తిరుమల తిరుపతి వార్షిక ఆదాయ వ్యయాల నివేదికను శ్రీవారికి నివేదించే విశేష కార్యక్రమాన్నే ‘ఆణివర ఆస్థానం’గా వ్యవహరిస్తారు. ఆదాయ వ్యయాలు, నిల్వలు మొదలైన వాటికి సంబంధించిన వార్షిక లెక్కలను ఆనాడే స్వామి వింటాడు. ప్రతీ సంవత్సరం దక్షిణాయన ప్రారంభంలో ఆణివర ఆస్థానం నిర్వహించడం ఆచారం. కర్కాటక మాసాన్ని తమిళంలో ఆడిమాసం అంటారు. కాలక్రమంలో ఆడివరమే ఆణివరం అయింది. దక్షిణాయనం తొలిరోజు స్వామికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం వచ్చే సంవత్సరానికి సంబంధించిన కార్యక్రమాల గురించి నివేదిస్తారు. ఆణివర ఆస్థానం ఆద్యంతం ఆసక్తిదాయకంగా ఉంటుంది. హరికొలువు ఉభయ దేవేరులతో మలయప్ప స్వామిని సర్వభూపాల వాహనంలో ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకు వస్తారు. అనంతరం బంగారు వాకిలి వద్ద సేనాధ్యక్షుడు విష్వక్సేనుని సమక్షంలో స్వామి వారి కొలువును శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆణివర ఆస్థానం సందర్భంగా శ్రీనివాసునికి ఏటా శ్రీరంగనాథుడు నూతన పట్టువస్త్రాలు, పూలమాలలు సమర్పిస్తాడు. అనంతరం రూపాయి హారతిస్తారు. ఈ కార్యక్రమంలో స్వామి ప్రతినిధులుగా నియమితులైన అధికార, అనధికార, అర్చక పరిచారక బృందమంతా పాల్గొంటుంది. దీన్నే ఆణివర ఆస్థానం అంటారు. పూల పల్లకి సేవ ఆణివర ఆస్థానం నాటి సాయంత్రం మలయప్పస్వామి ఉభయ దేవేరులతో పూల పల్లకిలో ఊరేగుతాడు. దక్షిణాయన పుణ్యకాలంలో స్వామిని సేవించిన వారికి కీర్తి, విజయం, ఇష్టకామ్యార్ధ సిద్ధి, విష్ణులోకప్రాప్తి కలుగుతాయి.