వినాయక చవితి పర్వదినమున వ్రతాన్ని ఆచరించి ప్రసాదాక్షతలు స్వీకరించిన వారికి చంద్రుని చూసిన దోషం అంటదని శాస్త్రం.
సింహాః ప్రసేనవధీః సింహాజాంబవతీ హతః
సుకుమారక మారోదీ: తవ హ్యేషశ్యమంతకః
ఒక వేళ చంద్రదర్శనము అయితే ఈ శ్లోకాన్ని పఠించాలి. ఈ శ్లోక అర్థం (సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుని సింహం చంపింది. దానిని జాంబవంతుడు చంపి ఈ శ్యమంతకమణిని నీకిచ్చాడు. అది జాంబవంతుని పుత్రుకని ఉయ్యాలలో ఉంచి దాసి పాడింది. దాని వల్ల కృష్ణుడు మణిని అపహరించాడన్న మిథ్యాపవాద దోషం పోయిందని
హరిద్ర గణపతి యొక్క పరమార్థము
పరమేశ్వరుడు, తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి త్రిపురాసురులను సంహరించుటకు బయలుదేరగా, భూమి రథముగా, సూర్యచంద్రులు రథ చక్రములుగా, వేదములు గుఱ్ఱములుగా, బ్రహ్మ సారథిగా, మేరు పర్వతము విల్లుగా, ఆదిశేషుడు అల్లెత్రాడుగా శ్రీ మహావిష్ణువే నారాయణాస్త్రముగా మారెను. ఈ మూడు పర్వతములు (రాక్షసులు) ఒకే మారు సంహరించవలెను కాని ఒక (గీతగా) వరుసలో వుండుట లేదు.ఇట్టి సమయములో నంది తన మూడు కొమ్ములతో మూడు త్రిపురములు క్రింద నుండి పొడిచి ఒక వరుసలో నిలబెట్టగా పరమేశ్వరుడు నారాయణాస్త్రమును ప్రయోగించెను. ఈ అస్త్రము ధాటికి నంది మూడవ కొమ్ము (మధ్యది) భూమి మీదకు పడిపోయెను. ఈ పసుపు కొమ్ము వెదుకుటకు శివుడు గణపతిని భూమి మీదకు పంపగా, గణేశుడు ఎంతో ప్రయాసపడి ఈ పసుపుకొమ్మును వెదికి తీసుకొని వచ్చి నందికి అందజేసెను.
ఈ విషయమున సంతసించిన పరమేశ్వరుడు ఈ పసుపుకొమ్ము భూమి మీద వుండాలని ప్రతి ఇంట శుభకార్యములలో ముందు దీనిని దంచి పసుపుగా వాడుకోవాలని, ఆ పసుపుతో తయారు చేసిన హరిద్రా గణపతికి ప్రథమపూజ జరగాలని శాసించారు.
