⚜️ పంబా సద్ది విశిష్టత ⚜️
పంబా సద్దియే శరణం అయ్యప్పా అను శరణఘోష ఇచ్చట సలిదిని ఉద్దేశించి
ఏర్పర్చిన పిలుపు. ఎరిమేలిపేటలో ఎగురుట కొరకు పేట దుకాణములో కొనియున్న కూరగాయలను మిగిలిన సామాగ్రులను చాలా వరకు అయ్యప్ప భక్తులు ఉపయోగించు కొనునది ఈ పంబా సలిదియే అగును. అది వారి వారి యొక్క ప్రక్క సంచి (సైడు బేగు) యందుంచుకొని తెచ్చెదరు. దానిని ఒక్కొక్కరు తీసి ఒకచోట కుప్పగా పోసి పలురకములైన కూరలను తయారు చేయుదురు. సాంబారు , తాళింపు , కూటు , చిప్స్ , పెద్ద అప్పడములు , ఊరగాయలు , పాయసము తెచ్చుకొన్న మధుర పదార్ధములు ఇలా ఒక్కొక్కరి నైపుణ్యమును , శక్తిని అనుసరించి వైభవోపేతమైన విందు తయారుచేసి
గురుస్వామితో సహపంక్తిన మృష్టాన్న భోజనము ఆరగింతురు. ఒక్కొక్క కూటమి వారునూ వారివారి తావళమునకు సమీపముగా పొడుగైన వెదురు కొమ్మకు పెద్దపెద్ద అప్పడములను స్వామివారి కొరకై వేలాడదీసియుంచెదరు.
అయ్యప్ప శబరిగిరి యాత్రీకులతో కలసి ఆ పంబాసద్ధిలో భుజించుననియూ ఆ
దినము స్వామి ఒక్కొక్కరి పంబాసద్దిలోనూ పాల్గొంటాడనియూ అచ్చట గూడియున్న వారి విశ్వాసము. పంబలో జరుపబడు ఈ సద్ద్యకు (విందుకు) ఇటువంటి విశేషము కలదని గురుస్వాములు ప్రవచించెదరు. సద్ద్యకు ముందు ముందుగా వారు వారు తెచ్చుకున్న ఇరుముడులను పెట్టి దానిని సాక్షాత్ అయ్యప్పగా తలచి దీపము వెలిగించి ఆకువేసి తయారు చేసిన సకల పదార్ధములనూ అందులో వడ్డించి అందరు స్వాములూ కూడా చుట్టూ నిలబడి శరణము పలికి భోజనమునకు ఉపక్రమింతురు. మనయొక్క స్వస్థలములలో అత్యంత వైభవముతో గూడి మనము గొప్పగొప్ప విందులలో పాల్గొని యుండిననూ , ఇటువంటి రుచికరమైన ఆత్మానందప్రదమైన భోజనము ఎప్పుడైనా భుజించుదుమా ? ఏమో సందేహమే ! ఇచ్చట గూడా బిచ్చగాళ్ళ సంఖ్య తక్కువ ఉండదు. ఒక సంఘమునకు చేరని నూతన వ్యక్తి ఎవరైనా కలసి వారితో భోజనమునకు
కూర్చున్నట్టైన ఆ సంఘము వారు అదికూడా ఒక విశేషముగా భావించి ఆనందింతురు. ఎందుకనగా ఆ సంఘమువారి యొక్క భక్తిని మెచ్చుకొని స్వయముగా ఆ శబరిగిరి
యందు కోవెలగొనియున్న అయ్యప్ప స్వామియే ఆ రూపమున వచ్చి వారితో భుజించి వారిని అనుగ్రహించినట్లుగా భావించుదురు.
🙏🥀ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌹🙏