శ్రీ వేంకటేశ్వర లీలలు భాగము 7 - కైలాసమున భృగు మహాముని

P Madhav Kumar


🌻 *కైలాసమున భృగు మహాముని* 🌻

🍃🌹బ్రహ్మదేవుని పరీక్షించుట జరిగినది. ఇంక శంకరుని పరీక్షించుట కొరకు సరాసరి కైలాసమునకు వెడలినాడు భృగువు. ఆ కైలాసమున వెండికొండ పై శివుడు ప్రమధ గణము శివనామ జపధ్యాన మొనర్చుచుండ తన్మయుడై యుండెను. 


🍃🌹కైలాసాచలము మీద ఎక్కడ వినిననూ పవిత్ర పంచాక్షరీ మంత్ర ప్రణవ నిస్వసములే! ఎక్కడ చూచినా భక్తతతుల శివభక్తి పారవశ్యమే!


🍃🌹భృగు మహాముని పరమేశ్వరుని ప్రత్యేక మందిరపు దిక్కుగా వెడలినాడు. అందమయిన ఆ మందిరము చెంతకు వెడలి కావలియున్న వారిని శంకరుడేమి చేయుచున్నాడని అడిగెను. 


🍃🌹అప్పడొకండు ఆర్యా! ప్రస్తుత సమయమున శంకరుడు తన నిజసతి పార్వతీదేవితో గూడి ఏకాంతకేళిలోనున్నాడు. ఇప్పట్టున మీకాయన దర్శన మగుట దుర్లభము. కనుక తాము మరి ఒకసారి రావలసినది’’ అని వినయముగా చెప్పెను. ‘కాదు నేనిప్పుడే లోనికిపోయి తీరవలెను’ అన్నాడు భృగువు. 


🍃🌹కూడదని చెప్పి చెప్పి చూచిరి. కాని, భృగువు మంకుపట్టు వీడలేదు. ఆరుమూడైన మూడు ఆరైనా లోనికి వెడలియే తీరవలెననీ హుంకరించి లోనికి ప్రవేశించినాడు. కేళీ విలాసముల గరుగుచున్న ఆ యాది దంపతములకు ఆటంటకము కలిగెను. పార్వతీదేవి పరపురుషుడగుభృగువును చూచినదై సిగ్గుదొంతరలు ముంచుకొనిరాగా ప్రక్కకు తొలగిపోయినది.


🍃🌹శంకరున కెక్కడలేని కోపము వచ్చినది. మహోగ్రమూర్తియై ‘‘ఓయీ భృగువూ! మునివై యుండియు నీకు మర్యాద తెలియకపోవుట ఆశ్చర్యముగానున్నది. 


🍃🌹ఏకాంతముగా కాంతతో శయ్యాగారమున నుండినప్పుడు ఆ మందిరములలో అన్యులు ప్రవేశించరాదను సామాన్య ధర్మమైననూ నీకు తెలియదా? అసలు నీవు నా అనుమతి లేనిదే లోనికెందులకు వచ్చితివి? బ్రహ్మవంశమున పుట్టి మహా తపస్సొనరించిన కీర్తిశాలివగు నీయట్టివాని కిట్టి పాపకృత్యమొనరించుట తగినదగునా? నీ ముఖమును జూచుటయే శుభకరము కాదు. 


🍃🌹నిన్ను కనికరించి విడుచుచుంటిని కానీ, లేనిచో నిన్ను నాశనమొనరించుట యెంతపని? ఛీ! వేగముగా బయటకు పొమ్మని దూషించి వదలివైచెను. శివుడు తనను దులిపి దులిపి విడిచినన్నూ భృగువునకు చీమ కుట్టినట్లు కూడ లేకపోయెను. 


🍃🌹పైపెచ్చు లోలోపల నవ్వుకొని బైటకు వచ్చివైచెను. ఈ శంకరుడు గూడ సత్త్వగుణ ప్రధానుడు కాకపోయెను. ఏకాంతమందిరమున ప్రవేశించితినని మండిపడినాడు దానికి మించి తిట్లవర్షమును కురిపించినాడు. 


🍃🌹మహా విరాగియైన ఈ శంకరునికి కూడ కోపము వచ్చినదే! దీనికి ఆయనకు గల తామసగుణమే కారణము కదా! అని అనుకొనెను. తామసగుణ ప్రధానుడగుటచే ఈ శంకరుడు తామసభావమున నేను వచ్చిన పనిని గ్రహించలేకపోయినాడు. అని అనుకొనుచూ భృగుమహర్షి కైలాసమును వీడి వెడలినాడు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat