వినాయక చవితినాడు పూజ అంతా పత్రాలతోనే. ప్రకృతిలో లభించే ఎన్నెన్నో పత్రాలను వెతికి, సేకరించి తీసుకువచ్చి పూజచేస్తాం. కాని ఆ పత్రాలలో ఎక్కడా తులసి ఆకుల ప్రస్తావనవుండదు.
తులసి పవిత్రమయిన మొక్క. అందరు దేవతలకు ప్రీతిపాత్రమైనది. తులసి మాలలతో పూజ చేయటం అత్యుత్తమ పూజా విధానమంటారు. కాని వినాయకునికి మాత్రం తులసి ఆకుల పూజ లేదు.
దానికి కారణం బ్రహ్మవైవర్త పురాణంలోని గణేశఖండం చివరిలో వుంది. గంగానదీ తీరంలో వినాయకుడు ధ్యానంలో వుండగా అక్కడ సంచరిస్తున్న యువరాణి తులసి వినాయకుని వింత ఆకారానికి ఆకర్షితురాలైంది. “నేను ధర్మ ధ్వజరాజు పుత్రికను. నన్ను పరిణయమాడ” మని అడిగింది. వినాయకుడు అంగీకరించలేదు. ఎంత బ్రతిమలాడినా లొంగని వినాయకుని తిరస్కారాన్ని భరించలేక "నీవు దీర్ఘకాలం బ్రహ్మచారిగా మిగిలిపోవుదువుగాక” అని శపించింది.
అందుకు పత్రిగా "నీవు రాక్షసుని చేతిలో బందీ అయి ఆ తరువాత సువాసన వెదజల్లే మొక్కగా పుట్టుదువుగాక" అని గణేశుడు ఆమెని శపించాడు.
తన పొరపాటును తెలుసుకుని తులసి క్షమించమని వేడుకోగా "ఆ శాపం వెనక్కి తీసుకోలేను కాని నువ్వు దేవతలందరి పూజకు పనికొచ్చే పవిత్ర మొక్కగా వుంటావు" అని గణపతి వివరించాడు. ఐనా తాను అప్పుడు కూడా స్వీకరించలేనని చెప్పాడు. కాబట్టే నేటికీ వినాయకునికి తులసి పత్రంతో పూజలు లేవు.
