అయ్యప్ప సర్వస్వం - 11

P Madhav Kumar


*బాధ గురువెవరు? బోధ గురువెవరు?*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


అయితే ఈ గురువులందరూ శిష్యులను ఉద్దరిస్తున్నారా ? వారి వద్ద దీక్ష తీసుకున్న శిష్యులందరూ తరిస్తున్నారా ? అనే సంశయాలు విమర్శలు లోకంలో కనబడుతూనే ఉంటాయి. వింటూనే ఉంటాం. నాకు గురుత్వమును నిర్వహించే అర్హత ఉన్నదా ? లేదా ? సద్గురు లక్షణాలు నాలో ఉన్నాయా ? లేవా ? నేను ఆ స్థానాన్ని అధిష్ఠించడానికి అర్హుడనా ? అనే ఆత్మవిమర్శముందుగా గురు స్థానం స్వీకరించే ఉపదేష్ట లేదా ఆచార్యుడు చేసుకోవాలి. అలా చేసుకోకుండా గురువనే వేషం లేదా ముసుగులో కేవలం స్వార్థంతో కీర్తికాంక్షతో గురుత్వాన్ని నిర్వహించేవారు తమ నాశ్రయించుకున్న శిష్యుల భవతాపాన్ని ఉపశమింపచేయలేరు. వారికి మనశ్శాంతిని ముక్తిని ప్రసాదింపలేరు. వారు కేవలం బాధ గురువులే కానీ బోధ గురువులు కాలేరు. ఇలాంటి కుహనా గురువులు పూర్వకాలంలో కూడా ఉండబట్టే -


*గురవో బహవస్సన్తి శిష్యవిత్తాపహారకాః తమేకం సద్గురుం మన్యే శిష్యహృత్తాపహారకమ్ |*

లోకంలో శిష్యుల ధనమును సేవలను హరించే గురువులు చాలామంది ఉంటారు. శిష్యుని యొక్క మనసులోని ఆర్తిని శాంతింప చేసి మనశ్శాంతి కలిగించే గురువే సద్గురువని నా తలంపు. అట్టి సద్గురువు లభించడం చాలా కష్టం అనే విమర్శ ప్రచారంలో కొచ్చింది కాగా *బోధగురువైన సద్గురువునాశ్రయించడం ఎలాగనేది ప్రశ్న.* సద్గురు లక్షణాలను కొన్నింటిని ఇతమిత్థంగా నిర్ధారించడం జరిగింది.


*సద్గురువు యొక్క లక్షణాలు :* ఆచార్యుడు శిష్యులను కన్నబిడ్డల వలె చూసు కోవాలంటున్నది వేదం. ఆచార్యుడుదయాన్నే లేచి సారస్వతేష్టి చేసి ప్రతినిత్యమూ అగ్నిహోత్రుణ్ణి


*ఆమాయాన్తు బ్రహ్మచారిణః స్వాహా ఏవం మా ప్రాతరాయాన్తు బ్రహ్మచారిణః స్వాహా*


*(తైత్తిరీయోపనిషత్తు)*


ఓ అగ్నిదేవా ! నా వద్దకు శిష్యులు పరంపరగా అవిచ్ఛిన్నంగా వస్తూ జ్ఞానులై వెళుతూ ఉండాలి. వచ్చేవారిలోని అజ్ఞానాన్ని మోహాన్ని వైదొలగించి వారికి అంతరింద్రియ నిగ్రహము (శమము) బహిరింద్రియ నిగ్రహము (దమమును) అనుగ్రహించి వారిలోని కపటబుద్ధిని పాపపుటాలోచనలను నీవు తొలగించి వారికి తేజస్సు. ఓజస్సు , యశస్సు , మహస్సులను నీవు అనుగ్రహించవలసినది. నీరు పల్లానికి ప్రవహించి నట్లుగా అనంతమైన కాలచక్రంలోకి దినాలు , వారాలు , పక్షాలు , మాసాలు , వత్సరాలు , యుగాలు కలిసిపోతున్నట్లుగా నా వద్దకు శిష్యులు అసంఖ్యాకంగా వచ్చి తేజస్సంపన్నులై ఆనంద స్వరూపులై మరల ఆచార్యకము నిర్వహించే సామర్థ్యంతో నా వద్ద నుండి నిష్క్రమించాలి.


అందరూ తాము తరిస్తూ తన చుట్టూ ఉన్న వారిని తరించేలా ప్రయత్నించాలి. ఈ పరంపర ఇలా అనుస్యూతంగా సాగుతూనే ఉండాలి. సద్గురువైన ఆచార్యుడిలా మనసా వాచా భగవానుని శిష్యుల అభ్యున్నతి కోసం అనునిత్యము తన దైనందిన జీవితంలో భాగంగా ప్రార్థిస్తూనే ఉంటాడు. తన వద్దకు వచ్చిన శిష్యునకు బ్రహ్మవిద్యను లేదా తారకమంత్రాన్ని ఉపదేశిస్తూ ఈ బ్రహ్మవిద్య మనల నిరువురను సంరక్షించుగాక. దీని యొక్క అమృతత్వసిద్ధిని మనమిద్దరము కలసి అనుభవిద్దాం. కలసి ప్రయత్నిద్దాం. ఆ బ్రహ్మతేజము తప్పక మనకు సిద్ధిస్తుంది. మనకు తప్పక శాంతి లభిస్తుందని ముమ్మారు భరోసాన్ని యిస్తాడు. ఈ విషయాన్ని


*సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై ఓం శాంతి శాంతి శాంతిః*


అనే శాంతి మంత్రంలో శ్రుతి నిర్దేశిస్తున్నది. ఇది సద్గురువు యొక్క స్వభావ నిర్దేశం. అంటే ఇలాంటి వారిని గుర్తించి వారిని శిష్యుడాశ్రయించాలని శ్రుతి తాత్పర్యం.


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*🌻🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat