⚜️ కన్నిమూల గణపతి ⚜️
అభిషేకము జరిపిన పిదప నెయ్యినింపి తీసుకొని వచ్చిన కొబ్బరికాయ ముక్కలను గణపతి యొక్క హోమ గుండము నందు భక్తితో వేయవలెను. ఒక చిప్పను చిన్న చిన్న ముక్కలుగా కోసి పసుపు పొడి యందు అద్ది నెయ్యిలో వేసి దానిని కూడా ప్రసాదముగా కొనిపోవుదురు. మరి కొందరు ఈ సంప్రదాయమును పాటించక రెండు చిప్పలను ఆ హోమ గుండము నందే వదలివేయుదురు. ఈ
విధముగా భక్తాదు లచే వేయబడు నారికేళ శకలములతోనే శబరిగిరి సన్నిధానపు ముంగిట యుండు ఈ గణపతి హోమగుండము మహాజ్వాలగా సుమారు ఒక నెల రోజుల వరకూ వెలుగుచునే ఉండును.
భక్తాదులు శబరిమల నుండి గొనిపోవు ప్రసాదములను తమ స్వస్థానములో
యుండు పరిచయస్తులు , స్నేహితులు , బంధువులు మొదలగు వారి ఇండ్లకు తీసుకెళ్ళి లేక పంపి , అందరికీ పంచి పెట్టుదురు. సాధారణముగా శబరిగిరి యాత్రచేయు అయ్యప్ప భక్తులు ఒక్కొక్కరు నెయ్యి , అప్పము , అరవణ పాయసము , పంచామృతము , చందనము , భస్మము మొదలగునవి అచ్చటినుండి వెలకు కొని దానిని అయ్యప్ప స్వామివారి ప్రసాదముగా తీసికొని పోవుదురు. కానీ కొందరు దీనిని వినియోగించువేళ ఆదాయమునకు ఎదురు చూసెదరు. దురాశ పరులైన అట్టి పళమ స్వాములు నెయ్యి యుండెడి పడప తొట్టిలో నుండి కొంచెము కొంచెముగా సంపాదించిన నెయ్యిని తమ ఊరికికొని వచ్చి భగవంతునికి అభిషేకము చేసిన నెయ్యి
ఇది మిక్కిలి మంచిదనియూ , మహత్యము నిండినదనియూ అందరికీ చెప్పచూ దానిని భద్రపరచుకొని , ఎవరైననూ విశ్వాసము కలిగి నమ్మినవారు ఆపదలో వచ్చి అడిగిన
డబ్బులు తీసికొని ఇచ్చెదరు. ఇటువంటి వారిని గూర్చి ఇంతకు మునుపటి అధ్యాయములోనే తెలియపరచియున్నాము. అయిననూ ఇంకనూ ప్రస్తావన చేయవలసి వచ్చుచునే యున్నది.
గణపతికి నెయ్యాభిషేకము చేయించువారు కూడా కలరు. అది వారి వారి ఇష్ట ప్రకారము చేయవచ్చును. దానికి దేవస్వమువారి అనుమతిగానీ , ధనవ్యయముగానీ
ఉండదు. ఎవరికైననూ , ఎప్పుడైననూ అభిషేకము చేయుటకునూ , స్పర్శించి నమస్కరించుటకునూ అభ్యంతరమేమియూ అచ్చట లేదు. గణపతి భగవానుని స్పర్శించి ఆ విగ్రహముపై నుండి జాలువారుతున్న నెయ్యిని తీసి చాలామంది తమ శరీరముపైననూ , శిరముపైననూ రుద్దుకొందురు. శిరోవేదనకు కానీ , శరీర మందుగల ఇతర వేదన లేక వ్యాధులకు మిక్కిలి గుణము ఆ నెయ్యి వలన లభించునని ఒక్కొక్కరి విశ్వాసము. ముందు వెనుక , ప్రక్కన అట్లు సర్వభాగములందు నిలబడియుండు అయ్యప్ప భక్తులను నిగ్రహించుట , నియంత్రించుట గణపతి భగవానునికి గాక మిగిలిన ఎవ్వరికినీ సాధ్యముకాదు..ఇట్లు ఆనందమును గూర్చెడి సాంప్రదాయములలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని గూడా యథావిధి ఆరాధనలు చేసి నమస్కరించి దానికి సమీపముగా యుండు సర్పరాజును గూడా ఆరాధించి మొక్కుట అనునవి కూడా యుండును.
🙏🪷ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌻🙏