🌺 లంకిణి 🌺

P Madhav Kumar

హనుమ సముద్రాన్ని దాటి తీరాన్ని చేరాడు. వెంటనే తన రూపాన్ని సాధారణ వానర రూపానికి తగ్గించాడు. ఆ రూపంలో ముందుకు సాగి, తీరాన గల మలయపర్వతం శిఖరంపైకి దూకాడు. నిల్చున్నాడక్కడ. ఎదురుగా ఉన్న సముద్రాన్ని చూశాడు. అంత సముద్రాన్నీ దాటి వచ్చినందుకు తనని తానే అభినందించుకున్నాడు. కుడిచేత్తో ఎడమ భుజాన్ని నిమురుకున్నాడు. వెలుగు బాగా ఉంది. సూర్యాస్తమయం కాలేదింకా. ఆ వెలుగులో స్వామికార్యం చక్కబెట్టడం ప్రమాదం అనుకున్నాడు హనుమ. 


అనుకుని, దట్టంగా వృక్షాలు గల చోట, పచ్చిక బయళ్ళలో విహరించి, శ్రమ తీర్చుకున్నాడు. తమ పక్కగా నడుస్తోన్న హనుమను చూసి ఆనందించాయి వృక్షాలు. అతనిపై పువ్వులు రాల్చి ఆశీర్వదించాయి. లెక్కకు మిక్కిలిగా పండ్ల చెట్లను చూశాడు హనుమ. అలాగే కలువలూ, కమలాలతో ఉన్న దిగుడు బావుల్ని చూశాడు. సాగరంలో కలుస్తున్న సెలయేళ్ళను చూశాడు. పులకించి పోయాడు అక్కడి ప్రకృతికి. 


ఇంతలో సూర్యాస్తమయం అయింది. చీకట్లు ముసురుకున్నాయి. అదే అదనుగా పిల్లకోతిలా మారిపోయాడు హనుమ. దగ్గరగా ఉన్న ప్రాకారంపైకి దూకాడు. కూర్చున్నాడక్కడ. లోపల గల నగరాన్ని పరిశీలించసాగాడు. త్రికూటపర్వతం మీద ఆకాశంలో వేలాడుతున్నట్టుగా విశ్వకర్మ నిర్మించిన లంకానగరాన్ని కళ్ళు పెద్దవి చేసుకుని చూశాడు హనుమ. ఆ నగర సౌందర్యానికి ముగ్ధుడైపోయాడు. చుట్టూ బురుజులతో కూడిన ఎత్తైన ప్రాకారం, నాలుగు వైపులా ద్వారాలు, తీర్చిదిద్దినట్టున్న రాచబాటలు, ఆ బాటలకు ఇరువైపులా బంగారు తోరణాలూ, పతాకాలూ కట్టి ఉన్న ఇళ్ళ వరుసలు. ఒకొక్క ఇల్లూ ఏడెనిమిది అంతస్తులతో ఉన్నాయి. ఎత్తుగా ఉన్నాయి. ఆకాశంలోకి చొచ్చుకుని ఉన్నాయి.


వాటిని చూసి ఆశ్చర్యపోయాడు హనుమ. రకరకాల ఆయుధాలు ధరించి, ఏమరుపాటు లేకుండా గస్తీ తిరుగుతున్నారు సైనికులు. నగరాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు.ఈ సైనికుల కళ్ళు గప్పి, ఇప్పుడు సీతాన్వేషణ ప్రారంభించాలి. ఎలా? అనుకునేంతలో ఆకాశం అదిరిపోయేట్టుగా పెనుకేక వినవచ్చింది. తల తిప్పి చూశాడు హనుమ. కనిపించిన భీకరాకారాన్ని చూసి రెండు చేతుల్తో తల పట్టుకున్నాడు.


 ఆ నగర సౌందర్యానికి ముగ్ధుడైపోయాడు. రకరకాల ఆయుధాలు ధరించి గస్తీ తిరుగుతున్నారు సైనికులు. నగరాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. వారి కళ్ళు గప్పి సీతాన్వేషణ ప్రారంభించాలి. ఎలా? అనుకున్నాడు హనుమ. అంతలో ఆకాశం అదిరిపోయేట్టుగా పెనుకేక వినవచ్చింది. తల తిప్పి చూశాడు. కనిపించిన భీకరాకారాన్ని చూసి తల పట్టుకున్నాడు. పెద్దపెద్ద కోరలు గల గుహలాంటి నోరు తెరచి, మిడిగుడ్లను మరింత పెద్దవి చేసి ఒకానొక రాక్షసస్త్రీ హాహాకారాలు చేస్తూ హనుమను సమీపించింది. గంభీరంగా అడిగింది.


‘‘ఎవడ్రా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నేను నిన్ను చంపక ముందే నిజం చెప్పు?’’ ఏం చెప్పను అన్నట్టుగా చేతి వేళ్ళలో మరో చేతి వేళ్ళు జొనిపి, భయపడుతున్నట్టుగా లేచి నిల్చున్నాడు హనుమ. ‘‘సైన్యం కాపలా కాస్తున్న ప్రాకారాలన్నిటినీ దాటుకుని ఇక్కడకు ఎలా వచ్చావు? వచ్చావు సరే, లంకలోనికి మాత్రం పోలేవు.’’ అన్నది ఆ రాక్షసి. భయంకరంగా నవ్వింది.


ఆ నవ్వుని ఓ కంట కనిపెడుతూ అడిగాడిలా హనుమ. ‘‘ఎవరు నువ్వు?’’ ‘‘ఎవరని నన్నే అడుగుతున్నావా? ఈ నగరమే నేను. నన్ను లంక అంటారు. లంకిణిని నేను. నన్ను నేనే రక్షించుకుంటాను. ఇంతకీ నువ్వెవరు?’’ ‘‘చూశావుగా! కోతిని.’’ అన్నాడు హనుమ. నగరం వైపు చూస్తూ మళ్ళీ అన్నాడిలా. ‘‘ఈ నగరం బాగుంది. చూడచక్కగా ఉంది.’’ ‘‘నన్ను కాదని ఈ లంకను చూడడం అసాధ్యం.’’ అన్నది లంక. చేయి సాచి, వేళ్ళు విడదీసి గట్టిగా హనుమను కొట్టింది. ఆ దెబ్బను భరించలేకపోయాడు హనుమ. పెద్దగా కేక పెట్టాడు. నిజరూపంలో ప్రత్యక్షమయ్యాడప్పుడు. లంక చూస్తుండ గానే అంత ఎత్తుకు ఎదిగాడు. కోపంగా చూశా డామెను. ఎడమచేయి ఎత్తి, వేళ్ళు మడిచి, పిడికిలి చేశాడు. దాంతో ఒకే ఒక్క దెబ్బ, లంక కడుపులో కొట్టాడు. ఆ దెబ్బకు లంక అవయవాలన్నీ పట్టు తప్పాయి. స్పృహ తప్పింది. కుప్ప కూలింది. 


లంకను చంపాలా? వద్దా? ఆలోచనలో పడ్డాడు హనుమ. తేరిపార చూడసాగాడు. స్పృహ తెచ్చుకుని కళ్ళు తెరిచింది లంక. హనుమ విరాట్‌ రూపాన్ని చూసి వణికిపోయింది. ‘‘మహాబాహూ! నీ పరాక్రమానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. నీలాంటి వారు అబలలను ఆదుకుంటారు. చంపరు. జాలి చూపించు.’’ అన్నది.


విరాట్‌ రూపాన్ని ఉపసంహరించాడు హనుమ. పిల్లకోతిలా మారాడు. ‘‘పూర్వం బ్రహ్మ నాకు ఓ వరం ఇచ్చాడు. ఎప్పుడైతే ఓ వానరుడు వచ్చి నిన్ను జయిస్తాడో అప్పుడు రాక్షసులకు చేటుకాలం దాపురించిందని తెలుసుకో అన్నాడు. సీతను అపహరించడంతో రావణునికేకాదు, రాక్షసులందరికీ చేటుకాలం దాపురించినట్టే! మహావీరా! ఇక నీ ఇష్టం! లంకానగరంలోనికి యథేచ్ఛగా ప్రవేశించు. నందికేశ్వరుని శాపం ఫలించింది.


లంక దుర్బలం అయింది. నిన్ను అడ్డగించేవారు లేరు. స్వేచ్ఛగా లంకాప్రవేశం చేసి, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు.’’ అన్నది లంక. అదృశ్యమైపోయింది.ప్రాకారం పైనుంచి లోపలికి దూకాడు హనుమ. శత్రునగరం కాబట్టి ఎడమకాలు ముందు పెట్టి, భవనాలు మేడలపై దూకుతూ సీతాన్వేషణ చేయసాగాడు. సీతాన్వేషణలో హనుమ భవనాలలో వీణలు వాయిస్తూ, గానం చేస్తోన్న మహిళలను చూశాడు. భర్తలను మురిపిస్తున్న మహిళలను చూశాడు. ఒడ్డాణాలు ధరించి, ఒయ్యారాలు పోతున్న మహిళలను చూశాడు. పచ్చటి దేహచాయతో ఉన్న మహిళలనూ, మెరుపుతీగెలవంటి తేజోవతులనూ, చంద్రబింబం వంటి ముఖాలుగల అందగత్తెలనూ, అమూల్య ఆభరణాలను అలంకరించుకున్న స్త్రీలనూ చూశాడు. దేవ దనుజ మనుష్య జాతికి చెందిన వేలాది మంది సుందరీమణులను చూశాడు. వారిలో అతనికి ఎక్కడా సీతాదేవి కనిపించలేదు.


వేదాధ్యయనం చేస్తోన్న అసురులను చూశాడు హనుమ. హోమాలు చేస్తున్న యాజకులను చూశాడు. బోడితలలవారినీ, జటలు ధరించిన వారినీ చూశాడు. కవచాలు, ఖడ్గాలు, గదలు ధరించిన సైనికులను చూశాడు. ఆ సైనికుల్లో పొట్టివారు ఉన్నారు. పొడుగు వారు ఉన్నారు. పసుపురంగు వారున్నారు. గోధుమరంగు వారు ఉన్నారు. నలుపువారు, కారు నలుపువారు రకరకాల రంగుల వారు ఉన్నారు. వారందరినీ చూశాడు హనుమ. రామకార్యానికి సహకరిస్తున్నట్టుగా చంద్రుడు వెన్నెల విరజిమ్ముతోంటే...ఆ వెలుగులో పరిశీలనగా అందరినీ అన్నిటినీ గమనించసాగాడు హనుమ.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat