🔱 *కుమార చరిత్ర* -5 🔱

P Madhav Kumar

 *శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామినే నమః*  
 

 
అనంతరం...మునులందరి కోరికపై మళ్లీ గిరిజా శంకరుల గాథ చెపుతున్నాడు సూతుడు
 
"....కనుక, తారకుడు కోరిన రీతిన అన్ని విధాలా సరిపోగలిగిన వాడు... శివవీర్యసంజాతు డొక్కడే గనుక దేవతలకు అంత ఆతృత, ఆదుర్దా!
 
శివ వీర్యసంజాతుడు తప్ప తారకుడిని జయించేవాడే లేడు. బ్రహ్మదేవుడి వరప్రభావం అది.
 
సతీదేవి లేనందునా - శివుడు తపోదిక్షలో ఉన్నందునా ఇదెలా సాధ్యం?
 
విష్ణుమూర్తితో సమాలోచన:
బ్రహ్మది దేవతలందరూ విష్ణుమూర్తితో కలిసి మంత్రాలోచన జరిపారు.

 "ఏదోవిధంగా పరమశివుని ఒప్పించి, ఏదో ఒక పిల్లని తెచ్చి కట్టబెడతాం అనుకోండి! ఆ పిల్ల శివ తేజోపుంజానికి తట్టుకోవద్దూ?" అని సందేహం వచ్చింది.
 
అదీ నిజమే! అయినా "ఈశ్వరుడు ఏ పిల్లనంటే ఆపిల్లని చేసుకొనే వాడా?" అనే ఇంకోసందేహం మరికొందరికి కలిగింది.
 
శ్రీ మహావిష్ణువు అందరికీ ధైర్యం చెప్పాడు. అట్టి మహాశివతేజాన్ని భరించగలిగేది సాక్షాత్తు ఆదిశక్తి స్వరూపిణి అంశతో జన్మించనున్నది.ఆమె హిమవత్పర్వతరాజతనయ అని సూచనప్రాయంగా తెలియజేశాడు.
 
తారకాసుర సంహారార్ధం, ఎంతో పకడ్బందీగా దేవతలందరూ ఆ పర్వతరాజతనయనే శంకరునికి పత్నిగా చేయు ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.

 
ఇంతకూ - అసలావిడ జన్మించనేలేదప్పటికి.. అంటే... ప్రాభవ వైభవాల దగ్గర్నుంచీ తమ ప్రయత్నం మొదలెట్టారన్నమాట.
 
ప్రకృతి పురుషుల కలయిక జరగాలి. తత్ఫలం కుమార రూపంలో ఎదగాలి. ఆయనవల్ల తారకాసుర సంహారం జరగాలి.

మళ్లీ దేవతలంతా సమావేశమయ్యారు - ఇంద్రుని ఆధ్వర్యంలో.
 
ప్రత్యక్షసాక్షి అయిన సూర్యుడు అన్నాడు "నీజమే! శంకరుని తపోదీక్ష నిత్యం నేను చూస్తూనే ఉన్నాను కదా! పార్వతీదేవి అంత చేరువలో ఉండి కూడా ఎటువంటి కామ వికారానికీ లోను గావడం లేదు."
 
"కావచ్చు! కాని ఆవిడ పూర్వాశ్రమంలో అతనిపత్ని సతీదేవియే గద!" అగ్నిదేవుడన్నాడు.

"నిజమే! కాని ఆ సంగతినైనా వారిరువురికీ తెలియజెప్పి, పరస్పరం వారిమధ్య ప్రేమ అంకురించేలా చేయగలవారేరి? హవిస్సులను మోసే సామర్ధ్యం ఉన్నవాడివి! ఈ చిన్నకబురు మోసే పని చేపట్టడానికి వేరే ఎందుకూ! నీవే చాలు అగ్నిదేవా!" అని ఇంద్రుడు అగ్నిని పొగిడి, ఆ పని సాధీంచ తలపోశాడు.
 
"అది మాత్రం నావల్ల కాదు దేవేంద్రా! ఏమీ అనుకోవద్దు!" అని తెలియజేశాడు.
 
"వరుణా! చల్లనివాడివి!నువ్వయినా..." ఇంకా ఇంద్రునిమాట అతని నోట్లొనే ఉంటూండగానే" దేవాధిదేవా! అన్యధా  
భావించవద్దు! అది నాచేతగాదు" అంటూ తప్పుకున్నాడు.
 
"కుబేరా! శివుడు నీకు పరమ పవిత్రుడు గదా! ఈ సాహస కార్యానికి..." ఇంద్రుని మాట అంది పుచ్చుకుంటూ,

 
"సాహసకార్యం మాట అలా ఉంచు! ఇంతకు ముందే, సతీదేవి దేహ త్యాగం జరిగిన అనంతరం, పునర్వివాహం చేసుకోమని శివునికి సలహా ఇచ్చి చీవాట్లు తిన్నాను. మళ్లీ ఇప్పుడా పని చేయడం వల్ల నాకు ఇంకోసారి అదే మర్యాద తప్ప, ఇతరత్రా ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా?" అంటు సందేహం వెలిబుచ్చాడు కుబేరుడు.
 
మహామునుల వైపు చూశాడు. వారిలో ఒక్కరూ ఈ బాధ్యత నెత్తిన వేసుకోడానికి రాలేదు.

 నిరుత్సాహంగా తమ  
గురువులైన బృహస్పతి వంక చూశాడు దేవరాజు....

 *దేవాదిదేవనుత దేవగణాధినాథ,*
 *దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద |*
 *దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే* ,
 *వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ‖ 2 ‖*

  🔱   *ఓం శరవణ భవ* 🔱

శ్రీ సుబ్రహ్మణ్య దివ్య చరిత్ర లో  మరికొన్ని అంశాలు తదుపరి సంపుటిలో తెలుసుకుందాం...🙏

*జై శ్రీమన్నారాయణ* 🙏
ఓం అరుణాచల శివాయ నమః🙏
ఓం వాయులింగేశ్వరాయ నమః🙏
🕉️🌷🕉️🌷🕉️🌷🙏🌷🕉️🌷🕉️

🙏 ఓం శరవణ భవ🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat