🥀 *“ధనం పెరిగిన కొద్దీ దానం పెరగాలి! విలాసాలు,డాబు పెంచుకున్నారంటే, ఏ నాటికైనా పతనం తప్పదు!”*
🥀వరిపంటకు నీరు లేకపోతే ఎండిపోతుంది, సమంగా ఉంటే బంగారంలా పండుతుంది. అధికమైతే, ఆ నీటనే మునిగి, కుళ్ళి, నశిస్తుంది.
🥀ఇక్కడ నీటినే ధనం అనుకుంటే...తగినంత లేకుంటే కరువు, సరిపడా ఉంటే సమృద్ధి, ఎక్కువైతే... తనను తానే నశింపచేసుకునే రాచమార్గం !
🥀అదే అధికంగా ఉన్న ధనాన్ని(నీటిని తీసివేస్తే) దానం చేస్తే తిరిగి దైవానుగ్రహమనే దివ్య ఫలాన్ని పొందవచ్చు.ఇప్పుడు లోకం తీరు మారింది. ఉన్నది తినేకంటే, తింటూ ఎదుటివాడికి చూపి, గొప్పలు కొట్టుకునే పధ్ధతి పెరిగింది.
🥀తమకున్న డబ్బు, కార్లు, బంగళాలు, విలాస వస్తువులు, తిరిగిన ప్రాంతాలు అన్నీ వెంటనే ఇతరులకు సోషల్ మీడియా ద్వారా చూపాలి. దేవాలయానికి వెళ్ళినా! దైవదర్శనం కంటే సేల్ఫీ లకు ప్రాధాన్యత ఇస్తున్నారు...!
🥀చీరలు, నగలు ధరించి, షోకేసుల్లో బొమ్మల్లా, ఇతరులకు ప్రదర్శించాలి. నిజానికి ఇటువంటి వారి చూపు, నవ్వు, ప్రదర్శన అంతా పటాటోపమే, వీరికి అంతర్గత శాంతి ఉండదు. వీరిని చూసి, ఇతరులు అనుకరించరాదు. మరి అంతర్గత శాంతి, ధర్మచక్రం యొక్క బలం ఎలా ఉంటుంది, అని అడిగేవారు, చక్వవేణ మహారాజు కధను, తప్పక చదివి తెలుసుకోవాలి !!
🥀పూర్వం చక్వవేణుడు అనే ధర్మాత్ముడు, సదాచారపరాయణుడు, సత్యవాది, దయామయుడు, మహాజ్ఞాని, అయిన మహారాజు ఉండేవాడు. అతను రాజద్రవ్యాన్ని తనకోసం వాడుకోవడం దోషంగా భావించి, భార్యతో తన పొలంలో వ్యవసాయం చేసుకునేవాడు. రాణి నాగలి లాగితే, రాజు విత్తనాలు చల్లేవాడు. తమ పొలంలో పండిన ప్రత్తితో బట్టలు చేసుకు ధరించేవాడు. తమ పొలంలో పండిన ఆహారమే తినేవారు. రాణికి ఖరీదైన ఆభరణాలు ఉండేవి కావు, వారి కష్టార్జితం వారి జీవనానికే సరిపోయేది.
🥀ఒకనాడు ఆ రాజ్యంలో జరిగిన తీర్ధానికి వచ్చిన ధనికులైన వ్యాపారుల భార్యలు, ఆడంబరంగా రాణిని దర్శించి, ఆమె కూడా మహారాజును అడిగి, అటువంటివి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వారి మాటలు విన్న రాణి, చక్వవేణుడిని, తనకూ విలువైన వస్త్రాభరణాలు కావాలని కోరింది.
🥀రాజు బాగా ఆలోచించాడు- తాను రాజద్రవ్యాన్ని ముట్టడు, కాని తను సామ్రాట్టు కనుక, దుష్టులు, బలవంతులు, అత్యాచారులు అయిన రాజుల నుంచి పన్నును వసూలు చెయ్యవచ్చు, అనుకున్నాడు.
🥀తన మంత్రిని రప్పించి, “రాక్షస రాజైన రావణుడి వద్దకు వెళ్లి, నేను 1.25 మణుగుల బరువైన బంగారాన్ని పన్నుగా చెల్లించమని, ఆజ్ఞాపించాను అని చెప్పి, తీసుకురమ్మని “ అనుజ్ఞ ఇచ్చాడు.
🥀మంత్రి తెచ్చిన వార్తను విన్న రావణుడు అతన్ని పరిహాసం చేసి, పంపాడు. ఇదే విషయాన్ని మండోదరికి చెప్పగా, ఆమె ‘స్వామీ ! పొరపాటు చేసారు. వారడిగిన బంగారం ఇవ్వాల్సింది. చక్వవేణుడి మహిమను రేపు ఉదయం మీకు చూపుతాను, ‘ అంది.
🥀ఉదయం ఆమె పావురాలకు గింజలు వేసి, అవి తింటూ ఉండగా, ‘రావణుడి మీద ఆన, గింజలు ముట్టకండి, ‘ అంది, అవి లెక్కచెయ్యక, తినసాగాయి.
🥀వెంటనే ఆమె, ‘చక్వవేణుడిపై ఆన, ఇక గింజలు ముట్టకండి,’ అంది, వెంటనే పావురాలు అన్నీ ఎగిరిపోయాయి. ఒక చెవిటి పావురం వినబడక, గింజ తినగానే, తల తెగి, క్రింద పడింది. తర్వాత రాణి, ‘చక్వవేణ మహారాజుపై ఆనను ఉపసంహరిస్తున్నాను, గింజలు తినండి,’ అనగానే, పక్షులు మళ్ళీ గింజలు తినసాగాయి.
🥀‘చూసారా స్వామి ! ఇదీ చక్వవేణుడి ధర్మ చక్ర మహిమ,’ అంది, మండోదరి. ‘పిచ్చి పక్షులకు ఏమి తెలుస్తుంది ?’ అంటూ కొట్టి పారేసాడు రావణుడు.
🥀చక్వవేణుడి మంత్రి సముద్ర తీరానికి చేరి, ఇసుక, మట్టితో లంకా నగర నమూనాను సరిగ్గా అలాగే చేసి, ‘ఒక వినోదం చూపుతాను,’ అంటూ, రావణుడిని పిలుచుకువచ్చాడు. ‘చక్వవేణ మహారాజుపై ఆన’, అంటూ నమూనాలో తూర్పువైపు ఉన్న బురుజులు, ప్రాకారాలను పడగొట్టగానే, లంకలో నిజంగా అమరిఉన్న నిజమైన తూర్పు వైపు బురుజు, ప్రాకారం కూలిపోయాయి.
🥀హతాశుడయ్యాడు రావణుడు. అలాగే మంత్రి, నమూనాలో ఉన్న తూర్పువైపు స్థూపాలు, ‘చక్వవేణ మహారాజుపై ఆన’ అంటూ, పడగొట్టగానే నిజ లంకాపుర స్థూపాలు కూలిపోయాయి. ఇది చూసి, బెదిరిన రావణుడు, మంత్రి కోరిన బంగారాన్ని అతడికి ఇచ్చి, పంపేశాడు.
🥀మంత్రి చక్వవేణుడికి బంగారం ఇవ్వగా, అతడు అది ఎలా తెచ్చావో చెప్పమని, మంత్రిని అడిగాడు. మంత్రి చెప్పింది విన్న రాణి ఆశ్చర్యచకితురాలు అయ్యింది. ఆమె పవిత్రవర్తనం యొక్క మహిమ తెలుసుకుని, బంగారం వద్దంది. ఆ బంగారం తిరిగి, రావణుడికి పంపివెయ్యబడింది. అన్ని లోకాలను ప్రభావితం చెయ్యగల చక్వవేణుడి త్యాగబుద్ధిని తెలుసుకుని, రావణుడి హృదయం కూడా పరివర్తన చెంది, మంత్రిని ఆదరించి, పంపివేసాడు.
*నీతి:* క్షణకాల దుస్సాంగత్యం కూడా అనర్ధాన్ని కలిగిస్తుంది. అందుకే దురభ్యాసాలు, మత్తుపదార్దాలు, క్రీడావినోదాలు, ఖరీదైన ఆడంబరాలతో గడిపేవారి సాంగత్యం వదలాలి. మోసంతో ఆర్జించిన మృష్టాన్నం కూడా విషతుల్యమే అవుతుంది. పవిత్ర ద్రవ్యం వల్ల ప్రాప్తించిన పిడికెడు అన్నమైనా అమృతతుల్యం అవుతుంది.