యాదగిరి గుట్ట / Yadagiri Gutta

P Madhav Kumar



*స్థల పురాణం*


ఆలయ ప్రవేశ ద్వారం

ఋష్యశృంగ మహర్షి , శాంతల పుత్రుడు యాదమహర్షి. ఈయన చిన్నతనం నుంచే హరి భక్తుడు. ఈయన ఆంజనేయస్వామి సలహా మీద ప్రస్తుతం యాదగిరిగా పిలవబడుతున్న ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశారు. అప్పుడు ఒక రాక్షసుడు ఆహార అన్వేషణలో అటుగావచ్చి నిశ్చల తపస్సులో వున్న ఈ ఋషిని చూసి తినబోయాడు. ఆ విషయం తపస్సులోవున్న ఋషికి తెలియలేదుగానీ , ఆయన ఎపరి గురించైతే తపస్సు చేస్తున్నాడో ఆ హరికి తెలిసింది. ఆయన పనుపున సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసుని సంహరించింది. అది చూసిన ఋషి ఆ సుదర్శన చక్రాన్ని పలు విధాల ప్రార్థించి , భక్తులకు ఏవిధమైన బాధలూ కలుగకుండా దుష్ట సంహారం చేస్తూ అక్కడే వుండిపొమ్మని కోరగా ఆ సుదర్శనము అనతికాలములోనే అక్కడ వెలయబోవుచున్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ శిఖరాన షట్కోణాకారాన వెలసి స్వామి దర్శనానికి వచ్చు భక్తులను సదా కాపాడుతూ వుంటానని వరమిచ్చి అంతర్ధానమయ్యాడుట.


తర్వాత యాద మహర్షి తన తపస్సుని కొనసాగించాడు. ఆయన తపస్సుకి మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. యాద మహర్షి కోరిక మీద అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలిశాడు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరుమీద ప్రసిధ్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది , స్వామి ప్రత్యక్షమైంది కొండక్రిందవున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా ఉన్నాడు.


యాదగిరి గుట్ట శంఖ చక్ర నామాలు

ఈ క్షేత్రానికి సంబంధించి ఇంకొక కథ. ప్రహ్లాదుని రక్షించటానికి , అహోబిలంలో నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఆ భీకర రూపాన్ని శాంత పరచటం ఎవరికీ సాధ్యం కాలేదుట. అప్పుడు దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్ధిస్తే ఆవిడ ప్రత్యక్షమై స్వామిని శాంతింప చేసిందట. అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువై వుండమని కోరాడుట. అయితే స్వామి అతి భీకర రూపంలో దర్శనమిచ్చిన ఆ ప్రదేశంలో శాంత రూపంతో కొలువై వుండటం లోక విరుధ్ధమని అక్కడికి సమీపంలో వున్న యాదగిరిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి అర్చామూర్తిగా లోక కళ్యాణార్ధం కొలువు తీరుతానని బయల్దేరారు. లక్ష్మీ సమేతుడై కొండపై గల గుహలో వెలిశారు. ఆయనవెంట ప్రహ్లాదుడూ , సకల దేవతలూ వచ్చి ఆయనతోపాటు ఇక్కడ కొలువుతీరి స్వామిని సేవిస్తూ వచ్చారట.


రాక్షస సంహారంచేసి లోక కళ్యాణం చేశారని సంతోషంతో స్వామివారి కాళ్ళని బ్రహ్మదేవుడు ఆకాశ గంగతో కడిగాడుట. ఆ ఆకాశ గంగ లోయలలోంచి పారి విష్ణు పుష్కరిణిలోకి చేరింది. ఈ పుష్కరిణికి కూడా చాలా ప్రాముఖ్యం ఉంది. ఇందులో స్నానంచేసి స్వామిని సేవించినవారికి సకల కోరికలూ తీరుతాయి. ఇక్కడ పితృకార్యాలు చేస్తే పితృ దేవతలు తరిస్తారు.


యాదగిరి గుట్ట మండపం

చాలామంది భక్తులు ఆరోగ్యం , గ్రహపీడా నివారణ , వగైరా కోరికలతో కొన్నాళ్ళపాటు ఇక్కడ వుండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. అంతేగాక ఇప్పటికీ రోజూ రాత్రుళ్ళు ఆ చుట్టుప్రక్కల కొండలమీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానంచేసి స్వామిని అర్చిస్తారు. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పడు మృదంగ ధ్వనులు వస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారుట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు.


మెట్ల మార్గాన వెళ్తే దోవలో శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూగా వెలిశాడు. ఇంకో విశేషం ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించినవారి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం.


*యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రములో రెండు లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి.* పాత లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం. కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం.


మరొక కథనం ప్రకారం లక్ష్మీ నరసింహస్వామివారు మొదట పాత లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వెలసి తరువాత కొత్త లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయమునకు గుర్రముమీద వెళ్ళేవారు. మనము ఇప్పటికీ ఆ గుర్రపు అడుగులు ఆదారిన చూడవచ్చు. ఈ గుర్తులు పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం నుండి కొత్తలక్ష్మీనరసింహస్వామివారి ఆలయము వరకు ఉన్నాయి. పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయంనందు , ఆంజనేయ స్వామి వారి ఆలయము కూడా ఉంది. అక్కడ గోడ మీద ఉన్న చిత్రములు చాలా అద్భుతముగా ఉన్నాయి. అక్కడ నుండి కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయమునకు వెళ్ళు దారిలో ఆంజనేయ స్వామి వారి మరొక ఆలయము కూడా ఉంది. ఈ ఆలయగర్భగుడిలో స్వామివారి వద్ద నిత్యము ఒక జల ప్రవాహము ఉంది. ఆ జలముతోనే నిత్యం స్వామివారికి అభిషేకం చేస్తారు.


రాయగిరి రైల్వేస్టేషను ఇక్కడికి చాలా దగ్గరలో ఉంది. యాదగిరి బస్టాండుకు హైద్రాబాదు , వరంగల్ , నల్గొండల నుండి చాలా బస్సులు  ఉన్నాయి.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat