🍃🌷అగస్త్యార్ఘ్యవిధి:
(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll
🌻ఈశ్వరుడు చెప్తున్నాడు:
శ్రావణమాసంలో ఆచరించాల్సిన అగస్త్యార్ఘ్యమనే ఉత్తమవిధిని తెలియజేస్తాను. అగస్త్య నక్షత్ర ఉదయానికి ముందే కాలనియమాన్ని తెలుసుకోవాలి. రాత్రి-పగలు సమానకాలం ఉండేరోజు నుండి ఏడురోజుల పాటు అర్ఘ్యప్రదానం చెయ్యాలి.
ఏ రోజు నుండి అర్ఘ్యమివ్వడం ప్రారంభిస్తారో ఆ రోజు ప్రాతఃకాలంలో తెల్లనువ్వులతో స్నానం చేసిన గృహస్థు, తెల్లని వస్త్రాన్ని, తెల్లని పూలమాలను ధరించి, బంగారం మొదలైన ధాతువులతో తయారై, పంచరత్నఖచితమై, నేతిపాత్రతో కూడినదై, మోదకాలు మొదలైన అనేకరకాల భక్ష్యపదార్థాలు, పండ్లతో పుష్పమాల- వస్త్రంతో అలంకరింపబడిన పూర్ణమైన రాగిపాత్రను దానిపై పెట్టి, ఆ పాత్రపై అగస్త్యుని బంగారుప్రతిమను స్థాపించాలి. ఆ ప్రతిమ బొటనవేలంత పరిమాణం కలదై, నాలుగు చేతులతో, స్థూలకాయుడై పొడవైన భుజాలతో సుందరుడై, శాంతభావంతో నున్న జటామండలధారి, కమండలం పట్టుకుని, అనేకమంది శిష్యులతో కూడినవాడై, చేతిలో దర్భలను, అక్షతలను ధరించి లోపాముద్రాసమేతంగా దక్షిణాభిముఖుడై ఉండాలి. దానియందు అగస్త్యుని ఆవాహన చేసి గంధం, పువ్వులు మొదలైన షోడశోపచారాలతో, నైవేద్యాలతో పూజించి, దధ్యోదనం సమర్పించి అర్ఘ్యప్రదానం చెయ్యాలి.
ముందుగా బంగారం, వెండి, రాగి లేదా ఇత్తడి పాత్రలో నారింజ, ఖర్జూరం, కొబ్బరి, గుమ్మడి, పొట్లకాయ, అరటి, దానిమ్మ, బెండకాయ, నిమ్మ, నల్లకలువ, పద్మం, దర్భలు, దూర్వాలు, మరొక ఏడురకాల పండ్లు, పువ్వులు, ఏడు రకాల ధాన్యాలు పాత్రయందుంచి దానిని పూజించి, మోకాలిపై కూర్చుని శిరస్సు వరకు ఆ పాత్రను ఎత్తి అగస్త్యమహర్షిని ధ్యానిస్తూ శ్రద్ధాభక్తులతో ఈ మంత్రసదృశ శ్లోకాలతో అర్ఘ్యమివ్వాలి:
కాశపుష్పప్రతీకాశ వహ్నిమారుతసమృవ, మిత్రావరుణయోః పుత్ర కుమ్భయోనే నమోస్తుతే.
కాశపుష్పప్రతీకాశ వహ్నిమారుతసమ్భవ l
మిత్రావరుణయోః పుత్ర కుమృయోనే నమోస్తు తే ll
విన్ద్యావృద్ధిక్షయకర మేఘతోయవిషాపహ l
రత్నవల్లభ దేవర్షే లంకావాస నమోస్తు తే ll
ఆతాపీ భక్షితో యేన వాతాపీ చ మహాబలః l
లోపాముద్రాపతిః శ్రీమాన్ యోసౌ తస్మై నమో నమః ll
యేనోదితేన పాపాని విలయం యాన్తి చాధయః l
వ్యాధయః త్రివిధాస్తాపాస్తస్మె నిత్యం నమో నమః ll
యాదఃపూర్ణః సరిన్నాథ్ యేన వై శోషీతః పురా l
సపుత్రాయ సశిష్యాయ సపత్నీకాయ వై నమః ll
🌷లోపాముద్రాదేవి అర్ఘ్యశ్లోకం:
రాజపుత్రి మహాభాగే ఋషిపత్ని వరాననే l
లోపాముద్రే నమస్తుభ్యం అర్ఘ్యం మే ప్రతిగృహ్యతామ్ ll
తరువాత అర్ఘ్యమిచ్చిన మంత్రాలతో ఎనిమిది వేలు లేదా నూట ఎనిమిది. ఆహుతులతో హోమం చేసి అగస్త్యుని శరణు వేడి ఇలా ప్రార్థించాలి.
అచిన్త్యచరితాగస్త్య యథాగస్త్యః ప్రపూజితః l
ఏహికాముష్మికీం కృత్వా కార్యసిద్ధిం ప్రజస్వ భోః ll
అనంతరం అగస్త్యుని విసర్జన చేసి, వేదాంగవేత్తయైన బీదబ్రాహ్మణ గృహస్థుకు పదార్థాలన్నిటినీ అర్పిస్తూ ఇలా ప్రార్థించాలి.
అగస్త్యో ద్విజరూపేణ ప్రతిగృహ్లాతు సత్కృతః అగస్త్యః l
ప్రతిగృహ్లాతి హ్యగస్త్యో వై దదాతి చ, ఉభయోస్తారకోగస్త్యో హ్యగస్త్యాయ నమో నమః ll
ఈ విధంగా దానమిచ్చి పూర్వం చెప్పబడిన మంత్రాలను జపం చెయ్యాలి. ఈ విధంగా ఏడురోజులు చేసి ఏడవరోజున తెల్లని ఆవును సకలభూషణాదులతో అలంకరించి దానం చెయ్యాలి. ఏ కోరిక లేకుండా ఏడు సంవత్సరాలు ఇలా ఆచరిస్తే జన్మరాహిత్య స్థితి కలుగుతుంది. సకామంగా చేస్తే రూపలావణ్యాలతో కూడిన చక్రవర్తిత్వం లభిస్తుంది.
బ్రాహ్మణుడు ఆచరిస్తే సకలవేదశాస్త్రాలలో విశారదుడవుతాడు. క్షత్రియులైతే సముద్రాంతం వరకు వరకు గల భూమికి పాలకులవుతారు. వైశ్యులైతే గో-ధన- ధాన్యాది సంపదలు పొందుతారు. శూద్రులు ఆచరిస్తే అత్యధిక ధనం, ఆరోగ్యం, సత్యప్రాప్తి కలుగుతుంది. స్త్రీలు ఆచరిస్తే వారికి సౌభాగ్యం, పుత్రుల అభివృద్ధి, ఇంటిలో సకల వస్తు సమృద్ధి కలుగుతుంది. పూర్వసువాసినులకు పుణ్యం పెరుగుతుంది. కన్య ఆచరిస్తే రూపగుణసంపన్నుడైన భర్తను పొందుతుంది.
ఏ దేశంలో ఈ విధంగా అగస్త్యార్ఘ్యవిధి చెయ్యబడుతుందో ఆ దేశంలో వర్షాలు కోరినప్పుడు కురిసి సుభిక్షంగా ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు కలుగవు. వ్యాధులు ఉండవు.
ఈ అగస్త్వార్థ ప్రదాన చరిత్రను పఠించినవారు, విన్నవారు సకల పాపాల నుండి ముక్తులై భూలోకంలో దీర్ఘాయువుతో జీవించి, హంసలు పూన్చిన రథంలో స్వర్గాన్ని చేరుకుంటారు. జీవనకాలమంతా ఈ వ్రతాన్ని నిష్కామభావంతో చేస్తే ముక్తిని పొందుతారు.
♦️శ్రీ స్కాందపురాణంలో ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగానున్న శ్రావణమాస మాహాత్మ్యమందు ఇరువదిఎనిమిదవ అధ్యాయము సమాప్తము.
ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏
🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿
