21. శ్రావణమాస మహాత్మ్యము - 21వ అధ్యాయం - Sravana Masam
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

21. శ్రావణమాస మహాత్మ్యము - 21వ అధ్యాయం - Sravana Masam

P Madhav Kumar

 

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉


🍃🌷ఏకవింశోధ్యాయము -  "ఉపాకర్మోత్సర్జన, శ్రవణాకర్మ, సర్పబలి, సభాదీప, హయగ్రీవ జయంతీ, రక్షాబంధనవిధి కథనం":


(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)


నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l

దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll


🌻సనత్కుమార ఉవాచ:

దయాసముద్రుడవగు ఓ సాంబమూర్తీ.... శ్రావణ శుద్ధ పౌర్ణమి యందు చేయతగిన కృత్యమును నాయందు దయగలవాడవై చెప్పుము. నాకు వినవలయునని ఆసక్తి కలిగియున్నదని సనత్కుమారుఁడు సాంబమూర్తిని అడిగెను.


🌻ఈశ్వర ఉవాచ:

సాంబమూర్తి చెప్పుచున్నాడు...


అభ్యసించిన వేదములకును పాప కర్మయు ఉత్సర్జనయు చెప్పబడెను. పుష్య పౌర్ణమి గాని, మాఘ పౌర్ణమి గాని ఉత్సర్జన కొఱకు చెప్పబడెను. కావున, అట్టి తిథియందైనను చేయవలెను. లేక పుష్యమాస పాడ్యమి గాని, మాఘమాస పాడ్యమిగాని చెప్పఁబడిన తిధియై యుండెను.  లేక రోహిణీ నక్షత్ర యుక్త తిధి యందైనను చేయవలెను. లేక వారివారి శాఖలను అనుసరించిన కులాచార ప్రకారముగా ఉపాకర్మయను ఉత్సర్హనయును ఒక్కసారిగానే చేయుట ఆచారము గూడ కలిగియుండి యున్నది. అందువలన ఈ శ్రావణమాస పౌర్ణమి యందే ఉపాకర్మయును ఉత్సర్జనయును చెప్పబడెను.  వాజసనేయీ శాఖను అనుసరించిన వారికి ఉపాకర్మను గుఱించి శ్రవణ నక్షత్రము చెప్పబడెను.


శ్రావణమాసములో చతుర్దశి, పౌర్ణమి, పాడ్యమి ఈ మూడు తిథులలో శ్రవణ నక్షత్ర యుక్త తిథియందు వాజసనేయి శాఖీయులు ఉపాకర్మ చేయుదురు.


యజుశ్శాఖీయులు శ్రావణపౌర్ణమి యందు చేయుదురు. సామవేదావలంబులు శ్రావణ మాసములో హస్తా నక్షత్రముతో గూడిన తిధి యందు చేయుదురు. గురుశుక్ర మూఢముల యందును చేయుదురు. మొదటగా ఉపాకర్మ మూఢములలో చేయగూడదని శాస్త్రవేత్తల అభిప్రాయము మఱియు పౌర్ణమి, గ్రహణము సంక్రాంతి మొదలగు వానిచే దోషముగలదగునేని యీ దినము విడిచి మఱియొక కాలమునందు చేయవలెను.


శ్రావణమాసములో హస్తా నక్షత్రయుక్త పంచమి యందు గాని, పౌర్ణమి యందు గాని తమ తమ శాఖలను అనుసరించి ఉపాకర్మయు ఉత్సర్జనయు చేయవలయును.


శ్రావణమాసము అధికమాసము వచ్చెనేని, శుద్ధ శ్రావణ మాసములోనే ఉపాకర్మ చేయవలయును. ఉపాకర్మయు ఉత్సర్జనము అనెడు రెండుకర్మలును ప్రతిసంవత్సరమును ముఖ్యముగా చేయతగినవి.


ఉపాకర్మను పూర్తి చేసి బ్రాహ్మణులు కూర్చుండియుండగా అప్పుడా సభయందు స్త్రీలు దీపదానం చేయవలెను.


బంగారము, వెండి, రాగి మొదలగువానిచే నిర్మించబడిన పళ్లెములో శేరు గోధుములనుంచి దానిపైని గోధుమపిండితో చేయబడిన ప్రమిద యందు దీపము వెలిగించి,  ఆ గోధుములపైన ఉంచి, దీపముతో గూడ, ఆ పళ్లెమును ఆచార్యుడు గ్రహించుగాక యని చెప్పి బ్రాహ్మణునకు దానమియ్యవలెను.


నెయ్యిగాని, నూనెగాని యుంచి మూడు వత్తులు గల దీపమును వెలిగించి, దక్షిణతాంబూలములతో గూడ ఆ దీపమును బ్రాహ్మణునకు దానమియ్య వలయును.


దీపమును వెలిగించి, ఆ దీపమును, బ్రాహ్మణుని పూజించి యిట్లు చెప్పవలయును. దక్షిణతాంబూలముల సహితముగా శ్రేష్ఠంబగు ఈ దీపమును భగవత్స్వరూపుడగు బ్రాహ్మణునకు యిచ్చుచున్నాను,  నా కోరికలన్నియు సఫలములగు గాక యని చెప్పి దీపదానము జేయవలయును. యిట్లు సభాదీపదానము చేయుట వలన పుత్రులు పౌత్రులు మొదలగు వానితోగూడిన వారలై వారి వంశమంతయు కీర్తిచేతను, సమస్త సద్గుణములచేతను ప్రకాశించునట్టిదగును.  ఆ స్త్రీలకు మఱియొక జన్మంబువ దేవతా స్త్రీలతో సమానముగు సౌందర్యము కలుగును. చిరకాలము  సువాసినీత్వము,  పెనిమిటికి ప్రేమతో గూడిన ప్రియురాలుగాను ఉండును. ఇట్లు,  అయిదు సంవత్సరములు ఈ ప్రకారముగా చేసి, పిమ్మట ఉద్యాపనము చేయవలెను. 


భక్తికలది యగుచు, బ్రాహ్మణునకు తన శక్తికొలదియు దక్షిణను ఇయ్యవలయును. 


ఓ మునీశ్వరుఁడా! ఇట్టి ఫలమును ఒసగునది కాఁబట్టి శ్రేయస్కరమగు దీని మహిమనంతయు జెప్పితిని. 


శ్రవణా నక్షత్రమును అనుసరించి చేయు కర్మయు ఆ రాత్రియే చేయవలయును. పిమ్మట అచ్చటనే సర్పబలియు జరుపవలెను.


ఈ చెప్పబడిన రెండుకర్మల యొక్క విధానము వారివారి సూత్రమును అనుసరించి చేసికొనవలయును. ఆ తిధి యందే హయగ్రీవావ అతారమనియు జెప్పబడెను.  ఈ దినమందు హయగ్రీవావతారము కలుగుటవలననే విశేష మహోత్సవము జరుగుచుండును. ఈ ఉత్సవము హయగ్రీవ మంత్రోపాసన కలవారు ముఖ్యముగా చేయుదురు.


శ్రావణమాసములో శ్రవణా నక్షత్రము ప్రవేశించగానే విష్ణుమూర్తి హయగ్రీవుడు అనే పేరు గలవాడై ఉద్భవించి, సమస్త పాపములను పొగొట్టునట్టి సామవేదమును గ్రహించెను.


సింధూనది సముద్రము సింగమగు చోట హయగ్రీవ అవతారము కలిగినది. కావున, శ్రవణా నక్షత్రము వచ్చినప్పుడు ఆ తీరంబున స్నానము చేసిన యెడల సమస్త కోరికలు ఫలించును.


అక్కడ శంఖము, చక్రము, గద మొదలగు ఆయుధములతో గూడిన విష్ణుమూర్తిని పూజింపవలయును. సామవేదమును వినవలయును. సమస్త విధముల చేతను బ్రాహ్మణులను పూజింపవలెను. అక్కడనే తమ బంధువులతో కూడ హయగ్రీవ సంబంధమగు ఆటపాటలను జరిపి,  భుజింపవలయును.  తిరిగి జన్మమునందు యోగ్యమగు పెనిమిటీని పొందగలందులకు స్త్రీలు జలక్రీడలు కూడ జరుపవలయును. మఱియు తమతమ దేశమునందును, తమతమ గృహముల యందును హయగ్రీవుని పూజించి, విశేష మహోత్సవమును గూడ జరుపవలయును. మఱియు హయగ్రీవ మంత్రమును గూడ జపింపవలయును. కాఁబట్టి, దానిని చెప్పెదను వినుము.


మొదటగా ప్రణవమును, పిమ్మట, నమః శబ్దమును, తర్వాత, *భగవతేధర్మా య శ్రీహయగ్రీవాయ* అనియు చివరను తిరిగి నమః శబ్దమును చేర్చవలయును. ఇట్లు చేర్చగా,  *ఓం నమో భగవతే ధర్మాయ శ్రీహయగ్రీవాయ నమః* అనేటటువంటి అష్టాదశాక్షరములు గల మంత్రమేర్పడును. ఈ మంత్రము సమస్త కార్యసిద్ధులను చేయును. షట్ పదమును చేర్చినయెడల ప్రయోగములయందు ఉపయోగింపబడును. యీ మంత్రమును అక్షరలక్ష గాని, ఎన్ని అక్షరములు కలవో అన్ని వేలుగాని పురశ్చరణను చేసిన యెడల, ఈ కలియుగములో నాలుగురెట్లు ఫలము కలుగును. ఈ ప్ర్రకారము చేసినయెడల హయగ్రీవుడు సంతోషించినవాడై, మంచి కోరికలనన్నియు ఫలింపచేయును. ఈ పౌర్ణమియందునే రక్షాబంధనం అనునదియు జెప్పబడెను.


ఈ రక్షాబంధనము అనునట్టి కర్మ, సమస్త రోగములను, సమస్త అశుభమలను నివారణ చేయును. కావున, ఓ మునీశ్వరుడా! దీనిని గుఱించి ఒక ఇతిహాసము కలదు, దానిని చెప్పెదను వినుము.


అది, ఇంద్రుని జయము నిమిత్తమై, శచీదేవి రక్షాబంధనము చేసినది.ఆది ఏవిధముగా అనగా, పూర్వము దేవతలకును, రాక్షసులకును పండ్రెండు సంవత్సరములు యుద్ధము జరిగెను.


అప్పుడు, దేవేంద్రుడు అలసియుండగా వానిభార్య శచీదేవి పెనిమిటిని జూచి, యిట్లు పలుకుచున్నది, ఓ నాధా! ఈ దినము భూతముల సంబంధమగు దినము, ఈ దినమున ఆగిన యెడల రేపు ఉదయమున అంతయు నీకు జయము కలుగును. నేను నీకు రక్షాబంధనమును చేసెదను, అందువలన నీవు ఇతరులచే జయింపబడవు, అని చెప్పి శచీదేవి పౌర్ణమి యందు దేవేంద్రునికి మంగళకృత్యములను చేసి, సంతోషమును కలిగించునట్టి కంకణమును కుడిచేతికి కట్టెను. ఇట్లు దేవేంద్రుడు కంకణమును కట్టుకొని బ్రాహ్మణులవలన దీవెనలనొంది ప్రతాపము కలవాడై తిరిగి రాక్షసులవద్దకు వెళ్లి, వారితో యుద్ధముచేయగా, ఒక క్షణములోనే వారిని ఓడించి, మూడు లోకములను జయించినవాడాయెను.


ఓ మునీశ్వరుడా! కావున, రక్షా బంధనము ఇటువంటి సామర్ధ్యము కలదియును, మఱియు జయమును సుఖమును పుత్రులను ఆరోగ్యమును ధనమును కలుగజేయును.


🌻సనత్కుమార ఉవాచ:

ఓ స్వామీ! ఏ తిథి యందు ఏ కాలంబున ఏ విధిగా రక్షాబంధనము చేయవలయునో దానిని చెప్పుము.


ఓ భగవంతుడా! అనేక ధర్మములు కలవియు, ఆశ్చర్యకరములగు కధలను నీవు చెప్పుచుండగా వానిని వినుట వలన నాకు యెంతవరకును తృప్తి తీరుటలేదని సనత్కుమారుడు చెప్పెను.


🌻ఈశ్వర ఉవాచ:

సాంబమూర్తి చెప్పుచున్నాడు... 


ఓ మునీశ్వరా! శ్రావణ మాసములో పౌర్ణమినాడు ఉదయంబున లేచి శ్రుతిస్మృతులను అనుసరించునట్లుగా స్నానము చేయవలయును.


సంధ్య జపము మొదలగునవి ఆచరించి, పితృదేవతలు, ఋషులు మొదలగువారికి తర్పణ చేసి, బంగారపు తీగెలతో గూడినదియు, ముత్యములు మొదలగువానితో అలంకరింపబడినదియు, నిర్మలమైనదియు, విచిత్రములగు పట్టుదారములతో కూడినదియు, చిగురుటాకులు, పుష్పగుత్తులు మొదలగువానినుంచి విచిత్రముగా ముడులు వేయబడినదియు, తెల్ల ఆవాలు, అక్షతలు మొదలైనవానితో మిశ్రితమైనదియును, మనోహరమైన కంకణమును, ఒక బంగారపు కలశమును బియ్యముచే నిండించి, దాని పైన ఆ కంకణమును ఉంచవలయును.


మనోహరంబగు ఆసనంబున కూర్చుండి, తన బంధుమిత్ర బ్రాహ్మణ సమేతుడై, వేశ్యలు మొదలగువారిచే నృత్యము గీతము వాద్యము మొదలగు మంగళ ధ్వనులు జరుపబడుచుండగా మంత్రసహితముగా పురోహితునిచే రక్షాబంధనమును చేయించుకొనవలయును, అప్పుడు చెప్పవలసిన మంత్రమేదియనగా... 


ఓ రక్షా! బలవంతుడును రాక్షసశ్రేష్ఠుడు అగు బలిచక్రవర్తి దేనిచే కట్టబడెనో అట్టి నిన్ను కట్టుచున్నాను కావున కదలకుండా ఉండుమని చెప్పి కట్టవలెను.

 

బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, మఱియు ఇతర జాతుల వారు సమస్తమైన వారును తమతమ శక్తికొలదియు బ్రాహ్మణులను పూజించి రక్షాబంధనం చేయించుకొనవలయును.


ఈ ప్రకారముగా రక్షాబంధనము చేయించుకొనిన వాడు, సమస్త దోషములను పోగొట్లుకొనిన వాడై సంవత్సర పర్యంతము వఱకును సుఖమును కలిగినవాడై యుండును.


పవిత్రమగు శ్రావణమాసములో ఈ చెప్పబడిన రక్షాబంధన విధిని జరుపుకొనినవాడు సంవత్సర పర్యంతము విశేషమగు సుఖము కలవాడై పుత్రులు పౌత్రులు స్నేహితులు మొదలగు వారితోగూడి సమస్తసుఖముల నొందును.


పరిశుద్ధమగు వ్రతమును ఆచరించువారు రక్షాబంధనమును భద్ర తిథి యందు చేయకూడదు. భద్ర తిధియందు రక్షాబంధనమును చేసిన యెడల వ్యతిరేక ఫలమిచ్చును అని సాంబమూర్తి సనత్కుమారునితో చెప్పెను.


♦️ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర సనత్కుమార సంవాదే -- "ఉపాకర్మోత్సర్జన, శ్రవణాకర్మ, సర్పబలి, సభాదీప, హయగ్రీవ జయంతీ, రక్షాబంధనవిధి" కథనం నామ ఏకవింశోధ్యాయస్సమాప్తః.


ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏


🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow