ఏనుగును రెండు దంతాలుంటాయి. కాని విఘ్నేశ్వరుడు ఏకదంతుడే. దీని వెనుక ఒక కథ
పరుశురాముడు తన తండ్రి జమదగ్నిని చంపిన క్షత్రియులందరినీ తుదముట్టిస్తానని ప్రతిజ్ఞపూనాడు. అలా అందరినీ సంహరించాక ఒకసారి శివుని దర్శించుకునేందుకు పరశురాముడు కైలాసానికి వచ్చాడు. ఆయనను బాలగణపతి
ద్వారం వద్దనే అడ్డగించాడు. లోపల శివపార్వతులు విశ్రాంతి తీసుకుంటున్నారని, కొద్ది సేపు వేచి వుండాలనికోరాడు. గణపతి నమ్రతగా చెప్పినా పరుశురాముడు వినలేదు. తన తల్లిదండ్రుల విశ్రాంతికి భంగం కలగనివ్వనని వినాయకుడు పట్టుబట్టాడు.
దానికి పరుశురాముడు ఆగ్రహం చెందాడు. బాలుడవు నీవా నన్ను అడ్డగించేది అని యుద్ధానికి దిగాదు. గణపతి తన తొండంతో పరుశురాముని తిప్పికొట్టగా, ఆయన తన గండ్రగొడ్డలిని గణపతిపై ప్రయోగించాడు.
గొడ్డలి తగిలి వినాయకుడి ఎదమ దంతం విరిగి కిందపడింది. ఆ శబ్దానికి పార్వతి, శివుడు ఉలిక్కిపడి దంతం విరిగిన వినాయకుని అక్కున చేర్చుకుని పరుశురముని పై ఆగ్రహించారు. "ఎంతో మహిమగల నా కుమారుడు వినాయకుడు తలచుకుంటే నీలాంటి వందమంది పరశురాముల్ని తుదముట్టించగలడు. అతని చేతిలో బతికి బైటపడటం నీ అదృష్టమే” అని పార్వతి పేర్కొంది.
పరుశురాముడు తన తప్పును తెలుసుకుని తనను క్షమించమని పార్వతీదేవిని. శివుడిని వేడుకున్నాదు. గణపతి గొప్పతనాన్ని తెలుసుకుని గణపతిని ఫల పుష్పాదులతో భక్తితో పూజించాడు పరుశురాముడు. అప్పటినుంచి గణేశుడు ఏకదంతుడయ్యాడు.
