గుడికి వెళ్తే ప్రసాదం తీసుకున్నా లేకున్నా తీర్థం తప్పకుండా తీసుకుంటాం.
పూజారిగారు మరేదో వ్యాపకంలో ఉంటే అడిగిమరీ తీసుకుంటాం. తీర్థం అంత అమూల్యమైంది, శ్రేష్ఠమైంది.
తీర్థాన్ని ఎలా తీసుకోవాలి...
తీర్థం తీసుకునేటప్పుడు కుడిచేతిని గోకర్ణంలా (ఆవు చెవి ఆకృతి) పెట్టాలి. అంటే చేతిని డిప్పలా ముడిచి, చూపుడు వేలును బొటనవేలుకు ఆనించాలి.
అంతే తప్ప ఒక చేయి, లేదా రెండు చేతులను దోసిళ్ళలా పట్టకూడదు.
ఉద్ధరణితో మూడుసార్లు తీర్థం పోసిన తర్వాత కళ్ళకు అద్దుకుని తాగాలి. తీర్థం నిలబడి తీసుకోవాలి
కూర్చుని మాత్రమే ప్రసాదం సేవించాలి అని చెబుతున్నారు. తీర్థం తీసుకునేటప్పుడు జుర్రిన శబ్దం రాకూడదు.
మనసులో దేవుని స్మరించుకుంటూ నిశ్శబ్దంగా సేవించాలి.
తీర్థం ఎలా చేస్తారు...
దేవునికి శుద్ధోదక అభిషేకం చేసేందుకు, కొన్ని తులసి దళాలు, కొద్దిగా పచ్చ కర్పూరం, కేసరి, శ్రీగంధం వేసి కలిపిన నీటిని సిద్ధంగా ఉంచుకుంటారు.
దేవుని అభిషేకించిన తర్వాత ఆ నీటిని తీర్థంగా ఇస్తారు.
తీర్థంలో ఉపయోగించే కర్పూరం, తులసి దళాలు మొదలైన ద్రవ్యాలు దివ్య ఔషధంలా పనిచేస్తాయి.
నాడీ మండలంలోని దోషాలను సరిచేస్తాయి. తులసి కఫం లాంటి శ్వాసకోశ సంబంధమైన అనారోగ్యాలను నివారిస్తాయి. కర్పూరం మనసుకు ఉల్లాసాన్ని కూడా కలిగిస్తుంది.
తీర్థం ఎందులో తయారు చేస్తారు...
రాగి లేదా తామ్ర పాత్రల్లో తీర్థాన్ని తయారు చేస్తారు. ఈ లోహ పాత్రల్లోనే తీర్థం ఎందుకు తయారుచేయాలి అంటే దీనికి ఉష్ణాన్ని తగ్గించి, లవణాలను గ్రహించే గుణం ఉంది. రాగి, నీటిని శుభ్రం చేసి సమశీతోష్ణ స్థితిలో ఉండేలా చేస్తుంది.
ఈ కారణం వల్లనే కొందరు రాత్రిపూట రాగిపాత్రలో నీరు పోసి, ఉదయానే తాగుతారు. ఇది ఆరోగ్యానికి మంచిది.శరీరంలోని కల్మషాలను పోగొడుతుంది...