అయ్యప్ప సర్వస్వం - 37

P Madhav Kumar


*శరణము పలికే విధానము  - 1*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


స్వామి శరణాలను పలుపలురకములుగా పలుకుదురు. అందులో తొమ్మిది రకములైన శరణములను సూచించి చెప్పుకొనవచ్చును.


1. వాత్సల్య శరణము , 

2. వ్యష్టిశరణము , 

3. సమిష్టి శరణము , 

4. సంకేత శరణము , 

5. దీర్ఘశరణము , 

6. దీనార్థశరణము , 

7. అవ్యవధితశరణము , 8. మౌనశరణము , 

9. క్షమాపణశరణము.


*1.“ వాత్సల్య శరణము”*


సర్వేశ్వరుడైన పరమాత్మను తన బిడ్డగా లేక సోదరునిగా భావించి పూజించుట , ఎలా దశరథుడు , యశోద , బలరాముడు , పందళరాజు మున్నగువారు సాక్షాత్ భగవంతుడే తమబిడ్డగా , సోదరునిగా యుండుటగాంచి ఎట్టి అనుభూతితో వార్లను సంభోదించి మురిసినారో అట్టిస్థితిలో తమలను యుంచి స్వామి అయ్యప్పను చిన్నారి బాలునిగా , కుళత్తూర్ శిశువుగా తలచి పిలిచే శరణాలలో వాత్సల్యము తొణికి సలాడును.


ఉదా|| హరిహరసుతుడే - శరణమయ్యప్ప


శంభుకుమారుడే - శరణమయ్యప్ప


పందళబాలుడే - శరణమయ్యప్ప


శక్తీ పుత్రుడే - శరణమయ్యప్ప


షణ్ముఖసోదరుడే - శరణమయ్యప్ప


గణపతి సోదరుడే - శరణమయ్యప్ప


*2. "వ్యష్టి శరణము”*


భగవత్సన్నిధిలో నిలబడి భక్తి శ్రద్ధలతో తనను తనవార్లను కాపడమనియు. తాను తలపెట్టిన కార్యము ఎట్టి ఆటంకము లేక జయప్రదము గావలయుననియు ప్రార్థించుచూ పిలిచే శరణాలను వృష్టి అందురు.


ఉదా॥ ముందు వెనుకతోడుండి కాపాడవలెను - స్వామియే శరణమయ్యప్ప


నీ భక్తులను కాపాడవలెను - స్వామియే శరణమయ్యప్ప


కన్ని స్వాములను కాపాడవలెను -  స్వామియే శరణమయ్యప్ప


సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తియే - శరణమయ్యప్ప


అజ్ఞానములో యున్నాము  -  స్వామియే శరణమయ్యప్ప 


జ్ఞాన ప్రసాదించవలెను -  స్వామియే శరణమయ్యప్ప 


జ్యోతి దర్శనము చూపించవలెను -  స్వామియే శరణమయ్యప్ప 


మున్నగు శరణాలను స్వామిపూజలో కరములు జోడ్చి తనువు మరచి పిలిచేటప్పుడు కలిగెడి అనుభూతి రాతలో పెట్టడం తరము కానిది.


*3. " సమిష్టి శరణము”*


శబరిమల యాత్రలో పిలిచినంత శరణఘోషములు ఇంకే తీర్థ యాత్రలోను వినిపించదనియే చెప్పవచ్చును. గుంపులు గుంపులుగా అలలవలె తరలివచ్చే స్వామి అయ్యప్ప బృందములో యొకరు స్వామియే అని పిలువ , అచ్చట గుమిగూడియున్న భక్తులందరిని ఒక్కసారిగా ఎలుగెత్తి *"శరణమయ్యప్ప"* అని మారు పలుకువేళ ఆ పరిసర ప్రాంతమే పావనమై తీరుననుటలో అతిశయోక్తిలేదు. ఈ శరణాలను శ్రీ అయ్యప్పస్వామి వారి దివ్యనామములు , ఆ యాత్రలో మనము సందర్శించు పుణ్యక్షేత్రములు మరియు శ్రీ స్వామి వారి వన యాత్రలోని ముఖ్యమైన స్థలములను , జతకలిపి రాగ , తాళ , లయములతో ఘోషించి ఆనందించెదరు. నోరువిప్పి శరణాలు పలికే వేళ మనయెడ యుండేటి సంకోచము , బద్దకము , భయము మున్నగునవి తొలగి , యదార్థ భక్తియు , స్థైర్యము కలుగును.


ఉదా|| మోక్షప్రదాయకుడే - శరణమయ్యప్ప


పూజించువారికానందమూర్తియే - శరణమయ్యప్ప


జ్యోతి స్వరూపుడే - శరణమయ్యప్ప


చిన్ముద్ర దారియే - శరణమయ్యప్ప


శబరిగిరీశుడే - శరణమయ్యప్ప


సర్వజీవాంతర్యామియే - శరణమయ్యప్ప


జీవన్ముక్తిదాయకుడే - శరణమయ్యప్ప


ఈ విధముగా ఎలుగెత్తి శరణాలు పలికేవారి ఆనందము ఆవేశము కనులారచూసి , చెవులారవిని తీరవలసిన సుఖానుభవములగును. ఈ తరుణాన కొందరు మూగవాళ్ళు గూడా స్వామి మహిమచే , నోరుతెరచి , *"శరణమయ్యప్పా"* యని , తమకు మాట్లాడే శక్తి వచ్చినది గూడా తెలుసుకొనక శరణాలు పలికిన గాధలు అనేకము గలదు. వ్యక్తి కన్న సమిష్టికి బలమెక్కువ. అలా సమిష్టిగా స్వామిశరణనామములను పలికి ప్రార్థనచేయువేళ ఆ ప్రాంతములోని చేతన , అచేతన వస్తువులన్నియు పవిత్రమగును. స్వామివారి సాన్నిధ్యము అచ్చటివారికి త్వరగా లభ్యమగును. మన సోదరులు , మిత్రులు అయిన క్రైస్తవులు , మహమ్మదీయులకు ఈ సమిష్టి ప్రార్ధన యొక్క పూర్తి పరిణామం తెలిసి యుండవచ్చుననుకొంటాను. అందుకే ఆ సోదరమతస్థులవారు ప్రతి నిత్యము ఒక నిర్ధికమైన సమయములో అందరూ కలసి ఒకస్థలమున కూడియో లేక వారివారి స్వస్థలము నుండియో సమిష్టి ప్రార్ధన చేయ వలయునన్న సిద్ధాంతమును ఏర్పరచుకొని దానినే ఆచరణలో అమలుపరచి దైవానుగ్రహ పాత్రులగుచున్నారనుట మిన్నగాదు.


పండుగ దినములలో వీరు సమిష్టిగా గుమిగూడి ప్రార్థన చేయుట అందరూ చూసియుండ వచ్చును. అట్టి సమిష్టి ప్రార్థనను భగవంతుడు తప్పక ఆలకించి అనుగ్రహిస్తాడని వారి ధృడ విశ్వాసం. అవును బృందముగాకూడి చేసే ప్రతి ప్రార్థనకు సత్ఫలితం లభించడం తథ్యం. కనుకనే ఈ శబరిమల యాత్రికులందరూ మకర సంక్రాంతి దినమున లక్షల సంఖ్యలో గూడి సమిష్టిగా శ్రీ అయ్యప్పస్వామిని శరణాలతో పిలిచి ప్రార్థించి , స్వామివారిని జ్యోతిగా సాక్షాత్కరింప జేసుకొని తమతమ కోర్కెలను తీర్చుకొనుచున్నారని నమ్మవచ్చును. కావున ఎచ్చట స్వామియే... అనుస్వరం వినిపించినను శరణ మయ్యప్ప అని మారు పలుకుటయూ మాలాధారులైన స్వాములు వెనకాడరాదు.


*4. సంకేత శరణము*


దేశపు నలుమూలల నుండి గుంపులు గుంపులుగా బయలుదేరు అయ్యప్ప భక్తాదులు మొదటగా కలిసే ప్రధాన ఘట్టము ఎరిమేలి. తదుపరి పంబాతీరము , సన్నిధానము మున్నగు స్థలమంతయు అపరిచితులైన స్వామి భక్తుల కూటమియే. ఎచ్చట చూసినను మాలాధారులే , నల్లని దుస్తులే , అందరినోట స్వామి శరణనామములే. ఇలా పలురకములైన రాష్ట్రీయులు , వివిధ భాషా సంభాషితులు , ఒకటిగా కలిసే ఇట్టి స్థలములందలి తమతమ బృందములోని వారెవరు తప్పిపోకుండాయుండుటకును , అలా ఆ సందర్భముగా ఎవరైనను బృందమువీడి వార్లను అనుసరించి నడుచటకును ఒక సంకేత శరణమును బృందములోని వారందరికి తెలిపి , అంగీకారా స్పదమైన నిర్ధేశించిన శరణమును యాత్రా రంభము మొదలు చివరివరకు పలికి , పలికించి బృందము శబరియాత్ర చేసి మరలే పద్ధతిని అనూ చానంగా మనపెద్దలు ఏర్పరచుకొని యాత్రగావించెదరు. శబరి యాత్రయంతట  ఈ సంకేత శరణము మహా ఉపయోగకారిగా యుండును. ఇలా వారివారి బృందములోని వారు మాత్రం అర్థం చేసుకొనే రీతి రాగములో పలికే శరణాలను సంకేత శరణములు అని


ఉదా ౹౹ శ... ర.... ణ... మయ్యప్ప


స్వా... మి... శ... ర... ణం


అ... య్య... ప్ప... శ... ర.... ణం


భ... గ... వా .... న్... శ....ర.... ణం


భ...గ.... వ ..... తి.... శ... ర... ణం


స్వా.... మీ ... పా... దం


అ... య్య..... ప్ప..... పా.... దం


భ... గ... వా .... న్... పా.... దం


ఈ శరణాలను అక్షరముల కక్షరము విభజించి ఒకవిధమైన రాగ పద్దతిలో వారి బృందములోని వారెల్లరికి అర్థమయ్యే శైలిలో పలికి , పలుకుటకు అలవరచుకొని , వనయాత్రలో ఈ సంకేత శరణాలసాయముతో బృందములోని వార్లను గుర్తించి జతవీడక యాత్ర చేసేదరు.


_*మిగతా భాగం రేపు చదువుకుందాము*_


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*🌹🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat