పలుకే బంగారమాయెనా, కోదండపాణి పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయె పిలచినా పలుకవేమి
కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రీ
ఎంత వేడినగాని సుంతైన దయరాదు
పంతము సేయ నేనెంతటివాడను తండ్రీ
ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి
కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రీ
రాతి నాతిగ చేసి భూతలమున
ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రీ
శరణాగతత్రాణ బిరుదాంకితుడవుకాదా
కరుణించు భద్రాచల వరరామదాస పోష