పరమశివుడు పులి చర్మాన్ని ధరించి, పులి చర్మాన్ని ఆసనంగా చేసుకుని ధ్యాన మగ్ధుడై కూర్చుని ఉంటాడు. ఆయన పులిచర్మాన్నే ఎందుకు ధరించాడు? పులి చర్మంపై ఎందుకు ఆసీనుడై ఉన్నాడు అన్న సందేహం కలగక మానదు.
- శివ అనగా శివుడు సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థాలున్నాయి.
- ఈయన త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు.
- శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు.
- శివుడు పశుపతిగాను, లింగం రూపములోను సింధు నాగరికత కాలానికే పూజలందుకున్నాడు. శివుడు అనార్య దేవుడు. కానీ తరువాత వైదిక మతంలో లయకారునిగా స్థానం పొందాడు.
పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్ధం ఉన్నది.
శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపాలు. ఢమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం.
అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక.
అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను ధరించిన ఏనుగు చర్మం అహంకారాన్ని త్యజించమని, ఆశీనంపైన పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతనూ సూచిస్తాయి.
ఆయన పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు, నందీశ్వరుడు సత్సాంగత్యానికి,
నంది ధర్మదేవతకు, మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక.
పరమ శివుడు పులిచర్మాన్ని ఎందుకు ధరించాడు?
పరమశివుడు పులి చర్మాన్ని ధరించి, పులి చర్మాన్ని ఆసనంగా చేసుకుని ధ్యాన మగ్ధుడై కూర్చుని ఉంటాడు. ఆయన పులిచర్మాన్నే ఎందుకు ధరించాడు? పులి చర్మంపై ఎందుకు ఆసీనుడై ఉన్నాడు అన్న సందేహం కలగక మానదు. అందుకు శివపురాణంలో ఒక కథ చెప్పబడింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పరమ శివుడు సర్వసంగ పరిత్యాగి. స్వామి దిగంబరుడై అరణ్యాలలో శ్మశానాలలో తిరుగాడుతూ ఉండేవాడు.ఒక రోజు ఆయన సంచరిస్తూ ఉండగా మునికాంతలు, (మునులు, మహర్షుల భార్యలు)పరమేశ్వరుని సౌందర్యానికీ, ఆయన తేజస్సుకీ కళ్ళు తిప్పుకోలేకపోయారు.
వారిలో ఆయనను చూడాలన్న కాంక్ష పెరగసాగింది.ఆయననే తలుచుకుంటూ గృహకృత్యాలను కూడా సరిగా చేసేవారు కారు. తమ భార్యలలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పుకు కారణమేమిటని వెతికిన మునులకు పరమేశ్వరుని చూడగానే సమాధానం దొరికింది.
సంహరించడానికి పథకం వేసారు..
వారు ఆ దిగంబరుడు సదాశివుడని మరచి ఆయనను సంహరించడానికి పథకం వేశారు. ప్రతి రోజూ స్వామి నడిచే దారిలో ఒక గుంతను తవ్వారు. స్వామి ఆ గుంత సమీపానికి రాగనే అందులో నుంచి వారి తపశ్శక్తితో ఒక పులిని సృష్టించి శివుని మీదికి ఉసిగొల్పారు.
రుద్రుని ఎదుట నిలవగలిగిన పరాక్రమం ఈ ప్రపంచంలో ఉంటుందా? మహాదేవుడు సునాయాసంగా ఆ పులిని సంహరించాడు. మునుల చర్య వెనుక వారి ఉద్దేశ్యం అర్థం చేసుకుని ఆ పులితోలుని కప్పుకున్నాడు.
అది చూసిన మునులు, రోజూ వారి ఆశ్రమానికి వస్తున్నది సాధారణ వ్యక్తి కాదని, దేవుడని తేరుకుని, శివుడి కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుంటారు. అప్పటి నుండి శివుడు ఆ పులిచర్మంను ధరించడం జరిగిందని శివపురాణంలోని కథ.
అంతే కాదు, పులి అమితమైన పరాక్రమానికి ప్రతీక, సంహారకారి, భయానకమైనది. అటువంటి పులి కూడా లయకారుడైన పరమేశుని ఎదుట నిలవలేదని , కాల స్వరూపుని ఎదుట నిలబడ గలది ఏదీ లేదని చెప్పడమే ఇందులోని ఉద్దేశ్యం
స్వామి పులిచర్మంపై కూర్చున్నా, పులి చర్మాన్ని ధరించినా అందుకు కారణం ఆయన సర్వోత్కష్టమైన కాల స్వరూపుడని చెప్పడమే..