భర్గ శతకము - Bharga Satakamu

P Madhav Kumar

                                                             : భర్గశతకము : 



శా. శ్రీకైలాస మహామహీధర శిరఃశృంగాటకాంచన్మణి-
ప్రాకారాంతర చంద్రకాంత రజతప్రాసాదశుద్ధాంత సిం-
హాకారోన్నతహేమపీఠమునఁ గొల్వైయుండు నిన్నెన్నెదన్
రాకాచంద్రనిభప్రభాకలిత! భర్గా! పార్వతీవల్లభా! 1

మ. క్షితినంభోనిధి కర్ఘ్యమిచ్చు క్రియ భక్తిన్బద్మినీభర్త కా-
రతి యర్పించు తెఱంగున న్బహుతరబ్రహ్మాండసంత్రాతకున్
శతకంబొక్కటి గూర్చి నీ కొసగెద న్సంరూఢిఁ గైకొమ్ము నా
కృతి సంస్తుత్యలసద్గుణాభరణ! భర్గా! పార్వతీవల్లభా! 2

మ. శుక శాండిల్య మృకండుజాత్రి కలశీసూనుల్ భరద్వాజ శౌ-
నక వాల్మీకి వసిష్ఠ గర్గ భృగు మాండవ్యాజసంభూత కౌ-
శిక కణ్వాది మహర్షిశేఖరులు నిన్ జింతింపఁగా లేరు, కొం-
కక నేనెంతటివాఁడ నిన్బొగడ భర్గా! పార్వతీవల్లభా! 3

మ. వరకౌండిన్యసగోత్రపాత్రుని యశోవర్ధిష్ణునిం గుక్కుటే-
శ్వరకారుణ్యకటాక్షలబ్ధ కవితాసామ్రాజ్యధౌరేయునిన్
స్థిరపుణ్యుండగు గంగమంత్రిసుతునిన్ దిమ్మప్రధానేంద్రునిన్
గరుణన్బ్రోవుము కూచిమంచికులు భర్గా! పార్వతీవల్లభా! 4

మ. ప్రచురత్వంబుగ నెంతు నాత్మనెపుడు న్బ్రత్యూహసంశాంతికై
విచలత్కర్ణసమీరదూరిత మహావిఘ్నంబుభృజ్జాలునిన్
రుచిరాస్వాంబురుహస్రవన్మదజలప్రోత్సాహ లీలాముహుః
ప్రచురద్భృంగకులున్ గణాధిపుని భర్గా! పార్వతీవల్లభా! 5

శా. వేమాఱున్ భవదీయ పావనకళావిఖ్యాతకావ్యక్రియా-
సామీచీన్య హృదంతరాళకవిరాట్సంక్రదనశ్రేణికిన్
సామర్థ్యం బొనగూర్చి మంచినుడువుల్ సంప్రీతి నొందించు వా-
గ్భామారత్నము లీలమై నిలిచి భర్గా! పార్వతీవల్లభా! 6

మ. చిరభక్తిన్మదిలో భవద్వ్రతముగాఁ జింతింతు నశ్రాంతమున్
బరవాది ప్రమథద్విపేంద్రపదవీపంచాననశ్రేష్ఠు బం-
ధురతేజోనిధి దెందులూరికులపాథోరాశిరాకానిశా-
కరునిన్ లింగయసద్గురూత్తముని భర్గా! పార్వతీవల్లభా! 7

మ. పులితోల్ముమ్మొనవాలు పాఁపతొడవుల్ భూత్యంతరాగంబు పు-
న్కలపేర్లెక్కువకన్ను నీలగళమున్ గంగావతంసంబు క్రొ-
న్నెలపూ వద్రిసుతాసమన్వయము విన్కీల్గంటు లేజింకయున్
గల నీ మూర్తిఁ దలంతు నెప్పుడును భర్గా! పార్వతీవల్లభా! 8

మ. హర! మృత్యుంజయ! చంద్రశేఖర! విరూపాక్షా! మహాదేవ! శం-
కర! భూతేశ! మహేశ! రుద్ర! మృడ! గంగాజూట! గౌరీమనో-
హర! సర్వజ్ఞ! బిలేశయాభరణ! శర్వా! నీలకంఠా! శివా!
కరిచర్మాంబర! యంచు నెంతు నిను భర్గా! పార్వతీవల్లభా! 9

మ. జగదీశాయ నమోస్తు తే భగవతే చంద్రావతంసాయ ప-
న్నగహారాయ శివాయ లోకగురవే నానామరుద్రూపిణే
నిగమాంతప్రతిపాదితాయ విలసన్నిర్వాణనాథాయ ధీ-
రగుణాఢ్యాయ యటంచు మ్రొక్కిడుదు భర్గా! పార్వతీవల్లభా! 10

మ. వ్రతముల్ దేవగురుద్విజార్యపదసేవల్ వైశ్వదేవాది స-
త్క్ర తుహోమాదులు దానధర్మములు వైరాగ్యప్రచారంబు లా-
శ్రితరక్షావిధు లించుకే నెఱుఁగ నీ చిత్తంబు నా భాగ్య మే-
గతి రక్షించెదొ కాని నన్నిఁకను భర్గా! పార్వతీవల్లభా! 11

మ. మరుదర్కేందుకృశానుయజ్వ గగనాంభకుంభినీమూర్తి నం-
బరకేశున్ శరణాగతార్తిహరణు న్బాలేందుచూడామణిన్
ధరణీభృత్తనయాస్తనద్వయమిళిత్కస్తూరికాపంకసం-
కరదోరంతరు నిన్ భజించెదను భర్గా! పార్వతీవల్లభా! 12

మ. మిహిరప్రోద్భవఘోరకింకరసమున్మేషోరగశ్రేణికా
విహగోత్తంస మశేషదోషపటలీవేదండకంఠీరవం
బహితక్రూరగణాటవీహుతవహంబైనట్టి పంచాక్షరం
బహహా! కల్గెను నాకు భాగ్యమున భర్గా! పార్వతీవల్లభా! 13

మ. నృపసేవా పరకామినీ పరధన ప్రేమాతిరేకంబు లొ-
క్కపుడుం గూర్పక తావకీన పదపద్మారాధనేచ్ఛారతుల్
కృప దైవాఱ నొసంగి భక్తవరుగా నేప్రొద్దు నన్బ్రోవుమీ
కపటారాతినిశాటసంహరణ! భర్గా! పార్వతీవల్లభా! 14

మ. అభవున్ శాశ్వతు నాద్యు నక్షయుని నవ్యక్తుం బరేశు న్మహా-
ప్రభు నాద్యంతవిహీను భూతమయు సర్వజ్ఞున్ గుణాతీతుఁ బ-
ద్మభవాండోదరు నాత్మరూపభవు నద్వంద్వుం జిదానందునిన్
రభసంబొప్పఁ దలంతు నిన్నె్పుడు భర్గా! పార్వతీవల్లభా! 15

మ. తనర న్నిన్మదినెంతు నెప్పుడును నా దైవంబుగా దాతఁగా
జనకుంగాఁ జెలికానిగా గురువుఁగా సద్బంధుగా నన్నఁగా
ఘననిక్షేపముగా మహాప్రభునిగాఁ గల్యాణసంధాయిగా
గనకోర్వీధరకార్ముకోల్లాసిత భర్గా! పార్వతీవల్లభా! 16

మ. ప్రతివారంబు శివోహమస్మి యనుచు న్భావింతు గంగాధర-
స్తుతులెల్లప్పుడుఁ జేతు శంకరకథల్ సొంపార నాలింతు నా-
యుతబుద్ధిన్ జగమెల్ల నీశ్వరమయం బంచు న్విచారింతు నే-
గతి రక్షించెదొ కాని నీవు నను భర్గా! పార్వతీవల్లభా! 17

మ. పురుహుతాగ్నిపరేతరాట్పలభుగంభోదీశవాతార్థపాం
బరకేశాబ్జభవాచ్యుతాదిక మహాబర్హిర్ముఖానేకభా-
స్వరకార్తస్వరవిస్ఫురన్మకుట శశ్వత్పద్మరాగప్రభో-
త్కరనీరాజిత పాదపంకరుహ! భర్గా! పార్వతీవల్లభా! 18

శా. వ్యాకీర్ణాచ్ఛజటాటవీతటనితాంతాలంబితోద్యత్తమి-
స్రాకాంతప్రథితప్రభాసముదయాశ్రాంతప్రఫుల్లన్మహా-
నాకద్వీపవతీవినిర్మిలజలాంతర్భాగభాగ్దివ్యరే-
ఖాకాంతోత్పలకైరవప్రకర! భర్గా! పార్వతీవల్లభా! 19

మ. సతతానందితసర్గ! సర్వసుమనస్సంస్తుత్యసన్మార్గ! యూ-
ర్జితకారుణ్యనిసర్గ! రాజతధరిత్రీభృన్మహాదుర్గ! హృ-
త్కుతుకాలింగితదుర్గ! సంహృతసమిద్ఘోరద్విషద్వర్గ! సం-
యతనీరంధ్రసుఖాపవర్గ! జయ! భర్గా! పార్వతీవల్లభా! 20

మ. పురరక్షఃపటుతూల హవ్యవహ! విస్ఫూర్జద్రురుక్రూరగో-
పరిపంథిక్షణదాచరోరగ మహాపక్షీంద్ర! ఘోరాంధకా-
సురగంధద్విరదేంద్ర పంచముఖ! యక్షుద్రప్రభావోల్లస-
త్కరిలేఖద్విషదభ్ర గంధవహ! భర్గా! పార్వతీవల్లభా! 21

మ. అమరాహార్యము విల్లుగా ఫణికులాధ్యక్షుండు తన్మౌర్విగాఁ
గమలాధీశుఁడు తూపుగా, నిగమముల్ గంధర్వముల్ గాఁగ స-
ర్వమహీచక్రముఁ దేరుఁజేసి విధి సారథ్యంబు మీఱం బరా-
క్రమలీలన్ దిగప్రోళ్ళఁ గూల్చితివి భర్గా! పార్వతీవల్లభా! 22

శా. కోటీరాంగదమేఖలాఘనతులాకోటీ కవాటీనట-
ద్ఘోటీ హాటకపేటికాభటవధూకోటీ నటాందోళికా-
వీటీ నాటకచేటికాంబరతతుల్ వే చేకుఱు న్నిన్నిరా-
ఘాటప్రౌఢి భజించు ధన్యులకు భర్గా! పార్వతీవల్లభా! 23

శా. కంఠేకాలుఁడటంచు నిన్నెపుడు లోకవ్రాత మగ్గింప వై-
కుంఠేంద్రాంబుజసంభవప్రముఖులం గోలాహలప్రక్రియం
గుంఠీభూతులఁ జేయు దుర్భయదకాకోలంబు హేలాగతిన్
గంఠాగ్రంబునఁ బూనినాఁడవట! భర్గా! పార్వతీవల్లభా! 24

మ. నిను డెందంబునఁ జీరికిం గొనక వాణీనాథజంభద్విష-
ద్దనుజారిప్రముఖాఖిలామరతతిన్ దట్టంబుగాఁ గూర్చి యా-
మున జన్నంబొనరించు దక్షుని దురాత్ము న్వీరభద్రోగ్రసం-
హననం బూని వధించితౌరా! భళి! భర్గా! పార్వతీవల్లభా! 25

మ. కిరిహంసాకృతులూని వెన్నుఁడును బంకేజాతగర్భుండు నీ
చరణంబుల్ శిరము న్గనం దలఁచి నిచ్చల్భోగిలోకంబు పు-
ష్కరమార్గంబును రోసి కానక నిరాశం జెందుచో వారలం
గరుణం బ్రోవవె లింగమూర్తివయి! భర్గా! పార్వతీవల్లభా! 26

మ. తరమే యేరికిఁ దావకీన ఘననిత్యశ్రీవిలాసక్రియల్
గరిమ న్దెల్పఁగ? దారుకావనిని లోకఖ్యాతిగా వర్ణివై
పరమానందరసార్ద్రమానసుఁడవై పల్మారు గ్రీడించితౌ
నరుదార న్మునిదారలం గలిసి భర్గా! పార్వతీవల్లభా! 27

మ. హరికన్న న్మరి దైవ మెవ్వఁడును లేఁడంచు న్భుజంబెత్తి ని-
ర్భరగర్వోద్ధతిఁ గాశికానగరిలోఁ బల్మాఱు వాదించు ని-
ష్ఠురవాగ్దోషరతుం బరాశరసుతున్ స్రుక్కింపవే భీమవై-
ఖరి దోఃస్థంభన మాచరించి మును భర్గా! పార్వతీవల్లభా! 28

మ. దనుజారాతి మృదంగము న్నలువ కైతాళంబు గోత్రాహితుం-
డెనయ న్వేణువు వాణి వీణయును వాయింపన్ రమాకాంత నే-
ర్పున గానం బొనరింప సంజతఱి వేల్పుల్మెచ్చఁగా హాళిమై
ఘనతన్ దాండవకేళి సేయుదఁట! భర్గా! పార్వతీవల్లభా! 29

శా. నీలాంభోధరమధ్యసంస్థితతటిన్నీకాశమై విస్ఫుర-
ల్లీల న్నివ్వరిముంటి చందమున నెంతే సూక్ష్మమై పచ్చనై
చాలన్భాసిలు తేజమీవ యనుచు న్స్వాంతంబునం దెన్నుదుర్
వాలెంబున్ ఘనులైన తాపసులు భర్గా! పార్వతీవల్లభా! 30

మ. గొనబార న్విటజంగమాకృతిని మున్ గొంకేది భల్లాణరా-
యని సద్మంబున కేఁగి యాతని సతి న్బ్రార్థించి యా లేమ య-
క్కునఁ జక్క న్నెలనాళ్ళబాలకుఁడవై గోమొప్పఁ గన్పట్టితౌఁ
గన నబ్రంబులు నీ విహారములు భర్గా! పార్వతీవల్లభా! 31

మ. యమరాడ్భీకరకాలపాశమథితుండై శ్వేతకేతుండు దు-
ర్దమశోకాకులచిత్తవృత్తిమెయి నిన్బ్రార్థింప వైళంబ యా
శమనుం గ్రొవ్వఱఁ దన్ని మౌనితనయున్ శశ్వద్గతిన్బ్రోవవే
కమలేశార్చితపాదపంకరుహ! భర్గా! పార్వతీవల్లభా! 32

మ. త్రిజగద్రక్షణశక్తిఁ గోరి కమలాధీశుడు నిన్వేయిపం-
కజపత్త్రంబులఁ బూజసేయునెడ నొక్కండందులేకుండినన్
నిజనేత్రాబ్జ మతండొసంగినఁ గృప న్వీక్షించితౌఁ జక్ర మ-
క్కజ మొప్పారఁగ నిచ్చి యేలుకొని భర్గా! పార్వతీవల్లభా! 33

మ. చిరుతొండండను భక్తునింటికి హొయల్ చెన్నార వేంచేసి త-
ద్వరపుత్రున్ దునిమించి నంజుడుతునె ల్వండించి భక్షించుచో
సిరియొప్ప న్నిజమూర్తిఁ జూపి యతనిన్ జేపట్టి రక్షింపవే
కరిదైత్యాధమగర్వనిర్మథన! భర్గా! పార్వతీవల్లభా! 34

మ. విజయుం డుగ్రవిపక్షశిక్షణకళావృత్తి న్మిముం గోరి య-
క్కజమొప్పన్ దప మింద్రకీలశిఖరిన్ గావించుచో బోయవై
విజయఖ్యాతిగఁ బోరి పాశుపతమీవే వాని కిష్టంబుగా
రజతక్షోణిధరాగ్రసద్భవన! భర్గా! పార్వతీవల్లభా! 35

మ. తనకున్ మిక్కిలి ముజ్జగంబుల కిఁకన్ దైవంబు లేఁడంచుఁ బా-
యని దర్పంబున దైత్యదానవమునీంద్రామర్త్యసంసత్పదం-
బున వాదించు విరించి పంచమమహామూర్ధంబు ఖండింపవే
కన నత్యుద్ధతభైరవాకృతిని భర్గా! పార్వతీవల్లభా! 36

మ. సకలాధీశుఁడ వెన్న నీవొక్కఁడవే సత్యంబు సత్యంబు కొం-
చక యంతర్బహిరుజ్జ్వలద్భువనరక్షాదీక్షఁ గాకోల ము-
త్సుకతం గంఠమునందుఁ దాల్చితివి మెచ్చుల్మీఱఁ గ్రూరాత్ములై
యకటా! మూఢు లెఱుంగఁజాలరిది భర్గా! పార్వతీవల్లభా! 37

శా. ఏరీ నీ కెనయైన దైవతములీ యీరేడులోకంబులన్
గారామారమృకండుసూనుఁడు మహోగ్రక్రూరమృత్యువ్యథా
భీరుండై శరణన్న మిత్తి నపుడే పెంపార్చి రక్షించిత-
య్యారే! శాశ్వతజీవిగా నతని భర్గా! పార్వతీవల్లభా! 38

శా. లోకశ్రేణికి నీవె కర్త వను టాలోకింప నిక్కంబెపో
వైకుంఠాధిపుఁడైన శౌరి దినరాడ్వంశంబునన్ రాఘవుం-
డై కన్పట్టి జగద్ధితంబుగ నసంఖ్యన్ శంభులింగంబులన్
వ్యాకీర్ణేచ్ఛఁ బ్రతిష్ఠ చేసెఁ గద భర్గా! పార్వతీవల్లభా! 39

మ. శిలలన్ఱొప్పియుఁ జెప్పుఁగాలను గడున్జిత్రంబుగాఁ ద్రొక్కియున్
వెలివెట్టించియుఁ గుంటెనల్నడపియు న్వే రోఁకటం గ్రుమ్మియు
న్నిలయద్వారమునందుఁ గాఁపునిచియున్ నీవారలైనారు వా-
రల భాగ్యం బిఁక నేమిచెప్పనగు? భర్గా! పార్వతీవల్లభా! 40

మ. అజినంబు న్వృషఘోటియుం బునుకలు న్హాలాహలంబు న్మహా-
భుజగంబు ల్శవభస్మము ల్గొఱలఁగా భూతాళితో నుండియున్
ద్రిజగన్మంగళదాయకాకృతిఁ గడున్ దీపించు టబ్రం బహా
రజనీనాథకళాశిరోభరణ! భర్గా! పార్వతీవల్లభా! 41

శా. డాయన్రాద యటండ్రు మాదృశులు చండాలాదుల న్డాసినన్
బాయుం బుణ్యచయంబులంచుఁ జదువు ల్పల్కంగ నీ వయ్యయో
బోయం డెంగిలిమాంసమిచ్చుటకు లోబుల్పూని చేకొంటి వే
ప్రాయశ్చిత్తము కద్దు దీనికిఁక? భర్గా! పార్వతీవల్లభా! 42

శా. భంజించుం గద! ఘోరదుష్కృతతతిన్ భస్మత్రిపుండ్రంబుల-
న్మంజుశ్రీలలితాక్షమాలికలఁ బ్రేమం బూని సద్భక్తి నీ-
కుం జేమోడ్చు మహానుభావుఁ డెపుడుం కుక్షిస్థలప్రోల్లస-
త్కంజాతప్రభవాండభాండచయ! భర్గా! పార్వతీవల్లభా! 43

శా. శ్రీశైలంబును గుంభఘోణమును గాంచీస్థాన కేదారముల్
కాశీ ద్వారవతీ ప్రయాగములు నీలక్ష్మాధరావంతికల్
లేశంబున్ ఫలమీవు నిన్నెపుడు హాళిం గొల్వలేకున్నచోఁ
గాశాకాశధునీఘనాభరణ! భర్గా! పార్వతీవల్లభా! 44

శా. కావేరీ సరయూ మహేంద్రతనయా గంగా కళిందాత్మజా
రేవా వేత్రవతీ సరస్వతుల కర్థిం బోవఁగానేల నీ
సేవాసంస్మరణార్చనాదు లెపుడున్ సిద్ధించు మర్త్యాళికిన్
గ్రైవీభూతభుజంగమప్రవర! భర్గా! పార్వతీవల్లభా! 45

మ. అరిషడ్వర్గముఁ దోలి సర్వహితులై యష్టాంగయోగక్రియా-
పరులై గాడ్పుజయించి ముద్రవెలయన్ బ్రహ్మంబునీక్షించి వా-
విరి సోహమ్మని యెంచుచుండెడి మహావేదాంతులౌ యోగిశే-
ఖరులెల్లన్ మిముఁ గాంచుచుండ్రు గద! భర్గా! పార్వతీవల్లభా! 46

మ. తలపోయన్ దిలజాలకాంతరమహాతైలంబు చందానఁ బూ-
సలలో దారము పోల్కి నాత్మమయతన్ సర్వాంతరస్థాయివై
విలసల్లీలల నిండియుండుకొను నిన్వీక్షంపఁగా నేర్చువా-
రలె ధన్యుల్ గద ముజ్జగంబులను భర్గా! పార్వతీవల్లభా! 47

శా. ఏణాంకుండొకఁడై పయోఘటములందెల్ల న్బహుత్వంబుచే
రాణం బొల్చు తెఱంగునం బృథుతరబ్రహ్మాండభాండాంతర
ప్రాణిశ్రేణులయందు నీవొకఁడవే రాణింతువౌ సర్వగీ-
ర్వాణస్తుత్యచరిత్ర! యాత్మమయ! భర్గా! పార్వతీవల్లభా! 48

శా. ఓంకారప్రముఖాక్షరోచ్చరణసంయోగంబు గావేన్ముఖా-
లంకారార్థము శబ్దబిందుకళలున్ లక్ష్యప్రయోగక్రియల్
పొంకంబౌ గురుమార్గముల్ యతిగతిం బో దుష్కృతిం బోలి సా-
హంకారుండయి ప్రాకృతుండు చెడు భర్గా! పార్వతీవల్లభా! 49

మ. అకలంకం బతులం బఖండ మమృతం బానందకందం బనూ-
నక మాద్యంతవిహీన మక్షర మనంతం బప్రమేయం బరూ-
పక మవ్యక్త మచింత్య మద్వయమునౌ బ్రహ్మంబు నీవంచుఁ గొం-
కక లోఁ గన్గొనువారు బల్లిదులు భర్గా! పార్వతీవల్లభా! 50

శా. ఆకుల్ మెక్కదె మేఁక? చెట్టుకొననొయ్యన్ వ్రేలదే పక్షి? పె-
న్గాకుల్ గ్రుంకవె నీట? గాలిఁ గొనదే నాగంబు? బల్గొందులన్
ఘూకం బుండదె? కోనలం దిరుగదే క్రోడంబు? నిన్గాంచినన్
గాకిన్నింటను ముక్తి చేకుఱునె? భర్గా! పార్వతీవల్లభా! 51

మ. ధర మృద్దారుశిలామయప్రతిమలన్ దైవంబు లంచుం బర-
స్పరవాదంబులఁ బోరుచున్ నిబిడసంసారాంధులై మేలు చే-
కుఱకే మగ్గములోని కండెల గతిన్ ఘోరార్తులై ప్రాకృతుల్
కరముం జచ్చుచుఁ బుట్టుచుంద్రు గద! భర్గా! పార్వతీవల్లభా! 52

మ. జననీగర్భమహామహోగ్రనరకస్థానవ్యథం గొన్నినా-
ళ్లెనయన్ బాల్యకుమారతాదశలఁ గొన్నేడుల్ వధూమీనకే-
తనగేహభ్రమఁ గొన్నినాళ్ళు ఘనవృద్ధప్రాప్తిఁ గొన్నేళ్ళుఁ బా-
యని దుఃఖంబులఁ బ్రాణి గుందుఁ గద? భర్గా! పార్వతీవల్లభా! 53

శా. కేదారాదిక పుణ్యభూముల కశక్తిం బోవఁగారాదు; బల్
పేదర్కంబున దానధర్మవిధు లోలిం జేయఁగారాదు గా-
కేదే నొక్కతఱిన్ సమస్తభువనాధీశున్ నినుం గొల్వఁగా
రాదో? కానరుగాక దుర్మతులు భర్గా! పార్వతీవల్లభా! 54

మ. తరుణీశుంభదురోజకుంభములపై ధమ్మిల్లబంధంబుపైఁ
గరమూలంబులపైఁ గపోలములపైఁ గందోయిపై మోముపై
నిరతంబున్ విహరించు చిత్త మెపుడున్ నీయందొకప్డేనిఁ జే-
ర్పరుగా మూఢు లదేమిదుష్కృతమొ? భర్గా! పార్వతీవల్లభా! 55

మ. మిము నొక్కప్పుడుఁ గొల్వనేరక వృథామిథ్యాప్రచారంబులం-
గములై వాఁగులయందు నెల్ల మునుగంగాఁ బుణ్యము ల్సేరునే?
తమి నశ్రాంతము నీటఁ గ్రుంకులిడి యేధర్మంబు లార్జించెనో
కమఠగ్రాహఢులీకుళీరములు! భర్గా! పార్వతీవల్లభా! 56

మ. హరి దైవంబు విరించి సర్వభువనాధ్యక్షుండు బృందారకే-
శ్వరుఁడాఢ్యుండు హుతాశనుండు పతి భాస్వంతుండు వేల్పండ్రు
లో నరయ న్నేరరుగా ‘శివాత్పరతరం నాస్తీ’తివాక్యార్థ మే-
కరణిం గోవిదులైరొ కాని మఱి! భర్గా! పార్వతీవల్లభా! 57

శా. వేయేనూఱుపురాణముల్ సదివినన్ వేదాంతముల్ గన్న నా-
మ్నాయంబుల్ పరికించినన్ స్మృతులు వేమాఱుల్ విమర్శించిన
న్నీయం దాఢ్యత దోఁచుచున్నయదివో నిక్కంబు భావింపఁగా
గాయత్రీపతివై తనర్చుటను భర్గా! పార్వతీవల్లభా! 58

శా. ఆఘంటాపథపద్ధతిన్ శివశివే త్యాలాపసంశీలులై
రేఘస్రంబులు ద్రోచు పుణ్యతము లుర్విన్ బ్రహ్మహత్యాద్యనే-
కాఘౌఘంబులు వాసి తావకపదప్రాప్తిన్ విడంబింతురౌ
ద్రాఘిష్ఠప్రభుతాగుణోల్లాసన! భర్గా! పార్వతీవల్లభా! 59

మ. పృథివిన్ మర్త్యుఁ డొకప్డు నీ శిరముపై బిల్వీదళం బొక్కట-
త్యాధికాహ్లాదముతోడ నిడ్డ నది యాహా! ఘోటకాందోళికా-
రథనాగాంబరపుత్రపౌత్రవనితారత్నాదులై యొప్పుఁబో
ప్రథితాదభ్రసితాభ్రశుభ్రయశ! భర్గా! పార్వతీవల్లభా! 60

మ. మిము సేవించుటచేతఁ గాదె చిరలక్ష్మీసంగతుల్ శౌరికిన్
నముచిద్వేషికి శాశ్వతస్థితమహానాకాధిపత్యంబు వా-
గ్రమణీభర్త కశేషసృష్టిరచనాప్రావీణ్యమున్ గల్గె నీ
క్రమ మజ్ఞుల్ గనలేరు గాని భువి భర్గా! పార్వతీవల్లభా! 61

శా. వాణీశాంబుజలోచనప్రముఖ గీర్వాణార్చితాంఘ్రిద్వయున్
క్షోణీభాగశతాంగునిన్ గజహరున్ శ్రుత్యంతవేద్యున్ నినున్
బాణాదిప్రమథోత్తముల్ గొలిచి మేల్పట్టూనిరౌ సంతత-
ప్రాణివ్యూహమనోంబురుడ్భవన! భర్గా! పార్వతీవల్లభా! 62

శా. దారిద్ర్యంబు దొలంగు మృత్యువెడలున్ దవ్వౌనఘవ్రాతము
ల్ఘోరవ్యాధులు గండదోషము లడంగున్ జారచోరవ్యథల్
దూరంబౌ నహితానలగ్రహగణార్తుల్ వీడు నిక్కంబు నీ
కారుణ్యం బొకయింత గల్గునెడ భర్గా! పార్వతీవల్లభా! 63

మ. సుత, పద్మాకర, దేవతాగృహ, వన, క్షోణీసురోద్వాహ, స-
త్కృతి, నిక్షేపము లంచు నెంచ నలువౌ నీ సప్తసంతానముల్
హితవారంగ నొనర్చు పుణ్యమెనయున్ హేలాగతి న్మర్త్యుఁడొ-
క్కతఱిన్ మిమ్ముఁ దలంచెనేని మది భర్గా! పార్వతీవల్లభా! 64

మ. అమరం ద్వత్పదపంకజాతయుగళధ్యానక్రియాశ్రాంతసం-
భ్రమలీలన్ విలసిల్లు డెంద మొరులన్ బ్రార్థింపఁగా నేర్చునే?
సుమనోనిర్ఝరిణీసువర్ణకమలస్తోమాసవాలంపట
భ్రమరం బేఁగునే తుమ్మకొమ్మలకు భర్గా! పార్వతీవల్లభా! 65

మ. శివుఁ జూడం దగదండ్రు గొందఱధముల్ చిత్రంబు తారెన్నఁడు
న్రవిచంద్రాగ్నిగృహిక్షమాపవననీరవ్యోమముల్ నీ స్వరూ-
పవిశేషంబు లటంచుఁ దెల్ప వినరో భావింప నమ్మూర్ఖపుం
గవు లెల్లం దదధీనతన్ మనరొ భర్గా! పార్వతీవల్లభా! 66

మ. ద్విపగంధర్వవిభూషణాంబరవధూవీటీభటాందోళికా-
తపనీయాదులచేత మత్తిలి బుధేంద్రశ్రేణిఁ బీడింతురౌ
తపనప్రోద్భవఘోరకింకరగదాదండోగ్రదుఃఖంబు లొ-
క్కపుడుం దుష్ప్రభులేల యెంచరొకొ? భర్గా! పార్వతీవల్లభా! 67

శా. నానాద్వీపధరాధురావహనమాన్యస్ఫారబాహాబలా-
నూనఖ్యాతిసమేతులైన శశిబిందుక్ష్మాతలేశాదిక
క్ష్మానాథు ల్చనిపోవుట ల్దెలియరో సత్యంబులా దేహముల్?
కానంజాలరు గాక దుర్నృపులు భర్గా! పార్వతీవల్లభా! 68

మ. చవిలెల్ కాసులు వీసముల్ గొని యథేచ్చాలీలలం బ్రేలు దు-
ష్కవుల న్మెచ్చుచు భవ్యకావ్యఘటనాశాలుల్ ప్రసంగించుచో
నవివేకక్షితినాయకాధమవరుల్ హాస్యోక్తులం బొల్తురౌ
కవితాసార మెఱుంగకుండుటను భర్గా! పార్వతీవల్లభా! 69

మ. చెలుల న్బంధుల విప్రులన్ బ్రజల దాసీభృత్యమిత్రాదులం
గల విత్తంబులు వృత్తులుం గొని కడున్ గారింతు రధ్యక్షతం
దలపంజాల రదేమొ మీఁదటికథల్ దర్పాంధకారాంధులై
కలనైనన్ మహిభృద్దురాత్మకులు భర్గా! పార్వతీవల్లభా! 70

శా. మన్నెల్లం దమ సొమ్మటంచు వసుధామర్త్యోత్తమక్షేత్రముల్
కన్నారం గని యోర్వలేక దిగమ్రింగం జూతు రల్పప్రభుల్
వెన్నప్పంబులొ బూరెలొ వడలొ భావింపంగ నొబ్బట్లొకో
యన్నా! యెన్నఁగ వారిపాలి కవి? భర్గా! పార్వతీవల్లభా! 71

మ. ప్రజలం గాఱియఁబెట్టి పెట్టియల నర్థంబెప్పుడు న్నించుచున్
ద్విజవిద్వత్కవివందిగాయకుల కేదే నొక్కటీలేక య-
క్కజమొప్పం బలుమూలలం దిరుగు భూకాంతాంళికిం గీర్తిధ-
ర్మజయౌద్ధత్యము లేక్రియం గలుగు? భర్గా! పార్వతీవల్లభా! 72

శా. ఆజిన్ వైరివరూధినీమథనదీక్షారూఢిఁ గ్రాలన్ వలెన్
భోజుం బోలి సమస్తయాచకతతిం బోషించుచుండన్ వలెన్
తేజం బెప్పుడు నుర్విలోఁ బ్రజకుఁ జెందింపన్ వలెన్ గానిచో
రాజా వాఁడు? తరాజు గాక! భువి, భర్గా! పార్వతీవల్లభా! 73

శా. తేజంబొప్పఁ బురాకృతంబున జగద్ధ్యేయత్వదంఘ్రిద్వయీ-
పూజాపుణ్యఫలంబునం దమరిటుల్ భూపత్వముం గంటకున్
వ్యాజంబూని కడుం జెడంగవలెనా యాలింపరా యీ నృపుల్
‘రాజాంతే నరకం వ్రజే’త్తనుట? భర్గా! పార్వతీవల్లభా! 74

మ. కవివిద్వద్ధరణీసుధాశనవరుల్ కార్యార్థులై యొద్ద డా-
సి వడిం జేతులు దోయిలించుకొని యాశీర్వాదముల్సేయ నె-
క్కువదర్పంబున నట్టిట్టుం బొరలకే కొర్మ్రింగినట్లుండ్రుగా
రవళిం దుర్నృపు లేమి యీఁగలరొ భర్గా! పార్వతీవల్లభా! 75

శా. గాజుంబూస యనర్ఘరత్నమగునా? కాకంబు రాయంచయౌ-
నా? జోరీఁగ మధువ్రతేంద్రమగునా? నట్టెన్ము పంచాస్యమౌ-
నా? జిల్లేడు సురావనీజమగునా? నానాదిగంతంబులన్
రాజౌనా ఘనలోభిదుర్జనుఁడు? భర్గా! పార్వతీవల్లభా! 76

శా. కోపం బెక్కువ, తాల్మి యిల్ల, పరుషోక్తుల్ పెల్లు, సత్యంబు తీల్,
కాపట్యంబు ఘనంబు, లోభము నహంకారంబు దట్టంబు, హృ-
చ్చాపల్యం బధికంబు, ద్రోహ మతివిస్తారంబు, ఛీ! యిట్టి దు-
ర్వ్యాపారప్రభు లేరిఁ బ్రోతు రిఁక? భర్గా! పార్వతీవల్లభా! 77

శా. హృద్వీథిం గనరుం దిరస్కృతియు బిట్టేపార నొక్కప్పుడున్
సద్వాక్యంబును దర్శనం బిడని రాజశ్రేణి కాశింతురౌ
‘విద్వద్దండ మగౌరవం’ బను స్మృతుల్ వీక్షింపరా దుర్నృపా-
గ్రద్వారంబుల వ్రేలు పండితులు భర్గా! పార్వతీవల్లభా! 78

మ. అపవర్గం బొనగూడునో చిరసుఖాహ్లాదంబు చేకూరునో
జపహోమాధ్యయనార్చనాదిక మహాషట్కర్మము ల్డించి దు-
ష్కపటోపాయవిజృంభమాణధరణీకాంతాధమాగారని-
ష్కపటభ్రాంతి జరింతు రార్యు లిల భర్గా! పార్వతీవల్లభా! 79

మ. అకటా! జుత్తెఁడు పొట్టకై కృపణమర్త్యాధీశగేహాంగణా-
వకరక్షోణిరజశ్ఛటావిరతసంవ్యాప్తాంగులై క్రుంగి నె-
మ్మొకముల్ వెల్వెలఁబాఱ వ్రేలు దురదేమో యెందులం బోవనే-
రక ధీమజ్జను లెంతబేలలొకొ! భర్గా! పార్వతీవల్లభా! 80

మ. అతిలోభిన్ రవిసూనుఁడంచుఁ గపటస్వాంతున్ హరిశ్చంద్రభూ-
పతియంచున్ మిగులం గురూపిని నవప్రద్యుమ్నుఁడంచు న్మహా-
పతితున్ ధర్మజుఁడంచు సాధ్వసమతిం బార్థుడటంచు న్బుధుల్
ప్రతివేళన్ వినుతింతు రక్కఱను భర్గా! పార్వతీవల్లభా! 81

మ. జనసంస్తుత్యమహాప్రబంధఘటనాసామర్థ్యముల్ గల్గు స-
జ్జను లత్యల్పుల దీనతం బొగడుదుర్ జాత్యంధతం జెంది కా-
కనువొప్పం దమరెన్నఁడున్ ‘సుకవితా యద్యస్తి రాజ్యేన కి’
మ్మను వాక్యంబు వినంగలేదొ మును? భర్గా! పార్వతీవల్లభా! 82

మ. సుగుణోద్దామమహాకవింద్రఘటితాక్షుద్రప్రబంధావళుల్
జగదుద్దండపరాక్రమక్రమవిరాజద్భూమిభృన్మౌళికిన్
దగుఁ గా కల్పుల కొప్పునే? కరికి ముక్తాకాయమానంబు సొం
పగుఁ గా కొప్పునే యూరఁబందులకు? భర్గా! పార్వతీవల్లభా! 83

మ. పటులోభాత్మున కెవ్వరైనఁ గడఁకం బద్యాదు లర్పించినం
గుటిలుండై యవియెల్ల నిల్పుకొనఁగా గోరండు నిక్కంబహా!
దిట మొప్పారఁగ నిల్పుకోఁగలదె ధాత్రిన్ గొంతసేపైన మ-
ర్కటపోతం బురురత్నహారంబులు? భర్గా! పార్వతీవల్లభా! 84

మ. భువిలో మేదరసెట్టి చివ్వతడకల్ పొంకంబుగా నల్లి పె-
న్రవళిన్ సంతలనెల్లఁ ద్రిప్పు క్రియ దైన్యంబెచ్చఁగా దుష్కవుల్
తివుటొప్పం జెడుకబ్బపుం దడక లోలిం ద్రిప్పఁగా నద్దిరా!
కవితల్ కాసుకు గంపెఁడయ్యెఁ గద భర్గా! పార్వతీవల్లభా! 85

మ. అవివేకక్షితినాయకాధమసభాభ్యాసప్రదేశంబులన్
బవళుల్రేలును జుట్టఁబెట్టుకొని దుష్పాండిత్యము ల్చూపుచుం
గవిముఖ్యుం బొడగాంచి జాఱుదురు వేగంబుండ విల్గన్న కా
కవులట్లే నిలఁబోక కాకవులు భర్గా! పార్వతీవల్లభా! 86

మ. భువిలో నిక్కలిదోషహేతుకమునం బొల్పారి గోసంగులున్
బవినాలు న్బలుమోటకాఁపుదొరలుం బాషండులు న్దాసరుల్
సివసత్తుల్ నెఱబోయపెద్దలును దాసేయప్రభుల్ దుష్టకా-
కవులు న్మీఱిరిఁకేమి చెప్పనగు? భర్గా! పార్వతీవల్లభా! 87

మ. కలుము ల్నిక్కమటంచు నమ్మి తులువ ల్గర్వాంధులై యెన్నఁడు-
న్బలిభిక్షంబులు వెట్టకుండ్రు పిదప న్బ్రాణంబులం బాసి యా
ఖలులేమౌదురో, వాండ్రు గూరిచిన రొక్కంబెల్ల నేమౌనొకో
కలుషోద్గాఢతమస్సహస్రకర! భర్గా! పార్వతీవల్లభా! 88

మ. తులువ ల్పెట్ట భుజింపలేక ధనమెంతో నెమ్మదిం గూర్చి మూ-
లల దట్టంబుగఁ బాఁతుకొన్న నృపతు ల్వాలెంబు నిర్మోహులై
పలుచందంబులఁ గట్టి కొట్టి మిగుల న్బాధించి రోధించుచుం
గల సొమ్మెల్ల హరించుచుండ్రు గద! భర్గా! పార్వతీవల్లభా! 89

మ. చెనఁటు ల్గూర్చుధనంబు మ్రుచ్చులకు దాసీవారయోషాహు-
తాశనదుష్టక్షితిపాలకప్రతతికిన్ సంరూఢిఁ జేకూరు గా-
కనవద్యప్రతిభావిభాసితబుధేంద్రానీకముం జేరునే?
కనదుద్దామపరాక్రమప్రథిత! భర్గా! పార్వతీవల్లభా! 90

మ. ధరణిన్ సద్గురుచెంత నెందఱు ఖలుల్ దార్కొన్న నచ్చోటికే
కరమర్థి న్బుధులేఁగుచుండుదురు నిక్కంబారయన్ గంటకా-
వరణోజ్జృంభితకేతకీవని కళుల్ వాలెంబుగాఁ జేరవే?
కరుణాదభ్రపయఃపయోనిలయ! భర్గా! పార్వతీవల్లభా! 91

శా. లోకానీకమునందు దుర్గుణులు కల్ముల్ గల్గియున్నప్డు ప-
ల్గాకుల్ దార్కొని మెల్లమెల్లనె దురాలాపంబులం గేరుచుం
గైకొం డ్రెల్లపదార్థము ల్నిజమహో కార్కూఁతలం గ్రోల్చుచు-
న్గాకు ల్వేములఁ జేరు చందమున భర్గా! పార్వతీవల్లభా! 92

మ. చదువు ల్వేదపురాండము ల్గయితలు న్సబ్బండువిద్దెల్ గతల్
మొదలెన్నేనిగ విద్దుమాంసువు లదేమో తెల్పఁగా వింటిఁగా
నదిగో చౌలకు మాలదాసరి శటాలైగారి జ్ఞానమ్మలెన్
గదియం జాలవటండ్రు ముష్కరులు భర్గా! పార్వతీవల్లభా! 93

శా. పో! పో! బాఁపఁడ! దోసె డూదలిడినం బోలేక పేరాసల-
న్వాపోఁ జాగితివేమి! నీ సదువు తిర్నామంబులో! సుద్దులో
భూపాళంబులొ లంకసత్తెలొ బలా బొల్ల్యావుపోట్లాటలో
కా! పాటింపనటండ్రు బాలిశులు భర్గా! పార్వతీవల్లభా! 94

మ. అదిగో బాఁపనయల్లుభొట్లయకు ముందప్పయ్యతీర్తంబులో
నదనం ‘గిద్దెఁడు కొఱ్ఱనూక లిడితిన్ అబ్బబ్బ! తిర్నామముల్
సదువం జాగిన మాలదాసర యలన్ సంతోసనాల్ సేసితిం
గద’ యంచుం బలుమోటులాడుదురు భర్గా! పార్వతీవల్లభా! 95

శా. రాలన్ దైలము తీయవచ్చు భుజగవ్రాతమ్ముల న్బేర్లఁగా
లీల న్బూనఁగవచ్చు నంబునిధి హాళిం దాఁటఁగావచ్చు డా-
కేల న్బెబ్బులిఁ బట్టవచ్చు విపినాగ్ని న్నిల్పఁగావచ్చు మూ-
ర్ఖాళిం దెల్పఁ దరంబె యేరికిని? భర్గా! పార్వతీవల్లభా! 96

శా. ఆఁకొన్నప్పుడు వంటకంబయిన బియ్యంబైన జావైనఁ గూ-
రాకైన న్ఫలమైన నీరమయినన్ హాళిం గల ట్లిచ్చుచున్
జేకోనౌఁ బరదేశులం గృహులకు న్సిద్ధంబు గావింప ఛీ!
కాకున్న న్మఱి యేఁటికొంప లవి? భర్గా! పార్వతీవల్లభా! 97

మ. మడతల్వల్కు నృపాలుతోఁ బలుమాఱు న్మారాడు పెండ్లాముతోఁ
జెడుజూడం బ్రచరించు నాత్మజునితోఁ జేట్పాటు గోర్లెంకతో
బొడవం జూడఁగవచ్చు కార్మొదవుతోఁ బోరాడు చుట్టంబుతోఁ
గడతేరం దరమా గృహస్థునకు? భర్గా! పార్వతీవల్లభా! 98

శా. కాకిన్శాశ్వతజీవిగా నునిచి చిల్కన్వేగ పోకార్చి సు-
శ్లోకుం గొంచెపుటేండ్లలోఁ గెడపి దుష్టుం బెక్కునాళ్లుంచి య-
స్తోకత్యాగి దరిద్రుఁ జేసి కఠినాత్మున్ శ్రీయుతుం జేయు నా-
హా! కొంకేదిఁక నల్వచెయ్వులకు? భర్గా! పార్వతీవల్లభా! 99

మ. ధరలో నెన్నఁగ శాలివాహనశకాబ్దంబు ల్దగ న్యామినీ-
కరబాణాంగశశాంకసంఖ్యఁ జెలువై కన్పట్టు (సౌమ్యా)హ్వ-
యస్ఫురదబ్దంబున నిమ్మహాశతక మేఁ బూర్ణంబు గావించి శ్రీ-
కరలీల న్బుధులెన్న నీకిడితి భర్గా! పార్వతీవల్లభా! 100

మ. ధనధాన్యాంబరపుత్రపౌత్రమణిగోదాసీభటాందోళికా-
వనితాబంధురసింధురాశ్వ (మహితైశ్వర్యంబు) దీర్ఘాయువు
న్ఘనభాగ్యంబును గల్గి వర్ధిలుదు రెక్కాలంబుఁ జేట్పాటులే-
క నరు ల్దీని బఠించిరేని భువి భర్గా! పార్వతీవల్లభా! 101

సంపూర్ణము.
రచించినవారు - కూచిమంచి తిమ్మకవి
కవిపరిచయము
- వేదము వేంకటకృష్ణశర్మ
(శతకవాఙ్మయసర్వస్వము, 1954)

పీఠిక - కె. గోపాలకృష్ణరావు
(అధిక్షేపశతకములు - ఆంధ్రప్రదేశ్‌ సాహిత్యఅకాడమీ, 1982)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat