గురుముఖతః నేర్చుకోవాలి

P Madhav Kumar


ఒకనొక పట్టణంలో ఒక చిరుద్యోగి ఉండేవాడు. అతడికి కొత్తగా పెళ్లి అయింది. భార్య కాపురానికి వచ్చిన రోజే.. ఆమెకు వంట రాదని తెలిసింది. ఆయనకూ వంట రాదు. ఏమి చేయాలో తోచక.. రోజూ పట్టణంలోని ఒక హోటల్‌లో భోజనం తెప్పించుకునేవారు. రోజులు గడుస్తున్నాయి. భోజనానికి అయ్యే ఖర్చు ఎక్కువైపోయింది. ఇలా లాభం లేదనుకున్నారు. ఎలాగైనా వంట నేర్చుకోవాలని కంకణం కట్టుకున్నారు.

ఒక వంటల పుస్తకం తెచ్చుకొని ఇద్దరూ పూర్తిగా చదివారు. ఒక మంచి రోజు చూసి.. ఇంట్లో వంట ప్రారంభించారు. ముందుగా అన్నం వండాలని నిశ్చయించుకున్నారు. పుస్తకంలో చూడగా.. ‘రెండు గ్లాసుల బియ్యం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో నాలుగు గ్లాసుల నీళ్లు పోయాలి. దానిని పొయ్యి మీద ఉంచాలి’ అని ఉంది. ఆ ప్రకారంగానే చేశారు. అరగంట దాటినా.. బియ్యం ఉడుకు పట్టలేదు. గంట దాటుతోన్నా.. ఒక్క మెతుకూ ఉడకలేదు. పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా చేసినా.. అన్నం ఎందుకు కాలేదనుకున్నారు.


ఇంతలో ఆ ఉద్యోగి స్నేహితుడు వాళ్లింటికి వచ్చాడు. దంపతుల ముఖాల్లో కలవరం చూసి.. విషయం ఆరా తీశాడు. జరిగింది చెప్పగా.. వంటింట్లోకి వెళ్లి చూశాడు. పొయ్యి మీద గిన్నె, గిన్నెలో బియ్యం, అందులో నీళ్లు పోశారు గానీ, పొయ్యి వెలిగించడం మర్చిపోయారు. ‘మంట లేకుండా.. అన్నం ఎలా అవుతుంది?’ అన్నాడు స్నేహితుడు. ‘ఆ విషయం పుస్తకంలో లేదుగా!’ అని అమాయకంగా ప్రశ్నించారు దంపతులు. ‘పుస్తకంలో లేదని ఇలాంటి విషయాలు గుర్తించకపోతే ఎలా? కొన్ని విషయాలు పుస్తకాలపై ఆధారపడటం కన్నా.. అనుభవజ్ఞుడైన వ్యక్తి దగ్గర నేర్చుకోవడం మంచిది. అప్పుడు పద్ధతులు, ఆచరణాత్మక ప్రయోగాలు చక్కగా తెలుస్తాయి’ అని చెప్పి వెళ్లిపోయాడు స్నేహితుడు.


సామాన్య విద్యలకే… గురువు అవసరం అయినపుడు, అతి సూక్ష్మమైన ఆధ్యాత్మ విద్యకు గురువు ఆవశ్యకత ఎంతుందో తెలుసుకోవచ్చు. గ్రంథములు చదివినంత మాత్రాన ఆధ్యాత్మికత జ్ఞానం సిద్ధించదు. అందులోని విషయాలను సద్గురువు ద్వారా అభ్యసిస్తే అది పరిపూర్ణం అవుతుంది. ఆధ్యాత్మ విద్య.. ఆచరణాత్మకమైన విద్య. దానిని గురు ముఖంగా నేర్చుకుంటేనే సఫలీకృతులు అవుతారు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat