పూరీ జగన్నాధుని ఆలయం గురించి తెలుకోవాల్సిన 7 వింతలు, విశేషాలు
మన దేశంలో ఎన్నో ప్రసిద్ధ ఆలయాలు, వాటిలో ఇప్పటికీ బయటపడని ఎన్నో వింతలు, మరెన్నో రహస్యాలు. అలాంటి అద్భుత ఆలయాల్లో పూరీ జగన్నాధుని ఆలయం ఒకటి. ఘనంగా జరుగుతున్న స్వామి వారి రథయాత్ర నేపథ్యంలో పూరీ ఆలయంలో ఉన్న మిస్టరీలేంటో ఓసారి తెలుసుకుందాం రండి.
జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు తన సోదరుడు బలరాముడు సోదరి సుభద్ర తో కలిసి కొలువుదీరిన మహిమాన్విత క్షేత్రమే పూరి జగన్నాథ ఆలయం.
ఆషాడశుద్ధ విదియ నాడు ఇక్కడ రథయాత్ర ప్రారంభమవుతుంది. కానీ అంతకు రెండు రోజుల ముందు జేష్ట మాసంలో వచ్చే పౌర్ణమి నాడు స్నానయాత్ర నిర్వహిస్తారు. తర్వాత స్వామికి అనారోగ్యం అని ప్రకటించి విశ్రాంతి పేరుతో రహస్య మందిరానికి తరలిస్తారు. రహస్య మందిరం నుంచి బయటకు వచ్చిన రోజే రథయాత్ర ప్రారంభం. మూడు రథాలలో స్వామి సుభద్ర బలభద్రులు గుండిచాకు చేరుకుంటారు. స్వామివారు అక్కడ ఆతిధ్యం స్వీకరించిన తర్వాత దశమినాడు తిరుగు ప్రయాణం అవడంతో యాత్ర ముగుస్తుంది.
ఎంతో ప్రాముఖ్యత పొందిన ఈ ఆలయం లో సైన్స్ కి అందని కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా:
- చక్రం: పూరీ జగన్నాధుని ఆలయం చాలా ఎత్తులో ఉంటుందని తెలిసిందే. ఆ గోపురం పైన ఓ సుదర్శన చక్రం ఉంటుంది. మీరు పూరీలో ఎక్కడనుంచి అయినా సరే ఆ సుదర్శన చక్రాన్ని చూస్తే అది మీ వైపే తిరిగి ఉనట్టు కనిపిస్తుంది.
- జెండా: ఈ ఆలయ గోపురం పైన ఉండే జెండాకు కూడా ప్రత్యేకత ఉంది. మామూలుగా ఏ గుడికి కట్టిన జెండా అయినా సరే, గాలి ఎటువైపు ఉంటే అటువైపే ఊగుతుంది. కానీ ఇక్కడి జెండా మాత్రం గాలి వస్తున్న వైపు కాకుండా.. వ్యతిరేక దిశలో ఎగురుతుంది.
- గోపురం నీడ: జగన్నాథ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ ఎవ్వరికీ కనిపించదు. పగలూ, సాయంత్రం ఏ సమయంలో కూడా ఆ గోపురం నీడ మాత్రం కనిపించదు.
- పక్షులు : జగన్నాథ ఆలయం పైన పక్షులు ఎగరవు. అయితే దీనికి మాత్రం ఒక కారణం ఉంది. ఇక్కడ గాలి సాంద్రత, తేమ శాతం తక్కువగా ఉండటం, ఇంకా ఆలయ వృత్తాకార నిర్మాణం కూడా పక్షులు పైకి ఎగరకుండా చేస్తుంది.
- ప్రసాదం తయారీ : స్వామి వారి ప్రసాదాన్ని ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పై భాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం విశేషం. అలాగే ఆలయంలో తయారు చేసిన ప్రసాదం కొంచెం కూడా వృథా అవ్వదు. వండినప్పుడు మామూలుగా ఉన్న ప్రసాదం నివేదిన అనంతరం ఘుమఘుమలాడుతుందని చెబుతారు.
విగ్రహాలు: సాధారణంగా ఆలయాలలో రాతి లేక ఇత్తడి విగ్రహాలు ఉంటే ఈ గుడిలోని శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ విగ్రహాలను చెక్కతో తయారు చేశారు.
రోజుకో కొత్త జండా: ఆలయ శిఖరం మీద ఉండే జెండాని ఎవరి సహాయం లేకుండా ఒక పూజారి ప్రతిరోజు మారుస్తారు. ఏనాడైతే ఆ జెండాని మార్చరో ఆ నాటి నుంచి 18 సంవత్సరాల పాటు ఆలయాన్ని మూసి వేస్తారని చెబుతారు. కానీ ఇప్పటివరకు అలా జరగనే లేదు.