*శ్రీదేవీభాగవతము - 39*

P Madhav Kumar


*తృతీయ స్కంధము - 18*

                       

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏

*శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః* 


*లలితా సహస్రనామ శ్లోకం - 39*


*ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంథివిభేదినీ!*

*సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణీ!!*

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏


*నిన్నటి భాగములో.........* 


*సుశీలుని కథ* చదువుకున్నాము.


*అమ్మ దయతో......*

ఈ రోజు  తృతీయ స్కంధములోని

*రామకథ* చదువుకుందాం......

🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡


🙏 *రామకథ* 🌈


దశరథుడనే మహారాజు అయోధ్యాపట్టణం రాజధానిగా ప్రజా పరిపాలన సాగిస్తున్నాడు. ఇతడు సూర్యవంశపు రాజు. యజ్ఞయాగాలు చేస్తూ ధర్మబద్ధంగా రాజ్యమేలుతున్నాడు. 


ఆయనకి రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు నలుగురు కుమారులు. కౌసల్యా సుతుడు రాముడు. కైకేయి కొడుకు భరతుడు. సుమిత్రకు కవల పిల్లలు - లక్ష్మణ - శత్రుఘ్నులు. ధనుర్విద్యతో సహా అన్ని విద్యలూ వీళ్ళు వేర్చుకున్నారు. 


ఒకరోజున విశ్వామిత్రుడు వచ్చి యాగసంరక్షణ కోసం పదహారేళ్ళ పసిబాలుడు రాముణ్ణి తనవెంట పంపమని అడిగాడు. దశరథుడు ముందు కొంత బెట్టుచేసినా తరవాత మెత్తబడి పంపించాడు. రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో వెళ్ళారు.  దారిలో రాముడు ఒకే ఒక్క బాణంతో తాటకను సంహరించాడు. సుబాహుణ్ణి సంహరించాడు. మారీచుణ్ణి ఎగరగొట్టాడు. యాగసంరక్షణ చేశాడు. అటునుంచి కౌశికుడితో కలిసి మిథిలానగరానికి వెళ్ళాడు. దారిలో అహల్యకు శాపవిమోచనం కలిగించాడు. శివధనుర్భంగం చేసి రాముడు సీతను వివాహం చేసుకున్నాడు. లక్ష్మణుడు ఊర్మిళను పరిణయమాడాడు.


జనకుడి సోదరుడు కుశధ్వజుడు. ఆయన కూతుళ్ళను మాండవీ, శ్రుతకీర్తులను భరతశత్రుఘ్నులు చెట్టపట్టారు. దశరథుడు శ్రీరాముడికి పట్టాభిషేకం చెయ్యాలనుకున్నాడు. ఏర్పాట్లు అన్నీ జరిగాయి.


కానీ కైకేయి పాత వరాలను రెండింటిని అప్పుడు అడిగింది. భరతుడికి పట్టాభిషేం జరగాలి, రాముడు పధ్నాలుగేళ్ళు వనవాసం చెయ్యాలి. సీతా లక్ష్మణులతో కలిసి దండకారణ్యాలకు వెళ్ళాడు రాముడు. పుత్రవిరహం తాళలేక దశరథుడు అసువులు బాశాడు. భరతుడు పట్టాభిషేకం తిరస్కరించాడు.


పంచవటిలో రామలక్ష్మణులు శూర్పణఖకు ముక్కు చెవులు కోసేశారు. ఖరాది రాక్షసులు పధ్నాలుగువేలమంది దండెత్తి వస్తే రాముడొక్కడూ అనాయాసంగా సంహరించి జయలక్ష్మిని వరించాడు. రాక్షస సంహారానికి సంతోషించిన మునులంతా వీరిని దీవించారు.


శూర్పణఖ లంకకు వెళ్ళి తన సోదరుడు రావణుడికి విషయమంతా విన్నవించింది. సీతాపహరణానికి ప్రోత్సహించింది. దశకంఠుడు మారీచుడి ఆశ్రమానికి వచ్చి అతణ్ణి బంగారు లేడిని చేసి రాముణ్ణి అడవిలోకి దూరం తీసుకుపోయేట్టు పథకం వేశాడు. బంగారు లేడిని చూసి సీతాదేవి ముచ్చటపడింది. తెమ్మని రాముణ్ణి కోరింది.


రాముడు ఏమి ఆలోచించకుండా దాని వెంటపడ్డాడు. అది మాయలేడి. చిక్కలేదు. చివరికి రాముడు బాణం వేశాడు. ఆ మాయలేడి ప్రాణాలు వదులుతూ హా! లక్ష్మణా ! అని బిగ్గరగా రామకంఠంతో అరిచింది. అది విన్న జానకి సౌమిత్రిని సహాయంగా వెళ్ళమంది. నిన్ను ఒంటరిగా విడిచివెళ్ళను, రాముడికి ఏ ప్రమాదమూ జరగదు అని సౌమిత్రి చెప్పినా సీత వినిపించుకోలేదు. పైగా శంకించి తూలనాడింది. విధిలేక లక్ష్మణుడు సీతను ఒంటరిగా వదిలి వెళ్ళాడు.


రావణుడు భిక్షురూపంలో సీతాదేవిని సమీపించాడు. ఆమె కథ అంతా అడిగి తెలుసుకున్నాడు. నిజరూపం చూపించాడు.


నీ స్వయంవరానికి మీ తండ్రి నన్ను కూడా పిలిచాడు. అయితే రుద్రచాపానికి భయపడి నేను రాలేదు. అప్పటినుంచీ నీ మీద నాకు మనసుంది. నన్ను చేపట్టు. ఈ కష్టాలు ఏమి పడతావు? నాతో వచ్చి దివ్యభోగాలు అనుభవించు. నీకు తగినవి అవ్వే కానీ ఈ కష్టాలూ కడగండ్లు కాదు. నువ్వు ఇలా వనవాసం చేస్తున్నావని తెలిసి, అలనాటి నా అనురాగాన్ని మళ్ళీ స్మరించుకుని నీకోసం వచ్చాను. నా శ్రమను సఫలం చెయ్యి.


*(అధ్యాయం- 28, శ్లోకాలు- 69)*


ఈ రూపానికి ఈ ప్రసంగానికి సీతాదేవి భయవిహ్వల అయ్యింది. ధైర్యం కూడదీసుకుని కఠినంగా బదులు చెప్పింది. 


పౌలస్త్య ! ఏమిటి నీకు ఈ దుర్బుద్ధి. నేనెవరనుకుంటున్నావు? జనకమహారాజుగారి కూతురిని. వేశ్యను కాదు. నా రాముడు వచ్చి నిన్ను చంపకముందే లంకకు పారిపో. నా కోసమని అనవసరంగా చచ్చిపోకు - అంటూ సీతాదేవి తన పర్ణశాలలోపలికి అగ్నిహోత్రం సన్నిధికి వెళ్ళిపోయింది. రావణుడు వెంబడించి బలాత్కారంగా పట్టుకుని రథంలో కూర్చోబెట్టుకున్నాడు. రామా! లక్ష్మణా! అంటూ సీతాదేవి దారుణంగా విలపించింది. రథం ఆకాశానికి లేచింది. లంకవైపు దూసుకువెడుతోంది. జటాయువు ఎదిరించి నిహతుడయ్యాడు. సీతను తీసుకువెళ్ళి రావణుడు లంకలో అశోకవనంలో కూర్చోబెట్టాడు. రాక్షసీ గణాన్ని కాపలా ఉంచాడు.


మాయలేడిని చంపి తిరిగివస్తున్న రాముడికి సౌమిత్రి ఎదురయ్యాడు. జరిగింది చెప్పాడు. ఇద్దరూ త్వరత్వరగా పర్ణశాలకు వచ్చారు. సీత కనిపించలేదు. అడవి అంతటా గాలించారు. బోరున విలపించారు. కొనప్రాణంతో ఉన్న జటాయువు జరిగిన సంగతి చెప్పాడు. ప్రాణాలు విడిచి పెట్టాడు. అతడికి అగ్ని సంస్కారం జరిపి రామలక్ష్మణులు దక్షిణదిశగా బయలుదేరారు.


కబంధుణ్ణి చంపి అతడికి శాపవిమోచనం కల్పించాడు రాముడు. అతడి సూచనపై ఋష్యమూకానికి వెళ్ళి సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా స్నేహం చేశాడు. వాలిని సంహరించి సుగ్రీవుణ్ణి కిష్కింధకు రాజును చేశాడు. వర్షాకాలం గడిచేవరకూ ప్రస్రవణ పర్వతగుహలో తలదాచుకున్నారు ఆ సోదరులు. సీతా విరహం తట్టుకోలేక రాముడు పరిపరివిధాల పరితపించాడు.


లక్ష్మణా ! ఇప్పటికి కైకేయి కోరిక తీరిందయ్యా ! కళ్ళు చల్లబడి ఉంటాయి. జానకి జాడ తెలియకపోతే నేను జీవించను. సీత లేకుండా తిరిగి అయోధ్యకు వెళ్ళను. వెళ్ళలేను. చేతికి అందిన రాజ్యం జారిపోయింది. వనవాసం ప్రాప్తించింది. తండ్రి మరణించాడు. సీతాపహరణం జరిగింది. ఇన్ని చేసి ఇంతగా నన్ను ఏడిపించుకుతింటున్న ఆ దుష్టదైవం ఇకముందు ఇంకా ఏమేమి చేస్తాడో ! భవిష్యత్తు దుర్ జ్ఞేయం కదా ! మనకు ఏ కష్టాలు రాసి పెట్టి ఉన్నాయో. సూర్యవంశంలో పుట్టి రాజపుత్రులమై యుండి ఇలా అడవుల్లో పడి ఏడుస్తున్నాం. రాజభోగాలు అన్నీ విడిచి పెట్టి నువ్వు నావెంటవచ్చావు. నీ తలరాత అలా ఉంది. ఏమి చేస్తాం ? అనుభవించు. దుఃఖాలు దిగమింగుకో.


తమ్ముడూ ! మన వంశంలో నా అంతటి దురదృష్టవంతుడూ దుఃఖభాజనుడూ మరొకడు గతంలో లేడు. భవిష్యత్తులో ఉండడు. ఏమి చెయ్యడానికి దారి కనపడటం లేదు. ఈ దుఃఖ సాగరం నుంచి బయట పడటానికి తరణోపాయం కనిపించడం లేదు. నువ్వు తప్ప నాకు మరో సహాయకుడైనా లేడు. ఎవరిని ఏమని ఏమి ప్రయోజనం! నా తలరాత ఇలా ఉంది అంతే.


నన్ను వివాహం చేసుకుని వైదేహి కష్టాల పాలయ్యింది. లంకేశుడి ఇంటిలో ఎంతగా విలపిస్తోందో యేమో ! పరమపతివ్రత. సుశీల, రావణుడికి లొంగదు గాక లొంగదు. అతడు బలాత్కారం చేస్తే ప్రాణాలైనా వదిలేస్తుంది తప్ప స్వైరిణిలా ప్రవర్తించదు. అతడికి లొంగదు. జానకి మరణిస్తే నేనూ మరణిస్తాను. ఈ ప్రాణాలతో ఈ శరీరంతో నాకు ఏమి పనిలేదు - రాముడు ఇలా విలపిస్తూంటే లక్ష్మణుడికీ దుఃఖం ముంచుకు వచ్చింది. అయినా నిబ్బరించుకుని అన్నగారిని ఓదార్చాడు.


*(రేపు సౌమిత్రి ఓదార్పు, నారదాగమనం - దేవీవ్రతోపదేశం)*


*🙏అమ్మ దయ ఉంటే... అన్నీ ఉన్నట్లే...🙏*


               *...శ్రీదేవీ భాగవతము... సశేషం...*


♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾


*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*

*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*


*భావము:* 💐


ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏



🙏🌹🌹🌹🌹🌻🌻🌹🌹🌹🌹🙏


🙏 శ్రీ మాత్రే నమః🙏


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat