దశమి వచ్చెనే దసరా తెచ్చెనే
బంగరు కనక దుర్గ పండగొచ్చెనే
విజయవాడ కృష్ణానది తీరమందునా
ఇంద్రకీలాద్రిపైన కొలువు తీరెను
చల్లని తల్లిగా జగతిని కాచును
కోరిన కోర్కెలిచ్చి కరుణచూపును
భక్తి నిండ నిష్టతోడ మాలవేతురు
శక్తి కొలది ముడుపు లిచ్చి మ్రొక్కుకొందురు
ముక్తికి మార్గము నీవని అందురు
భక్తులు నిన్ను చేరి వేడుకొందురు
పసుపు కుంకుమలతో నీకు పూజ జేతురు
పట్టు చీరలన్ని తెచ్చి కట్టబెడుదురు
పదముల పారాణి పూయుచునుందురు
ఫలరస పాయసములు ముందు నిడుదురు
ఆశ్వయుజ మాసమున నవరాత్రులను
అఖిలాండకోటి బ్రహ్మాండ తేజమై
అలరును అమ్మరో అదిగో చూడరో
ఆ వైభవము చూడ అలవికాదురో
ఓం కార రూపిణివై విజయదుర్గగా
క్లీం కార వాసినివై కనకదుర్గగా
అంబ భవానిగా శంభుని రాణిగా
అంజలి నిడుదును అప్పన్నదాసుగా