సత్యజిత్తు ఏకాదశి యందు భార్యతో బాటు ఉపవాసముండెను. కేశవుని గంధ పుష్పాదులతో నర్చించెను. దేవతల హితమును కోరుతూ శ్రీమన్నారాయణుని నిరంతరముగ జపించుచు జాగరణ చేసెను. ఏకాదశి నాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యజిత్తునకు ప్రత్యక్షమయ్యెను. నీలమేఘము వలె నల్లని చాయతో, నల్లని ముంగురులతో పద్మ నేత్రములతో ప్రకాశించు తిలకముతో, విచిత్ర కుండలములతో చెక్కిళ్లు ప్రకాశించుతుండగా, సూర్యకాంతిని మించు కిరీటముతో, హారకేయూరాది విభూషణములతో, పచ్చని పట్టు బట్టను కట్టి మనోహరమైన రూపముతో గరుత్మంతుని పైనెక్కివచ్చెను. ముని గణములు శ్రీమన్నారాయణుని స్తుతించు భార్యతోబాటు శ్రీమన్నరాయణుని పాదములపైబడి నమస్కరించెను.
శ్రీమన్నారాయణమూర్తి ‘నాయనా! కోరిన వరము నిచ్చెదను అడుగూ అనెను.
అప్పుడు సత్యజిత్తు ‘స్వామి! ఇంద్రాదులకు పూర్వము వలెనే సంచరించు శక్తి నిమ్ము వారిపై దయనుంచుము. తరువాత నాకును, నా భార్యకును నీ సాన్నిద్యము ననుగ్రహింపుము అని కోరెను. శ్రీహరి దయతో వాని కోరిక నంగీకరించెను ఇట్లనెను. ఓయీ! యీ ఏకాదశి తిథి సమస్త పుణ్యముల నిచ్చును. నేనీ తిథియందే నీకు ప్రసన్నుడనైతిని, కావున యీ తిథి నాకు సంతోషమును కలిగించు తిథి. నీవు నీ భార్య యీ పారిజాత వృక్షమును పెకిలించి ఇంద్రునకిండు, పవిత్రము, వనవాసి. నాకిష్టము అయిన ఈ తులసిని నాకిమ్ము, నీకు శుభము కలుగును, మరియొక ఆలోచన వలదు అని పలికెను. సత్యజిత్తును అట్లేయని అంగీకరించెను. మరునాటి ఉదయమున భార్యతో కలిసి పారిజాత వృక్షమును పెకిలించి ఇంద్రాదుల కిచ్చెను. తులసిను లక్ష్మీపతి యగు శ్రీహరికి ఇచ్చెను. శ్రీహరి అనుగ్రహము వలన ఇంద్రాదులందరును శక్తిమంతులై శ్రీమన్నారాయణునకు నమస్కరించి నిలిచిరి.
శ్రీహరి ఇంద్రాదులు వినుచుండగా సత్యజిత్తును వాని భార్యను జూచి యిట్లనెను. ఈ ఏకాదశి తిథి నాడు నీవు భక్తితో నీ విధముగ నన్ను పూజించి నా అనుగ్రహము నుండుట వలన మిక్కిలి ఉత్తమమైనది. నాకు మిక్కిలి ఇష్టమైనది. ఈ ఏకాదశీ తిథి సర్వజీవుల పాపములని అన్నిటిని పోగొట్టి అనంత పుణ్యమును ఇచ్చును. మందమతులైన మానవులు ఈ విషయమును గమనింపలేరు. పాడ్యమి నుండి పది దినములును యధా ప్రకారము భుజించి ఏకాదశి నాడు ఉపవాసమును, జాగరణము చేసి నన్ను స్మరించు వారు నా సాన్నిద్యమును చేరుదురు. ఇహలోకమున సర్వ సుఖములను, సర్వ శుభములను పొందుదురు. నాకు సంతోషము నిచ్చిన ఈ తిథి ఉత్తమ సంభావన నిచ్చి వేలకొలది అశ్వమేధములు చేసినవచ్చు పుణ్యము నిచ్చును.
ధర్మవేత్తలగు మునులును యీ తిథి మిక్కిలి పుణ్య ప్రదమని అందురు. పన్నెండవ రోజున దేవతలకు మరల శక్తి, పుష్టి కలుగుటచే ద్వాదశి తిథిని ప్రాణదాయిని విష్ణు ప్రియయని అందురు. అజ్ఞానముచే ఏకాదశి భుజించువారు మహా పాపముల అందురు. దశమి నాటి రాత్రి భోజనమును మాని, ఏకాదశి నాడు రెండు పూటల భోజనమును మాని, ద్వాదశి నాటి మధ్యాహ్నమున ఓక మారు భుజించి నాటి రాత్రి భుజింపక ఉండిన చాతుర్భుక్తావర్జితమైన ఏకాదశి ఉపవాసమని అందురు. ఈ ప్రకారము చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్య ఫలమును ఇచ్చును.
పుణ్య ప్రదమగు హరి వాసరమున ఉపవాసము జాగరణము చేసి నన్ను యధా శాత్స్రముగ పూజించినవాడు నాకిష్టుడు. నా లోకమును చేరును. ఇట్టి ఏకాదశి ఉపవాసము చేసిన వానినే గాక వాని కులము వారినందరిని రక్షించి అనేక యజ్ఞములు చేసిన వచ్చు పుణ్యము నిచ్చును. నాలుగు వర్ణములవారు, సన్యాసి, వానప్రస్తుడు, స్త్రీ, బాల, వృద్ధులు అందరును ఏకాదశి నాడు భుజింపరాదు, ఏకాదశి నాడు స్త్రీ సుఖము, నిద్ర, అన్నము వీనిని విడిచి నన్ను పూజించవలెను. నా పాదోదకమును సేవింపవలెను. అన్ని మాసముల యందును, శుక్ల కృష్ణ పక్షములు రెండిటను వచ్చు ఏకాదశుల అన్నియు ఇట్లే ఉపవాసము ఉండవలెను. చాంద్రాయణాది వ్రతముల ను ఆచరించుట వలన వచ్చెడి పుణ్యము ఏకాదశీ ఉపవాస వ్రతము వలన వచ్చును. కావున మానవులారా, మునులారా, నా భక్తులారా మెరెవ్వరును యీ ఏకాదశినాడు అన్ని మాసములయందును. రెండు పక్షముల యందును తినరాదు. ఇది సత్యము ఇట్లు ఉపవాసము చేసినవాడు నా లోకమును చేరి నన్ను పొందును. ఇది తధ్యము అని బిగ్గరగా పలికెను. అని గృత్నృ మహాముని జహ్ను మునికి వివరించెను.
గృత్నృ మహాముని జహ్ను మునితో నిట్లనెను. శ్రీమన్నారాయణుడు ఏకాదశి వ్రత విధానమును మహత్త్యమును వివరించి ఇంద్రాదులతో నిట్లనెను. మీరీ పారిజాత దివ్య వృక్షమును తీసికొని మీ నివాసమైన స్వర్గమునకు వెళ్ళుడని చెప్పెను. ఇంద్రాదులు శ్రీహరి చెప్పినట్లు పారిజాత వృక్షమును తీసికొని స్వర్గమునకు పోయిరి.
వారందరును వెళ్లిన తరువాత తులసి శ్రీమన్నారాయణునితో నిట్లనెను. స్వామీ! నీ పాదపద్మముల యందాసక్తి గల నన్ను దయ చూడుము. నాకు నీవు తప్ప మరి యొక్క గతిలేదు. నేను నీ పాద సాన్నిధ్యమునే కోరుకొందుము అని పలికిన తులసి మాటలను విని శ్రీహరి భూమి యందు అమృతము వలన పుట్టిన తులసి! నీవు నాకిటురాలవు. నా వద్దకు రమ్ము నిన్ను నేను హృదయమున ధరింతును...సందేహము వలదు.
నీవు పవిత్రురాలవు పవిత్రతను కలిగించు దానవు పాపనాశిని తులసి దళములతో కలిగి యున్న నిన్ను చూచినవారు గంగా స్నానము చేసిన వారువలె పవిత్రులగుదురు. నీ దళములతో నన్ను పూజించినవారు పునర్జన్మ నుండదు. అమృతము నుండి పుట్టిన తులసి నీ దళములను మాలగా చేసి నా కంఠమున సమర్పించిన వారు అంతులేనంత అనంత కాలము నా లోకమున నుండి నాలో ఐక్యమగుదురు. నిన్ను తమ ఇంటియందు గాని తోటలయందు గాని పెంచువారికి ఏ పాపములును అంటవు. ప్రాతఃకాలమున నిద్ర లేవగనే నిన్ను చూచి నమస్కరించిన వాడు ఆ దినమున సర్వ సుఖముల నందును.
తులసి మొక్కకు నీరు పోసి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం.
🍃🌷తులసి ప్రదక్షిణ స్తోత్రం:
యన్మూలే సర్వతీర్థాని యన్మభ్యే సర్వదేవతాః l
యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహం ||
🌷వివరణ:
యన్మూలే సర్వతీర్థాని: తులసి వేరు భాగంలో అన్ని పవిత్ర తీర్థాలు (గంగ, యమున మొదలైనవి) ఉన్నాయి.
యన్మధ్యే సర్వదేవతాః: తులసి మొక్క మధ్య భాగంలో ముక్కోటి దేవతలు కొలువై ఉన్నారు.
యదగ్రే సర్వవేదాశ్చ: తులసి ఆకుల చివర్లలో వేదాలు (ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం) ఉన్నాయి.
తులసి త్వాం నమామ్యహం: అట్టి విశిష్టత కలిగిన తులసి మాతకు నేను నమస్కరిస్తున్నాను.
తులసి మొక్కకు నీరు పోసి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని భక్తి విశ్వాసం.
అను శ్లోకమును చదివి నీకు నమస్కరింపవలెను. తులసి! నీ దళములతో నీటిని తన శరీరము పై జల్లుకొనువాడు అపవిత్రుడైనను పవిత్రుడగును. నీ కుదురు మొదలులోనున్న మట్టిని తిలకముగ నుదుటిపై ధరించినవాడు. సర్వసుఖములను పొందును. యక్ష రాక్షస పిశాచాదుల వలన వానికి ఏ బాధయు నుండదు. అమృత సంభవా తులసీ త్రైలోక్యపావనీ నేను నిన్ను లక్ష్మీదేవిని సమానముగా భావింతును అని శ్రీహరి తులసికి వరములిచ్చెను.
తులసి దళములను కాండములను శాఖలను అన్నిటిని శుభప్రదములైన మృదువైన తన చేతులతో తాకెను. చక్రధారి స్పర్శ వలన తులసి మరింత కాంతిని పవిత్రతను పొందెను. అప్పుడా తులసి మనోహరమైన పవిత్రమైన స్త్రీ రూపము పొంది శ్రీహరి అంశను పొందెను. మాయావి జగదీశ్వరుడు అయిన శ్రీహరి లోకరక్షణార్థమై తులసిని నియమించెను. శ్రీహరి ఎడమ చేతితో తాక బడిన భాగము కృష్ణ వర్ణమై కృష్ణ తులసి అను పేరు పొందెను. ఆ వైపున ఉన్న ఇతర వృక్షములను తులసీ సాన్నిధ్యముచే పవిత్రము అయ్యెను. తులసి యున్న ప్రదేశము పాపములను పోగొట్టును.
అప్పుడు శ్రీహరి సత్యజిత్తును చూచి ‘నీవు నాకు పూజను చేసి బ్రాహ్మణ సమారాధనము చేసి నీవు మరియు నీ భార్యయు భుజింపుడు ‘ అని పలికెను. సత్యజిత్తు కూడ శ్రీహరిని పూజించి, బ్రాహ్మణులకు భోజనమును పెట్టి తన భార్యతో కలసి భుజించెను. ఇట్లు ఆ వ్రతము పూర్తి అయిన తరువాత శ్రీహరి అందరును చూచుచుండ సత్యజిత్తు దంపతులతోను తులసితోను కలసి గరుత్మంతుని పైనెక్కి తన లోకమునకు పోయెను. నాయనా జహ్నుముని! ఇది ఏకాదశీ వృత్తాంతము. ఏకాదశి తిథి అశ్వమేధ సహస్ర ఫలము ఇచ్చునని స్పష్టమైనది కదా. అన్ని ఏకాదశులలోను మాఘమాసము నందలి ఏకాదశి మరింత శుభప్రదము.
ఆనాడు ఉపవాసము ఉండి శ్రీహరిని పూజించి జాగరణ మంత్రానుష్ఠానము స్మరణము చేసిన వారు శ్రీహరికి ప్రీతి పాత్రులై సాలోక్యమును సాయుజ్యమును పొందుదురు. ఏకాదశి నాడు ఉపవాసము ద్వాదశి నాడు పారాయణం ముఖ్యము. ఆనాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి యధా శక్తిగ గోదానము, భూదానము, వస్త్రదానము, సువర్ణదానము, సాలగ్రామ శిలాదానము మున్నగువానిని ఉత్తముడైన బ్రాహ్మణునకు, బ్రాహ్మణులకు ఈయవలెను. అట్టివారు యిహలోకమున చక్రవర్తియై తుదకు శ్రీహరి సాయుజ్యమునందును. ఇట్టి పవిత్రమైన కథను వినువాడును శ్రీహరి కరుణా కటాక్షము పొంది విష్ణువును చేరుదురు. నిస్సందేహముగా చెప్పుచున్నాను అని గృత్నృమద మహర్షి జహ్ను మునికి వివరించెను.
మాఘ పురాణం 24వ అధ్యాయ పారాయణం సంపూర్ణం.
