🔱 శబరిమల వనయాత్ర - 22 ⚜️కన్నుల పండుగైన దీపాల ఆవళి (పంబా విళక్కు) ⚜️

P Madhav Kumar


⚜️కన్నుల పండుగైన దీపాల ఆవళి (పంబా విళక్కు) ⚜️


ధనుర్మాసము (మలయాళమాసము) ఇరవై ఏడవ దినము మొదలు పంబాలో దీపాల ఆవళి ప్రారంభించిననూ , దాని యొక్క పరిపూర్ణ ప్రాధాన్య ఘట్టము ఇరవై తొమ్మిదవ దినమున సూర్యాస్తమయము తర్వాతనే పూర్తి అగును. సాయం సంధ్యవేళ సమీపించుచుండగానే అందరూ తమ తమ తావళము లందు వెదురులతో వారి వారి హస్త ప్రావీణ్యతతో తయారు చేసిన చిన్న , పెద్ద తీరులలో దీపాలంకారములు చేయుదురు. అయ్యప్ప భక్తులు వారి వారి యొక్క ఇరుముడి కట్టుకు ముందుగా ఒక్కొక్క దీపమును వెలిగించి యుంచుదురు. పగటి సమయమున వారు బృందముగా చేరి మచ్చుకత్తి గొడ్డలి మొదలగు ఆయుధధారులై అడవులలో ప్రవేశించి పెద్ద , పెద్ద వృక్షముల

యొక్క వేర్లనూ , మొక్కలను సేకరించుకొని వచ్చి దానితో అగ్నిని రగిల్చి ఆళావర్ణుని సంకల్పించి ఆళికలిపి అగ్నిని రగుల్చుదురు. విబూదిని పన్నీరుతో కలిపి ఒక ముద్దవలె చేయుటను ఆళి అందురు. మరియూ వెదురు బద్దలను సేకరించి గోపురము గుడారము , రథము మొదలగు ఒక్కొక్కరి *'కళాభిరుచిని'* అనుసరించి మిక్కిలి తన్మయత్వముతో కట్టి తయారుచేసి దాని చుట్టునూ నూనె దీపములను , మైనపు వత్తులను వెలిగించి పూజారాధనలు చేసి దానిని మోసికొనుచూ , భక్తిపారవశ్యముతో పారుచున్న పంబానదిలో వదలివైతురు. ఈ విధముగా పంబానదిలో తేలుతున్న గుడారములు , గోపురముల సంఖ్యను లెక్కపెట్టుట తరముకానిపని.



అంతటి గొప్పగా బారులు తీర్చి వరుసగా వెడలు దృశ్యము ఎంతో ఆహ్లాదకరముగా యుండును ఆ దృశ్యము యొక్క అంద చందములను రంగురంగుల వైభవమునూ చూడని వారికి చెప్పవలయుననిన ఎంత చెప్పిననూ తక్కువే అగును. ప్రతివారు వారి యొక్క జీవితము లోపల ఒక పర్యాయమైననూ ఇటువంటి దృశ్యమును చూచి తరించవలయును. ఇలా ఒక్కొక్కరి హస్తకళా నైపుణ్యముతో శోభాయమానముగా వెలయు దీపాల ఆవళియే "పంబావిళక్కు" అని పళమస్వాములు అందురు. నయానాందకరమైన ఈ దీపాల ఆవళితో గూడా టపాకాయలు ప్రేల్చుటయూ , నాదస్వరము , చెండ , మద్దెల , ఉడుకు , డోలు , చెంగిల , శంఖు , మొదలగు వాద్య ఘోషములతో మేళ తాళములతో భక్తులు చేయు భజనలు శరణఘోషములు నిర్విరామముగా వినబడుచునే యుండును. ఈ విధముగా లక్షోపలక్షల జనులు ఒకే స్వరముతో ఈశ్వరధ్యానము చేసి , ఆనందామృతమును గ్రోలి , స్వర్గతుల్యమైన ఆ పుణ్యనదీ తీరమునందు ఉత్సవము పూర్తి చేసికొని, ఆ నిశిరాత్రిలోనే మరల మిగిలిన యాత్రా కార్యక్రమములకు ఆయత్తమగుదురు.


🙏🌹ఓం శ్రీ స్వామియే శరణం అయ్యపపా 🌺🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat