*పురాణ ప్రారంభం - 9*
హిరణ్యాక్షుడి మరణం అతని సోదరులైన దైత్య దానవులలో , ముఖ్యంగా అతనితో పాటే పుట్టిన తమ్ముడు హిరణ్య కశిపునిలో విశేషమైన పగను రగిలించింది. విష్ణువు మీద ప్రతీకారం తీర్చుకొని తీరాలని హిరణ్యకశిపుడు వ్రతం పట్టాడు.
కశ్యపాశ్రమంలో కూడా విషాదం నిండింది. హిరణ్యాక్షుని కన్నతల్లి దితి దుఃఖంతోనూ , విష్ణువు మీద ఆగ్రహంతోనూ ఊగిపోయింది. 'దను' కూడా దితితో జతకట్టింది. ఇతర రాక్షస మాతలూ అంతే. లోకకంటకులుగా వ్యవహరించేవారు ఎవరైనా సరే హిరణ్యాక్షుడిలాగా అంతమొందాల్సి వస్తుందనీ , జగత్తుకే జనకుడైన శ్రీమహావిష్ణువు చేతిలో మరణించడం అతని అదృష్టమనీ వాళ్ళను ఓదార్చే ప్రయత్నం చేశాడు కశ్యప ప్రజాపతి.
ద్వేషంతో , అసూయతో పరస్పరం తాము దూరమైనా తన బిడ్డలూ , చెల్లెళ్ళ బిడ్డలూ చివరికి తల్లులకూ , తండ్రికీ కూడా దూరం కావడాన్ని అదితి తట్టుకోలేక పోయింది. చెల్లెళ్ళు వినత , కద్రువా ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు.
*"పిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపోతే తట్టుకోవాలి అదితీ ! నన్ను చూడు ! కన్నబిడ్డలందరూ దూరమయ్యారు. ఒకడు ఆ విష్ణువు చేతిలో చనిపోయాడు. అయినా నేను ధైర్యంగా ఉన్నానే !"* అంది ధీమాగా దితి.
*“నేనూ అంతేగా ! మమ్మల్ని చూసి ధైర్యం తెచ్చుకో అక్కా !”* అంది అందుకుంటూ దను.
అయితే చెల్లెళ్ళ ఓదార్పు మాటలు అదితికి మనశ్శాంతి ఇవ్వలేకపోయాయి. పిల్లలు దూరమవడం ఒక్కటే ఆమె విచారానికి కారణం కాదు.
ఆశ్రమ ప్రాంగణంలో చెట్టు కింద కూర్చుని దీర్ఘాలోచనలో మునిగిపోయిన అదితిని సమీపించాడు కశ్యపుడు. ఆమె దగ్గరగా కూర్చున్నాడు. ఆమె మొహంలోకి జాలిగా చూశాడు. అదితి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
*"ఎన్నాళ్ళిలా కుమిలిపోతావు ? మనకు ఏదో కొత్తగా కనిపిస్తోంది కానీ , కలిసి ఉండి , విడిపోవడం ప్రాణులకు సహజ లక్షణంగా సంక్రమించిందేమో అనిపిస్తోంది - ఆలోచిస్తుంటే. శరీరాల నుంచి పుట్టిన సంతానం ఆ శరీరాలకు దూరంగా వెళ్ళిపోతే కలిగే ఆవేదన నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గుండె దిటవు చేసుకో అదితీ ! మన కుమారులు విడివిడిగా రాజ్యాలు స్థాపించుకున్నారు. మందిరాలు కట్టుకొన్నారు. ఎన్నాళ్ళయినా , ఇలా కుమిలిపోవడంలో అర్థం లేదు...”*
అదితి కన్నీళ్ళు తుడుచుకుంది. *“నా విచారానికి కారణం నా బిడ్డలు మనల్ని వదిలి వెళ్ళడం ఒక్కటే కాదు స్వామీ ! ఒక తండ్రికి , ఒక ఆవాసంలో జన్మించిన బిడ్డలు పరస్పరం ద్వేషాగ్నిలో దహించుకు పోతూ , పరస్పర వినాశాన్ని కోరుకుంటున్నారు. వాళ్ళ విపరీత ప్రవర్తన నాకు ఎనలేని దుఃఖాన్ని కలిగిస్తోంది !"*
కశ్యపుడు బలహీనంగా నిట్టూర్చి , అనునయంగా ఆమె తల నిమిరాడు. *"స్వామీ... నాకో కోరిక ఉంది. తీరుస్తారా ?"* అదితి వున్నట్లుండి అడిగింది. కశ్యపుడు చిరునవ్వు నవ్వాడు. *"సతుల కోర్కెలు తీర్చడం పతుల విధి ! ధర్మం ! అడుగు !" "ద్వేషాలు , అసూయలూ లేని వాడూ , అందరినీ సమానంగా , పక్షపాత రహితంగా చూసేవాడూ , లోకానికి హితం చేకూర్చేవాడూ అయిన పుత్రుణ్ణి ప్రసాదించండి.”* అంటూ అదితి చీర చెంగును రెండు చేతుల్తో పట్టుకొని భర్త ముందు చాచింది. కశ్యపుడు అదితిని చిరునవ్వుతో చూశాడు.
*“అదితీ , ఆ కొంగును నువ్వు చాచాల్సింది నా ముందు కాదు. ఆ కొంగులో నువ్వు కోరిన భిక్ష వేసే వ్యక్తి వేరే ఉన్నారు !"* కశ్యపుడు నవ్వుతూ ఆగాడు. "స్వామీ !" అదితి కంఠంలో ఆశ్చర్యం పలికింది.
*“ఔను , అదితీ ! నేను కేవలం మన సంతానానికి మాత్రమే జనకుణ్ణి ! నేనిచ్చిన పుత్రభిక్ష ఎలా ఉందో చూశావుగా ! నీ కొంగుని ఆ జగజ్జనకుని ముందు పట్టు !" "జగజ్జనకుడా !"* అదితిని ఆశ్చర్యం వదల్లేదు.
*“ఔను ! జగజ్జనకుడైన ఆ శ్రీమహావిష్ణువును ప్రార్థించు ! నువ్వు కోరిన మహత్తర సుగుణాలున్న సత్పుత్రుణ్ణి ప్రసాదించగలిగించేది ఆ దేవదేవుడొక్కడే !"* కశ్యపుడు ఉపదేశిస్తున్నట్లు అన్నాడు.
*"స్వామీ ! ఆ స్వామి నా కోరిక తీరుస్తాడా ? నేను కోరుకునే సత్పుత్రుణ్ణి ప్రసాదిస్తాడా ? నిజమా ? చెప్పండి స్వామీ. నా ఆశ నెరవేరుతుందా ?"* అదితి ఆవేశంగా అడిగింది.
*"నీది కాదు. ఆశయం ! నీకో , నీ కుటుంబానికో మేలు చేసే కొడుకు కలగాలనుకోవడం ఆశ. తరతమ భేదాలు లేకుండా లోకానికంతకూ మేలు చేసే ఉత్తమ పుత్రుడు కలగాలనుకోవడం ఆశయం ! ఆశ స్వార్థం. ఆశయం ఉదాత్తం ! ఆశయ సాధనకు దైవానుకూలం తప్పక ఉంటుంది !"*
*"చక్కగా చెప్పారు స్వామీ !”* అదితి ఆనందంగా అంది.
*"ఈ రోజే నీ తపస్సు ప్రారంభించు ! తదేక ధ్యానంతో ఆ పరమ పురుషుడిని ప్రసన్నం చేసుకో !"* కశ్యపుడు అదితిని ప్రోత్సహిస్తూ అన్నాడు.
అదితి లేచి , ముందుకు వంగి కశ్యపుడి పాదాలకు నమస్కరించింది. *"నా ఆశయం. నెరవేరేలా ఆశీర్వదించండి !"*
కశ్యపుడు అదితి తల నిమిరాడు. ఆమె భుజాలు పట్టుకుని లేవనెత్తుతూ , తనూ నిలుచున్నాడు. ఆమె మొహంలోకి ఆప్యాయంగా చూశాడు. *"విష్ణు ప్రసాద సిద్ధిరస్తు !"*.