🙏🙏🙏🙏🙏🙏🙏
ఒకసారి శివపార్వతులు ఆకాశమార్గంలో కాశీ నగరానికి వెళ్తున్నారు. వారికి గంగానదిలో అనేకమంది యాత్రికులు స్నానాలు చేస్తుండటం కనిపించింది. అది చూసి పార్వతీదేవి ఇలా అన్నది..
‘‘నాథా! ఇంతమంది గంగలో స్నానాలు చేస్తున్నారు కదా, నిజంగానే వారి పాపాలు తొలగిపోతాయా? అదే నిజమైతే అందరూ పాపాలు చేసి, వాటి ఫలితాన్ని అనుభవించకుండా గంగాస్నానం చేసి పోగొట్టుకుంటారు కదా’’ అని సందేహం వెలిబుచ్చింది.
ఈశ్వరుడు చిరునవ్వుతో ‘‘దేవీ! ఇప్పుడు నేను ఒకటి చెబుతాను. నీవు ఆ విధంగా చేయి. అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది’’ అంటూ ఆమె ఏమి చేయాలో చెప్పాడు. ఆ ప్రకారం పార్వతి, పండు ముతైదువ రూపం ధరించి, గంగలో మునిగిపోతున్న ఒక వృద్ధుణ్ణి చూపిస్తూ, ‘‘దయచేసి నా భర్తను కాపాడండి’’ అంటూ కేకలు వేయసాగింది. ఆ మాటలు విని చాలామంది గంగలో దూకి, ఆమె పతి ప్రాణాలను రక్షించేందుకు సిద్ధమయ్యారు. అది చూసిన వృద్ధురాలు ‘‘అయ్యా! నా భర్తకొక శాపం* *ఉంది. పాపాత్ములెవరయినా ఆయనను ముట్టుకుంటే వెంటనే ఆయన ప్రాణాలు పోతాయి. అదేవిధంగా ఆయనను తాకిన వారి తల బద్దలవుతుంది. కనుక మీలో పాపరహితులైన వారు మాత్రమే ఆయనను రక్షించేందుకు పూనుకోండి’’ అని హెచ్చరించింది.*
*ఆ మాటలు విని అందరూ వెనక్కి వెళ్లిపోయారు. ఒకే ఒక వ్యక్తి మాత్రం నదిలో దూకి, కొట్టుకుపోతున్న వృద్ధుడి రెక్క పుచ్చుకుని, తన వీపు మీద ఆయనను మోస్తూ, ఒడ్డుకు తీసుకు వచ్చాడు. వృద్ధురాలు అతనికి కృతజ్ఞతలు చెబుతూనే, నాయనా! నీవు ప్రాణాలకు తెగించి మరీ నా మాంగల్యం దక్కించావు. నీవు పాపరహితుడవా’’ అని అడిగింది.
ఆ వ్యక్తి ‘‘అమ్మా! నేను ఇంతకుముందే గంగా స్నానం చేసి పునీతుడినయ్యాను. అందుకే నీ పతి ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నించాను’’ అని చెప్పాడు. పార్వతీ పరమేశ్వరులు ఆ వ్యక్తికి దర్శనమిచ్చి, అంతులేని సంపదలను ప్రసాదించి తిరిగి వినువీధులలో విహరించసాగారు. ‘‘ చూశావా దేవీ! విశ్వాసం ఉంటే గంగ తప్పకుండా వారి పాపాలను ప్రక్షాళన చేస్తుంది’’ అన్నాడు పరమేశ్వరుడు. అర్థమైందన్నట్లుగా పార్వతి చిరునవ్వుతో తల పంకించింది. పని చేస్తుందా లేదా అని అనుమానంతో వేసుకుంటే ఔషధం కూడా పని చేయదు.*
దృఢవిశ్వాసంతో చేసే పని తప్పక ఫలితాలనిస్తుందన్నది నీతి...
శుక మహర్షి
మన భారతీయ బ్రహ్మర్షులలో శుక మహర్షికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సాధారణంగా శుక మహర్షి అని వినగానే శుక్ర మహర్షి అనుకుంటారు చాలామంది. కాని ఈ శుక మహర్షి పేరు వినగానే మనందరికీ గుర్తుకు వచ్చేది శ్రీ భాగవతం. తన తండ్రి అయిన వేదవ్యాసుడు రాసిన భాగవతాన్ని పరీక్షిత్తు మహారాజుకు ఏడూ రోజుల పాటు వినిపిస్తాడు శుకుడు.
ఇక శుక మహర్షి పుట్టుక విషయానికి వస్తే వేదవ్యాస మహర్షి ఎన్నో వందల సంవత్సరాలు తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకోమని అడిగితే, తనకి పంచభూతాలను పోలిన కొడుకు కావాలని వరం కోరాడు. అది విని తథాస్తు అన్న శంకరుని కృప వల్ల ఆరణి మథన సమయంలో ఘ్నతాచి అనే చిలుక కారణంగా శుకుడు పుట్టటం జరిగింది. అందువల్లే శుకుడి మొహం చిలుక ఆకారంలో ఉంటుందని కొందరి నమ్మకం.
కాంతులు వెదజల్లుతూ పుట్టిన శుక మహర్షికి పుట్టిన వెంటనే గంగ వచ్చి స్నానం చేయించింది, ఆకాశం నుంచి కూర్చోవటానికి కృష్ణాజినం, చేతి దండం వచ్చాయి, పార్వతితో కలిసి శివుడు వచ్చి ఉపనయనం చేసాడు. ఇంద్రుడు కమండలాన్ని, దేవతలు ఎప్పటికీ మాయని బట్టలని ఇచ్చి వెళ్ళారు.
శుక మహర్షికి పుట్టుకతోనే అన్ని వేదాలు వచ్చట. అయినా వేదవ్యాసుడు అతనిని బృహస్పతి దగ్గరకి పంపి విద్యాభ్యాసం చేయిస్తాడు. అతడు అన్నీ నేర్చుకుని తిరిగి తండ్రి దగ్గరకు వస్తాడు. అటు తర్వాత శుకుడిని జనక మహారాజు దగ్గరకి వెళ్లి మోక్షమార్గం గురించి తెలుసుకొని రమ్మని పంపుతాడు వేదవ్యాస మహాముని. మిథిలా నగారానికి వెళ్ళిన శుకుడిని జనకుడు అన్ని రాజలాంచనాలతో పాటుగా లోపలి తీసుకువెళ్ళి, వచ్చిన కారణం తెలుసుకుని అతనికి మోక్షమార్గం గురించి తెలియచేస్తాడు.
తరువాత శుకునకు వ్యాసమహర్షి సృష్టి రహస్యాలను తెలియచేస్తాడు. ఎన్నో పరమ రహస్య విషయాలను కూడా తెలియజేస్తాడు. తండ్రి ఆజ్ఞను అనుసరించి భూమండలాన్ని మొత్తం సంచరించాలని నిశ్చయించుకుంటాడు శుకుడు. అలా తిరుగుతున్న సమయంలోనే పరీక్షిత్తు మహారాజుని కలవటం జరుగుతుంది. తక్షకుడి విషంతో వారం రోజుల్లో మరణించేలా శాపాన్ని పొందిన అతడికి తన తండ్రి అయిన వేదవ్యాసుడు రాసిన భాగవత కథలని వినిపిస్తాడు. ఎక్కడా ఒక్కఅరగంట కూడా ఉండని శుకుడు పరీక్షిత్తు మహారాజు నగరంలో ఏడు రోజులు ఉండటానికి ఒప్పుకుని అతనికి మోక్షమార్గాన్ని చూపిస్తాడు.
ఎప్పుడూ దైవ చింతనలో మునిగిపోయి ఉండే శుకుడికి ఒంటి మీద బట్టలు కూడా ఉన్నాయా లేదా అనే స్పృహ కూడా ఉండేది కాదు. అంతలా ప్రతిక్షణం తపస్సులో మునిగి ఉండేవాడు.అతను నడిచి వెళ్తున్నప్పుడు పక్కన ఏమి జరిగినా అతనికి తెలిసేది కాదు. ఒక రోజు శుకుడు ఆకాశగంగ మార్గం నుండి వెళ్తున్నప్పుడు అందులో స్నానం చేసే అప్సరసలు అతనిని చూసి ఏ మాత్రం సిగ్గుపడరు, అక్కడ నుండి పారిపోరు. కాని అదే మార్గంలో అప్పుడే వెళ్తున్న వ్యాసుడిని చూసి గబగబా బట్టలు కట్టుకుని అతడిని చూసి సిగ్గుపడతారు. ఇది గమనించిన వ్యాసుడు కారణం అడిగితే శుకుడు ఎంత జ్ఞాని అయినా అతని మనసు అప్పుడే పుట్టిన పసిపిల్లవాడి మనసులాగా స్వచ్చమైనదని తెలియచేస్తారు. అది విన్న వ్యాసుడికి తన కొడుకు అంటే ఉన్న ప్రేమ రెట్టింపు అవుతుంది. అంత గొప్ప కొడుకుని కన్నందుకు ఎంతో గర్వపడతాడు. మరొకసారి దేవ వేశ్య అయిన రంభ శుకుని అందానికి ముగ్దురాలయి తనని అనుభవించమని అతనిని కోరుతుంది. కాని సున్నితంగా తిరస్కరిస్తాడు శుకుడు. ఈ వృతాంతాన్ని శుకరంభా సంవాదంలో చదవవచ్చు.
ఒక రోజు నారద మాహామునిని దర్శించుకున్న శుకుడు ఈ లోకంలో పుట్టినందుకు ఏమి చేస్తే మంచిదని అడుగుతాడు, అందుకు సమాధానంగా నారదుడు యోగసిద్ధి పొందటం మంచిదని చెపుతాడు. అది విన్న శుకుడు తన తండ్రి దగ్గరా, నారదుడి దగ్గరా సెలవు తీసుకుని కైలాస పర్వతం మీదకి వెళ్లి తపస్సు చేసి యోగసిద్ధిని పొందుతాడు. కొంతకాలం తరువాత నారదుడు శుకుడిని చూడటానికి వెళితే అతనికి ఆత్మయోగం గురించి చెప్పి ఆకాశంలోకి ఎగిరిపోతాడు శుకుడు. అలా వెళ్ళిపోతూ అక్కడున్న పక్షులతో, తన కోసం తన తండ్రి వచ్చి శుకా అని పిలిస్తే 'ఓయ్' అని పలకమని చెప్పి వెళ్ళిపోతాడు.
కొన్నాళ్ళ తరువాత ఎంతకీ కనిపించని కొడుకుని వెతుక్కుంటూ కైలాస పర్వత ప్రాంతంలో తిరుగుతూ శుకా అని పిలిచిన వ్యాసుడికి ఓయ్ అని వినిపించిందట. కొడుకుకోసం తపిస్తున్న వ్యాసుడిని చూసి శివుడు అతనిని ఓదార్చి నువ్వు కోరుకున్నట్టే నీకు ఎంతో ఉత్తమమైన కొడుకు పుట్టాడు. సృష్టి రహస్యం తెలిసిన నువ్వు ఇలా బాధపడటం మంచిదికాదని చెప్పి అతనిని తిరిగి ఆశ్రమానికి పంపిస్తాడు. శుకుడిని పోలిన తత్త్వజ్ఞుడు, యోగీశ్వరుడు, తపస్వి మూడు లోకాలలో మరొకరు లేరు. అంతటి మహనీయ మహర్షికి శిరస్సు వంచి మనసులోనే పాదాభివందనం చేసుకుందాం...
మానవ శరీరం గురించి శివుడు
పార్వతికి ఉపదేశించిన పరమ రహస్యాలు
స్వరం ఒకటి
మూడు రూపములుగాను ,
అయిదు రూపములుగాను అగును.
ఈ అయిదు మరలా ఒక్క రూపముగా అగును.
మరలా అయిదు చొప్పున ఇరువైయిదు విధములుగా అగును.
శరీరం నందు స్వరం పుట్టును .
స్వరము నందు నాడిపుట్టును.
స్వర నాడుల స్వరూపం తెలియచేయుటకు శరీరం చెప్పబడుచున్నది.
తండ్రిలో మూడు నెలల ఉండును
తల్లిలో 9 నెలలు ఉండను
శరీరం పిండం అనబడును.
ఆ పిండం నందు శరీరం అణిగి ఉండును.
శుక్ల శోణిత సమ్మితం అగు ఆ పిండం చైతన్యముతో కూడుకుని ఉండును.
ఆ శుక్ల శోణితములు నాలుగు దినముల వరకు ప్రతి దినము నందు సమ్మేళనం అగుచుండును.
అయిదు దినములకు బుడగ వలే అగును.
పది దినములకు నెత్తురు అగును.
పదిహేను దినములకు మాంసం ముద్ద అగును.
ఇరువది దినములకు గట్టి మాంసం ముద్ద అగును. ఇరువైదు దినములకు సమాన రూపం అగును.
మొదటి నెల యందు పంచభూతములు కూడును. రెండొవ నెల యందు మేథస్సు కలుగును.
మూడోవ నెల యందు ఎముకలు మజ్జ కలుగును. నాలుగోవ మాసము నందు అవయవములు జనించును.
అయిదోవ మాసము నందు రంధ్రములతో గూడిన చెవులు , ముక్కు, కన్నులు , నోరు మొదలగునవి జనించును.
ఆరొవ మాసం నందు కంఠరంధ్రం , ఉదరం పుట్టును .
ఎడొవ మాసం నందు పుట్టిన శిశువు బ్రతుకును గాని అల్పాయువు లేదా అల్పబలము , క్షీణ థాతువు గల రోగి అగును.
ఎనిమిదోవ మాసము నందు పుట్టిన శిశువు ఏ విధముగానూ బ్రతకదు . తల్లి దేహము మరియు శిశువు దేహము నందు ప్రాణం తిరుగుచుండును . కావున తల్లి గాని శిశువు గాని బిడ్డ గాని మృతినొందును.
తొమ్మిదోవ మాసమున గర్భమునకు జ్ఞానము కలుగును. తొమ్మిదోవ మాసమున గాని పదోవ మాసమున గాని ప్రాణములతో పుట్టును .
స్త్రీలకు ఋతుదినము మొదలు 16 వ దినముల వరకు కళ హెచ్చి గర్భము నిలుచును. కావున సరి దినములలో స్త్రీతో గూడిన పురుష గర్బము , బేసిదినములలో గూడిన యెడల స్త్రీ గర్బము కలుగును.
పుత్ర సంతానం కోరువాడు సరి దినముల యందు ఋతు స్నానం చేసిన స్త్రీతో సంగమం జరుపవలెను. స్త్రీ యొక్క రేతస్సు అధికంగా ఉండి పురుషుని యొక్క వీర్యం తక్కువుగా ఉన్న ఆడ సంతానం కలుగును. పురుషుని వీర్యం ఎక్కువుగా ఉండి స్త్రీ రేతస్సు తక్కువుగా ఉన్న మగవాడు పుట్టును .
ఋతుస్నానం అయిన రాత్రి సంగమం వలన గర్బం నిలిచినచో పుట్టిన మగవాడు అల్పాయువు , దరిద్రుడు అగును. గర్బం అయిదోవ దినమున అయిన కూతురు మంచి పుత్రులు కలిగినదిగా ఉండును. ఆరొవ దినమున అయిన యెడల మధ్యమ గుణము కలవాడు అగును.
ఎడొవ దినమున అయిన యెడల పుత్రవతి యగు కూతురు , ఎనిమిదొవ దినమున మహదైశ్వర్య సంపన్నడగు కుమారుడు , తొమ్మిదోవ దినమున పతివ్రత అగు కూతురు , పదొవ దినమున మంచి కుమారుడు పుట్టును . ఈ విధముగా ఒక్కొ దినముకు ఒక్కొ ప్రాముఖ్యత సంతానం విషయంలో ఉండును.
ఎముకలు , మెదడు , వీర్యం ఇవి తండ్రి నుంచి సంక్రమించును. నెత్తురు , రోమములు , మాంసం తల్లి నుంచి సంక్రమించును.
రోమములు , చర్మము , ఎముకలు , మాంసము ఇవి పృథ్వి అంశములు , శుక్లము, పురీషము , మూత్రము , నిద్ర ఆలస్యము ఇవి ఉదక అంశములు .
* ఆకలి , దప్పిక , దేహకాంతి ఇవి తేజస్సు యొక్క అంశములు , ముడుచుకొనుట , చాచుకొనుట , పారుట, కదులుట, వణుకుట, నిలుచొనుట ఇవి వాయు అంశములు. కోపం , సిగ్గు , భయం , మోహం ఇవి ఆకాశం యొక్క అంశములు .
* నాలిక , చర్మము , చెవులు , ముక్కు , కన్నులు ఈ అయిదు జ్ఞానేంద్రియములు , ఉపస్థము , ఆసనం , వాక్కు , హస్తములు , పాదములు ఇవి కర్మేంద్రియాలు .
* మూలాధారం నందు నాలుగు దళముల పద్మము , యోని నందు ఆరు దళముల పద్మము , నాభి యందు పది దళముల పద్మము , హృదయము నందు పండ్రెండు దళముల పద్మము ఉండును.
* కంఠము నందు పదహారు దళముల పద్మము , కనుబొమ్మల నడుమ రెండు దళముల పద్మము , బ్రహ్మ రంధ్రము నందు వేయి దళముల పద్మము ఉండును.
* ఈ ఏడు పద్మములును సప్తచక్రములు అనబడును. దేహమునందు ఉండు నాడులు అనేక రూపాలుగా విస్తారంగా ఉండును. ఇవి పెద్దలైన యోగ గురువులచేత ఆత్మజ్ఞాన నిమిత్తం తెలుసుకొనవలెను.
* సప్త ద్వీపములు , ఇరువదియేడు నక్షత్రములు , నవగ్రహములు వీనిని శరీరం నందు తెలుసుకొనిన వాడే గురుడు అనబడును.
* నాభికి దిగువును మీదను మొలకల వలే బయలుదేరి డెబ్భైరెండువేల నాడులు దేహ మధ్యంబు ఉండును.
* అడ్డముగా , పొడుగుగా , క్రిందగా దేహం మొత్తం వ్యాపించి చక్రముల వలే సకలమై సిరలు తిరుగుచూ ప్రాణం ఆశ్రయించి యుండును.
* నాభికి దిగువుగా కుండలిని స్థానం నందు సర్పాకృతిగా ఒక నాడియు మీదుగా పది నాడులు కిందగా పది నాడులు ఉండును.
* సూక్షముఖములు అగు ఆ నాడుల నడుమ ఉత్తమమైన చక్రం ఒకటి ఉన్నది . అందు ఇడా , పింగళ , సుషుమ్న అను మూడు నాడులు కలవు.
* ఆ నాడులలో సూక్ష్మ ముఖములు అగు ముఖ్యమైన నాడులు పది ఉన్నవి. వాటి పేర్లు వరసగా ఇడ, పింగళ , సుషమ్న , గాంధారి , హస్తి, జిహ్వ, పూషలము , భూషితము , కుహక , శంఖిని , శారద అనునవి కలవు. వాటిలో ఇడ , పింగళ నాడులు వాయువునెల్లప్పుడు వహించి ఉండును.
* సుషమ్న నాడి కాల మార్గముచే బ్రహ్మ రంధ్రము నందు ఉండును. పూషలము , భూషితము అను నాడులు నేత్రము
ల యందు ఉండును.
* గాంధారి , హస్తిజిహ్వ ఈ రెండును చెవి ద్వారము నందు ఉండును. కుహక గుదస్థానం నందు , శంఖిని లింగ రంధ్రము నందు ఉండును. శారద నోటి యందు ఉండును.
* మానవ శరీరం నందు ప్రాణము , అపానము , సమానము , ఉదానము , వ్యానము , నాగము , కూర్మము , కృకరము , దేవదత్తము , ధనుంజయము అనే పది రకాల వాయువులు ఉండును.
* పైన చెప్పిన ఆ పది నాడులలో ముఖ్యమైన ప్రాణవాయువు నాభిగుహ యందు ఉండినదై ముఖం , నాసిక , హృదయము , నాభి ఈ నాలుగు స్థలముల యందు సంచరించుచుండును. నాభి యందు శబ్దము , నోటి యందు ఉచ్చరణం , ముక్కున ఉచ్చ్వాస నిశ్వాసములు , హృదయము నందు దగ్గు వీనిని పుట్టించును .
* అపానవాయువు , పిరుదులు , పిక్కలు వీనికి మధ్యభాగమునను , గుదము , లింగము , నాభి , వృషణము , తొడలు , మోకాళ్లు స్థానముల యందును ఉండును. ఈ అపాన వాయవు మలమూత్రాదులను బయటకి పంపును .
* వ్యాన వాయవు కన్నులు , చెవులు , కాలి మడములు , పిరుదు , ముక్కు , ఈ స్థానముల యందు ఉండును. ఈ వ్యాన వాయవు ప్రాణాపాన వాయువులను వెలుపలికి పోవునట్లు లోపలికి వచ్చునట్లు చేయును .
* సమాన వాయవు శరీరం నందు నాభిస్థానం నందు ఉండి జఠరాగ్నితో గూడి డెబ్బైరెండువేల నాడీ రంధ్రముల యందు ఉండును. భుజించబడిన , తాగబడిన పదార్ధాల రసములను దేహమున వ్యాపింపచేసి దేహపుష్టిని కలుగచేయును .
* ఉదానవాయువు కంఠం నందు ఉండి చేతులు , కాళ్లు మొదలైన అంగాల సంధుల యందు వ్యాపించి చాచుట, ముడుచుకొనుట మొదలగు కార్యములు నిర్వర్తించును.
* ధనుంజయ వాయవు వలన ఘోషము , మాటలాడుట నాగము వలన , ఆవులింత దేవదత్తం వలనను , తుమ్ము కృకరము వలనను , కన్ను మూసి తెరచుట కూర్మం వలనను కలుగును. మనిషి మరణించిన తరువాత దేహం ఉబ్బిపోవుటకు కూడా ఈ ధనుంజయ వాయవు కారణం...
.
-హిందూ ఋషులు...
🔥సర్వేజనాసుఖినోభవంతు 🔥