శ్రీ సరస్వతీ విద్యాపీఠం - అర్చన - 06. ప్రార్థన - Sri Saraswati Vidya peetham
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ సరస్వతీ విద్యాపీఠం - అర్చన - 06. ప్రార్థన - Sri Saraswati Vidya peetham

P Madhav Kumar
1.యా కుందేందుతుషారహారధవలా, యా శుభ్రవస్త్రావృతా। 
యా వీణావరదండమండితకరా, యా శ్వేతపద్మాసనా॥ 
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా వందితా।
సా మాం పాతు సరస్వతీ, భగవతీ, నిశ్శేషజాడ్యాపహా||

2. శుక్లాం బ్రహ్మవిచారసారపరమామ్, ఆధ్యాం జగద్వ్యాపినీం
వీణాపుస్తకధారిణీమభయదాం, జాడ్యాంధకారాపహామ్ । 
హస్తే స్ఫాటికమాలికాం విదధతీం, పద్మాసనే సంస్థితాం 
వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదామ్ ||

ప్రతిపదార్థ తాత్పర్యము:

యా = ఎవరు, కుంద = ముద్దమల్లె (వలె), తుషార = మంచు (వలె), హార = హారము, ధవలా = తెల్లదనము గలదో, యా = ఎవరు, శుభ్ర = తెల్లని, వస్త్రావృతా = వస్త్రములతో చుట్టబడియున్నదో (ధరించినదో) యా = ఎవరు, వీణావరదండ = శ్రేష్ఠమైన వీణా దండము చేత, మండిత = అలంకరింపబడిన, కరా = చేతిని కలిగి ఉన్నచో, యా = ఎవరు, శ్వేత = తెల్లని, పద్మాసనా = పద్మము ఆసనముగా గలదో, యా = ఎవరు, బ్రహ్మ అచ్యుత శంకర = బ్రహ్మ, విష్ణువు, శంకరుడు, ప్రభృతిభిః = మొదలైన, దేవైః = దేవతలచే, సదా = ఎల్లప్పుడు, వందితా = నమస్కరించబడునదో, సా = ఆ (ఆమె), నిశ్శేష జాడ్యాపహా = అజ్ఞానమును పూర్తిగా తొలగించు, భగవతీ = సరస్వతీ, మాం = నన్ను, పాతు = రక్షించునుగాక.

మల్లెలు, చంద్రుడు, మంచువంటి, తెల్లని హారముతో తెల్లదనం గలది. తెల్లనైన శుభ్ర వస్త్రములను ధరించినట్టి, శ్రేష్ఠమైన వీణాదండము చేత అలంకరింపబడినట్టి చేతులు గలది. తెల్లని తామరపై ఆసీనురాలైనట్టిది, బ్రహ్మవిష్ణు మహేశ్వరాది దేవతల చేత సర్వదా నమస్కరించబడినది, అజ్ఞానమును నిశ్శేషముగా తొలగించునట్టి భగవతి, సరస్వతి నన్ను రక్షించుగాక.

శుక్లాం = తెల్లని దానిని, బ్రహ్మ విచార = బ్రహ్మజ్ఞాన సంబంధిత చర్చ యొక్క, సారపరమాం = అంతిమ సారమైనదానిని, ఆద్యాం - (సృష్టి కంతటికిని) మొదటిదైన దానిని, జగద్వ్యాపినీం = ప్రపంచమందంతటనూ వ్యాపించియున్న దానిని, వీణా=వీణను, పుస్తక = పుస్తకమును, ధారిణీం = ధరించిన దానిని, అభయదాం = అభయమొసంగు దానిని (భయము లేకుండా చేయుదానిని), జాడ్యాంధకారాపహం = అజ్ఞానపు చీకట్లను తొలగించుదానిని, హస్తే = చేతియందు, స్పాటిక మాలికాం = స్పటిక మాలతో, విదధతీం = ధరించిన దానిని, పద్మాసనే = పద్మాసనము నందు (పద్మమే ఆసనముగా), సంస్థితాం కూర్చొనియున్న (నెలకొనియున్న) దానిని, పరమేశ్వరీం = పరమేశ్వరిని, భగవతీం = భగవతిని, బుద్ధిప్రదాం = బుద్ధిని ప్రసాదించుదానిని, తాం = ఆ (ఆమెను), శారదాం = శారదామాతకు, వందే = నమస్కరించుచున్నాను.

తెల్లనిది, బ్రహ్మజ్ఞానమునకు సంబంధించిన చర్చల తుది సారమైనది. మొదటి నుండియు జగత్తంతా వ్యాపించియున్నట్టిది, వీణను, పుస్తకమును ధరించినట్టిది, అభయమునొసంగునది, అజ్ఞానాంధకారమును తొలగించునది, చేతియందు స్పటికమాలతో ప్రకాశించునది, పద్మాసనము నందు కూర్చొని యున్నట్టిది, బుద్ధినొసంగునట్టి, పరమేశ్వరి, శారదాదేవికి నమస్కారము.


3. హే హంస వాహిని జ్ఞాన దాయిని 
అంబ! విమల మతి దే! అంబ! విమల మతి దే॥ 
జగ శిర మౌర బనాయే భారత్ 
వహ్ బల విక్రమ దే
।।అంబ।।
సాహస శీల హృదయ మే భర దే 
జీవన త్యాగ తపోమయ కర దే 
సంయమ సత్య స్నేహ కా వర దే 
స్వాభిమాన్ భర దే 
।। హే।।
లవ కుశ ధ్రువ ప్రహ్లాద బనే హమ్ 
మానవతా కా త్రాస్ హరే హమ్ 
సీతా సావిత్రీ దుర్గా మా 
ఫిర్ ఘర్ ఘర్ భరదే !  
।। హే।।

హిందీ గీతము యొక్క తాత్పర్యము :

హంసను వాహనముగా గలది, జ్ఞానము నొసంగుదానివియైన ఓ మాతా నిర్మలమైన బుద్ధినిమ్ము.

భారతదేశమును ప్రపంచమునకు తలమానికముగా చేయగల బలపరాక్రములనిమ్ము, మాతా నిర్మలమైన బుద్ధినిమ్ము.


మా మనస్సులందు సాహసమును, శీలమును నింపుము, మా జీవనములను త్యాగ, తపములతో నింపివేయుము. ఇంద్రియములను అదుపులో నుంచుకొనునట్టి, సత్యమునే పలుకునట్టి, స్నేహపూర్వకముగా వ్యవహరించునట్టి వరమును ప్రసాదించుము, స్వాభిమానమును నింపుము.


మేము లవ, కుశ, ధ్రువ, ప్రహ్లాదులవంటి వారమగునట్లుగా, మానవత్వమునకేర్పడిన గ్లానిని తొలగించునట్లుగా, సీత, సావిత్రి, దుర్గామాత వంటి నారీమణులను యింటింటా నిండునట్లుగా చేయుము.

గాయత్రీమంత్రం - ప్రతిపదార్థ తాత్పర్యము:


ఓమ్ భూర్భువః స్వః | తత్సవితుర్వరేణ్యమ్ ||
భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ॥



భూః =సత్ (శాశ్వతము) భూలోక రూపము భువః =చిత్ జ్ఞానరూప), అంతరిక్షరూపము, స్వః = ఆనంద స్వరూప, సవితుః = సమస్త జగత్తును సృష్టించి, వరేణ్యం = మిక్కిలి శ్రేష్టమైన, భర్గః = జ్ఞాన శక్తియైన తేజమును, ధీమహి = ధ్యానింతుము, యః (భగవాన్) = సర్వేశ్వరుడవైన సూర్యుడు, నః = మాకు, ధియః = మంచి బుద్దులను, ప్రచోదయాత్ = ప్రేరేపించునో అట్టి సూర్యుని ధ్యానింతుము.

సచ్చిదానంద స్వరూపుడును సమస్త జగత్తును సృష్టించి ప్రకాశింప జేసే ఆ ప్రసిద్ధమైన సర్వోత్కృష్టమైన విజ్ఞాన స్వరూపుడైన సూర్యుడిని మేము నిత్యము ధ్యానింతుము, ఆ సర్వేశ్వరుడు మాకు మంచి బుద్దులను (సత్కర్మల వైపు) ప్రేరేపించును గాక.

భారతమాత స్తోత్రము యొక్క ప్రతిపదార్థ తాత్పర్యము:

రత్నాకరాధౌతపదాం హిమాలయ కిరీటినీమ్ ॥ 
బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారతమాతరమ్॥


రత్నాకర = సముద్రునిచేత, ధౌత = బాగా కడుగబడిన, పదాం = పాదములు గలదానిని, హిమాలయ కిరీటినీమ్ హిమాలయములు కిరీటముగా గలిగినదానిని, బ్రహ్మ రాజర్షి = బ్రహ్మర్షులు, రాజర్షులు మొదలగు, రత్నాఢ్యాం = రత్నాల వంటి వారితో ఒప్పుచున్నట్టి భారతమాతరం = భారతమాతకు, వందే = నమస్కరిస్తున్నాను.


సముద్రునిచే బాగా కడుగబడిన పాదములు గలది, హిమాలయము కిరీటముగా గలది. బ్రహ్మర్షులు, రాజర్షులు, అను మొదలగు పుత్రరత్నములచే సంపన్నురాలైనది అగు భారతమాతకు నమస్కారములు.

శాంతి మంత్రము:

ఓం ద్యౌశ్శాంతిః అంతరిక్షగం శాంతిః పృథివీ శాంతిః
ఆపః శాంతిః ఓషధయః శాంతిః వనస్పతయః శాంతిః 
విశ్వేదేవాః శాంతిః బ్రహ్మ శాంతిః సర్వగం శాంతిః 
శాంతిరేవ శాంతిః సా మా శాంతిరేధి-ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః

ద్యౌః = స్వర్గము (ఆకాశము), అంతరిక్షగం = సమస్తలోకాలకు నివాస స్థానమైన శూన్యము, పృథివీ = భూమి, ఆపః = జలము, ఓషధయః =ఫలించగనే నశించు వృక్షజాతులు, వనస్పతయః = పుష్పించకనే ఫలించు వృక్షజాతులు, విశ్వేదేవాః = పితృదేవతలకు హితులైన గణదేవతలు, (క్రతువు, దక్షుడు, వసువు, సత్యుడు, కాముడు, కాలుడు, ధూరి, విరోచనుడు, పురూరవుడు, మార్ధవనుడు, అను పది మంది దేవతలు), బ్రహ్మ = వేదము, జ్ఞానము, సామాః సామగానములు మొదలగునవి ఇవన్నియు శాంతించును గాక. ఆ శాంతి నా వైపు ప్రసరించుగాక.

ప్రారంభముననే ఈ ప్రార్ధన ఒక మంత్రమని చెప్పబడినది. కనుక ఉచ్చారణమున, స్వరమున జాగ్రత్త వహించవలసి యుండును.

అర్థమును గ్రహించి మనస్సును నిగ్రహించి చేయు ప్రార్థన సకలార్ధ ప్రదాయకమగును.










#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow