శ్రీవారి బ్రహ్మోత్సవాలు - రథోత్సవం - చక్రస్నానం

P Madhav Kumar


Part - 21

⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️

శ్రీవారి బ్రహ్మోత్సవాలు  -ఎనిమిదవ రోజు- రథోత్సవం


ఎనిమిదోరోజు జరిగే రథోత్సవానికి హాజరయ్యేంత భక్తజనం మరేరోజునా కానరారు. భక్తులు ప్రత్యక్షంగా పాలుపంచుకోగలిగే స్వామివారి వాహన సేవ అదే మరి. ఇక రథం విషయానికొస్తే... 


దానికి సారథి దారుకుడు. సైబ్యం, సుగ్రీవం, మేఘపుష్పం, వాలహకం రథానికి పూన్చిన గుర్రాలు. సకల దేవతామూర్తులతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఆ రథాన్ని అధిరోహించిన మలయప్పస్వామి తిరువీధుల్లో ఊరేగి భక్తులను పరవశింపజేస్తారు.'


రథస్థ కేశవం దృష్టా పునర్జన్మ నవిద్యతే' అనేది శృతివాక్యం.


⚜️⚜️⚜️⚜️


శ్రీవారి బ్రహ్మోత్సవాలు- తొమ్మిదవ రోజు- చక్రస్నానం


 శ్రీవారి బ్రహ్మోత్సవాలలో తొమ్మిదవరోజు ఉదయం భూదేవీ సమేత  మలయప్పస్వామివారిని సుదర్శన చక్రత్తాళ్వార్‌తో వరాహస్వామివారి ఆలయ ప్రాంగణంలో వేంచేపు చేయించి, పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. తర్వాత శ్రీచక్రత్తాళ్వార్‌ను అంటే సుదర్శన చక్రాన్ని స్వామి పుష్కరిణిలో ముంచి, పవిత్రస్నానం చేయిస్తారు. 


అదే సమయంలో లక్షలమంది భక్తులు కూడా శ్రద్ధాభక్తులతో శిరఃస్నానం చేస్తారు.


ఆ సమయంలో శ్రీవారి దివ్యమూర్తుల శక్తి, శ్రీవారి పంచాయుధాల్లో ప్రముఖమైన శ్రీసుదర్శనాయుధశక్తి పుష్కరిణి జలంలో సూక్ష్మరూపంతో మిళితమై ఉంటాయి. అందుకే ఈ చక్రస్నానం సృష్టిచక్రానికంతటికీ అత్యంత పవిత్రమైంది. దీనికే అవభృథస్నానమని కూడా పేరు.


 శ్రీవారి దివ్యాయుధాలలో చక్రాయుధ ప్రశస్తి ఎంత మహత్తరమో గుర్తిస్తే- చక్రస్నాన మహత్యం భక్తులకు అంతగా స్వానుభవానికి వస్తుంది.


శ్రీనివాసుని పంచాయుధాలలో మూర్తిమంతంగా, దేవతగా, ఆళ్వార్‌గా, యంత్రరూపంగా, యంత్రాధిష్ఠానదేవతగా, దుష్టశిక్షణలో ప్రముఖాయుధంగా కీర్తింపబడేది  సుదర్శనమొక్కటే! 


భక్తై సుఖేన దృశ్యత ఇతి.....


 అంటే దీనిని భక్తులు సుఖంగా చూడగలరన్నమాట. 


శ్రీవారి చక్రాయుధాన్ని కష్టాలు, దుష్టశక్తులు, శత్రువుల బారి నుండి రక్షించే మహాశక్త్యాయుధంగా విశ్వసించి, పూజించడం ఒక ప్రత్యేకత. 


దేవశిల్పి అయిన విశ్వకర్మ సూర్యుని  తేజస్సును పోగు చేసి, చక్రాకారమైన ఆయుధంగా రూపొందించి, మహావిష్ణువుకు ఆయుధంగా ఇచ్చాడు. ఇది శ్రీహరి సంకల్పించినంతనే వచ్చి, కుడిచేతిని చేరుతుంది. ప్రయోగించగానే ఎంత బలవంతుణ్ణయినా తరిమి, సంహరించి, తిరిగి స్వస్థానానికి వస్తుంది. ఈ చక్రాయుధం వల్ల మృతినొందినవారు విష్ణుదేవుని దివ్యతేజంలో లీనమవుతారు.


గజేంద్ర సంరక్షణకై శ్రీహరి తన చక్రాయుధాన్నే పంపాడు.


 భాగవతంలోని అంబరీషుని వృత్తాంతంలో... దుర్వాసునికి బుద్ధి చెప్పి, అంబరీషుని రక్షించేందుకై శ్రీహరి పంపిన చక్రం ఎంత మహత్తర ప్రభావంతో, విజ్ఞతతో ప్రవర్తించిందో గమనిస్తే, అది సాక్షాత్తూ నారాయణ రూపమే అని గోచరిస్తుంది.


 శివబ్రహ్మాదులైన ఏ దేవతలూ ఆ చక్రాన్ని నివారించలేకపోయారు. అప్పుడు అంబరీషుడు ఆ మునిని రక్షించేందుకు చేసిన చక్రాయుధ స్తోత్రం సుదర్శన సహస్రనామ స్తోత్రంలోని అన్ని నామాల సారాంశాన్నీ పుణికిపుచ్చుకుంది.


దుష్టులకు సుదర్శన చక్రం ఆయుధంలా కనిపిస్తే, భక్తులందరికీ అది స్వామివారి ఆభరణంలా దర్శనమిస్తుంది.


 సృష్టిక్రమం దోషదూషితం కాకుండా ఈ చక్రం కాపాడుతుందనేది యోగుల విశ్వాసం.


 శ్రీవారి చక్రం అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసి, జ్ఞానకాంతులను ప్రసరింపజేస్తుంది. అందుకే దీన్ని సుదర్శనం అంటారు.


 ధ్వజారోహణం నాడు గరుత్మంతునితోబాటు చక్రత్తాళ్వార్‌నీ ఆహ్వానిస్తారు. అప్పుడు చక్రగద్యంతో స్వాగతం పలుకుతారు. అనంతరం... ‘అఖిల జగదభివృద్ధిరస్తు’ అని మంగళవాచకం చెప్పి, తాళ లయాత్మకంగా ఆహ్వానించి, సుదర్శన దేవతకు ప్రీతికరంగా...‘చక్రస్య షట్పితా పుత్రతాళం స్వస్తిక నృత్తకమ్ శంకరాభరణ రాగం చక్రవాద్య సమన్వితమ్’ అని పఠిస్తారు.


ఇందుకు తగినట్లే మంగళవాద్యకులు శంకరాభరణం, షట్పితా పుత్రతాళం, స్వస్తిక నృత్తం, చక్రవాద్యం కావిస్తారు. నైవేద్య నీరాజనాద్యుపచారాలతో చక్రదేవతను ఆరాధిస్తారు. ఇదే పద్ధతిని అనుసరించి, చక్రగద్యాదికం పఠించి, అర్చించి, ధ్వజావరోహణం నాడు చక్రదేవతకు వీడ్కోలు పలుకుతారు.


బ్రహ్మోత్సవ సేవలలో తక్కినవన్నీ ఒక ఎత్తు... చక్రస్నానం ఒక ఎత్తు. 


శ్రీమన్నారాయణాభేదశక్తిని తనలో ఇముడ్చుకున్న చక్రస్పర్శచే పవిత్రమైన పుణ్యజలంలో చక్రంతోపాటు స్నానం చేయడం బ్రహ్మోత్సవాలలో ఒక అద్భుత సన్నివేశం. 


చక్రస్నానం వల్ల సర్వపాప విముక్తులై, విష్ణులోకాన్ని పొందుతారని ఆగమోక్తి..


అభయహస్తప్రదర్శన గోవిందా || మర్త్యావతారాగోవిందా..


శంఖచక్రధర గోవిందా|| శారంగదాధర గోవిందా


గోవిందాహరి గోవిందా || గోకులనందన గోవిందా.


⚜️⚜️⚜️🌷🌷⚜ తిరుమల సర్వస్వం⚜️


ఆనంద నిలయంలో వైకుంఠవాసునికి ఆరగింపులు

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat