15. శ్రావణమాస మహాత్మ్యము - 15వ అధ్యాయం - Sravana Masam
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

15. శ్రావణమాస మహాత్మ్యము - 15వ అధ్యాయం - Sravana Masam

P Madhav Kumar

 

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉

🍃🌷త్రయోదశీ వ్రత కథనం - చతుర్దశీ వ్రత కథనం:

(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l

దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll


🌻ఈశ్వర ఉవాచ:

సాంబమూర్తి  చెప్పుచున్నాడు…


ఓ సనత్కుమారా! త్రయోదశీ దినమందు చేయదగిన విధానమును చెప్పెదను వినుము. ఈ త్రయోదశీ వ్రతమునందు షోడశోపచారములచే మన్మధుని పూజింపవలయును.


ఆశోక పుష్పములు, మాలతీ పుష్పములు, పద్మములు, దేవప్రియ పుష్పములు, కుంకుమ పువ్వులు పొగడ పుష్పములు, మఱియు మత్తత కలిగించెడు నికర పుష్పములు, ఎఱ్ఱని అక్షతలు, పచ్చని గంధములు, శోభస్కరమగు సుగంధద్రవ్యంఋలు, బలకరమగు ద్రవ్యములు, రేతస్సును వృద్ధి చేసెడు ఇతర ద్రవ్యములు, మొదలగువానిచే మన్మధుని పూజించవలయును♪.


అనంతరము నైవేద్యము చేయవలయును♪. పిమ్మట తాంబూలమును ఇవ్వవలయును, తాంబూలములో ఉంచు ద్రవ్యములేవి అనగా... చికిని పోక చెక్కలు, కవిరి ఉండలు, జాజిపత్రి, జాజికాయలు, లవంగములు, ఏలకులు, ఎండిన కొబ్బరి యొక్క చిన్న చిన్న ముక్కలు, పచ్చకర్పూరము కుంకుమపువ్వు, మగధ దేశమందు పుట్టినటువంటివి, బంగారు వంటి వర్ణము కలవి గాని, తెల్లని వర్ణము కలవిగాని, ఎర్రగా నుండునవి గాని, మృదువైనవియు, దృఢమగు తమలపాకులతో కూడ తాంబూలమును ముఖమునందు సువాసన కొఱకు ఇయ్యవలయును.


మైనముతో నిర్మింపబడిన వత్తులతో మన్మధునకు దీపమునిచ్చి పిమ్మట పుష్పాంజలులను సమర్పింపవలయును.


ఆ మన్మధుని నామములను స్మరించుచు ప్రార్ధన చేయవలయును♪. కావున, ఆ మన్మధుని నామములను నీకు చెప్పెదను♪.  సమస్తమైనవారికంటె అధికమగు సౌందర్యము కలవాడును, విష్ణుమూర్తి కుమారుడును, ప్రద్యుమ్నుడను పేరుగల మన్మ ధుడు నన్ను రక్షించుగాక.


మీనకేతన, కందర్ప, అనంగ, మన్మధ, మార, కామ, ఆత్మసంభూత, ఝుష కేతు, మనోభవ* ఆను నామములచే జెప్పబడు మన్మథుడు నన్ను రక్షించుగాక. 


రతీదేవిని ఆలింగనము చేసికొనుటవలన ఆమె ఉన్నతమగు కుచములందు కస్తూరిచే అలంకరింపబడిన మకరికాపత్ర రచనలు మన్మధుని భర్త స్థలంబునందు చిహ్నితములైనవి అట్టిమనోహరుడుగు నన్ను రక్షించుచుండుగాక.


పుష్పములు ధనస్సుగా గలవాడును, శంబరాసురునకు శత్రువును, పుష్పములు బాణములుగా గలవాడును, రతీదేవికి పెనిమిటియు, మకరము ధ్వజముగా గలవాడును, అయిడుపుష్పములు బాణములుగా గలవాడును, సుందరుడునగు మన్మధుడు నన్ను రక్షింపుచుండుగాక.


దేవతుల యొక్క కార్యమును సాధించుటకు నీవు సాంబమూర్తి యొక్క తపోవిఘ్నము జేయగా, నిన్ను తృతీయ నేత్రాగ్నిచే భస్మము చేసెను, కావున నీవు చేయునట్టి కృత్యములనన్నియు పరోపకారమునే చెప్పుచున్నవి.


నీకు యుద్ధమునందు వసంతుడు సహాయుడు అనుట మాటమాత్రమేగాని నీవు స్వయముగానే జయింప గలవాడవు. నీ మనస్సును సంతోష పెట్టుటయందు దేవేం ద్రుడు రాత్రింబగలును ప్రయత్నము చేయుచుండును.


ఎందువలననగా, ఎవరైనను కఠినముగ తపస్సు చేయగా తన ఇంద్రపదవిని కోరుదురనే భయముచే వారి తపోవిఘ్నము చేయుటకు ఎల్లప్పుడు నీ సహాయమును కోరుచుండును. నీకంటె ఇతరమగు మఱియొకడు థైర్యముకలవాడై ఎవడును సాంబమూర్తితో విరోధము పెట్టుకోగలవాడగును.


బ్రహ్మానందముతో సమానమగు ఆనందమును కలిగించుటయందు నీ కంటె ఇతరుడెవడును లేడు. ప్రపంచమును మోహింపచేయునట్టి సేనలలో నీతో సమానమగు పరాక్రమము కలవాడులేడు.


అనిరుద్ధునకు తండ్రియు, కృష్ణమూర్తి కుమారుడును, దేవతలకు ప్రభువును మరియు పర్వతము వలన పుట్టిన మంచిగంధము, అగరు మొదలగు వానిచే పరిమళించువాడవునై యుంటివి.


శరత్కాల చంద్రుడు సహాయముగా గలవాడును ప్రపంచోత్పత్తికి కారణుడును అగు ఓవమన్మధుడా! ప్రపంచమును జయించుటయందు మలయమారుతము నీకు సహాయము.


ఓ స్వామీ! నీ యొక్క బాణము మిక్కిలి గొప్పదియు, వ్యర్ధముకానిదియు మిక్కిలి దూరప్రదేశమునకైనను వెళ్లునదియు, ఎంతమాత్రమును దయలేకుండా మర్మములను నొప్పించునదియు, ఎచ్చటను అడ్డు లేనిదియు, మృదువైనను తన పేరును వినినంత మాత్రముననే అమితమగు మనోవ్యాధిని కలిగించునదియు తనకు సమానమగు పదార్ధమును చూచినంత మాత్రముననే పొందుటకు సాధనమైయుండను.


ప్రపంచమును జయించుటకు మనుష్యుల యొక్క అలంకారమే నీకు ముఖ్యమగు సాధనము. ఓ ప్రభువా! గొప్పవారగు సమస్తమైన దేవతలను నీవు పరిహరించుచున్నావు.


నీకు అందరును లోబడిరి, అది యే విధముగాననగా... బ్రహ్మదేవుడు తన కూతురు యందు వాంఛగలవాడాయెను, విష్ణుమూర్తి బృంద యను స్త్రీ యందు ఆసక్తి గలవాడాయెను, సాంబమూర్తి పరభార్య రతుడగుట వలననే ఆయనను స్పృశింపగూడదు అనిరి, మఱియు తన శక్తి యందే బహుకాలము సంభోగము చేసెను, దేవేంద్రుఁడు దుష్ట ప్రవర్తన కలవాడై గౌతమ మునీశ్వరుని భార్యతో సంభోగించెను, ద్విజులకు రాజు అని చెప్పబడుచుండెడి చంద్రుడును తన గురువగు బృహస్పతి యొక్క భార్యను బలాత్కారముగానే తీసుకొని వెళ్లెను, విశ్వామిత్ర మునియు అనేక పర్యాయములు తపోభ్రష్టుడై యెట్టిదుష్కృత్యములు చేయలేదు.


ఓ మన్మధుడా! యీ మొదలగువారిని కొందరినే ముఖ్యమగు వారిని జెప్పితిని, విశేషముగా చెప్పవలయుననిన మితియే లేదు కావున, నీ పుష్పబాణములకు లోబడక జితేంద్రియులగువారు కొంచెముగానే యుందురు.


ఓ స్వామీ! అందువలన నే జేసిన యీ పూజచే, నీవు నన్ను అనుగ్రహింపుము♪. శ్రావణశుక్ల త్రయోదశీ యందు మన్మధుని పూజించిన యెడల ప్రవృత్తిమార్గము నందు కోరిక గలవానికి వీర్యమును బలమునిచ్చుచున్నాడు, అపేక్షారహితునకు వికారములను పోగొట్టుచున్నాడు.


కోరికలు గలవాడై మన్మధుని శ్రావణమాసములో పూజించినయెడల మన్మధుడు సంతోషించినవాడై, ఉన్నతమగు కుచములు కలవారునూ, శరత్కాలము నందు సంపూర్ణుడగు చంద్రుని వంటి ముఖము గలవారును, పద్మములవంటి నేత్రములు కలవారును, పొడవైన మృదువగు నల్లని వెంట్రుకలు ముంగురులు కలవారును, చక్కని ముక్కు కలవారును, ఆరటి స్తంబముల వంటి తొడలు కలవారును, రమ్యమగు పిక్కలు కలవారును, ఏనుగు నడకలను మించిన నడక గలవారును, రమ్యములగు రావియాకుల వంటి యోనులు కలవారును, పెద్దవియగు పిరుదులు కలవారును, శంఖము వంటి కంఠము కలవారును, చక్కని మొలచే ప్రకాశించువారును, దొండపండు వంటి ఆధరోష్టము కలవారును, సింహ నడుము వంటి నడుము కలవారును, ఆనేకమగు అలంకారములచే ప్రకాశించువారును, మనోహరులగు స్త్రీలను భార్యలనుగా సమకూర్చును.


మఱియు శుక్ల పక్ష త్రయోదశి యందు పూజించినయెడల చిరకాలం జీవించువారును, మంచిగుణములు కలవారును, సుందర రూపులును, యోగ్యులునగు అనేక పుత్రులను ఒసగువాడగును.  


ఓ మన్మధుడా! త్రయోదశి యందు చేయతగినదియు, శుభప్రదమగు కృత్యమును చెప్పితిని, ఇకముందు చతుర్దశి యందు జేయతగిన కృత్యమును చెప్పెదను.


ఓ మునీశ్వరుడా! ఆష్టమి యందు దేనిని గుఱించి పవిత్రారోపణ వ్రతమును చెప్పితినో... అప్పుడు ఆ వ్రతమును చేయకుండినట్లైన యెడల చతుర్దశి యందు చేయవలయును.


చతుర్దశి యందు చేసినప్పుడు సాంబమూర్తికి పవిత్రమును అర్పించవలయును. పవిత్రవిధానమంతయు దేవిని గుఱించియు, విష్ణుమూర్తి గుఱించియు చెప్పిన విధముగానే జరుపవలయును. ప్రార్ధనాదులయందు చెప్పతగిన నామముల విషయమై శైవ శాస్త్రములయందు జాబాలాదులచే చెప్పబడిన గ్రంధములందునున్న రీతిగాను మఱియు వాటికి అనుసరణగా తనకు గలిగిన ఊహ ప్రకారముగాను కల్పన చేసి చెప్పవలెను. 


ఇక్కడ కొంచెము విశేషము కలదు, దానిని చెప్పెదను వినుము. పదకొండు పోగులు గాని, ముప్పది యెనిమిది పోగులుగాని, యేబది పోగులు గాని పవిత్రమునకు పోయవలయును. ముడులు సమాన యెడము కలుగునట్లుగానే ముడి వేయవలయును, పండ్రెండు అంగుళములు గాని, ఎనిమిది అంగుళములు గాని, నాలుగు అంగుళములు గాని పొడవు యుండునట్టి లింగమును పూజింపవలయును. శివుని సంతోషము కొఱకు పూజావిధియంతయు పూర్వము చెప్పబడిన రీతిగానే చేయవలయును.


ఓ చిన్న వాడా! దీనికి కలుగు ఫలమంతయు పూర్వము చెప్పబడిన విధముగానే కలుగును. కాఁబట్టి, ఇదియంతయు నీకు చెప్పితిని మఱియు ఏదియైనను వినుటకు కోరిక కలిగిన యెడల దానిని అడుగుము చెప్పెదను, అని సాంబమూర్తి సనత్కుమారునితో చెప్పెను.


♦️ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర సనత్కుమార సంవాదే “త్రయోదశీ వ్రత కథనం", "చతుర్దశీ వ్రత కథనం" నామోధ్యాయస్సమాప్తః.  


ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏


🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow