*బుధగ్రహ జననం - 9*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
తారా , చంద్రుడూ అరణ్యంలోకి వెళ్ళి ఉంటారనీ , తిరిగి వస్తారనీ నమ్మిన బృహస్పతి ఆశ అడియాసే అయ్యింది. నెలల పాటు శిష్యుల చేత ఆయన చేయించిన తార , చంద్రుల అన్వేషణ ఫలించలేదు.
తారా , చంద్రుడూ అంతర్ధానం కావడానికి కారణం వారిద్దరికీ ఒకరి పట్ల మరొకరికి ఉన్న వ్యామోహమేనని నిస్సంశయంగా అనిపించినప్పటికీ , ఆయన తారను విస్మరించలేకుండా ఉన్నాడు. ఏది జరిగినప్పటికీ తార తన భార్య !
తార సౌందర్య రాశి తార , బ్రహ్మదేవుడు సూచించిన భార్య - తిరిగి తనను చేరుకుంటుందన్న నమ్మకాన్నీ , చేరాలన్న ఆశనూ పెంచిపోషించుకుంటూ యాంత్రికంగా కాలం వెళ్ళదీస్తున్నా డాయన.
ఆశ్రమంలో పాఠ ప్రవచనం , ఇంద్ర సభలో మంత్రాంగం అనే విధులకు లోపం రానివ్వకుండా చూసుకుంటున్నా రాయన. తార వియోగాన్నీ , ఆ వియోగం అందించిన అవమానాన్ని మౌనంగా భరిస్తున్న బృహస్పతి - 'తారాచంద్రుల అంతర్ధాన విషయం' ఇంద్రుడికి తెలియకుండా చూసుకున్నాడు.
కాలం తన నిరంతర ప్రయాణాన్ని నిరాటంకంగా సాగిస్తూ తనూ సాగిపోతోంది. జరిగిపోతున్న వాటన్నింటినీ తన విశాల గర్భంలో దాచుకుంటూ కాలం తన నిరంకుశ , నిర్దాక్షిణ్య ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది.
తన వైపు దూసుకువస్తున్న తారను చంద్రుడు వొడుపుగా పట్టుకుని ఆపాడు. ఆమె ముఖంలోకి చిరునవ్వుతో చూస్తూ ఊయలను బలంగా తోశాడు.
వేగంగా , తనకు దూరంగా వెళ్ళిన తార , క్షణకాలం ఆగి , ఇనుమడించిన వేగంతో తన వైపు వస్తోంది... గాలిలో ! తార తన వైపు వస్తూనే ఉంటుంది. ఆమెను తనకు దూరంగా తీసుకు వెళ్ళాలని ఎవరు ప్రయత్నించినా , ఆ ఊయలలాగే ఆ ప్రయత్నంలో ఓడిపోవాల్సిందే ! చంద్రుడు సగర్వంగా నవ్వుకుంటూ , తన వైపు దూసుకొస్తున్న తార కోసం చేతులు చాచాడు.
తార తటాలున ఊయల పీఠం మీద నుంచి , కిందికి , అతని చేతుల్లోకి జారింది.
*"ఏం ? డోలోత్సవం చాలా , తారా ?"* చంద్రుడు నవ్వాడు.
*"చాలు....”* తార బరువుగా నిట్టూర్చింది.
*"ఏం ? ఆ మాత్రానికే అలసిపోయావా ?"* చంద్రుడు ఆమెను కొద్దిగా దగ్గరగా లాగి అన్నాడు.
*"మనం ఈ మందిరానికి వచ్చినప్పుడున్నంత ఉబలాటం ఇప్పుడు ఈ డోలిక మీద లేదు..."* తార మెల్లగా అంది.
*"అలాగా ! అదేమిటి ? మోజు తీరిపోయిందా , దేవికి ?"*
*"కాదు...నీకు అర్థం కాలేదా ?"* తార చంద్రుడి ముఖంలోకి చూస్తూ అంది.
*"ఏమిటి ?"* చంద్రుడు అడిగాడు. నవ్వింది. *“ఒకసారి... నన్ను చూడు !".*
చంద్రుడు చూశాడు. ప్రేమతో , కోరికతో వెలిగిపోతున్న అతని కళ్ళు తార పాదాలు నుంచి తల దాకా దీపారాధన చేస్తున్నాయి.
అతని చూపులు తారకు నవ్వు తెప్పించాయి. *"పిచ్చి చంద్రా ! నీకు చూడ్డం తెలీదు. విను , నేను ఊయలలో ఎందుకు మనుపట్లా ఊగలేనంటే , ఊయలలో ఊగే నీ ప్రతిరూపం నాలో - నాగర్భడోలికలో ఊగుతోంది !".*
చంద్రుడు ఆశ్చర్యంగా చూశాడు. *“నిజమా ?”.*
*"నన్ను చూసే కళ్ళతో నువ్వు ఇక దేన్నీ చూడలేకపోతున్నావు. అయిదు మాసాలుగా మోస్తున్నాను... మన ఆనందఫలాన్ని నాలో !"* తార అలసటగా చంద్రుడి వైపు వాలుతూ అంది.
*" బృహస్పతితో నీ కళ్యాణం ఏకోన్ముఖం ! ఆనందం ద్విముఖం !' అని బ్రహ్మ నన్ను దీవించారు... చంద్రా ! నీతో నేను పొందుతున్నది ద్విముఖమైన ఆనందం !"* అంది తార.
బృహస్పతి పూజ ముగించి , లేచి , చేతులు జోడించి ప్రార్ధన చేస్తున్నాడు.
*"నారాయణ ! నారాయణ !"* నారదుడి నారాయణ నామ స్మరణ బృహస్పతిని తీగలా చుట్టి వెనక్కి తిప్పింది.
*“నారద మునీంద్రులకు నమస్సులు !"* బృహస్పతి చేతులు జోడిస్తూ అన్నాడు.
*“నారాయణ ! సతీ సమాగమ ప్రాప్తిరస్తు !”* నారదుడు సందర్భశుద్ధిగా అన్నాడు.
*“నారదా... !"* బృహస్పతి కంఠం నివ్వెర పాటుతో బొంగురుగా ధ్వనించింది..
*"ఈ నారదుడికి ఎలా తెలుసునని ఆశ్చర్యపోతున్నారా ? ఇలాంటివి తెలుసుకోవ దానికే బ్రహ్మగారు నన్ను కన్నారు , మనసుతో !"* నారదుడు నవ్వుతూ అన్నాడు.
*"మీ శిష్యులు ఇంకా ఆ తారాచంద్రుల కోసం - పాపం - వాళ్ళు లేని ప్రదేశాల్లో గాలిస్తూనే ఉన్నారు !"* నారదుడు నవ్వాడు.
*"నారదా ! తారా... అదే... తార ఎక్కడుందో తెలుసా ?"* చంద్రుడి ప్రస్తావన లేకుండా జాగ్రత్తగా అడిగాడు బృహస్పతి.
*“నారాయణ ! తెలుసుకోకుండా మీ దర్శనానికి వస్తానా ?"*
బృహస్పతి నిట్టూర్చాడు. *"... ఎలా ఉంది , తార ?"*
*"ఇక్కడున్నప్పటి కన్నా అందంగా , ఇక్కడున్నప్పటి కన్నా ఆనందంగా ఉంది !"* నారదుడు నవ్వుతూ అన్నాడు.
బృహస్పతి మౌనంగా , విచారంగా చూశాడు.
*"మీ శిష్యుడు చంద్రుడు మీ అందాల తారను తన మందిరంలో ఉంచుకున్నాడు !"* నారదుడు చిరునవ్వుతో అన్నాడు. *"తారా చంద్రుల విలాస నిలయంగా ఉన్న ఆ చంద్ర మందిర విలాసం చెబుతాను. శిష్యుల్ని దూతలుగా అక్కడికి పంపండి !"*
*"రా , చంద్రా!”* ఒంటరిగా కూర్చున్న బృహస్పతి ఉలిక్కిపడి , ఆగ్రహంతో చెట్టు మీదికి చూశాడు. చిలక గుబురులో సర్దుకుంటూ , తననే చూస్తోంది. ఆ పాపిష్ఠి చిలక అనుకరిస్తోంది తార పిలుపు అని ఆయనకు తెలుసు. కోపాగ్నిలో ఆ చిలకను మాడ్చి మసి చేసివేయాలనిపిస్తున్న ఆవేశాన్ని నిగ్రహించుకుంటూ , చెట్టు కొమ్మల్నే చూస్తూ ఉండిపోయా డాయన.
పువ్వులన్నీ పిందెలుగా మారిపోయాయి. కాలం కరిగిపోతోంది. దానితో పాటు తార తిరిగి వస్తుందన్న ఆశ తరిగిపోతోంది తనలో.
నారద మహర్షి సూచన మేరకు శిష్యుల్ని పంపించాడు తను. తారాచంద్రులిద్దరూ. ఆ కుర్రవాళ్ళను దారుణంగా అవమానించి , బెదిరించి పంపి వేశారు.
చేసేది లేక , స్వయంగా తనే వెళ్ళాడు. మందిరం ముందు పడిగాపులు కాశాడు. చాలా సేపటికి , మందిరంలోంచి వెలికి వచ్చిన చంద్రుడూ , తార - తనను పురుగులా. చూశారు. *"గురుతల్ప గమనం పాపం !"* అన్నాడు తాను చంద్రుడితో.
*“అందుకే కదా దర్భలతో అల్లిన ఆ తల్పాన్ని వదిలి - ఇక్కడున్న హంసతూలికా తల్పాన్ని చేరాం !"* అన్నాడు చంద్రుడు.
బృహస్పతి బరువుగా నిట్టూర్చాడు. తనను హీనాతిహీనంగా చిన్నబుచ్చుతూ , తనను తిరస్కరిస్తూ తార పలికిన పలుకులు గుర్తుచేసుకోవడం ఇష్టం లేక నిస్సహాయంగా తల విదిల్చాడు బృహస్పతి.
*“గురుదేవులకు ప్రణామం !"* బృహస్పతి ఆలోచనల లోంచి బయటపడి చూశాడు. ఎదురుగా ఇంద్రుడు !
*“మహేంద్రా !”*
*"మీరు రాలేదు ! నేనే వచ్చాను ! కొంత కాలంగా మీరు సభకు ఎందుకు క్రమంగా రాలేకపోతున్నారో తెలుసుకునే వచ్చాను..."* ఇంద్రుడు బృహస్పతితో బాటు ఆశ్రమం వైపు నడుస్తూ అన్నాడు.
*"దేవరాజా !"*
*"ఈ దేవరాజు తమ కోసం ఏ సాహసమైనా చేయగలడన్న సత్యాన్ని మీరు విస్మరించారు. ఆ చంద్రుడి దురాగతాన్ని దాచి ఉంచుకున్నారు. ఆ తారను మరిచిపొండి. బ్రహ్మదేవులను మళ్ళీ ఆశ్రయించి , మరొక ఉత్తమ కళత్రం మీకు లభించేలా చేస్తాను !"* ఇంద్రుడు ఆవేశంగా అన్నాడు.
*"మహేంద్రా...!"*
*"ఔను గురుదేవా ! ఆ తార పరపురుషుని పరిష్వంగంతో పతిత అయిపోయింది. ఆమె మీకు తగదు !"*
బృహస్పతి ఇంద్రుని వైపు నిదానించి చూశాడు. *"దేవరాజా ! ఈ సందర్భంలో నీకొక ధర్మ సూక్ష్మం చెబుతాను. స్త్రీకి పర పురుష సంగమ దోషం ఋతుస్రావంతో పోతుంది. బహిష్టు అలాంటి స్త్రీని పవిత్రం చేస్తుంది !”*
ఇంద్రుడు కొత్త పాఠం వింటున్నట్టు చూస్తూ వుండిపోయాడు.
*"మీరు సెలవిచ్చిన ధర్మ సూక్ష్మం మాకు శిరోధార్యం గురుదేవా ! మీ ధర్మపత్ని తారాదేవిని మీ పాదాల ముందు గురుదక్షిణగా సమర్పించుకునే బాధ్యత నాది !”*
*“మహేంద్రా !"* బృహస్పతి ఆనందంగా అన్నాడు..
*“అందుకు అవసరమైతే ఆ చంద్రుడి మీద యుద్ధం ప్రకటిస్తాను ! ఆశీర్వదించండి !"* ఇంద్రుడు ఆవేశంగా అన్నాడు.
*"విజయోస్తు , దేవేంద్రా ! విజయోస్తు !"* బృహస్పతి ఉత్సాహంగా దీవించాడు.
🙏 సకల నవగ్రహ దేవతాయ నమః 🙏