💥జనకుడు "శ్రీరాముడు"తో ఇలా అన్నాడు.....
ఇయం సీతా మమ సుతా సహ ధర్మ చరీ తవ |
ప్రతీచ్ఛ చ ఏనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా |
పతివ్రతా మహభాగా ఛాయ ఇవ అనుగతా సదా ||
రామయ్యా! నీకు సీత ఎవరో తెలీదు కదా,
ఇదుగో ఈమే సీత, ఈమె నా కూతురు.
నేను నీకు ఈమెని కామ పత్నిగా ఇవ్వడంలేదు,
నీతో పాటు ధర్మంలో అనువర్తించడానికని ఈ పిల్లని ఇస్తున్నాను, అందుకని ధర్మపత్నిగా స్వీకరించు రామా.
ఆడపిల్ల తండ్రిని కదా, అందుకని ఆనందంలో ఇన్ని మాటలు అనేశాను, కాబట్టి నన్ను క్షమించు,
ఈమెని నువ్వు పుచ్చుకో, నీ చేతితో మా అమ్మాయి అరచేతిని బాగా రాసి పట్టుకో (సూర్యవంశం వాళ్ళకి అరచేతిని అరచేతితో రాసి పట్టుకుంటే సుముహుర్తం, మనం జీలకర్ర-బెల్లం పెడతాం సుముహుర్తానికి),
ఈ క్షణం నుంచి మా అమ్మాయి ఏది చేసినా అది, నా భర్త అని నీ కోసమే చేస్తుంది.
రామ! మాది విదేహ వంశం, మాకు దేహమునందు భ్రాంతి ఉండదు, నా కూతురిని అలా పెంచాను.
ఒక ఏడాది తరువాత నా కూతురు నీతో కలిసి పుట్టింటికి వచ్చినప్పుడు నేను నేర్పిన సంప్రదాయాన్ని మరిచిపోతే, అది నీ వల్లే రామ, ఎందుకంటే నేను నేర్పినదాన్ని భర్త ఉద్ధరించాలి,
ఆ ఉద్ధరించడంలో పొరపాటు వస్తే అది నీదే అవుతుంది, ఆమె నిన్ను నీడలా అనుగమిస్తుంది.
[ఇదంతా పై శ్లోకం యొక్క రహస్యార్ధం.]
అలాగే లక్ష్మణుడికి ఊర్మిళతోను, భరతుడికి మాండవితోను, శత్రుఘ్నుడికి శృతకీర్తితోను వివాహం జరిపించారు.
అలా వివాహం జరగగానే, దివ్యదుందుభిలు మ్రోగాయి, పైనుండి పుష్పాలు పడ్డాయి.
దేవతలందరూ సంతోషించారు.
ఆ రోజూ జరిగిన సీతారాముల కల్యాణానికి సమస్త లోకాలు సంతోషించాయి.
మరునాడు ఉదయం విశ్వామిత్రుడు అందరిని ఆశీర్వదించి ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయారు.
జనక మహారాజు కానుకగా ఏనుగులు, గుర్రాలు, వస్త్రాలు, ముత్యాలు, పగడాలు మొదలైనవి ఇచ్చాడు.
అందరూ కలిసి అయోధ్య నగరం వైపుకి పయనమయ్యారు.
అప్పుడు అనుకోకుండా ఆకాశంలో పక్షులు భయంకరంగా కూస్తున్నాయి, నిష్కారణంగా దిక్కులలో చీకటి కమ్ముతోంది,
మంగళ ప్రదమైన వృక్షాలు నేలమీద పడుతున్నాయి, కాని మృగాలు మాత్రం ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి.
ఇదంతా చూసిన దశరథుడికి భయం వేసి, ఏమి జరుగుతోందని వశిష్ఠుడిని అడిగాడు.
ఆ శకునములను గమనించిన వశిష్ఠుడు, ఏదో దైవీసంబంధమైన విపత్తు వస్తోంది, కాని మృగములు ప్రదక్షిణగా తిరుగుతున్నాయి కనుక నువ్వు ఆ విపత్తుని అధిగమిస్తావన్నారు.
ఇంతలోపే ప్రళయకాల రుద్రుడు వచ్చినట్టు విష్ణు చాపాన్ని పట్టుకొని పరశురాముడు వచ్చి, నేను ఈ రోజే విన్నాను,
శివ ధనుస్సుని విరిచావంట,
నీ గురించి విన్నాను రామ, ఏమిటి నీ గొప్పతనం,
నువ్వు అంతటివాడివైతే ఈ విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టి బాణాన్ని నారిలో సంధించు అన్నారు.
ఈ మాటలు విన్న దశరథుడు హడలిపోయి, పరుగెత్తుకుంటూ పరశురాముడి దగ్గరికి వచ్చి.....
మహానుభావ! ఈ భూమండలం మీద ఉన్న క్షత్రియులపై 21 సార్లు దండయాత్ర చేశావు, క్షత్రియులందరినీ సంహరించావు.
ఇవ్వాళ హిమాలయాల మీద తపస్సు చేసుకుంటున్నావు.
లేకలేక నాకు పిల్లలు పుట్టారు. వివాహాలు చేసుకొని ఇంటికి వెళుతున్నారు. నన్ను క్షమించు అని దశరథుడు ప్రాధేయపడ్డా పరశురాముడు రాముడినే పిలిచి విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టమన్నాడు.
అప్పుడు రాముడు ఇలా అన్నాడు "పరశురామ! నువ్వు విష్ణు చాపం ఎక్కుపెట్టు, ఎక్కుపెట్టు అని నన్ను ఒక పనికిమాలిన వాడిగా ఇందాకటి నుంచి మాట్లాడుతున్నా ఎందుకు ఊరుకున్నానో తెలుసా, తండ్రిగారు పక్కనుండగా కొడుకు ఎక్కువ మాట్లాడకూడదు కనుక.
నేను తప్పకుండా ఎక్కుపెడతాను" అని ఆ విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టి, ఆ నారిలోకి బాణాన్ని పెట్టారు.
"నీ మీదే ఈ బాణ ప్రయోగం చేసి సంహరించగలను, కాని నువ్వు బ్రాహ్మణుడివి మరియు నా గురువైన విశ్వామిత్రుడికి నీకు చుట్టరికం ఉండడం చేత నేను నిన్ను సంహరించను.
కాని ఒకసారి బాణం సంధించిన తరువాత విడిచిపెట్టకుండా ఉండను, అందుకని నేను నీ గమన శక్తిని కొట్టెస్తాను" అన్నాడు.
అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు "రామ! నేను క్షత్రియులని ఓడించి సంపాదించిన భూమిని కశ్యపుడికి దానం చేశాను, అప్పుడాయన నన్ను రాత్రి పూట ఈ భూమండలం మీద ఉండద్దు అన్నాడు. ఇప్పుడు చీకటి పడుతోంది, కావున నేను తొందరగా మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్ళాలి.
నువ్వు నా గమన శక్తిని కొట్టేస్తే నేను వెళ్ళలేను, మాట తప్పిన వాడినవుతాను " అని అన్నాడు.
అయితే నీ తపఃశక్తితో సంపాదించిన తపోలోకాలు (తపస్సు) ఉన్నాయి, వాటిని కొట్టెస్తాను అన్నాడు. పరశురాముడు సరే అన్నాడు.
అప్పుడు పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న లోకాలని రాముడు కొట్టేసాడు. వెంటనే పరశురాముడు అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోతూ ఆయన, నువ్వెవరో నేను గుర్తుపట్టాను రామ, నువ్వు ఆ శ్రీమహావిష్ణువే, ఇక ఈ భూలోకంలో నా అవసరంలేదని మహేంద్రగిరి పర్వతాలవైపు వెళ్ళిపోయాడు పరశురాముడు.
దశరథుడు సంతోషంగా వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్ళాడు.
కౌసల్య, సుమిత్ర, కైకేయి ఎదురొచ్చి హారతులిచ్చారు. తమ కోడళ్ళని చూసుకొని మురిసిపోయారు.
అప్పుడు వాళ్ళని ఆ వంశ కుల దైవాలున్న దేవతా గృహాలకి తీసుకెళ్ళి ఇక్కడ పూజ చెయ్యాలని చూపించారు.
అలా ఆ నూతన దంపతులు హాయిగా క్రీడిస్తూ కాలం గడిపారు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️