అయ్యప్పస్వామి విల్లుఅంబు పొడిచి బావిని , కోనేరును సృష్టించినాడని కొందరు గాయకులు తమ పాటలలో పాడియున్నారు. ఇంతకు ముందే చెప్పబడిన వివరములు విశ్వాసయోగ్యమైనవి అని నమ్మేడి వారికి , ఈ పాటలు గూడా సరియైనవే అని అనిపించక మానవు. కన్నిస్వాములైన అయ్యప్ప భక్తులు ఈ కోనేరు యందునూ , బావి యందునూ బొరుగులు చల్లుట , శూర టెంకాయలు కొట్టుట , టపాకాయలు పేల్పించుట , యాచకులకు ధర్మము చేయుట మొదలగు సాంప్రదాయములను
పాటించెదరు. కన్నిస్వాములు కానివారు గూడా పై విధములైన సంప్రదాయములను. పాటించుట మిక్కిలి శ్రేయస్కరమగును. కొచ్చుకడుత్త స్వామి , కరిమల భగవతి అను పేరుగల వనదుర్గ యొక్క నివాస స్థలమే ఈ కరిమలయని పళమస్వాములు చెప్పుచున్న సమాచారమును బట్టి తెలియుచున్నది.
భక్తిలేక వ్రతభంగముతో ఏదో పరీక్ష చేయవలయునని బయల్దేరి యాత్ర చేయు నటువంటి వారిని కోపముతో ఆపదలు కలుగజేసి , ఈ వనదేవతలు పలు ఆటంకములను కలుగజేయుదురని అనేకమంది పళమ స్వాములు శిష్యబృందములకు
ఉపదేశించి ఈ దేవతలచే పూర్వులకు కలిగిన సంకటములను చెప్పెదరు.వ్రతానుష్టానములను క్రమముగా పాటించక (ఎవరినో మెప్పించునట్లు మాత్రముండి) తమ ఇష్ట ప్రకారం ప్రవర్తించి అహంకారముతో గూడి యాత్రచేయు వారిని ఈ కరిమల భగవతి అచ్చటి నుండి ముందుకు సాగనివ్వదని గూడా గురుస్వాములు చెప్పుచునే యుందురు. తూర్పు దిక్కున ఎతైన వంకర టింకరలుగా యుండు ఈ కరిమల ఎక్కుట కన్న దిగుట మిక్కిలి ప్రయాసమే అగును. ఈ కరిమల వైపు నుండి దిగుట అనునది పలు ఆపదలతో కష్టములతో ,కూడినదియైననూ, ఎంతో దుర్గమ మార్గమే అయిననూ స్వామి శరణములు భక్తితో ఉచ్చరించుచూ వచ్చిన , ఎట్టి ఆపదలూ సంభవించవని అయ్యప్ప భక్తుల ఆత్మవిశ్వాసము.
🙏🌹ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌸🙏