శ్రీదేవీభాగవతము - 25*

P Madhav Kumar


*తృతీయ స్కంధము - 04*

                       ✍️ ఆచార్య బేతవోలు రామబ్రహ్మం

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏

*శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః* 


*లలితా సహస్రనామ శ్లోకం - 25*


*సంపత్కరీ సమారూఢ సింధురవ్రజసేవితా!*

*అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృతా!!*

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏


*నిన్నటి భాగములో.........*                   

*త్రిమూర్తికృత దేవీస్తుతి* చదువుకున్నాము.


*అమ్మ దయతో......*

ఈ రోజు  తృతీయ స్కంధములోని

*దేవీకృత తత్త్వోపదేశం - శక్తిప్రదానం* చదువుకుందాం......


🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡


🙏 *దేవీకృత తత్త్వోపదేశం - శక్తిప్రదానం* 🙏


*చతుర్ముఖా !* నాకూ నా పురుషుడికీ భేదం లేదు. ఎప్పుడూ ఏకత్వమే. అతడే నేను, నేనే అతడు. భేదం మతివిభ్రమం.


*సదైకత్వం న భేదో౬స్తి సర్వదైవ మమాస్య చ !*

*యో౬సౌ సా౬హమహం యో౬సౌ భేదో౬స్తి మతివిభ్రమాత్ !!*


మా మధ్య ఉన్న సూక్ష్మమైన అంతరాన్ని తెలుసుకున్నవాడు నిస్సంశయంగా సంసారవిముక్తుడు. బ్రహ్మం ఎప్పుడూ ఏకమే, అద్వితీయమే. *ఏకమేవాద్వితీయం బ్రహ్మ.* సందేహం లేదు.  కానీ సృజన సమయంలో ద్వైతభావాన్ని పొందుతుంది. ఒకటే దీపం ఉపాధియోగం వల్ల రెండు అయినట్టూ, నీడయే అద్దంలో పడి ప్రతిబింబమైనట్టూ, మేము ద్విధాత్వం (ద్వైత భావం) పొందుతూంటాం.


*యథా దీపస్తథోపాధేర్యోగాత్సంజాయతే ద్విధా!*

*ఛాయే వాదర్శమధ్యే ప్రతిబింబం వా తథావయోః !!*


అజా ! ఉత్పత్తికాలంలో సృష్టికోసం (భేదం) భిన్నత్వం సంభవిస్తుంది. అలా ద్వైవిధ్యం ఉన్నప్పటికీ అది దృశ్యాదృశ్య విభేదమే. ఉపసంహార సమయంలో నేను స్త్రీనీ కాదు, పురుషుణ్ణి కాదు, క్లీబాన్నీ కాదు. సర్గస్థితిలోనే ఈ విభేదం. అదికూడా బుద్ధికల్పితం. మరొక రహస్యం చెబుతున్నాను. 


*ఈ సృష్టిలో నేను కానిది ఏమి లేదు. బుద్ధి, శ్రీ, ధృతి, కీర్తి, స్మృతి, శ్రద్ధ, మేధ, దయ, లజ్జ, ఆకలి, కోరిక, ఓర్పు, కాంతి, శాంతి, దప్పిక, నిద్ర, మెలకువ, జర, యౌవనం, విద్య, అవిద్య, స్పృహ, వాంఛ, శక్తి, అశక్తి, వస, మజ్జ, చర్మం, వృష్టి, వాక్కు, అనృతం, ఋతం, పరామధ్యమాపశ్యంతీలు, వివిధ నాడీమండలం - అన్నీ నేనే.* 


నేను కానిది ఏదైనా ఉందా ? ఆలోచించి చెప్పు. *“సర్వమేవాహమ్”*  ఈ నిశ్చయం తెలుసుకో. అందుకే ఈ సృష్టిలో నాది వితత స్వరూపం.


దేవతలలో కూడా రకరకాల పేర్లతో నేనే ఉంటాను. శక్తి రూపంలో ఉంటాను. పరాక్రమం చూపిస్తాను. *గౌరి, బ్రాహ్మి, రౌద్రి, వారాహి, వైష్ణవి, శివ, వారుణి, కౌబేరి, నారసింహ, వాసవి - అన్ని రూపాలూ అన్ని నామాలూ నావే. అందరిలోనూ నేనే ఉండి అందరినీ నిమిత్తమాత్రుల్ని చేసి ఆయా కార్యాలు నేనే నిర్వర్తిస్తూంటాను.*


నీళ్ళలోని చల్లదనం, అగ్నిలోని వెచ్చదనం, సూర్యుడిలోని జ్యోతిస్సు, చంద్రుడిలోని మంచు నేనే. అవసరాన్నిబట్టి ఏది కావాలంటే అది అవుతాను. నేను లేనిది - ఏదీ స్పందించదు. శంకరుడైనా సరే నేను వదిలేస్తే రాక్షసుల్ని సంహరించలేడు. దుర్బలుడైపోతాడు. లోకంలో దుర్బలుడికి పర్యాయపదం ఏమిటి ? శక్తిహీనుడు అనే కదా ! రుద్రహీనుడు, విష్ణుహీనుడు అని ఎవరైనా అంటారా ? శక్తిహీనుడు అని మాత్రమే అంటారు.


నువ్వైనా శక్తియుక్తుడవు అయినందువల్లనే జగత్సృష్టి చెయ్యగలుగుతున్నావు. విష్ణువూ అంతే. ఇంద్రాది దిక్పాలకులూ అంతే. పంచభూతాలూ సూర్యచంద్రులూ అంతే. ఈ భూమి - సమస్తాన్నీ మోస్తోందంటే శక్తియే కారణం. నేనే లేనినాడు అశక్తురాలవుతుంది. చిన్న పరమాణువును కూడా మొయ్యలేదు. ఆదిశేషుడూ అష్టదిగ్గజాలూ అంతే. నేను తలుచుకుంటే సృష్టిలో ఉన్న నీరంతా త్రాగెయ్యగలను. సూర్యుణ్ణి దాచెయ్యగలను. వాయువును స్తంభింపజెయ్యగలను.


*కమలజా !* నా తత్త్వం విచిత్రంగా ఉంటుంది. ప్రాగభావప్రధ్వంసాభావాది స్థితులకు అతీతం. మృత్పిండ కపాలాదులలో ఘటాభావంలాగా జగదభావం ఉందిగానీ శక్త్యభావం లేదు, ఉండదు. ఇక్కడ అంతా జలమయం, పృధివి లేదు, సృష్టి ఎలా చెయ్యను అనికదా అడిగావు. స్థూలాకారంలో పృథివి లేదు అంటే పరమాణువు(లు)గా ఉందని తెలుసుకో. పృథివ్యభావం పరమాణ్వభావం కాదు.


*శాశ్వతం, క్షణికం, శూన్యం, నిత్యం, అనిత్యం, సకర్మకం, అహంకారం అని ఏడు విభేదాలు ఉన్నాయి.*


*విరించీ !* నీకు మహత్తత్త్వం ఇస్తున్నాను స్వీకరించు. దాని నుంచి అహంకారం ఉద్భవిస్తుంది. అహంకారం నుంచి యథాపూర్వంగా భూతసృష్టి కావించు.


*పద్మసంభవా !* నీకొక శక్తిని ఇస్తున్నాను స్వీకరించు. ఇదిగో చూడు. *అందాల రాసి. శ్వేతాంబరధారిణి. చారుహాసిని. దివ్యభూషణ భూషిత. పేరు మహాసరస్వతి. రజోగుణవతి. నీకు క్రీడార్థంగా నిత్యసహచారిణిగా ఉంటుంది. ఈమె నా విభూతి. ఎప్పుడూ అవమానించకు సుమా ! నీకు పూజ్యతమ. నీకు ఏకైక ప్రియ.*


ఈమెతో కలిసి సత్యలోకానికి వెళ్ళు. బీజం నుంచి చతుర్విధ సృష్టినీ కావించు. కర్మలతో కలిసి జీవుల గుర్తులు (కోశంలో) కాలగర్భంలో ఉంటాయి. వాటిని అనుసరించి యథాపూర్వంగా సృష్టిని ఉత్పాదించు. కాలకర్మస్వభావాదులు కారణాలుగా చరాచరజగత్తు యథాపూర్వంగా ఉంటుంది.


నీకు విష్ణుమూర్తి ఎల్లప్పుడూ మాననీయుడు, పూజనీయుడు. సత్త్వగుణ ప్రధానుడు కనక మీ ఇద్దరి కంటే అధికుడు. కష్టసాధ్యమైన పని చెయ్యవలసి వచ్చినప్పుడల్లా ఇతడు అవతారం ఎత్తి దానవ సంహారం చేసి మీకు సహకరిస్తూ ఉంటాడు. శివుడు కూడా నీకు సహాయకుడుగా ఉంటాడు. వెళ్ళు. సకల దేవతలనూ సృష్టించు. సకల మానవులనూ సృష్టించు. యజ్ఞయాగాలను వారు నిర్వహిస్తారు. దేవతలను సంతృప్తి పరుస్తారు. అన్నింటా నా నామధేయాన్ని ఉచ్చరిస్తే చాలు అందరికీ సంతృప్తి కలుగుతుంది. తమోగుణ విశిష్టుడుకదా అని శివుణ్ణి చిన్నచూపు చూడకు. అతడు మాననీయుడు. యజ్ఞాలలో ప్రత్యేకించి పూజనీయుడు.


దేవతలకు రాక్షసభయం పెచ్చు పెరిగినప్పుడు నా శక్తులు *వారాహి, వైష్ణవి, నారసింహ* మొదలైన రూపాలలో ఆవిర్భవించి రాక్షససంహారం చేస్తాయి.


*మంత్రాలలోకెల్లా ఉత్తమోత్తమం నవాక్షరమంత్రం.* దాన్ని జపిస్తూ, నిరంతరం మనస్సులో ధ్యానిస్తూ నీ పనులను నువ్వు నిర్వర్తించు. నిర్విఘ్నంగా జరుగుతాయి. సకలవాంఛలు తీరతాయి.


*నారదా !* నాకు ఇలా ఉపదేశించి ఆ జగన్మాత విష్ణుమూర్తితో సంభాషించింది అతడికి మహాలక్ష్మిని బహూకరించింది. నిత్యానపాయినిగా వక్షఃస్థలం మీద ధరించి గౌరవించమంది, నా శక్తి, క్రీడార్థంగా నీకు ఇస్తున్నాను. ఎప్పుడూ అవమానించకు అని హెచ్చరించింది. ఇది లక్ష్మీనారాయణ యోగం అని చెప్పింది.


మీ ముగ్గురూ మద్గుణసంభవులు. అందరికీ మాన్యులూ పూజ్యులు అవుతారు. మీలో మీరు కలహించుకోకుండా అవిరోధంగా వర్తించండి. మూఢులు విభేదాలు కల్పిస్తారు. వాళ్ళే నరకానికి పోతారు. శివుడే విష్ణువు. విష్ణువే శివుడు. అలాగే విరించి. భేదం ఉంది అన్నవాడికి నరకమే గతి.


*విష్ణూ !* మరొక గుణభేదం ఉంది. విను. నీది అతిముఖ్యమైన సత్వగుణం. పరమాత్మ విచింతనకు అనుకూలిస్తుంది. రజస్తమోగుణాలు నీలో అసలు ఉండకపోవు. అప్రధానంగా ఉంటాయి. లక్ష్మీదేవితో విహారాలు చేసేటప్పుడు రజోగుణం ప్రధానమవుతుంది. వాగ్బీజమూ కామబీజమూ 


మాయాబీజమూ (ఐం - హ్రీం - క్లీం) అయిన ఒక దివ్యమంత్రాన్ని నీకు ఉపదేశిస్తున్నాను. దీన్ని జపిస్తూ సుఖంగా జీవించు. నీకు మృత్యుభయం లేదు. నీ మీద కాలం ఏ ప్రభావమూ చూపించదు. (ముసలితనం రాదని). నా విహారాన్ని ముగించి ఈ విశ్వాన్ని ఉపసంహరించేటప్పుడు మాత్రం వారు ముగ్గురూ కూడా నాలో లీనమైపోతారు. నీకు ఉపదేశించిన మంత్రం ఉధ్ధసంయుక్తం. శుభప్రదం. మోక్షప్రదం. అనుక్షణం జపించు. వెళ్ళు. వైకుంఠం నిర్మించుకుని నివసించు. సనాతనినైన నన్ను ధ్యానిస్తూ స్వేచ్ఛగా విహరించు.


*నారదా !* త్రిగుణాత్మక ప్రకృతి ఆ మహాదేవి విష్ణుమూర్తితో సంభాషించి శివుడివైపు తిరిగింది. అమృతోపమంగా మాట్లాడింది.


*హరా !* ఇదిగో గౌరి. మనోహర. మహాకాళి, ఈమెను స్వీకరించు. కైలాస శిఖరం నివాసంగా చేసుకుని హాయిగా విహరించు. నీకు తమోగుణం ప్రధానంగా ఉంటుంది. సత్త్వరజోగుణాలు అప్రధానంగా ఉంటాయి. రాక్షస వినాశనం చేసేటప్పుడు తమోగుణ రజోగుణ ప్రధానుడవు అవుతావు. నన్ను ధ్యానిస్తూ యోగనిష్ఠలో కూర్చున్నప్పుడు సత్త్వగుణ ప్రధానుడవు అవుతావు. మొత్తం మీద ఈ ముగ్గురివీ మూడుగుణాలు. సృష్టి స్థితి లయాలకు అవే కారణాలు. ఈ మూడుగుణాలకూ అతీతమైనది (వస్తువు) ఏదీ ఈ సృష్టిలో లేదు. కనిపించే ప్రతివస్తువులోనూ ఈ గుణత్రయం ఉండి తీరుతుంది. నిర్గుణమైన వస్తువు సృష్టిలో కనపడదు. భూతకాలంలో లేదు. భవిష్యత్కాలంలో ఉండదు. కంటికి కనపడేది ఏదీ నిర్గుణం కాదు. పరమాత్మ ఒక్కడే నిర్గుణుడు. అతడు కంటికి కనపడడు.


*శంకరా !* నేను మాత్రం సమయానుకూలంగా సగుణనూ నిర్గుణనూ అవుతూంటాను. ఎల్లవేళలా అహంకారం మాత్రం నేనే. ఎన్నడూ కార్యం మాత్రం కాను. కారణరూపంలో సగుణను. పురుష సన్నిధిలో నిర్గుణను. అహంకారం మహత్తత్త్వం. శబ్దాదులు గుణాలు. కార్యకారణరూపంలో అహర్నిశమూ సంసారం (ప్రపంచం) సాగుతూ ఉంటుంది. అహంకారమే నేను కనక నేనే కారణం. అహంకారమే నాకు కార్యం. అది త్రిగుణాత్మకం. అది మహత్తత్వం. అది బుద్ధి. దానినుంచే తన్మాత్రలు ఉత్పన్నమవుతున్నాయి.


పంచభూతాది సర్వసృష్టి సముద్భవానికీ అవే కారణం. కర్మేంద్రియాలు అయిదు, జ్ఞానేంద్రియాలు అయిదు, మహాభూతాలు అయిదు (పంచభూతాలు), మనస్సు పదహారవది. ఈ పదహారూ కార్యకారణగణం. పరమాత్మ అనబడే ఆదిపురుషుడు కార్యమూ కాదు, కారణమూ కాదు.


*శంభూ !* ఇదీ సృష్టి రహస్యం. ఈ ముగ్గురికీ సంక్షేపంగా తెలియపరిచాను. 


ఇదిగో ఈ 'దివ్య విమానంలో బయలుదేరండి. మీ మీ కార్యాలు నిర్వహించండి. విషమ పరిస్థితి ఏదైనా ఎదురైనప్పుడు నన్ను స్మరించండి. స్మరణమాత్రం చేతనే నేను మీకు దర్శనం అనుగ్రహిస్తాను. అలాగే సనాతనుడైన పరమాత్మనుకూడా తలుచుకోండి. మా ఇద్దరినీ తలుచుకుంటే నాకు కార్యసిద్ధి నిస్సంశయంగా కలుగుతుంది.


*నారదా !* ఆ జగదీశ్వరి ఇలా మా ముగ్గురికీ మూడు శక్తులను బహూకరించి (బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సరస్వతీ లక్ష్మీ మహాకాళీ శక్తులను) వీడ్కోలు పలికింది. అక్కడినుంచి కదిలి ఇవతలికి వచ్చేసరికి మళ్ళీ మాకు యథాపూర్వంగా పురుషరూపాలు వచ్చేశాయి. ఆశ్చర్యంగా తనువులు తడుముకొని చూసుకున్నాం. జగన్మాత ప్రభావాన్ని తలుచుకుంటూ దివ్యవిమానం అధిరోహించాం.


మరింక ఆ సుధాసింధువుగానీ ఆ శ్వేతద్వీపంగానీ ఆ మహాదేవిగానీ కనిపించలేదు. దేవేరులతో కలిసి మేము ముగ్గురమూ ఉన్న విమానం బయలుదేరింది. వెనకటికి మధుకైటభులను విష్ణుమూర్తి సంహరించిన మహాజలనిధి దగ్గరికి వచ్చింది. నా పద్మాసనం సన్నిధిలో నిలిచింది. 


*(అధ్యాయం-6, శ్లోకాలు-85)*


బ్రహ్మదేవుడు ప్రసంగం ముగించాడు. నారదుడికి చాలా సందేహాలు తొలగడంతోపాటు, కొత్త సందేహాలుకూడా చాలా పుట్టకువచ్చాయి. వినయంగా తండ్రిని ప్రశ్నించాడు.


*పితామహా !* అవినాశి నిర్గుణుడు అచ్యుతుడు అవ్యయుడు అయిన ఆదిపురుషుణ్ణి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలని ఉంది. దర్శనానుభవం పొందినవాడవు. వివరించి చెప్పు. త్రిగుణాత్మకమైన ఆదిపరాశక్తిని మీరు వీక్షించారు. నిర్గుణ స్వరూపిణి సగుణరూపంలో ఎలా ఉంటుంది ? ఆ పురుషుడు ఎలా ఉంటాడు ? శ్వేతద్వీపంలో నేననగా మిగతా మహర్షులనగా వేలసంవత్సరాలుగా మళ్ళీ మళ్ళీ తపస్సులు చేస్తూనే ఉన్నాం. కానీ ఇంతవరకూ పరమాత్మ దర్శనం మాకు లభించలేదు. మీకు సిద్ధించింది. ఎంతటి మహాభాగ్యమది ! పద్మసంభవా! దయచేసి నా సందేహం తీర్చు. *నిర్గుణ - నిర్గుణుడు* ఎలా ఉంటారో వివరించు.


చతుర్ముఖుడు నాలుగువైపులా చిరునవ్వులు చిందించాడు. వాత్సల్యం తొణికిసలాడే చూపులతో నారదుణ్ణి కౌగిలించుకున్నాడు. మృదువుగా బదులు పలికాడు.


*(రేపు బ్రహ్మకృత గుణతత్త్వ నిరూపణం)*


*🙏అమ్మ దయ ఉంటే... అన్నీ ఉన్నట్లే...🙏*


               *...శ్రీదేవీ భాగవతము... సశేషం...*


♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾


*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*

*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*


*భావము:* 💐


ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏


 

🙏🌹🌹🌹🌹🌹🙏


🙏 శ్రీ మాత్రే నమః🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat