*🌼ఆంజనేయస్వామి గురించి కొన్ని విశేషాలు🌼*

P Madhav Kumar


ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక రోజులు - శనివారం, మంగళవారం మరియు గురువారం.


*పురాణ కథ ప్రకారం*

ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, ఎగురవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే ఏడున్నర యేళ్ళ శనిదోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శని వారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చు.


*స్వామికి ప్రీతి పాత్రమైన పువ్వులు:*


1. తమలపాకుల దండ:

ఒక కధ ప్రకారం, అశోక వనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట, దగ్గరలో పువ్వులు కనిపించక! అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు.


2. మల్లెలు:

గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చెయ్యడం చాల శ్రేష్టం.


3. పారిజాతాలు:

స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాల ప్రీతి. అందుకే పారిజాతంపూలతో పూజ చేస్తారు.


4. తులసి:

తులసి రాములవారికి ప్రీతిపాత్రమైనది, అందుకే హనుమంతునికికూడా ఇష్టమైనది


5. కలువలు:

కలువ పువ్వులు కూడా శ్రీరాములవారికి ఎంతో ఇష్టమైన పూలు. కేరళలోని ఇరింజలకుడలో భరతునుకి ఒక దేవాలయం వుంది. అందులో అతనికి కలువ పూల మాల వెయ్యడం సాంప్రదాయం. శ్రీరాములవారికి హనుమంతుడు మరియు భరతుని మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత, హనుమత్ స్వామికి కూడా కలువ మాల వేస్తారు.


*పంచముఖ హనుమాన్:*


శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. ఈ పంచముఖముల వివరాలు ఇలా చెప్పబడ్డాయి.


1 తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త శుద్దిని కలుగ చేస్తాడు.


2 దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.


3 పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు.


4 ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.


5 ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, బిడ్డలను ప్రసాదిస్తాడు.


*హనుమంతుడి సందేశం ?*


హనుమంతుడంటే ఒక అంకితభావం. బుద్ధిబలం, స్థిరమైన కీర్తి, నిర్భయత్వం, వాక్ నైపుణ్యం – వీటన్నింటి సమ్మేళనం. అంటే ఈ లక్షణాలన్నింటికీ అసలైన సిసలైన ఉదాహరణ హనుమంతుడు అని భావం. సముద్రంలో నూరు యొజనాల దూరాన్ని ఒక గోవు గిట్ట చేసిన గుంటలోని నీళ్లను దాటినట్లుగా దాటడం, విశ్వవిజేతలైన రాక్షస వీరుల నేకులను దోమల్లాగ నలిపి వేయటం, బంగారు మేడల లంకా నగరాన్ని తన తోకకున్న మంటతో భస్మీపటనం చేయటం – ఇవన్నీ హనుమంతుడి వీరత్వాన్ని లోకానికి తెలియజేసిన అనేక సంఘటనల్లో కొన్ని మాత్రమే.


హనుమంతుడు సాటిలేని బలం కలవాడు, మేరు పర్వతం లాంటి శరీరం కలవాడు, రాక్షసజాతి అనే కారడవిని కాల్చివేసిన కారు చిచ్చులాంటి వాడు అంటూ ఇంతా చెబితే – సముద్రమంత ఉన్న అతడి శక్తిలో నీటిబొట్టంత చెప్పినట్లు లెక్క. సముద్రాన్ని దాటడానికి లేచిన హనుమంతుడు అంగదాది వీరులతో ‘నేను లంకా నగరానికి వెళుతున్నాను. ఎప్పటికి తిరిగి వస్తానో చెప్పలేను గానీ, సీతమ్మ జాడను కేవలం తెలుసుకోవటం కాదు – ఆ తల్లిని చూసే వస్తాను. ఇది తథ్యం. నా రాక కోసం ఎదురుచూస్తూ ఉండండీ' అన్నాడు. కర్తవ్య నిర్వహణ కోసం వెళుతున్న ఏ ఉద్యోగికైనా, ఏ వ్యక్తికైనా ఉండవలసిన మొట్టమొదటి లక్షణమిదే! ఆత్మ ప్రత్యయం. ఆత్మ విశ్వాసం. ఇదే విజయానికి తొలి మెట్టు. ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం.


‘నీ వెవరివీ' అని ఎవరైనా అడిగితే హనుమంతుడు తన గురించి తాను చెప్పుకొనే మొదటి మాట –


‘నేను కోసలేంద్రుడి దాసుడి'ని.


కొంచెం వివరంగా చెప్పమంటే ‘ఎంత అసాధ్యమైన కార్యాన్నయినా అనాయసంగా నెరవేర్చగలిగిన శ్రీరామచంద్రుడి సేవకుడినీ అంటాడు.


మనం మన సంస్థ తరపున మరోక సంస్థకు వెళ్ళినపుడు మనల్ని పరిచయం చేసుకోవలసిన విధానమిదే! ‘నేను ఈ విధమైన ప్రశస్తి కలిగిన ఈ సంస్థకు సంబంధిచిన ఉద్యోగిని. నా పేరు ఫలానా…. మన వలన సంస్థకూ, సంస్థ వలన మనకూ కీర్తి రావటమంటే ఇదే! ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం.


‘వినయం వల్లనే వ్యక్తిత్వం రాణిస్తుంది' అనేదానికి హనుమంతుడే నిదర్శనం. ఆయన సముద్రాన్ని దాటి ‘అబ్బా! ఇది సామాన్యమైన పని ఏమి కాదూ. మాలో ఏ నలుగురో ఆయిదుగురో దీనికి సమర్ధులు అంటూ సుగ్రీవుడి పేరు, మరొక ఇద్దరు ముగ్గిరి పేర్లు చెప్పి, చిట్టచివరనే తన పేరుని చెప్పుకొన్నాడు. మనకంటే పెద్దవాళ్ళు మన బృందంలో ఉన్నప్పుడు మనం ఎంత గొప్పవాళ్ళమైనా వారి పేర్ల తరవాతే మన పేరు చెప్పుకోవటమే బెట్టుగా ఉంటుంది. ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం. మనకన్న అధికులముందు అణిగిమణిగి ఉండటం మనకు అవమానమేమి కాదు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat