ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు

P Madhav Kumar
స్వామియే శరణమయ్యప్ప

ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు

ఒకటి మనశ్శాంతి. రెండు సంతృప్తి.
ఈ రెండింటిని సంపాదించుకున్న వాళ్ళు ప్రతి క్షణం అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు.

సంపాదించుకోవటానికి కష్టపడక్కర్లేదు. ఎంతో ఆనందంగా సంపాదించుకోవచ్చు, కులదైవ
(ఇలువేలుపు) నామ స్మరణ చేస్తే చాలు. ఆ వెలకట్టలేని రెండు సంపదలనూ ఇస్తాడు.

ఆధ్యాత్మికత అనే సరస్సులో నామం అనే రాయి వేసి శబ్దం చేస్తే తరంగాలు మొదలవుతాయి. అవి మనసంతా వ్యాపించి శరీరమంతా నిండిపోతాయి, ఏ నామాన్నయితే మనం స్మరిస్తున్నామో ఆ దేవుడికి సంబంధించిన రూపాన్ని మన మదిలో నిలుపుతాయి. నామం ఆధ్యాత్మిక శబ్ద తరంగం.

”బెల్లం బెల్లం”అంటే బెల్లం రుచి మనకు తెలియదు. "తేనె తేనె” అంటే కూడా తేనె రుచి మనకు తెలియదు.

బెల్లాన్ని కొరికి తినాలి. తేనెను నోటిలో వేసుకొని చప్పరించాలి.అప్పుడే ఆ మాధుర్యం మనకు అనుభవమవుతుంది. దైవనామం, దైవం వేరు కాదు.ఆ పేరు స్మరించగానే అతడు మన దగ్గరుంటాడు.ఇది అనుభవైకవేద్యం.

నామం చెబుతాం. శబ్దం వినిపిస్తుంది. మన రూపంలాగా రూపం కనిపించదు. ఎంతకాలం నిరీక్షించాలి.ఎప్పుడు భగవంతుడు కనిపిస్తాడని సందేహం. అందుకే కొంతకాలం నామస్మరణ చేసి విసిగిపోయి విడిచి పెట్టేస్తారు. అక్కడే మనం నిలబడాలి. దైవం ఒక అనుభవం. ఇనుపముక్కను బాగా కాలిస్తే అందులోకి ఉష్ణం వ్యాపిస్తుంది.ఆ ఉష్ణం ఇనుపముక్క ఎంతవరకు విస్తరించి ఉందో అంతవరకు వ్యాపిస్తుంది. అందులో వేడి కనిపించకపోవచ్చు. ముట్టుకుంటే చుర్రుమనిపిస్తుంది. నామస్మరణతో మనసును పదేపదే భక్తిపూర్వకంగా సాధనలో ఉంచుతుంటే దేహమంతా ఆధ్యాత్మిక తరంగ ప్రవాహంగా మారిపోతుంది.

నామస్మరణ చేయగా చేయగా వెదురు ముక్క లాంటి శరీరం వేణువవుతుంది.బృందావనంలో శ్రీకృష్ణుడు ఆలపించిన నాదమవుతుంది. ముల్లోకాలూ తిరిగి ‘నారాయణా! నారాయణా!’ అని స్మరించే నారదుడి చేతిలో తంబుర అవుతుంది.

భక్తి-ప్రేమలను నింపి చేసే నామస్మరణకు మించిన యోగం లేదు.పూర్వజన్మ పుణ్యంవల్లనే ఆ భాగ్యం కలుగుతుంది.

దాన్ని దక్కించుకున్నవారు తుకారాం, త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు, ప్రహ్లాదుడు లాంటి భక్తులు. వారే సజీవ సాక్ష్యంగా కాలంలో నిలిచి నామ మాహాత్మ్యాన్ని విశ్వానికి చాటారు.

పురాణాల్లో శాస్త్రాల్లో చదివాము ఆ మహానుభావుల గురించి. మనం కూడా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు అందుకు సాధనయే తరుణోపాయం.

పూజ కోసం సామగ్రి కొనాలి, ఎన్నోకొన్ని నియమాలు పాటించాలి. వ్రతాలకు, నోములకు అయితే కఠోర నియమాలుంటాయి. యజ్ఞాలకు, క్రతువులకు శక్తియుక్తులుండాలి. శాస్త్రం తెలిసి ఉండాలి. దోష రహితంగా చెయ్యాలి. అందుకే కలియుగంలో నామస్మరణను మించింది లేదని చెప్పారు. ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మనసును లగ్నం చేసి నామం స్మరించుకోవచ్చు. పనికి ముందు, పనిచేసుకుంటూ నామస్మరణ, పని తరవాత మళ్ళీ నామస్మరణ చేస్తూ ఉంటే ఆ చేసే పని పవిత్రమవుతుంది.అందులోని దోషాలు హరించిపోతాయి.

ఆ విధంగా చేసే కర్మ భగవదర్పణ కర్మ అవుతుందని భగవద్గీత చెబుతోంది.

ఎవరి పేరు వాళ్లకు ఇష్టం.మనందరికీ మనల్ని సృష్టించినవాడి పేరు ఎందుకు ఇష్టంగా ఉండదు, తప్పక ఉంటుంది. భయంలో, బాధలో, సుఖంలో, సంతోషంలో పాలలో తేనెను కలుపుకొన్నట్లు జీవితంలో నామాన్ని కలుపుకోవాలి

దైవం ఎప్పుడూ మనతో కలవడానికి త్వరపడుతూనే ఉంటాడు. నామస్మరణ ఈ రోజు మొదలుపెడితే ఇప్పుడే ఆయన మనకు చేరువవుతాడు.

సందేహమే లేదు. నిరంతర భగవన్నామ స్మరణమేఆధ్యాత్మిక జీవితానికి బంగారుబాట.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat