26. శ్రావణమాస మహాత్మ్యము - 26వ అధ్యాయం - Sravana Masam
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

26. శ్రావణమాస మహాత్మ్యము - 26వ అధ్యాయం - Sravana Masam

P Madhav Kumar

 

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉

🍃🌷శ్రావణ అమావాస్య పోలా వ్రతం:

(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l

దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll   


🌻ఈశ్వరుడు చెప్తున్నాడు:

శ్రావణ అమావాస్యనాడు ఆచరించాల్సిన పోలా వ్రతం విధికి సంబంధించిన కథ చెప్తాను.


ఒకప్పుడు అత్యంత పరాక్రమం కలిగి లోకకంటకులైన రాక్షసులతో మహాయుద్ధం జరిగింది. నేను వృషభం (నంది)పైఉండి సంగ్రామంలో పాల్గొన్నాను. అంధకాసురునితో యుద్ధం జరిగిన సమయంలో నంది దేహానికి చాలా దెబ్బలు తగిలాయి. చర్మం కూడా అనేకచోట్ల ఛేదింపబడి చాలా రక్తం కూడా వచ్చి ప్రాణం మాత్రమే మిగిలిన దేహంతో ఉన్నప్పటికీ ధైర్యంగానే ఉంటూ అంధకాసురుని, ఇతర దైత్యులను సంహరించే వరకు నాకు సహకరిస్తూనే ఉంది. అంధకాసురుని వధించాక నేను ప్రసన్నుడనై నందితో, “నీ స్వామిభక్తికి, పరాక్రమానికి చాలా సంతోషించాను. నీ దేహం ఛిద్రాలు ఏమీలేకుండా మునుపటి కంటే మరింత దృఢంగా, శక్తిమంతంగా ఉండేలా చేస్తాను. 


అంతే కాకుండా మరేమైనా వరాలు కోరుకో... ఆనందంగా ఇస్తాను" అని చెప్పాను. దానికి నందీశ్వరుడు, "ఓ దేవదేవ! మహేశ్వర! నువ్వు నా పట్ల ప్రసన్నుడవు కావడమే పెద్ద వరం. అంతకంటే ఏమి కావాలి? అయినా లోకోపకారం కోసం ఒక వరం కోరుకుంటున్నాను. నువ్వు నా పట్ల ప్రసన్నుడవైన ఈ రోజు శ్రావణ అమావాస్య. ఈ తిథి నాడు మానవులు గోవుతో కలసి ఉన్న వృషభ ప్రతిమను మట్టితో చేసి పూజించాలి. ఈ రోజున జన్మించిన ధేనువు కామధేనువుతో సమానమవ్వాలి. 


ఈ విధంగా పూజించినవారి కోరికలు తీరుస్తానని నువ్వు వరం ఇవ్వాలి. మట్టిప్రతిమలలోనే కాక ప్రత్యక్షంగా గోవులను, వృషభాలను ఈ రోజు పూజించాలి. బంగారం మొదలైన వివిధ ధాతువులతో గోవృషభాలను అలంకరించాలి. అనేక రంగులతో చిత్రితమైన వస్త్రాన్ని సమర్పించాలి. చక్కటి ధ్వనిని కలిగించే గంటను మెడకు కట్టాలి.


సూర్యోదయమైన నాలుగు ఘడియల తరువాత ఆవును ఊరివెలుపలకు మేతకు తీసుకువెళ్ళి మరల సాయంత్రం ఊరిలోకి తీసుకురావాలి. ఆహారంగా గోవులకు పుష్టిని కలిగించే నువ్వులు మొదలైన వివిధ పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. దానివల్ల గోధనం అభివృద్ధి చెందుతుంది. 


ఏ ఇంటిలో గోసంపద ఉండదో అది శ్మశానంతో సమానం. ఆవుపాలు లేకుండా పంచామృతం, పంచగవ్యాలు తయారు కావు. గోమయంతో లేపనం కాని ఇల్లు పవిత్రం కాజాలదు. ఎక్కడ అయితే గోజలం(గోమూత్రం) చిలకరింపబడదో అక్కడ చీమలు మొదలైన కీటకాల బాధ ఉంటుంది. ఆవుపాలు లేకుండా ఆహారంలో పుష్టి ఏముంటుంది? ఓ ప్రభో! నా యందు నీకు దయ కలిగినట్లైతే నేను కోరిన ఈ వరాలను ప్రసాదించండి అని అడగగా నేను ప్రసన్నుడనై, "ఓ వృషభశ్రేష్ఠా! నువ్వు కోరినవన్నీ ప్రసాదిస్తాను. ఈ రోజున వృషభాల చేత శ్రమ కలిగించే పనులు చేయించరాదు. 


ఈ రోజు కేవలం తినడానికి గడ్డి, త్రాగడానికి కావలసినంత నీటిని ఇస్తూ వృషభాలు హాయిగా ఉండేలా చూసుకున్నవారు మహావీరులు, బలవంతులు కాగలరు. అలాంటివారిని ‘పోల' అని అంటారు. కాబట్టి ఈ రోజు 'పోలా' అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది. ఈ రోజు బంధుమిత్రులతో కలిసి మహోత్సవం చేసుకోవాలి.


🌻కుశగ్రహణవిధి:


శ్రావణ అమావాస్యనాడు పవిత్రంగా వెళ్ళి దర్భలను కోసుకొని తీసుకురావాలి. ఈ రోజు తెచ్చిన దర్భలను ఎన్నిరోజులు వాడుకున్నా అవి పవిత్రంగానే పరిగణింప బడతాయి. ఈశాన్యం వైపు తిరిగి, “విరించినా సహోత్పన్న పరమేష్ఠీనిసర్గజ, నుద పాపాని సర్వాణి దర్భ స్వస్తికరోభవ" అని ప్రార్థించి 'హుంఫట్ ' అని పలికి దర్భలను తియ్యాలి. అగ్రభాగాలు భిన్నము కానివి, ఎండిపోకుండా ఉన్నవి తియ్యాలి. ఆకుపచ్చగా ఉన్నవి పితృకర్మలకు ఉపయోగించాలి. మూలాలు లేకుండా ఉన్నవి దేవకార్యాలకు, జపాలకు ఉపయోగించాలి. ఏడు ఆకులున్న దర్భలు దేవ- పితృకార్యాలకు శ్రేష్ఠమైనవి. మూలభాగం లేకుండా అగ్రములు ఉండి, పది అంగుళాల పరిమాణం కల రెండు దర్భలు పవిత్రాలుగా ఉపయోగపడతాయి.


బ్రాహ్మణులకు నాలుగు దర్భలను కలిపి పవిత్రం చెయ్యాలి. ఇతరులకు క్రమంగా మూడు, రెండు, ఒకటిగా దర్బలను పవిత్రాలుగా చెయ్యాలి. లేదా అన్ని వర్ణముల వారికి రెండు దర్భలను కలిపి ముడి వేసి పవిత్రములుగా ఉపయోగించవచ్చు. 


ఈ పవిత్రాలు ధరించడానికి ఉపయోగపడతాయి. ఉత్పవనం కోసం రెండు దర్భలు ఉపయోగించాలి. ఏబది దర్భలతో బ్రహ్మను, ఇరువది అయిదు దర్భలతో విష్టరుని నిర్మించాలి. ఆచమనం చేసేటప్పుడు పవిత్రాన్ని తీసెయ్యరాదు. వికిరపిండం పెట్టేటప్పుడు, అగ్నౌకరణం చేసిన తరువాత, పాద్యం ఇచ్చిన తరువాత పవిత్రాన్ని విడిచిపెట్టాలి. దర్భతో సమానమైన పుణ్యప్రదమైన, పవిత్రమైన, పాపనాశకమైన వస్తువు మరొకటి లేదు. దేవకర్మ, పితృకర్మ - రెండిటికీ దర్భలను ఉపయోగించాలి. 


అందులోనూ శ్రావణ అమావాస్యనాడు తీసిన దర్భలు మరింతగా పవిత్రతను సంతరించుకుంటాయి.


♦️శ్రీ స్కాందపురాణంలో ఈశ్వర సనత్కుమార సంవాదరూపంగానున్న శ్రావణమాస మాహాత్మ్యమందు ఇరువది ఆరవ అధ్యాయము సమాప్తము.     


ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏


🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow