శ్రీ వేంకటేశ్వర లీలలు భాగము 4 - నారదుడు బ్రహ్మలోకమునకు వెడలుట

P Madhav Kumar


🍃🌹మునులారా! నారదుడు మహాభక్తుడు. అతడు మఱి యెవరోకాడు. సాక్షాత్తూ బ్రహ్మదేవుని కుమారుడే, భగవద్భక్తులను అభిమానించు నారదుడు సజ్జనుల పాలిట కామధేనువుగ నుండి గర్వముతో పెటపెటలాడువారిని ఒక చూపు చూసి గర్వపు కోరలనుతీసి వినోదించు స్వభావము కలవాడు. 


🍃🌹నిరంతరము శ్రీమన్నారాయణుని నామస్మరణతో పరవశుడై గానము చేయుచూ యెచ్చట నాటంక మనునది లేకయే త్రిలోకములలో సంచరించు నారదుని మహిమ నారాయణునకు తెలియును. నారాయణుని లీలలు నారదునకు తెలియవలసినంతగా తెలియును.


🍃🌹ఒకనాడు తన జనకుడగు బ్రహ్మదేవుని సందర్శించుటకై సత్యలోకమునకు ప్రయాణమయి వెడలినాడు. పద్మాసనమున నాలుగు మోములతో చక్కగ కూర్చునియున్నాడు బ్రహ్మ, ఆయన భార్య అందాల రాశి, చదువుల తల్లియయిన సరస్వతీదేవి వీణ పై సామగానము చేస్తూ భర్తచెంత కూర్చోని యున్నది. 


🍃🌹ఇంద్రుడు మున్నగు దిక్పాలకులు, సూర్యుడు మున్నగు కాంతులీను గ్రహములూ, అనేక మంది మునులు, ముఖ్యముగా సప్తఋషులు, అప్పటికే ఆ సభలో తము అర్హమైన ఆసనముల నలంకరించియుండిరి.


🍃🌹అటువంటి మహాసభకు నారద మునీంద్రుడు విచ్చేసి వినయ పూర్వకంగా బ్రహ్మ, సరస్వతులకు నమస్కరించాడు. వారు నారదుననుగ్రహించి దీవించినారు. నారదుడు ఆ సభకు వచ్చుట సభాసదులకాసక్తికరముగా నుండెను. కారణము నారదుడు త్రిలోక సంచారి కదా. 


🍃🌹అతడు దేవతల వద్దకు వెడలును, రాక్షసుల వద్దకు వెడలును ఆయన ఎక్కడకు వెడలినను అడ్డు ఆపులుండవు కదా! అందువలన అచ్చటి విశేషము లిచ్చటను, ఇచ్చటి విశేషము లచ్చటను ముచ్చటించుట ఆయన కుండనే యున్నది. 


🍃🌹అందువలననే నారదాగమనం ఆనందకరమగుట బ్రహ్మదేవుడు తనయుని ఉచితాసనమలంకరింపజేసి యిట్లనెను - కుమారా! నారదా! నీవు మహాభక్తులలో ఒకడవు. లోకోపకార కార్యక్రమములు నిర్వహించుటయందు నీ ఆసక్తి, శక్తి నాకు తెలియనివి కావు. నీచే నాకొక మహాకార్యము జరుగుదగియున్నది. అందువలన నీ వర్హుడవని నేననుకొందును. ఇంతకు అది ఏమనగా...


🍃🌹మానవులందరూ దైవభక్తియనునది దానంతయులేక నాస్తిక భావములతో నజ్ఞానాంధ కారమున కొట్టుమిట్టాడుచున్నారు. మూర్ఖభావములు కలిగి, ఆ మనుష్యులు బరితెగించి యిష్టము వచ్చినట్లు చేయరాని పాపము లెన్నియో చేస్తూ యున్నారు. 


🍃🌹తల్లితండ్రుల మాటలు పిల్లలు వినుట లేదు. భర్తల మాటలకు భార్యలు విలువనిచ్చుట లేదు. పెద్దవారిని గౌరవించుట, గురువుల పట్ల భక్తి కలిగియుండుట యివి భూలోకమున నీ కలియుగమున నల్లపూసలగుచున్నవి. 


🍃🌹ఇవి అన్నియు మానవులందు పొడజూపుటకు కారణము ఈ సర్వలోకములకూ సర్వగ్రహ నక్షత్రాదులకు మొత్తము మీద సర్వ ప్రకృతి సృష్టికి కారకుడైన దైవము యొక్క చింతన లేకపోవుటయే. పైగా యీ కలియుగమందు శ్రీమహావిష్ణువుయొక్క అవతారము లేకపోయెను. 


🍃🌹కనుక, నారదా! ఇంతకూ నేను చెప్పబోవునదీ, నీవు చేయవలసినదీ యేమనగా నీ యొక్క నేర్పు చూపించి, యోచించి యెట్లయిననూ శ్రీమహావిష్ణువు భూలోకమున అవతరించునట్లు చేయవలెను. దానివలన మానవ కళ్యాణమగును. మరల భూలోకవాసులందు ఆస్తికత్వము ప్రబలుటకు వీలుండును అనెను. 


🍃🌹సభలో గల ఇంద్రాదులకు బ్రహ్మదేవుని ఆలోచన ఆనందమును రేకెత్తించినది. జనకుని మాటలను శ్రద్ధగా విని, నారదుడు తానా పనిని చేయబూనుట లోకోపకారమని భావించి చేయుటకు నిశ్చయించుకొని మరల తండ్రికి నమస్కరించి శెలవు గైకొని వీడి వెడలినాడు.



🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat