భగవంతుని దరి చేర్చే నవవిధభక్తి మార్గాలలో ఈ ‘ఆత్మనివేదనం’ ఒకటి.
మానవదేహంలో జ్యోతిరూపంలో వెలుగొందే ‘ఆత్మ’ కర్మలు చేయదు.
దేహంచేత కర్మలు చేయిస్తుంది. కానీ., కర్మఫలం మాత్రం ‘ఆత్మ’కే చెందుతుంది.
అందుకనే..., దేహం నశించిన తర్వాత కర్మఫలం ఆత్మనే అనుసరించి వెడుతుంది. శరీరం ఇక్కడే రాలిపోతుంది. అదే దేహానికి, ఆత్మకు ఉన్న సంబంధం.
ఈ సత్యాన్ని గుర్తించని మానవుడు..అన్ని పనులు తనే చేస్తున్నానని అహంకరిస్తాడు.
అందుకనే మనిషికి ఇన్ని కష్టాలు.
మానవుడు సుఖజీవి. సుఖాలు అనుభవిస్తున్న కాలంలో వాడు ఎవరినీ గుర్తించడు. దైవాన్ని అసలు తలచడు. అదే కష్టాలు ఎదురైన కాలంలో క్షణకాలం కూడా వదలకుండా దైవాన్ని సతాయించేస్తాడు. బజారులో దొరికే అన్ని పుష్పాలు కొని., దేవునికి ఊపిరి సలపకుండా ఒకటే పుష్పార్చనలతో., అష్టోత్తరాలతో ఊదరకొట్టేస్తాడు. ఇక్కడ ఒక సత్యం అందరూ గుర్తించాలి.
ఈ ప్రకృతిలో లభించే పూవులు, కాయలు, పండ్లు, ఆకులు, కూరలు, నదీజలాలు.... ఇలా ఒకటేమిటి..ప్రకృతి సంపద మొత్తం భగవంతుని ఆస్తి. ధానిమీద ఎవరికీ అధికారం లేదు. ఆ పరమాత్ముడు తను ప్రేమతో సృష్టించిన ప్రాణికోటి మీద అనురాగంతో ఈ ప్రకృతి సంపదను అనుభవించమని మనకు అందించాడు. అంతే.
పూవులు అమ్మేందుకు ఎవడికి అధికారం ఉంది? కొనేందుకు నీకేం అధికారం ఉంది? మరి ఏ అర్హతతో దేవునికి పుష్పార్చనలు చేస్తున్నావు? అలాంటప్పుడు దేవునికి నీవు చేసే పూజకు ఫలం ఏమోస్తుంది? దేవుని ఆస్తిని దేవునికే అర్పించడంలో అర్థమేముంది? మరి ఈ సత్యం తెలియకనేనా.. యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇలా అన్నాడు?
#పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్ఛతి
తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రియతాత్మనః#
‘ఎవరైతే నాకు పత్రమైనను., పుష్పమైనను., ఫలమైనను., చివరకు ఉదకమైనను
భక్తితో సమర్పిస్తారో..., వాటిని నేను ప్రీతితో స్వీకరిస్తాను’ ఆది పై శ్లోకం తాత్పర్యం.
ఏవండీ., నాకు తెలియక అడుగుతున్నాను.. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగేవారున్న ఈ రోజుల్లో.. ప్రేమగా పూవో., పండో..,మరింకేదైనా ఇస్తే., తీసుకోనివారెవరు సార్.., ఒక్క దేవుడేనా.. అందరూ రెడీయే. మరి ఈ సంగతి తెలియకనా..శ్రీకృష్ణుడు అలా అన్నాడు? ఆయనకేమైనా పిచ్చా? ఆయన భావం అది కాదు.
ఈ దేహమే ఓ ‘పత్రం’. పండుటాకులాగే ఈ దేహం కూడా ఏదో ఒక రోజు రాలిపోతుంది. ఈ సత్యాన్ని గుర్తించి..,చేసే ప్రతి కర్మను ఫలాపేక్ష రహితంగా చేస్తూ., ఆ భగవంతుని పాదాలపైన ‘పత్రం’లా రాలిపోవాలి. ఈ జన్మను ఓ తులసిదళంలా చేసి ఆ స్వామి అర్చనకు వినియోగించాలి. అదే జన్మ ఎత్తినందుకు సార్థకత. ఎందుకంటే ఈ దేహం నీది. తండ్రి నుంచి నీకు సంక్రమించిన ఆస్తి. దీనిమీద నీకు సంపూర్ణమైన అధికారం ఉంది. ఈ ‘పత్రార్చనను’ ఆ పరమాత్ముడు ప్రేమగా స్వీకరిస్తాడు.
ఈ విధమైన ‘పత్రార్చనకు’ అలవాటుపడ్డ మానవుని మనోక్షేత్రంలో మొగ్గలావున్న ‘భక్తి’ పుష్పంలా వికసిస్తుంది. ఆ ‘భక్తి పుష్పాన్ని’ ఆ పరమాత్ముని పుష్పార్చనకు వినియోగించాలి. భగవంతుడు కోరుకనేది ఆ ‘భక్తిపుష్పాన్ని’ కానీ.. ఈ గులాబీ పువ్వులను., చేమంతి పువ్వులను కాదు. ఈ ‘భక్తిపుష్పం’ నీ స్వార్జితం. దీనిమీద పూర్తి హక్కులు నీవి. ఈ ‘పుష్పార్చనను’ భగవంతుడు ప్రీతిగా స్వీకరిస్తాడు.
పూవు... పండుగా మారడం ప్రకృతి సహజం కదా. ఎప్పుడైతే ‘భక్తిపుష్పం’ తన సుగంథాలతో ఆ భగవంతునికి ‘ధూపసేవ’ చేస్తూ అలసి, సొలసి, వాడిపోతుందో..ఆ ‘భక్తిపుష్పం’...‘ఙ్ఞానఫలం’గా రూపాంతరం చెందుతుంది. ఆ ‘ఙ్ఞానఫలాన్ని’ భగవంతుడు
నివేదనగా కోరుకుంటాడు గానీ.. ఈ అరటిపళ్ళు., కొబ్బరికాయచెక్కలు.,ఆపిల్ పండ్లు,
వగైరా వగైరా కాదు. ఈ ‘ఙ్ఞానఫలం’ నీ దేహక్షేత్రంలో..పండిన పంట. అది నీది. నీ కష్టార్జితం. ఈ ‘ఙ్ఞానఫల’ నివేదను ఆ జగన్నాథుడు ప్రీతిగా భుజిస్తాడు. అది ప్రత్యక్షంగా చూస్తున్న భక్తుని కళ్లనుండి ‘ఆనందాశ్రువులు’ జలజల రాలతాయి. అదీ.. ఆ జలం..
ఆ ఉదకం..ఆ తోయం..భగవంతుడు కోరుకునేది గానీ.., ఈ గంగనీరు.. గోదావరినీరు కాదు. ఆ ‘ఆనందాశ్రువులు’ నీవి. భక్తిసేద్యంలో అలసిన నీ స్వేదజలాలు అవి. వాటి మీద సంపూర్ణ అధికారం నీదే. ఆ ‘ఆనందాశ్రువులతో’ ఆ దేవదేవుని అభిషేకించాలి. ఆయన సేవలో నీ ‘ఆనందాశ్రువులు’ ఆవిరై.. ఆ స్వామి శ్వాసగా మారాలి. అదే.. అదే.. ‘ఆత్మనివేదన’ అంటే. ఇంతకు మించిన అర్చన మరేదీ లేదు........
రచయత: సేకరణ : జంపని శ్రీనివాస మూర్తి గారు