గణేశ చతుర్థశి!
అకార చరణ విశ్వంభరణ ఉకార లంబోదర ధీకరణ -
మకార మస్తక శివహరి స్మరణ జయ జయ ప్రణవేశా! గణేశా!అన్నారు పెద్దలు అంటే గణపతి ఓంకార స్వరూపుడు. అకారం చరణాలను అంటే పాదాలను, ఉకారం పొట్టను, మకారం శివ హరులను స్మరించే అంగాలు కలిగిన గణపతిని ఓంకార స్వరూపుడుగా వేదాలు చెపుతున్నాయి.
ఈ సృష్టిలో బలవంతులు మోటుపనులు, బుద్ధిమంతులు సూక్ష్మపనులు చేయగలరు. కానీ ఒకరు చేసినది మరొకరు చేయలేరు. ఏనుగు ఎంత బరువునైనా మానునైనా సునాయాసముగా తొండముతో లేపి అవతల పెట్టగలదు. అదే తొండముతో నేల మీద వున్న సన్నని సూదినైనా తీసి యివ్వగలదు. ఇలా సూక్ష్మ స్థూల కర్మలలో సమన్వయము సాధించాలని తెలియజెప్పడానికే గణపతి ఏనుగు తలను ధరించాడు.
గణపతికి పెద్ద చెవులుంటాయి అంటే చెవులు పెద్దవి చేసుకొని శుభాన్ని వినమని ఆయన సూచిస్తున్నాడు. కండ్లు చిన్నవి -ఎందువల్లనంటే మనలోకి చేరే కుసంస్కారాలలో చాలా భాగం కండ్ల ద్వారా చేరుతాయి. అన్ని ఇంద్రియాలలో మన కండ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎవరితోనైనా ఏవైనా చెప్పేటప్పుడు "స్వయముగా నా కండ్లతో చూచాను తెలుసా?” అని అంటాము. ఈ రకముగా ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకొనే కండ్లు చిన్నవిగా వుంటేనే మంచిది. సృష్టికి మూలమైన 'కామం' కండ్ల నుండే ప్రవేశిస్తుంది. కనుక జన్మపరంపరను ఆపాలంటే కండ్లు చిన్నవిగా చేసుకోవాలి. గణపతి పొట్ట చాలా పెద్దది. ప్రాణాయామము చేసే సిద్ధయోగులకు పొట్ట పెద్దదిగా వుంటుంది. సృష్టి రహస్యములన్నీ ఇముడ్చుకుంటుంది. బయట సృష్టి లోపల కూడా వున్నదని చెప్పడానికే 'కుంభక ప్రాణాయామము' చేస్తారు. మహాత్ములు కనిపిస్తే కాళ్ళకు నమస్కరిస్తాము. తలకు కాదు. ఎందుచేత? కాళ్ళు శ్రేష్ఠమా? తల శ్రేష్ఠమా? నిజానికి ఆ మహాత్ముని తల ఏ స్థితిలో వుందో, ఏ లోకములో వున్నదో ఎవరికి తెలుసు? మనకు అందేవి, కనిపించేవి ఆయన కాళ్ళే. అంతకన్నా సుకుమారమైన, అందమైన కాళ్ళు ఈ లోకములో చాలా వుండవచ్చు -కానీ ఆచరణాల్ని బట్టి అంటే వాళ్ళు జీవించి నడిచే పద్ధతిని బట్టి వాళ్ళ చరణాలకు నమస్కరించుట జరుగుతుంది. కానీ కాళ్ళ యొక్క కోమలత్వాన్ని బట్టి కాదు. గణపతి కాళ్ళు కొద్దివి కానీ క్షణాలలో భూప్రదక్షిణ చేసి రాగలవు. సమానము అని శ్రీ తులసీదాసు భగవంతుని స్మరించని "తల” పిచ్చి పుచ్చకాయ, చేదు గుమ్మడికాయ అన్నారు. నిరంతరము శివహరులను స్మరించడం వలననే గణపతి తల సర్వ పూజ్యమైనది. ఏ యితర దేవతలను పూజించినా ప్రథమ పూజలందుకునే శ్రేష్ఠత్వం గణపతికి లభించింది.
గణేశునికి ప్రీతికరమైన గరిక మహాత్మ్యం
హిమవంతుని పుత్రిక పార్వతీదేవికి పరమేశ్వరునికి వివాహం నిశ్చయమైంది. కళ్యాణమునకు మగపెళ్ళివారు అనగా శివుడు చిన్న కుర్రవాడు, ముసలి ఎద్దు పది మంది ప్రమథగణాలు విడిది ఇంటికి వచ్చినారు. ఈ విషయము తెలిసిన పర్వతరాజు హిమవంతుడు నిరాశ చెంది "కనీసం చుట్టాలు కూడా లేని శివుడు నాకు అల్లుడా? ఎంతో మంది వస్తారని ఆశ చెందాను.” అని తక్కువ భావన వచ్చినది. పరమశివునికి తన కాబోయే మామకు అహంకారం తొలగించదలచినాడు. వెంటనే మామకు కబురు పెట్టి తన వెంట వచ్చిన చిన్న కుర్రవాడు ఆకలికి ఆగలేడని కొద్దిగా చద్ది అన్నం పెట్టమని కోరగా దీనికి పర్వతరాజు కుర్రవానికి భోజనం వడ్డించమన్నాడు. ముందుగా వండిన భోజనం పెట్టటం ప్రారంభించినారు. ఆడ, మగ పెళ్ళి వారందరికి వండిన వంటకాలు అన్ని ఖాళీ అయినవి. అయినా అతనికి ఆగలేక పచ్చి కూరగాయలు, బియ్యము, ఉప్పు, పప్పు, అన్ని కాళీ చేసాడు అంతే కాదు ఆకాశమంత ఎత్తు వేసిన పందిళ్ళు, తాటాకులు అన్ని తిన్నాడు. కాని చిన్న కుర్రవాని ఆకలి తీర్చలేకపోయినాడు. అప్పుడు ఈశ్వరుడు “ఒక్క చిన్న కుర్రవాని ఆకలి తీర్చలేక పోయిన వారు ఏమి మర్యాదలు చేయగలరని?” అని ప్రశ్నించగా హిమవంతునికి అహంకారం తొలగిపోయినది. వెంటనే ఆ బాలుని తృప్తి మార్గము ఏమిటి అని శివునుని ప్రశ్నించగా ఇంతలో ఆకాశవాణి ఆ చిన్న కుర్రవాడు సర్వ విఘ్న వినాయకుడు. విఘ్నాధిపతి అనంత శిరస్సులతో, బాహువులతో వున్న అతనిని తృప్తిపరచలేవు. కావున భక్తితో "ఒక చిన్న గరిక పోచ” సమర్పించుమని తెలియజేయగా, హిమవంతుడు వెంటనే చిన్నగరిక తెప్పించి శుభ్రపరచి సమర్పించెను. గణేశుడు గరికను ఆరగించి తృప్తోస్మి అని ఆశీర్వదించినాడు. కావున గణేశునికి గరికి ప్రీతికరమైనది.
వినాయకునికి ప్రీతికరమైన గుంజీళ్ళ పరమార్థం
ఒకసారి విష్ణువు కైలాసానికి వెళ్ళగా అక్కడ నున్న గణపతి విష్ణువు చేతిలోని సుదర్శన చక్రాన్ని లాగుకొని గుటుక్కున నోటిలో వుంచుకున్నాడు. విష్ణువు ఎంత సేపు అడిగినా తిరిగి యివ్వలేదు. అప్పుడు ఏమీ చేయాలో విష్ణువు కొద్ది సేపు ఆలోచించి తన రెండు చెవులను చేతులతో పట్టుకుని గుంజీలు తీశాడు. ఈ హఠాత్ విచిత్రచర్యకు వినాయకుడు నవ్వు ఆపుకోలేక పడిపడి నవ్వాడు. ఆ నవ్వడంలో సుదర్శన చక్రం నోట్లో నుండి జారిపడినది. వెంటనే విష్ణువు సుదర్శన చక్రాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. సాక్షాత్తు విష్ణుమూర్తే వినాయకుని ప్రీతి కొరకు గుంజీలు తీసే ఆచారం ప్రారంభించి నాడు. కావున మనము వినాయక చవితి రోజున సాయంత్రం స్వామి ఎదుట గుంజీలు తప్పక తీయాలి.