ వలయ భయం ! ఈ భయం నుంచి కాపాడు తల్లీ ! అంటే మళ్ళీ ఈ సంసారంలో పుట్టకుండా చేసి జన్మరాహిత్యాన్ని అనుగ్రహించి, మోక్షాన్ని ప్రసాదించు తల్లీ  !

రోగానశేషానపహంసి తుష్టా రుష్టా తు కామాన్ 
సకలానభీష్టాన్ త్వామాశ్రితానాం న 
విపన్నరాణాం త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి !!
తల్లీ ! నిన్నాశ్రయించిన వారి మీద నీకు అనుగ్రహం కలిగితే, వారియందు నువ్వు ప్రసన్నురాలివైతే, వారి సకల బాధలు పోగొడతావు, రోగాలన్నింటినీ సమూలంగా నశింపజేస్తావు. ఆయుర్వేదము, హోమియోపతి చికిత్స లలో  జబ్బు లక్షణాలను, రోగ మూలాలను కనిపెట్టి, వాటిని తగ్గిస్తారు. రోగ కారణమైన మూలం నశిస్తే, రోగం పూర్తిగా నయమవుతుంది, మళ్ళీ రాదు. అదే పైపైన పోగొడితే, అది మళ్ళీ వచ్చే అవకాశం ఉంది.

అమ్మ ను ఆశ్రయించిన వారికి భవరోగం సమూలంగా నశిస్తుంది. ఎవరైనా ధర్మం తప్పితే, శాస్త్రాలను అతిక్రమిస్తే నీకు కోపం వస్తుంది. అప్పుడు బాధలు కలుగుతాయి. కనుక జనులు ధర్మపరులమయి అమ్మవారిని ఆశ్రయించాలి. నిన్ను ఆశ్రయించిన వారు ఇంకొకరి నెవ్వరినీ ఆశ్రయించ వలసి రాదు. ఆ విధంగా నీ భక్తులను అనుగ్రహిస్తావు. సంసారసాగరాన్ని దాటించే తల్లివి నువ్వు.

సర్వబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి
ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరివినాశనమ్ !!
  మూడు లోకాలకు పాలకురాలివైన జగన్మాత అనుగ్రహం వల్ల అన్ని బాధలు, ఆధివ్యాధులు,  అన్ని తాపాలు ఉపశమిస్తాయి. తల్లీ  ! ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవికమైన త్రివిధ తాపాలను పోగొట్టి, అరిషడ్వర్గమనే మా శతృవులను నశింపజేసి,  మా శతృవులలోని శతృభావాలను పోగొట్టి మమ్మల్ని అనుగ్రహించు. ఇదే నీవు చేయవలసిన పని, అని అమ్మవారిని ప్రార్ధించాలి. కర్మ, ఉపాసన, జ్ఞానముల మేలు కలయిక చండీసప్తశతి. ఆదిపరాశక్తి భక్తులను బ్రోచేటప్పుడు ప్రసన్నముగా ఉంటుంది. అప్పుడు ఆవిడ లలితా దేవి. దుష్ట రాక్షసులను శిక్షించేటప్పుడు చండీదేవి గా ప్రకాశిస్తుంది. సృష్టి లో ఏ శక్తైనా దాని ప్రసన్నత్వము మనకు కావాలి, ప్రచండత్వము కావాలి.

"సావర్ణిః సూర్యతనయో యో మనుః కథ్యతే2ష్టమః "- అని ప్రారంభమవుతుంది
దుర్గా సప్తశతి ప్రథమాధ్యాయము. స్వారోచిష మన్వంతరంలో ఎనిమిదవ మనువు సూర్య పుత్రుడైన సావర్ణి. ' సా వర్ణిస్సూర్యతనయః ' అనేదే ఒక మంత్రం.
సా అంటే ఆమె ! ఆ పరబ్రహ్మ స్వరూపిణీ అయిన జగదంబ !  అనిర్వచనీయమైన పరతత్వాన్ని సః అనో, సా, అనో, తత్ అనో చెప్తాము. వర్ణిః - వర్ణము అంటే అక్షరము,  రంగు - అంటే అమ్మవారిని గురించి చెప్పే మంత్రము అని అర్థం చేసుకోవచ్చు. అష్టమః మనుః - ఎనిమిదవ మనువు అంటే - 'య' నుంచి ఎనిమిదవ అక్షరాన్ని తీసుకోవాలి. అది - 'హ' అంటే హ్రీం బీజాక్షరానికి సంబంధించిన కథ - అమ్మవారి కథ అని అర్థం.
  ఏ గ్రంథాలు చదువుతున్నా, కథతో పాటు తాత్విక చింతన, ఆధ్యాత్మిక దృక్పథము ఉండాలి. వాటిని మనకు అన్వయించుకోవటం తెలియాలి. అప్పుడు మనం తత్త్వం తెలుసుకో గలుగుతాము. జీవితంలో, సాధనలో పరమాత్మ వైపు పయనించ గలుగుతాము.

చండీ సప్తశతిలో మొత్తం పదమూడు అధ్యాయాలున్నాయి. అది మూడు భాగాలు గా ఉంటుంది. మహాకాళీ, మహాలక్ష్మి, మహాసరస్వతుల మహిమలు ఇందులో కీర్తించబడతాయి. మధుకైటభుల సంహారము, మహిషాసురుడు,  చండముండులు, ధూమ్రాక్షుడు, రక్తబీజుడు,  శుంభనిశుంభులు అనే రాక్షసులను, వారి పరివారమును జగన్మాత చండీదేవి తన శక్తులైన కాళిక ఇత్యాది  పరివారముతో కలిసి యుధ్ధం చేసి సంహరించటం చెప్పబడింది. ఈ సప్తశతిలో నాలుగు స్తోత్రాలున్నాయి.  బ్రహ్మదేవుడు, దేవతలు జగన్మాతను స్తోత్రించారు. ఈ నాలుగు స్తోత్రాలలో ఋగ్వేదము లోని దుర్గా సూక్తం, సరస్వతీ సూక్తం, మేధా సూక్తం, శ్రధ్ధాసూక్తం, భూసూక్తం మొదలైన దేవీ సూక్తముల సారం ఉన్నది. సాధారణ మానవులకు వేదసూక్త సారము నందించటానికి మహర్షులు ఇలాంటి స్తోత్రాలు వ్రాస్తారు.

పూర్వం స్వారోచిష మన్వంతరంలో చైత్రవంశానికి చెందిన ' సురథుడు ' అనేరాజు రాజ్యాన్ని పాలిస్తుండగా, కోలావిధ్వంశులు అనే శతృ రాజులు సురథుని మీద దాడి చేసి, ఓడించి, మా పక్షాన రాజ్యపాలన చేస్తూ నామమాత్రపు రాజుగా ఉండమన్నారు. స్వరాజ్యానికి తిరిగి వచ్చిన సురథుడు వేట నెపంతో అడవికి వెళ్ళి,  'సుమేథసుడు' అనే మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. మహర్షి ఆయనకు ఆతిథ్యమిచ్చాడు. తన పరిస్థితికి దిగులు పడుతూ కాలం గడుపుతుండగా, ఒకనాడు ఆ ఆశ్రమానికి ' సమాధి ' అనేపేరుగల వైశ్యుడు ఒకడు వచ్చాడు. అతని పిల్లలే అతని సంపాదనంతా తీసుకుని, అతణ్ణి తరిమేశారు. వీళ్ళిద్దరూ పరస్పరం కష్టాలు చెప్పుకుని, ఓదార్చుకుని, ఒక శుభ ముహూర్తాన సుమేథ మహర్షి దగ్గరికి వెళ్ళి, శరణువేడి, తమ కష్టాలు చెప్పుకున్నారు. మా మనస్సులు మా అధీనంలో లేవు. మా దుఃఖాన్ని పోగొట్టమని ప్రార్ధించారు. "ద్వావప్యత్యన్త దుఃఖితౌ"

ఇక్కడి నుంచి సుమేధ మహర్షి చేసిన బోధ ప్రారంభమవుతుంది. మహర్షి వారిద్దరికీ బోధిస్తున్నారు.
'జ్ఞానమస్తి సమస్తస్య జన్తోర్విషయగోచరే...' పుట్టిన ప్రతి ప్రాణికీ జ్ఞానముంటుంది, ఇంద్రియ జ్ఞానం, విషయ జ్ఞానం. మనం పెంచుకుంటున్న విషయజ్ఞానం వలన నేను, నాది అని ఏర్పడి, రాగద్వేషాలు కలుగుతాయి. మానవునికి జంతువులకు తేడా జ్ఞానంలోనే ఉంది.

"జ్ఞానమస్తి సమస్తస్య
జన్తోర్విషయగోచరే ! .
జ్ఞానినో మనుజాః సత్యం
కింతు తే న హి కేవలమ్ "!!
  అందుకే శంకరాచార్యులు 'జంతూనాం నరజన్మ దుర్లభమ్...' అన్నారు.
"లోభాత్ ప్రత్యుపకారాయ నన్వేతాన్ కిం న పశ్యసి !
తథా2పి మమతావర్తే మహాగర్తే నిపాతితాః !!

మహామాయా ప్రభావేణ సంసారస్థితికారిణా !...
మహామాయా హరేశ్చైషా
తయా సంమోహ్యతే జగత్ !
జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సా !!

బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి !
తయా విసృజ్యతే విశ్వం జగదేతచ్చరాచరమ్ !!

సైషా ప్రసన్నా వరదా నృణాం భవతి ముక్తయే !
సంసారబంధహేతుశ్చ సైవ సర్వేశ్వరేశ్వరీ  !!

మన బాధ మహామాయ వల్ల వచ్చింది. మనిషి మమత అనే గోతిలో పడి బయటకి రాలేక కొట్టుకుంటున్నాడు. ప్రపంచ నిర్వహణ కోసం మహామాయ మోహాన్ని పుట్టిస్తుంది. శ్రీహరి  యొక్క యోగనిద్రా రూపంలో మహామాయ ఉంటుంది. ఆ మహామాయ అనుగ్రహం తో మోహంలోంచి బైట పడగలుగుతాము.

ఇలా మహర్షి చెప్పగానే ఆ మహామాయ గురించి చెప్పమని సురథ మహారాజు ప్రార్ధించాడు. 'అథా2తో బ్రహ్మ జిజ్ఞాసా' అని బ్రహ్మ జ్ఞాన చర్చ ప్రారంభమైనట్లుగా కష్టాల వల్ల వైరాగ్యం కలిగి జగన్మాత గురించి తెలుసుకోవాలనిపించింది వీరిద్దరికీ ! భగవద్గీత లో లాగా దేవీ మాహాత్మ్యంలో కూడా మోహంతో ప్రారంభమయి, మోహం పోగానే మోక్షము ప్రాప్తిస్తుంది. సుమేథ మహర్షి జగన్మాత గురించి చెప్తూ బ్రహ్మ జ్ఞాన బోధ చేశారు.

నిత్యైవ సా జగన్మూర్తిస్తయా సర్వమిదం తతమ్ " !
 ఎప్పుడూ ఉన్న, శాశ్వతమైన జగన్మాత మూర్తే ఈ విశ్వమంతా !
యుధ్ధం యదా యదా బాధా దానవేభ్యో భవిష్యతి!
తదా తదా2వతీర్యా2హం కరిష్యామ్యరిసంక్షయం !! అని జగన్మాత ఎప్పుడు రాక్షసుల వల్ల బాధలు కలిగినా, తాను అవతరించి, శతృనాశనం చేస్తానని అభయమిచ్చింది. అమ్మ ఎప్పుడెప్పుడు ఎందుకు ఎలా ఉద్భవించిందో ఆ కథలను సవివరంగా వారికి తెలియజెప్పాడు.

సృష్టి కి పూర్వం ప్రళయావస్థలో జగత్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉండగా, ఆయన కర్ణ మాలిన్యం లోంచి మధు, కైటభుడు అనే ఇద్దరు రాక్షసులు వచ్చారు. విష్ణునాభికమలంలో  ఉన్న బ్రహ్మ దేవుని బాధించసాగారు.  యోగమాయ సంకల్పం వల్లే శ్రీ హరి యోగనిద్రలో ఉంటాడు, అమ్మ సంకల్పం వల్లే నిద్రలేస్తాడు. అంటే త్రిమూర్తులకు అధిదైవం జగన్మాత ఆదిపరాశక్తి. బ్రహ్మదేవుడు యోగనిద్రాదేవిని ప్రార్ధించాడు. అదే ఇందులో మొదటి స్తోత్రం. ఆవిడ బైటికి రాగానే శ్రీ మహావిష్ణువు మధుకైటభులను సంహరించాడు. ప్రతిప్రాణిలోను చైతన్యం ఉంది. నిద్రించే చైతన్యాన్ని మేల్కొలిపితే, అమ్మ దర్శనమవుతుంది. విష్ణువు సత్త్వగుణసంపన్నుడు. మధుకైటభులు రజస్తమోగుణాలు. సత్త్వగుణం మేల్కొంటే రజస్తమోగుణాలు నశిస్తాయి. మధు అంటే తేనె, తీపి. కైటభుడు అంటే కైటభం - కీటకం. తేనె చుట్టూ కీటకాలు తిరుగుతుంటాయి. మనిషికి అన్నింటి కంటే తీపి తానే, నేను అనేదే ! అహం. నేను ఉంటే అనేకమైన నావిలు - మమ  ఉంటాయి. అహంకార మమకార నాశనమే మధు కైటభ నాశనము.

పూర్వం మహిషాసురుడు దేవతలను జయించి, స్వర్గాన్నాక్రమించగా, దేవతలు బ్రహ్మ తో కలిసి విష్ణు రుద్రుల దగ్గరికి వెళ్ళి  మహిషుని ఆగడాల గురించి చెప్పారు. ఆ మాటలు వినగానే శివకేశవులకు ధర్మ రక్షణ కోసం క్రోధమొచ్చింది. వారి ముఖాల నుంచి, దేవతలందరి ముఖాల నుంచి తేజస్సులు బయటి కొచ్చి, అన్నీ కలిసి ఒక రూపు ఏర్పడింది. ఆ రూపు ఆదిపరాశక్తిగా భాసించింది. ఆమెయే చండీదేవి. ఆమె అందరి శక్తుల సమూహ శక్తి ! ఆ దేవతలకు శక్తి నిచ్చిన పరాశక్తే వారిలో నుంచి బైటకు వచ్చింది. ఈశ్వర విష్ణువుల క్రోధం లోంచి వచ్చిన చండి  మహిషాసురుని సంహరించింది. మహిషము - దున్నపోతు - జడత్వానికి, జంతు తత్వానికి ప్రతీక ! పైగా అసురుడు. అతి బలవంతుడైన మహిషాసురుడు నిహతుడవగానే, దేవ గణములందరూ ఆనందించారు. అంబికాదేవిని - చండికా దేవిని స్తోత్రించారు. 
ఇది రెండవ స్తోత్రం.
" దేవ్యా యయా తతమిదం జగదాత్మశక్త్యా
నిశ్శేషదేవగణశక్తిసమూహమూర్త్యా !
థామంబికామఖిలదేవమహర్షిపూజ్యాం భక్త్యా నతాః స్మ విదధాతు శుభాని సా నః "!!
జగత్తంతా తన ఆత్మశక్తితో వ్యాపించి ఉన్న తల్లి, సమస్త దేవతల శక్తి సమూహము అమ్మ రూపము. సమస్త దేవతల చేత ఋషుల చేత పూజింపబడుతున్న అంబికను నమస్కరించుచున్నాము. ఆమె మాకు శుభములు కలిగించు గాక ! దేవతలు ఋషులు కలిసి స్తోత్రం చెయ్యటమంటే, మన ఆలోచనలతో, వాక్కులతో, ఇంద్రియాలతో పరమాత్మను స్తోత్రం చెయ్యటమే !

హేతుస్సమస్తజగతాం త్రిగుణాపి దోషైః
న జ్ఞాయసే హరిహరాదిభిరప్యపారా !
సర్వాశ్రయాఖిలమిదం జగదంశభూత
మవ్యాకృతా హి పరమా ప్రకృతిస్త్వమాద్యా " !!
  అద్భుతమైన రీతిలో అమ్మను స్తోత్రం చేసి, నందనవన కుసుమాలతో అర్చన చేశారు. ఆ స్తోత్రంతో ఆనందించిన అమ్మ వరం కోరుకోమంటే, " అమ్మా ! దుష్ట రాక్షసుడిని సంహరించావు. మాకింకేం కావాలి ? ఎవరు ఈ స్తోత్రం తో నిన్ను కీర్తిస్తారో వారికి సకల శుభాలను అనుగ్రహించమని కోరారు.

"యది చా2పి వరోదేయస్త్వయాస్మాకం మహేశ్వరి
సంస్మృతా సంస్మృతా త్వం నో హింసేథాః పరమాపదః !
యశ్చ మర్త్యః స్తవైరేభిస్త్వాం స్తోష్యత్యమలాననే !
తస్య విత్తర్ధ్ధివిభవైర్ధనదారాదిసంపదామ్ !
వృధ్ధయే స్మత్ప్రసన్నా త్వం భవేథాః సర్వదాంబికే !! సరేనని వరమిచ్చి, భద్రకాళి అంతర్హితురాలైనది.

ఒకప్పుడు శుంభుడు, నిశుంభుడు అనే రాక్షస సోదరులు విజృంభించి, దేవతలకు చెందవలసిన యజ్ఞ హవిర్భాగాలను తామే తీసుకుంటూ దేవతలందరినీ రాజ్య భ్రష్టులను చేసి బాధించసాగారు. అప్పుడు దేవతలందరూ అమ్మ ఇంతకు ముందు తమకిచ్చిన వరాన్ని గుర్తుచేసుకున్నారు. రాక్షసుల వల్ల ఆపదకలిగితే, తనను స్మరిస్తే, రాక్షసులను నశింపజేస్తానని అపరాజితాదేవి అనుగ్రహించింది. దేవత లందరూ హిమవత్పర్వతానికి వెళ్ళి విష్ణుమాయను ప్రార్ధించారు. ఇది మూడవ స్తోత్రం. మహాశక్తివంతమైన స్తోత్రం.

" నమో దేవ్యై మహాదీవ్యై శివాయై సతతం నమః !
నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మ తామ్ !!

రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః !
జ్యోత్స్నాయై చేన్దురూపిణ్యై సుఖాయై సతతం నమః !!

యా దేవీ సర్వ భూతేషు విష్ణుమాయేతి శబ్దితా !
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః !!

యా దేవీ సర్వ భూతేషు చేతనేత్యభిధీయతే !
నమస్తస్యైనమస్తస్యై నమస్తస్యై నమోనమః !!

యా దేవీ సర్వభూతేషు బుధ్ధి రూపేణ సంస్ధితా; 
నిద్రారూపేణ , క్షుధా రూపేణ, ఛాయా రూపేణ ....... సంస్ధితా !
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః !!

ఇంద్రియాణామధిష్ఠాత్రీ భూతానాం చాఖిలేషు యా !
భూతేషు సతతం తస్యై వ్యాప్తి దేవ్యై నమో నమః !! ...

ఈ స్తోత్రం మహా శక్తిమంతమైన  సూక్తం. ఇందులో మహర్షి జగన్మాత యొక్క మంత్ర, తంత్ర, యంత్ర కీలక రహస్యాలన్నీ నిక్షిప్తం చేశారు. దీనికి అపరాజితా సూక్తము, దేవీ సూక్తము, మహాసూక్తము అని పేరు. ఈ సూక్తము వేదంలోని దేవీసూక్తంతో సమానము. దేవీ మాహాత్మ్యం మొత్తం ఈ సూక్తములో చెప్పబడింది. సర్వవ్యాపకమైన చైతన్యం జగన్మాతే అని చెప్పారు. మనిషికి జీవితంలో కావలసినవన్నీ జగన్మాత రూపాలే, అని చెప్పి అటువంటి దేవికి నమస్కారములని ప్రతి పాదములో మూడు మూడు సార్లు చెప్పారు. అంటే దానికి తిరుగు లేదని అర్థం.  త్రికరణాలతో శరణాగతి చేస్తున్నారని అర్థం ! ప్రతి పాదంలోనూ ఐదు సార్లు నమః అంటున్నాము ఈ స్తోత్రంలో ! అంటే పంచేంద్రియాలతో నమస్కరిస్తున్నామని అర్థం ! 
  సగుణ నిర్గుణ రూపిణికి నమస్కరించటం ! జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థలకు సాక్షిగా ఉన్న, తురీయ స్వరూపిణి అయిన, తురీయాతీత పరమాత్మకు నమస్కరించటం ! విశ్వరూపంలో ఉన్న, విశ్వాతీతమైన పరబ్రహ్మకు నమస్కరించటం !!
భగవద్గీతలోని విభూతియోగసారం ఇదే !

విశ్వమంతా వ్యాపించిన జగన్మాతను ప్రార్ధించగానే, అమ్మవారు సాకార రూపంలో పార్వతీదేవిగా, గంగలో స్నానం చెయ్యటానికి వచ్చినట్లుగా అక్కడికి వచ్చింది దేవకార్యం పూర్తి చెయ్యటానికి !
హిమవత్పర్వత ప్రాంతాల్లో విహరిస్తున్న సుమనోహర రూపిణి అయిన అంబికను శుంభ, నిశుంభుల భృత్యులైన చండ, ముండులు చూశారు.

' దదర్శ చండో ముండశ్చ భృత్యౌ శుంభనిశుంభయోః ' ! వెళ్ళి తమ యజమానులకు ఆమె సౌందర్యం గురించి చెప్పారు. ముల్లోకాల్లోనూ ఇలాంటి సౌందర్యం చూడలేదన్నారు. విలువైన రత్నాలన్నీ రాజుల దగ్గరే ఉండాలి ఆమెను తెచ్చుకోమన్నారు.

' రత్నభూతమిహానీతం యదాసీద్వేదసో2ద్భుతమ్ ' !

ఈ మాటలు విన్న శుంభుడు సుగ్రీవుడు అనే దూతని అమ్మవారి దగ్గరికి పంపాడు. ఆ దూత రాజు చెప్పిన మాటలను ఆవిడకు చెప్పాడు.  ఓ దేవీ ! దేవతలను జయించిన రాక్షసరాజు శుంభుని దూతను నేను. ఆయన ఇలా చెప్పమన్నాడు. ' స్త్రీరత్నమైన నువ్వు నా దగ్గర ఉంటే శోభిల్లుతావు. కనుక నువ్వు వచ్చి, నన్ను కానీ నా సోదరుని కానీ చేపట్టు. '
  ఆ వార్త విని దుర్గాదేవి - ' అవును, నువ్వు నిజమే చెప్పావు. కానీ నేను ముందే ఒక ప్రతిజ్ఞ పూనాను. నన్ను ఎవరు యుధ్ధంలో జయిస్తారో, నా దర్పాన్ని పోగొడతారో, లోకంలో నాకు ఎవరు ప్రతిబలులో, ఆయనే నాకు భర్త. కనుక వెళ్ళి చెప్పు, శుంభుడైనా సరే, నిశుంభుడైనా సరే, నన్ను జయించి, పాణిగ్రహణం చేసుకోమను.'

యో మాం జయతి సంగ్రామే యో మే దర్పం వ్యపోహతి
యో మే ప్రతిబలో లోకే స మే భర్తా భవిష్యతి !!
  తన దూత తెచ్చిన సమాధానం విన్న శుంభుడు క్రోధంతో మండిపడుతూ, దైత్యాధిపుడు, సైన్యాధ్యక్షుడైన ధూమ్రలోచనుడిని పిలిచి, నువ్వు సైన్యంతో వెళ్ళి, ఆవిడను ఓడించి, తీసుకురా ! అని ఆజ్ఞాపించాడు. అతను వేలమంది సైన్యాన్ని వెంట తీసుకుని హిమవత్పర్వత ప్రాంతానికి వెళ్ళి, అమ్మవారితో ఘోరంగా యుధ్ధం చేశాడు. జగ జగదంబిక అతని సైన్యాన్ని సంహరించి, హూంకారంతో ధూమ్రాక్షుడిని భస్మీభూతం చేసింది. మిగిలిన సైన్యాన్ని అమ్మవారి వాహనమైన సింహం మట్టు పెట్టింది.

' హుంకారేణైవ తం భస్మ సా చకారాంబికా తతః ' !!
  ధూమము అంటే పొగ. ధూమ్రలోచనుడు అంటే మసకబారిన కళ్ళవాడు. మసకబారిన కళ్ళకి ఉన్నది ఉన్నట్లుగా కనిపించదు. సత్యం తెలీదు. అమ్మవారి హుంకారంతో ధూమ్రలోచనుడు మరణించాడు. హుం అనేది బీజాక్షరం. బీజాక్షర జపం వల్ల కలిగే శబ్ద చైతన్యం యొక్క స్పందన మనలోని రాక్షసత్వాన్ని నశింపజేస్తుంది. ఆ వార్త విని శుంభుడు మహోగ్రుడై, చండ ముండులను పిలిచి, మీరు వెళ్ళి, ఆవిడను ఓడించి, జుట్టు పట్టుకొని లాక్కురండి అని ఆజ్ఞాపించాడు.

హే చండ ! హే ముండ !
బలైర్బహుభిః పరివారితౌ !
తత్ర గచ్ఛత గత్వా చ
సా సమానీయతాం లఘు !!
  వాళ్ళిద్దరూ హిమశైలేంద్ర శృంగానికి వెళ్ళి, సింహవాహని, కరాళవదనా అయిన కాళితో యుధ్ధానికి తలపడ్డారు. జగదంబిక కోపం ప్రదర్శించి, కనుబొమలు ముడివెయ్యగానే, అందులోంచి  కాళికాదేవి వచ్చింది. వికటాట్టహాసం చేసింది. రాక్షసులు దూకుతూ ఉంటే, కాళీదేవి అందరినీ గుర్రాలతో, ఏనుగులతో, రథాలతో సహా మ్రింగేసింది.

కాలమే కాళీదేవి. కాలం సర్వాన్నీ, సర్వులను గ్రసిస్తుంది. కాలాతీత అయిన అమ్మవారి లోంచి కాలం వచ్చి, సర్వ ప్రాణికోటినీ మింగేస్తుంది. కాలరూపంలో పరమాత్మను దర్శించిన మన సనాతన ధర్మము విశ్వములోకే మహోన్నతమైనది. అందరమూ కాలగమనంలో వెళ్ళిపోయేవాళ్ళమే ! ఆ సత్యాన్ని తెలుసుకోగలవారికి గర్వము, అహంకారాలుండవు.

కారేరాజులు రాజ్యముల్ గలుగవే, గర్వోన్నతిం బొందరే 
వారేరీ సిరి మూటగట్టుకొని పోవంజాలిరే, భూమిపై
బేరైనం గలదే శిబి ప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై
యీరే కోర్కులు, వారలన్ మరచిరే యిక్కాలమున్ భార్గవా ! 
అని బలిచక్రవర్తి శుక్రాచార్యునితో చెప్పాడు. జీవితం అశాశ్వతమైనది. ఆత్మ శాశ్వతమైనది. ఆత్మజ్ఞానం పొంది శాశ్వతానందం పొందాలి, అశాశ్వతమైన శరీరంతో శాశ్వతమైన కీర్తిని సంపాదించుకోవాలి.
  కాళీదేవి విజృంభించి, చండుడిని పడగొట్టి, ముండుడి తలను ద్రెంచి, చండముండులిద్దరి తలలనూ పట్టుకుని అంబికాదేవిని దగ్గరికి వచ్చింది. అమ్మవారు చాలా ఆనందించి, నువ్వు చండముండుల తలలను తెచ్చావు కనుక ' చాముండి ' నామంతో పిలవబడతావని అనుగ్రహించింది.

'యస్మాచ్చండం చ ముండం చ గృహీత్వా త్వముపాగతా !
చాముండేతి తతో లోకే ఖ్యాతా దేవి భవిష్యసి' !!

'చమూన్ సమూహాన్ సైన్యాన్ దాతి ఇతి చాముండా' !
 సైన్యాన్ని, సమూహాన్నీ  లాగేసే తల్లి. అంటే అనేకత్వాన్ని పోగొట్టి ఏకత్వంలో నిలిపే తల్లి, జ్ఞానప్రదాయిని, మోక్షప్రదాయిని అయిన తల్లి చాముండాదేవి.

శుంభనిశుంభులు బయలుదేరారు  వేలసైన్యంతో, రకరకాల రాక్షసజాతులతో !
అమ్మవారు ధనుష్ఠంకారం చేసింది. అనేకులైన రాక్షసులు మరణించారు. దేవతలందరూ ఆకాశంలో నిలబడి చూస్తున్నారు. వారందరిలో నుంచి దేవతా శక్తులు బైటికొచ్చాయి.

" బ్రహ్మేశగుహవిష్ణూనాం తథేంద్రస్య చ శక్తయః !
శరీరేభ్యో వినిష్క్రమ్య  తద్రూపైశ్చండికాం యయుః '!!

బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారీ, వైష్ణవి, ఐంద్రీ, వారాహీ, నారసింహీ మొదలైన సకల దేవతా శక్తులు వచ్చాయి. అమ్మవారు శివుడిని తన దూతగా శుంభనిశుంభుల దగ్గరికి పంపింది. వాళ్ళు తనను శరణు కోరి దేవేంద్రునికి త్రైలోకాధిపత్యం ఇచ్చి, దేవతలకు హవిర్భాగాలు  తీసుకునే అవకాశం  కల్పిస్తూ రాక్షసులందరూ  పాతాళానికి వెళితే రక్షిస్తాననీ, లేకపోతే సంహరిస్తాననీ కబురు పంపింది. ఆ  మాటలు విన్న రాక్షసులకు  కోపం  వచ్చి, కాత్యాయని దగ్గరికి  వచ్చారు. అమ్మవారి శక్తులకు రాక్షసులకు ఘోర  యుధ్ధం జరిగింది. కాళీ, బ్రహ్మాణీ, మాహేశ్వరీ, వైష్ణవీ, కౌమారీ, ఐంద్రీ, వారాహీ, నారసింహీ అష్ట  మాతృగణాలు యుద్ధం చేసి  అనంతమైన రాక్షస సేనలను మట్టు పెడుతుంటే, భయపడి రాక్షసులు పారిపోసాగారు. ఆ సమయంలో రక్తబీజుడనే రాక్షసుడు వచ్చి యుధ్ధం చెయ్యటం మొదలెట్టాడు. అతని రక్తము కనుక కిందపడితే,  ప్రతి రక్తపుబొట్టు నుంచి ఒక రక్తబీజుడు పుట్టుకొస్తూ ఉంటాడు. ఐంద్రీ అతణ్ణి వజ్రాయుధంతో కొట్టింది.

దెబ్బలు తగిలి రక్తం చిందినప్పుడల్లా  వేలసంఖ్యలో రక్తబీజులు పుటుకొస్తున్నారు. అష్టమాతృకలు  ఏమీ చెయ్యలేకపోతున్నారు. అప్పుడు అమ్మవారు కాళీమాతను పిలిచి, ' చాముండా  ! నువ్వు విజృంభించి, రక్తబీజుడి రక్త బిందువులు కింద పడే  లోపలే ప్రతి రక్తబిందువును  తాగేసెయ్యి అని చెప్పింది. కాళీమాత అలాగే చేసి, రక్తబీజుడిని రక్త హీనుణ్ణి చేసి సంహరించింది. దేవతలు ఆనందించారు. రక్తం అంటేనే రాగము, ప్రేమ ! బీజము అంటే విత్తనము. రక్తబీజుడు రాగానికి ప్రతీక ! రాగం,ప్రేమ, మోహం,  మమత - ఎంత చంపుతున్నా, పుడుతూనే ఉంటుంది. దాని వల్ల జన్మపరంపర కలుగుతూనే ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం తోనే అది నశిస్తుంది.

రక్తబీజుడి మరణవార్త విని శుంభ నిశుంభులిద్దరూ అమ్మవారి మీదకు యుధ్ధానికి వచ్చారు. అనేక ఆయుధాలతో పోరు జరిగాక, అమ్మవారు చండికాదేవి నిశుంభుణ్ణి నేలకేసి కొట్టింది. తమ్ముడు క్రింద పడేప్పటికి శుంభుడు రౌద్రంగా వచ్చాడు. అమ్మవారు శంఖనాదం చేసింది. దిక్కులు పిక్కటిల్లేలా జ్యారవం చేసింది. కాళీదేవి పైనుంచి దుమికి రెండు చేతులతో నేలను గట్టిగా కొట్టింది. దాంతో మిగతా శబ్దాలన్నీ ఆగిపోయాయి.

' తతః కాళీ సముత్పత్య గగనం క్ష్మామతాడయత్  !
కరాభ్యాం తన్నినాదేన ప్రాక్స్వనాస్తే తిరోహితాః ' !!
  అప్పుడు అంబిక ' దురాత్మా ! ఆగు ఆగు ! అని అరవగానే, ఆకాశంలో దేవతలందరూ జయజయ ధ్వానాలు చేశారు -
జయ దుర్గే ! హర దుర్గే ! జయజయ దుర్గే !

' దురాత్మన్ తిష్ట తిష్ఠేతి వ్యాజహారామ్బికా యథా !
తదా జయేత్యభిహితం దేవైరాకాశ సంస్థితైః ' !!
  భీకర యుద్దం జరుగుతుండగా, అమ్మవారు శుంభుడిని శూలంతో కొట్టగానే, అతడు మూర్ఛితుడై కింద పడ్డాడు. చక్రాయుధంతో నిశుంభుడు చండికను కొట్టగానే, దుర్గార్తి హారిణి అయిన దుర్గ తన శరాలతో ఆ చక్రాన్ని ముక్కలు చేసి, అతని గదను కొట్టి, తన ఖడ్గంతో నిశుంభుని తలను నరికేసింది, నిహతుణ్ణి చేసింది.

' శిరశ్చిచ్ఛేద ఖడ్గేన తతో2సావపతద్భువి ' !
  అష్ట దేవతలు, శివదూతీ దేవి అందరూ తమతమ ఆయుధాలతో రాక్షస సేనను అంతం చెయ్యసాగారు. ప్రాణ సమానమైన తమ్ముని మరణంతో కోపంతో బాధతో మండిపడుతూ శుంభుడు అంబికను తుదముట్టించాలని వచ్చి, ఇలా అంటున్నాడు -

"బలావలేపాద్ దుష్టే త్వం  మా దుర్గే గర్వమావహ !
అన్యాసాం బలమాశ్రిత్య యుధ్యసే యాతి మానినీ !!
  ' ఓ దుర్గా ! నీకేదో బలముందని గర్వపడకు. ఇతరుల బలాన్ని ఆశ్రయించి నాతో యుధ్ధం చేశావు.'
ఆ మాటలకి అంబికాదేవి ఇలా అంది -
"ఏకైవాహంజగత్యత్ర  ద్వితీయా కా మమాపరా !
పశ్యైతా దుష్ట మయ్యేవ విశన్త్యో మద్విభూతయః !!

తతః సమస్తాః తాః దేవ్యో బ్రహ్మాణీ ప్రముఖా లయమ్ !
తస్యా దేవ్యాః తనౌ జగ్ముః ఏకైవాసీత్తదాంబికా " !!

' ఈ జగత్తులో నేను ఒక్కత్తినే ఉన్నాను. నేను కాకుండా రెండవది ఏది ఉంది ? ఓ దుష్టుడా ! వీరందరూ నా విభూతులు, నా శక్తులు. చూడు నాలోనే ప్రవేశిస్తున్నారు ' అనగానే బ్రహ్మాణీ మొదలైన దేవతలందరూ మహాదేవి శరీరంలోకి ప్రవేశించారు. అప్పుడు అంబిక ఒక్కత్తే అయి ప్రకాశించింది. 
  సకల వేదోపనిషత్తుల సారము, మన సనాతన ధర్మ సారము, ఏకేశ్వరోపాసనే ! ఏకమేవాద్వితీయం బ్రహ్మ.' ఉన్నది ఒక్క సత్యమే ! ఆ ఏకము అనేకంగా, విశ్వంగా కనిపిస్తోంది. అహం - నేను అని ఏ చైతన్యం వలన కలుగుతోందో, ఆ చైతన్యం అమ్మవారే ! శుంభ నిశుంభులకు కూడా ఉన్న అనేకత్వపు అజ్ఞానాన్ని తొలగించటానికే, ఏకా అయిన అమ్మవారు అనేకంగా వచ్చింది.

నా శక్తులను నాలోకి తీసేసుకున్నాను. ఇంక యుధ్ధానికి సిధ్ధమవమని చెప్పింది. దేవికీ, శుంభుడికీ భయంకరమైన యుధ్ధం జరిగింది. అనేకమైన దివ్యాస్త్రాలతో పోరు జరిగుతుండగా శుంభుడు వేల అస్త్రాలతో అమ్మవారిని కప్పేశాడు.

' తతః శరశతైః  దేవీమాచ్ఛాదయత సో2సురః ' !
అమ్మవారు  శుంభుని ధనుస్సును  విరిచేసి, అతనుప్రయోగిస్తున్న  ఆయుధాలన్నింటిని ప్రతీకాస్త్రాలు  వేసి, తిప్పికొట్టింది. శుంభుణ్ణి  ఎత్తి పట్టుకుని గిరగారా తిప్పి నేలకేసి కొట్టింది. శూలంతో  వక్షఃస్థలంలో  పొడిచింది. అతను గతాసువయి పడిపోయాడు. దురాత్ముడు శుంభుడు మరణించగానే, జగత్తు - పంచభూతాలు స్వస్థత పొందాయి. ఆకాశం నిర్మలమైంది. దేవగణాలు,  గంధర్వులు అందరూ హర్షనిర్భరమానసులయ్యారు. అప్సరసలు  నాట్యం చేశారు. సూర్యుడు మంచి వెలుగు  పొందాడు. అగ్నులు చక్కని కాంతితో ప్రకాశించాయి. జగన్మాత తన అవతార కార్యాన్ని  పూర్తి చేసింది. దేవతలందరూ పరమానంద భరితులయి, కాత్యాయనీదేవిని అనేక విధాలుగా  సంస్తుతించారు.  ఇది నాల్గవ స్తోత్రము.

"త్వం వైష్ణవీ శక్తి రనంతవీర్యా  విశ్వస్య బీజం పరమాసి మాయా !
సమ్మోహితం దేవి సమస్తమేతత్ త్వం  వై  ప్రసన్నా భువి ముక్తి హేతుః " !!
 జగన్మాత సర్వ స్వరూపిణి. అమ్మా ! నీవు  అనంతమైన వైష్ణవీ శక్తివి, విశ్వకారణ బీజభూతమైన పరమ మాయవు నీవే. అందరినీ  సమ్మోహన  పరచే  శక్తివి నీవే. నీవు ప్రసన్నురాలివైతే ముక్తిని పొందగలుగుతాము అంటూ 23 శ్లోక మంత్రాలతో అనేక విధాలుగా స్తోత్రం చేశారు.

" రోగానశేషానపహంసి తుష్టా రుష్టా తు కామాన్ సకలానభీష్టాన్ !
త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాహ్యాశ్రయతాం ప్రయాన్తి " !!
  అమ్మా ! అందరికీ శరణు నీవేనమ్మా ! నీవు ప్రసన్నమైతే సకల రోగాలనీ - భవరోగాన్ని నశింపజేస్తావు, సర్వ కామనలనీ తీరుస్తావు. అధర్మ మాచరించటం వల్ల నీకు కోపం వస్తే, బాధలు కలిగిస్తావు. అటువంటి నిన్ను అహంకారాన్ని వదిలి శరణు కోరుతున్నాము. ఇదే శరణాగతి !

" విద్యాసు శాస్త్రేషు వివేకదీపే ష్వాద్యేషు వాక్యేషు చ కా త్వదన్యా !
మమత్వగర్తే2తి మహాంధకారే విభ్రామయత్యేతదతీవ విశ్వమ్ " !! 
  అమ్మా ! నువ్వే ఈ మహా విశ్వాన్ని నిర్వహిస్తూ, అందరినీ మహా అంధకారమయమైన మమత్వము, మోహము అనే గొయ్యిలో పడేసి తిప్పుతుంటావు. నీవే మహావాక్యముల రూపంలో జ్ఞానాన్నిస్తున్నావు. జ్ఞానం కలిగిన వారికి ముక్తి నిస్తున్నావు. విజ్ఞాన వివేక దీపాలయినటువంటి  సమస్త విద్యలలోను, శాస్త్రాలలోను, ఆద్యా వాక్యములలో అంటే మహావాక్యములలోను నీవు తప్ప ఇతరము చెప్పబడలేదమ్మా !  అనగా మహావాక్యముల సారము అమ్మయే ! నాలుగు మహావాక్యముల సారము ' సర్వంఖల్విదం బ్రహ్మ.' ఈ సర్వము బ్రహ్మమే ! జగన్మాతృ స్వరూపమే !

" ప్రణతానాం ప్రసీద త్వం  దేవి విశ్వార్తి హారిణి  !
త్రైలోక్యవాసినామీడ్యే  లోకానాం వరదా భవ " !!
 ' విశ్వంలోని అందరి ఆర్తిని పోగొట్టే తల్లీ ! నిన్ను  ఆశ్రయించి, శరణుకోరి, ప్రార్ధించినవారి యందు ప్రసన్నురాలివి కమ్ము. ముల్లోకవాసులకూ పొగడదగిన తల్లివి నువ్వే. లోకులకు వరములిచ్చి అనుగ్రహించమ్మా  అని ప్రార్థించగానే, కాత్యాయనీదేవి జగదుపకారభూతమైన  వరాన్ని అనుగ్రహిస్తాను కోరుకోమని చెప్పింది. దేవతలు ఇలా వరమడిగారు -

" సర్వబాధాప్రశమనం  త్రైలోక్యస్యాఖిలేశ్వరి !
ఏవమేవ త్వయా కార్యం  అస్మద్వైరివినాశనమ్ !!
  'ముల్లోకాలనేలే జగజ్జననీ ! నీవు కేవలము అన్నిబాధలను ఉపశమింపచెయ్యి. మా శతృవులను నశింపజెయ్యి.' ఎవరికైనా ప్రథమ శతృవులు అంతశ్శతృవులే - కామక్రోధాది అరిషడ్వర్గం. వీటివల్ల జనించే ఇతర దుర్గుణాలు, అవలక్షణాలు. అవన్నీ నశించాలి. మానవులలోని దుర్గుణాలు నశించాలి. అమ్మవారు ఇలా అభయమిచ్చింది - వైవస్వత మన్వంతరంలో ఇరవైఎనిమిదవ యుగంలో ఇంకో శుంభనిశుంభులు పుడతారు. అప్పుడు నేను నందగోపకులంలో యశోదాగర్భ సంభవురాలినయి, వారిని నశింపజేస్తాను. వింధ్యవాసినిగా కీర్తించబడతానని చెప్పింది. దుర్మార్గులైన రాక్షసులను సంహరిస్తాననీ, దుర్గగా, భ్రామరీదేవిగా పూజలందుకుంటానని చెప్పి ఇలా వాగ్దానం చేసింది.

" ఇత్థం యదా యదా బాధా దానవేభ్యో భవిష్యతి !
తదా తదా2వతీర్యాహం  కరిష్యామ్యరిసంక్షయం "!!

శ్రీకృష్ణ పరబ్రహ్మ భగవద్గీతలో

"యదా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత !
అభ్యుత్థానమధర్మస్య తదా2త్మానం సృజామ్యహమ్ "!!
అని చెప్పినట్లుగా, అమ్మవారు కూడా దానవుల వల్ల బాధలు కలిగినప్పుడల్లా తానవతరించి శతృ సంహారం చేస్తానని అభయమిచ్చింది.

" ఏభిః స్తవైశ్చ మాం నిత్యం స్తోష్యతే యః సమాహితః ! తస్యాహం సకలాం బాధాం నాశయిష్యామ్యసంశయమ్ "!!
  ఈ స్తోత్రంతో నన్ను ఎవరు ప్రార్ధించినా, నేను తప్పక వారందరి బాధలు పోగొడతాను అంటూ జగన్మాత దేవీమాహాత్మ్య పఠనం వలన కలిగే ఫలితాలను వివరించి చెప్పి అంతర్ధానమయింది.

ఈ విధంగా సుమేధ మహర్షి సురథ మహారాజుకీ, సమాధి అనే వైశ్యునికీ దేవీమాహాత్మ్యమును వివరించారు.

" ఏవం భగవతీ దేవీ  సా నిత్యా2పి పునః పునః ! సమ్భూయ కురుతే భూప  జగతః పరిపాలనం " !! ఈ విధంగా జగన్మాత తాను నిత్యురాలైనప్పటికీ, మాటిమాటికీ రూపం ధరించి వచ్చి, జగత్పాలన చేస్తోంది.

మార్కండేయ మహర్షి చెప్తున్నారు - ఈ దేవీమాహాత్మ్యాన్ని విని సురథ మహారాజు, సమాధి అనే వైశ్యుడు శోకమోహ రాగవివర్జితులై, అమ్మనే దర్శించాలనే కాంక్షతో మూడు సంవత్షరాలు నియతాహారులై తపస్సు చేశారు. జగన్మాత ప్రీతి చెంది, ప్రత్యక్షమయి, మీకేం కావాలో కోరుకుంటే ఇస్తానంది. సురథ మహారాజు తన బలంతో శతృవులను జయించి తన రాజ్యం తాను పొందాలనీ, వచ్చే జన్మలో అవిభ్రంశమైన అంటే నాశనం లేని రాజ్యం కావాలనీ  నాశనం లేని రాజ్యం కావాలనీ కోరుకున్నాడు. వైశ్యుడు అహంకార మమకారాలని పోగొట్టి, జ్ఞానాన్నివ్వమని కోరుకున్నాడు. జగన్మాత వారిద్దరూ కోరినదానికంటే ఎక్కువే ఇచ్చింది. రాజుకి ఈ జన్మలో నిష్కంటకమైన రాజ్యాన్నిచ్చింది. మరుజన్మ లో మనువుగా ఉండేలా అనుగ్రహించి, అవిభ్రంశమైన రాజ్యాన్నిచ్చింది. వైశ్యునికి ముక్తి పొందటానికి కావలసిన జ్ఞానాన్నిచ్చి, మోక్షాన్ని అనుగ్రహించింది.

అమ్మ పర్వతం కొన మీద ఉంది. పర్వతము కూడా విడివిడిగా ఉన్న కొన్ని గిరుల ఏకాకార సమూహం. పర్వతము విడి భాగాలు కలిగి, ఏకంగా భాసిస్తుంది చెరుకు గడ లాగా ! చెరుకుగడ లో కణుపు లుంటాయి. కానీ అన్ని కణుపులు కలిసి గడ అవుతుంది. అలాగే మన దేహంలో వెన్నుపూస విడివిడి భాగాలుగా కనిపిస్తూ ఉన్న ఒకే వెన్నుదండం. సుషుమ్న నాడియే వెన్నుదండం, పర్వత శిఖరాగ్రం. మన శరీరంలో సప్త చక్రాలున్నాయి. మూలాధార చక్రంలో ఉన్న కుండలినీ శక్తి జాగృతమయి షట్చక్రాలు దాటి, సహస్రార చక్రాన్ని చేరితే, సహస్రారంలో ఉన్న పరతత్వాన్ని చేరి, అక్కడి నుంచి స్రవించే అమృత ఝరిలో తడిసి అలౌకికానందాన్ని జీవుడు అనుభవిస్తాడు.
చండ ముండ, శుంభ, నిశుంభులందరూ పర్వతము చివరన ఉన్న అమ్మను చూడగలిగారు. అందరూ  పరాత్పరి  చేతులో మరణించారు. అమ్మను దర్శించగలిగితే, మనలోని దుర్గుణాలు, రాక్షస భావాలు, అజ్ఞానము అన్నీ నశించి, కైవల్యం ప్రాప్తిస్తుంది.

చండముండులు దుర్మార్గమైన, ధర్మవిరుధ్ధమైన బలదర్పాలకు ప్రతీకలు. కామముతో, రాగముతో ప్రవర్తించేవారు. శుంభుడు, నిశుంభుడు అహంకారము, మమకారాలకు ప్రతీకలు. ధూమ్రాక్షుడు సత్యంతెలుసుకోలేని తనానికి, క్రోధానికి ప్రతీక, రక్తబీజుడు రాగానికి, దానివల్ల జన్మలకు కారణమునకు ప్రతీక, మహిషాసురుడు జడత్వానికి, అజ్ఞానానికి ప్రతీక ! అమ్మవారు ఈ రాక్షసులందరినీ సంహరించింది అంటే, మనలోని ఈ దుర్గుణాలన్నింటినీ పోగొట్టి, రజస్తమోగుణాలను పోద్రోలి, సత్వగుణాన్ని వృధ్ధి పరచి, ఈశ్వరుడిని దూతగా పంపినట్లుగా, యోగ్యుడైన సాధకుని దగ్గరికి ఆచార్యుని, గురువును పంపించి, మనని తరింపజేస్తుంది.

మహారాజు సురథుడు. సురథుడు అంటే మంచి రథము కలవాడు, రథము అంటే శరీరము. పటిష్టమైన ఏకాదశ ఇంద్రియములు కలిగిన దేహము. ' శరీరమాద్యం ఖలు ధర్మ సాధనమ్ '. శరీరంతోనే సాధనచేసి, జ్ఞానాన్ని, మోక్షాన్ని పొందాలి. వైశ్యుడు సమాధి - సమాధి అంటే నిశ్చలమైన మనస్సు కలవాడు. ఏకాగ్రమైన స్థిరచిత్తం కలవాడే సమాధి స్థితిలో సత్య సందర్శనం చెయ్యగలుగుతాడు. సమత్వమైన బుధ్ధి కలవాడు సమాధి. సమత్వం యోగ ఉచ్యతే !

గురువుగారు, మహర్షి సుమేధుడు. సుమేధుడు అంటే మంచి మేధస్సు కలవాడు. మంచి జ్ఞానము కలవాడు. బ్రహ్మజ్ఞానము కలిగిన గురువు. మన శరీరం సురథంకావాలి. మనస్సు, బుధ్ధి యోగనిష్ఠతో సమాధిలో ఉండాలి. ఇవికావాలంటే సద్గురువు - మంచిబుధ్ధి కావాలి. అప్పుడు జగన్మాత అనుగ్రహం లభించి బ్రహ్మవిద్యను, మోక్షాన్నిపొందుతాము.

దేవీమాహాత్మ్యం మూడు భాగాలుగా, ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్రలు గా  పరిగణించబడుతోంది. మూడు చరిత్రలలోను వరుసగా మహాకాళీ, మహాలక్ష్మి, మహాసరస్వతీ దేవతల స్వరూపములు ఆవిష్కరించ బడ్డాయి, స్తోత్రించబడ్డాయి. ప్రథమ అధ్యాయము ప్రథమ చరిత్ర. రెండవ అథ్యాయము నుండి నాల్గవ అధ్యాయం వరకు మధ్యమ చరిత్ర, ఐదవ అధ్యాయము నుంచి పదమూడవ అధ్యాయం వరకు ఉత్తమ చరిత్ర. ఈ మూడు చరిత్రల శ్రవణ, అధ్యయన, ఆచరణల ద్వారా బ్రహ్మ గ్రంధి, విష్ణు గ్రంధి, రుద్ర గ్రంధి విభేదనం జరిగి, జీవుడు అమ్మ కటాక్షానికి పాత్రుడయి ముక్తి పొందుతాడు.

మనిషికి వైరాగ్యం కలగటానికి అనేక కారణాలుంటాయి. అయితే ఆ వైరాగ్యం స్ధిరపడి, హేయమైన, క్షణికమైన ఈ ప్రాపంచిక సుఖాల పట్ల విముఖత ఏర్పడి, అమ్మా ! నువ్వే  కావాలి అన్న వాళ్ళకి  అమ్మ శాశ్వతానంద  ధామాన్నిస్తుంది. అమ్మ అనుగ్రహం వల్ల మహారాజు సురథుడు ఈజన్మలో తను కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి పొందాడు. అష్టైశ్వర్యాలను అనుభవించాడు. అనంత కాలం రాజ్యపాలన చేసి, మరుజన్మ లో సూర్య పుత్రునిగా మనువుగా పుట్టి శాశ్వతుడయ్యాడు.

మనమందరం చండీహోమము జరుపుకుంటూ ఉంటాము  కనుక దేవీ మాహాత్మ్యాన్ని  స్మరించి, నమస్కరించుకోవాలి. అమ్మ తత్త్వాన్ని తెలుసుకోవాలి.
  ఆదిపరాశక్తి అయిన జగన్మాతనే సప్త మాతృకలుగా, సర్వ దేవతలుగా, నవ దుర్గలుగా భావించి ఆరాధిస్తాము. శాక్తేయులు శక్తి ని దుర్గామాతగా ఆరాధిస్తారు. శక్తి అంటేనే అమ్మవారు. శక్తి అంటేనే చైతన్యము, కదలిక. శక్తి లేకపోతే ఏ పనీ చెయ్యలేము. సాక్షాత్తుగా శివుడు కూడా శక్తి తోడు లేకపోతే ఏమీ చెయ్యలేడట ! హరిహరబ్రహ్మదేవతలు  కూడా తమతమ బాధ్యతలను  నిర్వహించటానికి శక్తి కోసం అమ్మవారినే అర్చిస్తారట  ! ఎటువంటి పుణ్యము చెయ్యనివాడు దేవిని స్తోత్రం చెయ్యలేడు, ప్రణామమైనా చెయ్యలేడు అని జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు అమ్మవారిని స్తోత్రించారు.

' శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి !
అతస్త్వామారాధ్యాం హరిహరవిరించాదిభిరపి  ప్రణంతుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి !!

జగన్మాత దాక్షాయణిగా - సతీదేవిగా పుట్టటం, దక్షయజ్ఞం మొదలైన కథ, హిమవంతుని కూతురు హైమవతిగా - పార్వతిగా జన్మించి, తపస్సు చేసి, మహేశ్వరుడిని పరిణయమాడటం అన్నీ అందరికీ తెలిసినవే ! దాక్షాయణి యోగాగ్నిలో దగ్ధమైనప్పుడు సతీవియోగం భరించలేక ఈశ్వరుడు ఆమెను భుజం మీద పెట్టుకుని వెళుతుంటే శ్రీహరి ఆమె శరీరాన్ని సుదర్శన చక్రం తో ముక్కలుగా నరికెయ్యగా, మఖ్య భాగాలు పడిన చోట్లు అష్టాదశ శక్తిపీఠాలుగా వెలశాయి. ఇతర చిన్న చిన్న భాగాలు, ఆభరణాలు పడి, పంచాశత్ శక్తి పీఠాలేరాపడ్డాయి. ఇవి కాక, నూటఎనిమిది శక్తి కేంద్రాలున్నాయి. మన పవిత్ర భారతదేశం మొత్తం శక్తి పీఠాలమయం. ఎన్నో ఆలయాలలో విగ్రహాల రూపంలో, శ్రీచక్ర రూపంలోను అమ్మవారిని ఆరాధిస్తాము.

 అమ్మ గురించి మాట్లాడుకుంటున్నాము.
కాలమంతా దైవస్వరూపమే ! కాలమే కాళికాదేవి ! కాలమే కాళేశ్వరుడు. కాలంలో అద్భుతమైన శక్తి ఉంది. కాలంలోని దివ్యశక్తిని,  సూక్ష్మ శక్తి ని తెలుసుకున్న మహర్షులు  మన పండుగల నేర్పరచారు. ఉన్న పరబ్రహ్మ శక్తి ఒక్కటే అయినా, కాలశక్తికి అనుగుణంగా, ఏ మాసాన ఏ తిథిలో  పరమాత్మ ను ఏ నామ రూపాలతో ఎలా అర్చించాలో, ఏ నైవేద్యాలు పరమాత్మ కు సమర్పించి, మనం స్వీకరిస్తే, మనం శారీరక మానసిక ఆరోగ్యవంతులుగా ఉంటామో తెలియజేశారు. ఇటువంటి ఆరాధన వల్ల మనలోని దివ్యశక్తి జాగృతమయి మనం అమ్మ అనుగ్రహాన్ని పొందగలుగుతాము.

సచ్చిదానందస్వరూపము, అద్వితీయము, నిష్కళము, అశరీరి అయిన పరబ్రహ్మము   ఉపాసకుల కోసము రూపము ధరించి, త్రిమూర్తులుగా, త్రిశక్తులుగా, అసంఖ్యాక దైవ గణములుగా ప్రకాశిస్తోంది.

" చిన్మయస్యాద్వితీయస్య నిష్కళస్యాశరీరిణః  !
ఉపాసకానాం కార్యార్ధం బ్రహ్మణో రూప కల్పనా " !!
ఆ రూపాలను శివునిగా, విష్ణువుగా, శక్తిగా ఆరాధిస్తాము. రూపంతో ఆరాధించేటప్పుడు అనేక ఉపాసనా పద్ధతులుంటాయి, అనేక కథలుంటాయి. యదార్ధముగా పరమాత్మ రూపు ధరించి వచ్చి, లీలలు ప్రదర్శిస్తాడు. ఏ దైవాన్ని ఆరాధించే వారికి ఆ దైవమే పరబ్రహ్మ ! మిగతా దైవాలందరూ ఆ దైవం కంటే అప్రధానులు. ఏ దైవాన్ని గురించి చెప్పేటప్పుడు ఆ సమయంలో ఆ దైవమే గొప్ప ! ఏ దైవాన్ని ఆరాధించేటప్పుడు ఆ దైవమే అత్యుత్కృష్టము, అదే పరబ్రహ్మ !

వసంత నవరాత్రులలో, శరన్నవరాత్రులలో దేవీమాతను ఆరాధిస్తాము. సంవత్సరం రెండు అయనాలుగా - ఉత్తరాయణం, దక్షిణాయనం అని ఉంది. ఏడాదంతా నిత్యకర్మల నాచరిస్తూ, భగవదుపాసన చేస్తున్నా, రెండు అయనాలలో రెండు సార్లు అమ్మవారిని  పూర్ణ సంఖ్య అయిన తొమ్మిది రోజులు పూజిస్తే, ఏడాదంతా శుభంగా వర్ధిల్లగలుగుతాము. ఈ జగత్తు లో అమ్మ కానిది ఏదీ లేదు.

దేవీ సప్తశతిలో లో దేవతలు జగన్మాతను ' అమ్మా ! నువ్వెవరు ? ' అని ప్రశ్నిస్తారు. దానికి మహామాయా స్వరూపిణి అయిన జగదంబ ఇలా చెప్పింది. 
అహం బ్రహ్మ స్వరూపిణీ ! మత్తః ప్రకృతి పురుషాత్మకం  జగత్  ! శూన్యంచాశూన్యం  చ ! అహమానంద అనానందౌ  ! అహం  విజ్ఞానావిజ్ఞానౌ ! అహం  బ్రహ్మ బ్రహ్మాణీ వేదితవ్యే ! అహం  పంచభూతాన్యపంచభూతాని ! అహమఖిలం జగత్ ! వేదో2హమవేదో2హం ! విద్యామవిద్యా2హం ! అజాహమనజాహం !అధశ్చోర్ధ్వం చ తిర్యక్చాహమ్ !." ఇలా సృష్టి సర్వము, సృష్ట్యతీతము సర్వము తానే అని చెప్పింది.
నేనే పరబ్రహ్మను. నానుంచే ప్రకృతి పురుషాత్మకమైన జగత్తు వచ్చింది. శూన్యము, శూన్యము కానిదీ వచ్చింది. నేనే ఆనందము, అనానందము. నేనే విజ్ఞానము, అవిజ్ఞానము. నేనే బ్రహ్మముగా, బ్రహ్మాణిగా తెలియబడుతున్నాను. నేనే పంచభూతాలు, పంచభూతాలు కానిదానిని. నేనే ఈ అఖిల జగత్తును. నేనే తెలియబడేదాన్ని, తెలియబడనిదాన్ని. నేనే విద్యను, అవిద్యను. నేనే పుట్టిన దానిని, పుట్టని దానిని. పైన క్రింద పక్కల  నేనే ఉన్నాను......." ఇలా సృష్టి సర్వము అమ్మ మయము.

అమ్మవారిని ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి దాకా అర్చించి, దశమినాడు పంభక్ష్యపరమాన్నాలు జగన్మాతకు సమర్పించి, అప్పటి వరకు వ్రత దీక్షలో ఉన్న మనం అప్పుడు వాటిని స్వీకరించాలి. సంప్రదాయాన్ని బట్టి నవరాత్రులలో అమ్మవారిని ఒక్కోచోట, ఒక్కో నామంతో, రూపంతో అలంకారాలతో ఆరాధిస్తారు. ప్రతి నామానికి రూపానికి ఒక కథ ఉంటుంది, ఒక తాత్విక అర్ధం ఉంటుంది. 

తొమ్మిది రోజులలో సప్తమి, అష్టమి, నవమి తిధులు విశేషమైనవి. సప్తమి, మూలా నక్షత్రం రోజున జగన్మాతను జ్ఞాన ప్రదాయిని అయిన మహాసరస్వతీ దేవిగా ఆరాధిస్తాము. శ్వేత వస్త్రధారిణి అయిన సర్వశుక్లా సరస్వతీ అమ్మవారు శుధ్ధసత్వ స్వరూపిణి. ఆవిడ వాహనం హంస. నీటిని పాలను వేరుచెయ్యగల శక్తి సృష్టిలో ప్రాణికోటిలో  కేవలం హంసకు మాత్రమే ఉంది. అలాంటి హంసవాహని జ్ఞానసరస్వతీదేవి  జ్ఞానానికి, వివేకానికి, పవిత్రతకు, శుధ్ధతకు, సత్వగుగానికి ప్రతీక. శ్రీ సరస్వతీ ఉపాసన వల్ల ఈ గుణాలను మనం పొందుతాము.

ఆష్టమి తిథి ఎప్పుడూ జయాష్టమే ! పరమాత్మ శ్రీ కృష్ణునిగా అవతరించిన  రోజు కృష్ణాష్టమి. అదే రోజున జగన్మాత శ్రీ కృష్ణ సోదరిగా, యోగమాయగా యశోదామాతకు జన్మించింది. ఆమె లోకులచేత పూజింపబడుతుందని  శ్రీ కృష్ణ పరమాత్మ అనుగ్రహించాడు. అనేక నామాలతో ఆ తల్లి పూజలందుకుంటోంది.  జగన్మాత దుర్గాదేవి దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించిన రోజు ఆశ్వయుజ శుద్ధ అష్టమి. తాత్వికంగా చూస్తే, మనలోని దుర్గుణాలే దుర్గముడు. అమ్మవారి అనుగ్రహం తో మన సాధనతో మనలోని దుర్గుణాలను జయించాలి. ఆశ్వయుజ అష్టమి అర్ధరాత్రి జగన్మాత వీరభద్ర సమేత భద్రకాళిగా అవతరించింది. కనుకనే ఆ రోజును దుర్గాష్టమి అంటున్నాము.
 అమ్మవారిని అష్టమి తిథి  నాడు పూజించటంలో మరొక విశేషముంది. పౌర్ణమి తరువాత పాడ్యమి నుంచి కళలు తగ్గుతున్న చంద్రుడు, అమావాస్య తరువాత పాడ్యమి నుంచి ఒక్కొక్క కళ పెరుగుతున్న చంద్రుడు, అష్టమినాడు మాత్రం ఎటు వైపు నుంచి చూసినా, సమానమైన  కళలతో ఉంటాడు, సమానమైన కాంతితో ప్రకాశిస్తాడు. అలాగే అమ్మవారు కూడా సంపూర్ణ కాంతితో, పరిపూర్ణ అనుగ్రహం తో విరాజిల్లుతుంది. కనుకే అష్టమి తిథికి అంత ప్రాముఖ్యత. అమ్మవారి అనంత శక్తి, అవ్యాజ కరుణ కూడా ఏ మార్పులు లేకుండా పూర్ణత్వంతో ఉంటుంది.

నవమి సంఖ్య పూర్ణ సంఖ్య. నవమి నాడే శ్రీ రామచంద్రునికి కళ్యాణం చేస్తాము. ఆశ్వయుజ నవమిని మహానవమి అంటాము. అదే మహర్నవమి. ఆరోజున జగన్మాతను  సింహవాహనిగా, మహిషాసురమర్దినిగా ఆరాధిస్తాము. ఆవిడ మహిషాసురుడిని సంహరించి, లోకాలకు ఆనందం కూర్చిన దినం మహర్నవమి. దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులలో ముఖ్యమైన రోజు నవమి. అన్ని రోజులు పూజించలేని వాళ్ళు నవమి నాడు పూజించినా చాలును.

దశమిని విజయదశమిగా భావించి జగన్మాతను రాజరాజేశ్వరీ దేవిగా, జయావిజయా సహిత అపరాజితా దేవిగా ఆరాధిస్తాము. శమీవృక్షానికి - జమ్మి వృక్షానికి పూజచేసి,

' శమీశమయతే పాపం శమీ శత్రు వినాశినీ !
ధారిణ్యర్జున బాణానామ్ రామస్య ప్రియవాదినీ ' !!
 అని చెప్తూ జమ్మి వృక్షానికి ప్రదక్షిణ చెయ్యాలి. శమీ వృక్షం మన పాపాలనూ, తాపాలనూ, మానసిక బలహీనతలను, దుర్గుణాలను శమింపజేస్తుంది. అంటే తగ్గిస్తుంది. పాపం శమిస్తుంది అంటే మనలోని అధర్మం నశిస్తుంది. జమ్మి ఆకులను పెద్దవారి చేతికిచ్చి, పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోవాలి. తల్లిదండ్రుల, పెద్దల, గురువుల ఆశీస్సులే మానవుల సర్వతోముఖాభివృధ్ధికి సరైన బాటలు. తల్లిలో, అక్కలో, చెల్లిలో, ప్రతిస్త్రీలో జగన్మాతను దర్శించాలి. ప్రతి అణువు అమ్మవారే అని గుర్తించాలి. జగన్మాత ఆవిర్భవించినప్పుడు దేవతలు చేసిన స్తోత్రాలలో ఒకటి ఇలా ఉంది.

" పృథివ్యాం యా స్ధితా పృథ్వ్యా న జ్ఞాతా పృథివీం చ యా !
అంతః స్ధితా యమయతి  వందే తామీశ్వరీం పరామ్ " !!
ఏ శక్తి పృథ్వి పైన ఉన్నదో, ఏది పృథ్వీ స్వరూపమో, దేనిని పృథ్వి తెలుసుకోలేదో, ఏది లోపల ఉండి అన్నింటినీ నియమిస్తున్నదో, అటువంటి ఈశ్వరశక్తికి నమస్కరించుచున్నాను.
అంటే సమస్త విశ్వంలోని అంతర్యామి జగన్మాతే ! ఈ మంత్రశ్లోకం బృహదారణ్యకోపనిషత్తులోని, కేనోపనిషత్తు లోని మంత్రాలను గుర్తు చేస్తోంది.

" యచ్చక్షుషా న పశ్యతి యేన చక్షూంషి పశ్యతి తదేవ బ్రహ్మ త్వం విధ్ధి " !
  దేనిని కన్ను చూడలేదో, దేనివల్ల కంటికి చూసేశక్తి కలిగిందో అదే బ్రహ్మము.

పరబ్రహ్మమే సాకార రూపంలో జగన్మాతగా వచ్చి, దుష్టులను శిక్షించి, ధర్మమును ప్రవర్తిల్లజేసి, మనందరినీ కన్నతల్లిలా కాపాడుతున్నది. అమ్మవారిని మహర్షులు, జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు, మూక శంకరులు ఇంకా ఎందరో అనేక విధాలుగా శ్రీ లలితా రహస్య సహస్ర నామములతో, సౌందర్య లహరిలో, మూకపంచశతిలో, కనకధారాస్తవంలో, ఇంకా అనేక స్తోత్రాలతో కీర్తించారు.
ఆ స్తోత్రాలను పరిశీలిస్తే, అమ్మ సగుణ నిర్గుణ స్వరూపిణి అని గ్రహించగలము. చిదగ్నికుండ సంభూత అయిన శ్రీమాత కేశాది పాదనఖముల వర్ణన కనిపిస్తుంది.

' చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్ కచా.'
'నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణా '

'నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకులా  
నిర్గుణా నిష్కళా శాంతానిష్కామా నిరుపప్లవా'
  అమ్మవారిని ఏ రూప నామాలతో అర్చిస్తున్నా, ఆవిడని త్రిశక్తులుగా, అందరు దేవతల నామాలతో కీర్తించటం గమనించగలము.

'.గీర్దేవతతేతి గరుడధ్వజసుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి....'

అమ్మవారిని
'....తామగ్నివర్ణాం తపసా జ్వలన్తీమ్....' అని అగ్నిశిఖగా, జ్యోతిస్స్వరూపంగా, బంగారు రంగు కాంతులతో, ఎర్రని రంగుతో, నీలి వర్ణంతో ప్రకాశిస్తున్నట్లుగా దుర్గాసూక్తంలో కీర్తించారు. దేవీ ఖడ్గమాలలో అమ్మవారి నామాలు, అమ్మవారి పరివార దేవతల నామాలను స్తోత్రించారు. శ్యామలాదండకం లో జగన్మాతను  - '...సర్వ యంత్రాత్మికే, సర్వ తంత్రాత్మికే, సర్వ మంత్రాత్మికే, సర్వశక్త్యాత్మికే, సర్వ రూపాత్మికే, సర్వ ముద్రాత్మికే, సర్వరూపే హే జగన్మాతృకే...' అని స్తోత్రించారు.

సకళ నిష్కళ రూపిణి అయిన, పంచకృత్య పరాయణ అయిన, సూర్యచంద్రాగ్ని నేత్ర అయిన, అవ్యాజ కరుణామూర్తి అయిన విశ్వరూపిణి జగన్మాత కంచి కామాక్షిగా, మధురమీనాక్షిగా, కాశీవిశాలాక్షిగా, బాలాత్రిపుర సుందరీ దేవిగా, అఖిలాండేశ్వరిగా, జగదంబగా, ఆశ్రిత కల్పతరువుగా, త్రవర్గాపవర్గ ప్రదాయినిగా, మహాత్రిపురసుందరిగా కరుణించారు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat