08. శ్రావణమాస మహాత్మ్యము - 8వ అధ్యాయం - Sravana Masam
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

08. శ్రావణమాస మహాత్మ్యము - 8వ అధ్యాయం - Sravana Masam

P Madhav Kumar

 

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l

దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll


🌻ఈశ్వరఉవాచ:  

సాంబమూర్తి చెప్పుచున్నాఁడు... 

బుధ గురు వారముల సంబంధమగు వ్రతములను జెప్పెదను వినుము. సమస్త పాపములను పోగొట్టునట్టి యీ వ్రతములను శ్రద్ధగా ఆచరించిన మనుజుఁడు విశేషమైన కార్యసిద్ధిని పొందగలడు.

పూర్వము బ్రహ్మదేవుఁడు చంద్రుని ద్విజరాజు అని ఏర్పాటుజేసెను. అటువంటి చంద్రుఁడు ఒకానొక సమయమున రూపము, లావణ్యము, యౌవనము, మొదలగు గుణములచే సమస్త స్త్రీలను మించియున్నదియు తార అను పేరుచే ప్రసిద్ధికెక్కియున్న గురుభార్యను చూచినవాడై దాని సౌందర్యాతశయం వలన మోహముజెంది,  ఆమెను తన యింటికి తీసికొని వెళ్లి ఆమెతో కొంతకాలము సంభోగింపగా... ఆమెయందు చంద్రుని వలన ఒక పుత్రుఁడుదయించెను.

ఆ పిల్లవాడు సమస్త లక్షణములు గలవాడును,  రూపము, విద్య మొదలగువానిచే ప్రకాశింపుచు బుధుడు అను పేరుచే ప్రసిద్ధికెక్కియుండెను. ఇట్లుండగా,  బృహస్పతి తన భార్యను వెదకుచూ రాగా తారను చంద్రునియింట జూచి,  ఓవచంద్రుడా!  నేను నీకు గురువును కదా నా భార్యను నీవు తీసుకొని రాతగునా! గురు భార్యతో సంభోగించినవానికి ప్రాయశ్చిత్తము లేదుగదా!! ఓ చంద్రుఁడా! ఇట్టి మహాపాతకము జేయుటకు నీకు బుద్ధి ఎలాగు కలిగినది!? కాఁబట్టి, నీకు గురు భార్యయు నాకు ప్రియురాలునగు తారను ఎవరికిని తెలియకమునుపే నాకిమ్ము, నీవు చేసిన పాపమునకు రహస్యముగానే ప్రాయశ్చిత్తము జేసికొని పవిత్రుఁడవుగమ్ము. ఆలాగున నీవు చేయని యెడల నీవు చేసిన అపరాధమును దేవేంద్రునితో చెప్పెదను.

ఈ ప్రకారము బృహస్పతి అనేక విధములుగా చెప్పినప్పటికిని, చంద్రుఁడు తార యందుగల మోహముచే తారను ఇవ్వలేదు. అప్పుడు బృహస్పతి దేవసభకు వెళ్లి, ఈ వృత్తాంతము దేవేంద్రునితో ఈ విధముగా జెప్పెను.

ఓ ఇంద్రుడా! నా భార్యను చంద్రుఁడు అపహరించెను, నేను వెళ్లి నా భార్యను నాకిమ్మని ప్రార్థించినా ఇవ్వలేదు. కాఁబట్టి, నీవు దేవతలకందరికిని ప్రభువువు గనుక, నీ ఆజ్ఞ ప్రకారముగా నా భార్యను నాకిచ్చునట్లు చేయవలయును. ఆలాగున నీవు చేయనియెడల చద్రుఁడు చేసిన పాపము నీవు పొందగలవు. ఎందువల్లననగా, లోకములో ప్రభువు, పాపపుణ్యములను విచారించి, దుష్కృతములు చేసినవారికి తగిన శిక్ష విధించవలయును. అట్లు చేయనిచో ఆ దేశవాసుల పాపములను రాజు పొందగలడని శాస్త్రములు నిర్థారణచేసి చెప్పుచున్నవి. మరియు బలము లేనివానికి రాజే బలమని పురాణములయందు చెప్పబడుచున్నది.

ఈ విధముగా బృహస్పతి చెప్పిన మాటను దేవేంద్రుడు విని మిక్కిలి కోపముగలవాడై చంద్రుని పిలిపించి యిట్లు చెప్పెను. ఓ చంద్రుఁడా! ఇతరుల భార్యలతో సంభోగము చేసినను విశేషపాపము లేదు గాని గురు భార్యాసంభోము మహాపాపము కాఁబట్టి నీవు విచారింపక బృహస్పతికి తార నిమ్ము.

ఇట్లు చెప్పిన దేవేంద్రుని మాటలను చంద్రుడునిని చెప్పుచున్నాడు.  ఓ దేవేంద్రా! నీ ఆజ్ఞానుసారముగా బృహస్పతికి తారనిచ్చెదను, గాని, కుమారుడగు బుధుని యివ్వను. నా వలన కుమారుడు కలిగెను కాబట్టి నా వద్దనే యుండవలెనని చంద్రుడు చెప్పెను. నా వలన కుమారుడు కలిగెను కాఁబట్టి నా వద్దనే ఉండవలయునని బృహస్పతియు అనెను. ఇట్లు ఉభయులు వివాదపడుచుండగా, దేవతలకు సందేహం కలిగి యిందు విషయమై యధార్థము తల్లికి తెలిసియుండును కాఁబట్టి ఆమెనడిగి నిర్ధారణ చేయదలచినవారై తారను బిలచి, ఓ తారా! ఈ పిల్లవాడు ఎవరివలన సంభవించెనో నిజము చెప్పమని దేవతలడుగగా, అప్పుడు తార సిగ్గును జెంది,  ఆ పిల్లవాడు చంద్రుని వలన కలిగెనని పలికెను.

బృహస్పతి క్షేత్రమునందు బుట్టినవాడు గనుకను,  చంద్రునకు వ్రసుడు గనుకను, ఎవరికి ఇవ్వవచ్చునని శాస్త్రము విచారించి,  బుధుని చంద్రునకు ఇప్పించిరి. 

అప్పుడు దేవతలు బుధుని చంద్రునకు ఇప్పించఁగా బృహస్పతి చిన్నబోయిన మనస్సు గలవాడాయెను. అప్పుడు దేవతలిట్లు చెప్పుచున్నారు. బుధుడా, నీవు చంద్రునింటికి వెళ్లుము, ఆయినను బుధుని విషయములో బృహస్పతికిని చంద్రునకును పుత్రసంబంధము కలదని నుడివిరి.

ఓ బృహస్పతీ!  మరియొకటి చెప్పెదవినుము. నిన్ను, బుధుని - మీ ఉభయులను గుఱించియు కలిపి వ్రతము జేసిన వానికి సమస్తమైన కార్యసిద్ధులు గలుగును సత్యము సందేహము లేదు.

సాంబమూర్తికి ప్రియకరమగు శ్రావణమాసములో ఎవడైనను, బుధ, గురు వారములయందు బుధుని బృహస్పతి ఆకారములను మంటపమునందు వేరు వేరుగా పూజచేసి, పెరుగుతో మిళితమైన అన్నమును, ముల్లంగి కూరయు నివేదనము చేసినయెడల ఫలమును పొందగలడు. పిల్లలు తిరిగి సంచరించునట్టి గృహమునందు వీరి ప్రతిమలనుంచి పూజించిన యెడల సమస్త గుణసంపత్తి కలవాడు దీర్ఘసయువును కలుగునట్టి పుత్రులను పొందును. ధనకొట్లయందు ప్రతిమనుంచి పూజించిన యెడల ఎప్పుడు ధనము క్షీణింపక పొందుచుండును. వంటయింటి యందుంచి ప్రతిమలను పూజించిన యెడల పాకవృద్ధియు,  దేవతాగృహమందు జరిగిన యెడల దేవతల అనుగ్రహమును కలుగును.

పడకయింటి యందుంచి పూజించినయెడల భార్యావియోగమెన్నడును సంభవింపదు. ధాన్యకొట్ల యఁదుంచి పూజించినయెడల ధాన్యవృద్ధి కలుగును. మరియు ఏయే కోరికలను ఉద్దేశించి పూజించినా అవియన్నియు సఫలమగును. ఇట్లు యేడు సంవత్సరములు వ్రత మాచరించి పిమ్మట ఉద్యాపనము చేయవయును.

ఒక బంగారపు ప్రతిమను జేయించి, దానిని పగలు షోడశోపచారములచే బూజించి, రాత్రి జాగరణము చేసి, మరునాడు ఉదయము స్నానము జేసి పరిశుద్ధుఁడై అగ్ని ప్రతిష్ఠాపనము చేసి నువ్వులు, నెయ్యి, అన్నము, ఉత్తరేణి, రావి, సమిధలు మరియు ఇతరసమిధలచేతను యధావిధిగా హోమముజేసి, అనంతరము పూర్ణాహుతి గావించి, బంధువులను మేనల్లుడు మేనమామ మొదలగు వారిని ఇతరత్రా బ్రాహ్మ ణులను భుజింపజేసి తానును భుజింపవలయును. ఇట్లు యేడు సంవత్సరములు ప్రతమును చేసినవారు సమస్త కోరికలను పొందగలరు.

విద్యను కోరి వ్రతమును జేసినయెడల వేదశాస్త్రార్థములను దెలిసినవాడగును బుధుని పూజించుటవలన గౌరవము కలవాడునగును.


🌻సనత్కుమార ఉవాచ: 

ఓ భగవంతుడా! మేనమామను మేనల్లుని భుజింపజేయవలయునని చెప్పితివి. దానిని చెప్పుటకు వీలుండు నేని దానికి కారణము సహేతుకముగా జెప్పవలయును అని సవత్కుమారుడు అడిగెను.  


🌻ఈశ్వరువాచ: 

సాంబమూర్తి చెప్పుచున్నాఁడు... 

ఓ మునీశ్వరా! పూర్వకాలమున బ్రాహ్మణులును,  దీనులు-దరిద్రులై ఉదరపోషణార్ధమై చాలా కష్టపడుచుండి మేనమామ మేనల్లుడును యిద్దరు కలరు. వారిద్దరు ఒకానొక సమయంబున శ్రావణమాసములో ఒక మనోహరమగు పట్టణమునకు యాచనచే ధాన్యమును సంపాధించుటకు వెళ్లగా ఆ ఊరిలో ప్రతిగృహమందును బుధ-గురువార వ్రతములనే జూచుచుండిరి.

అప్పుడు వారు ఇట్లు అనుకొనిరి - అన్ని వారములను గుఱించి ప్రతిములను జూచితిమి కాని బుధ-గురువార వ్రతములను ఎచ్చటను జూడలేదు, ఇక్కడ ప్రతియింటను ఆచరించుచుండిరి, కాఁబట్టి, మనమును శ్రేష్ఠంబగు ఈ వ్రతమును ఆచరింపవలయునని అన్యోన్యమనుకొనిరి. గాని, ఆ వ్రతవిధానము తెలియక, సందేహము కలవారైరి.

అప్పుడు, ఆ రాత్రియందు భగవంతుని అనుగ్రహమువలన స్వప్నములో ఆ వ్రతవిధానమంతయు గోచరమయ్యెను. అప్పుడు వారిరువురు వ్రతమును ఆచరించినవారై విశేషముగు ఐశ్వర్యమునొందిరి. ఆ సంపత్తియును దినదినము వృద్ధియగుచుండెను. ఇట్లు యేడు సంవత్సరములు ఆచరించిన వారలై పుత్రులు పౌత్రులు మొదలగు సమస్త సంపత్తులు కలవారైరి. బుధగురు వారవ్రతములను ఆచరించి భూలోకములో వ్యాపింపజేయుటవలన బుధుడును బృహస్పతియు సంతసించి వారికి ప్రత్యక్షమై వరములనొసగిరి,

ఓ మునీశ్వరా! ఇట్టి వృత్తాంతము జరిగినది కాఁబట్టి, యిది మొదలుకొని బుధ-గురువార వ్రతములను ఆచరించు వారు మేనమామను మేనల్లుని ముఖ్యముగా భుజింపజేయవలయునని బుధగురువులు చెప్పిరి. ఈ వ్రతమును ఆచరించుటవలన సమస్త కోరికలనుపొంది,  జన్మానంతరమున నా లోకమునకు వచ్చి సూర్యచంద్రులు ఉండునంత కాలము నా లోకములో నివసింతురు.

ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర సనత్కుమార సంవాదే బుధ-గురువార వ్రత కథనం నామ అష్టమోధ్యాయ సమాప్తం.   

ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏

⚜️⚜️🌷🌷⚜️⚜️🌷🌷⚜️⚜️

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow