🌸మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏదైనా శుభకార్యం తలపెట్టినా, ఏదైనా మంచి పనులు చేయాలని భావించిన ముందుగా వినాయకుడికి పూజలు చేస్తాము. ఈ విధంగా వినాయకుడికి పూజ చేయటం వల్ల ఆ కార్యానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా దిగ్విజయంగా పూర్తవుతుందని భావిస్తారు.
🌸 ఎంతో విశిష్టత కలిగిన ఈ గణనాథుడు కూడా దొంగతనం చేశాడంటే మీరు నమ్ముతార !!
వినడానికి ఆశ్చర్యంగా ఉన్న వినాయకుడి కూడా దొంగతనం చేశాడని పురాణాలు చెబుతున్నాయి.
మరి వినాయకుడు దొంగతనం చేయడానికి గల కారణం ఏమిటి.? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
🌸పురాణాల ప్రకారం పూర్వం దేవతలు, రాక్షసులు అమృతం కోసం సాగర మధనం చేస్తుంటారు. ఈ మహత్తర కార్యం మొదలు పెడుతున్న సమయంలో దేవతలు రాక్షసులు వినాయకుడికి పూజ చేయటం మరిచిపోయారు. ఈ క్రమంలోనే ఆగ్రహం వ్యక్తం చేసిన గణనాధుడు సముద్రగర్భం నుంచి ఉద్భవించిన ఒక బిందెడు అమృతాన్ని దొంగలించి తమిళనాడు రాష్ట్రం, నాగపట్నం జిల్లా తిరుక్కాడియాయూర్ లో ఉన్నటువంటి కడేశ్వరస్వామి ఆలయంలో దాచారు.
🌸ఈ విధంగా వినాయకుడు దొంగలించి దాచిపెట్టిన అమృతం బిందె మహా శివలింగంగా ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి.
ఈ విధంగా ఈ ఆలయంలోని స్వామి వారు అమృతం నుంచి ఉద్భవించాడు కనుక ఈ ఆలయంలో వెలసిన స్వామివారిని అమృత కడేశ్వరుడిగా భక్తులు పూజ చేస్తున్నారు.
🌸ఈ క్రమంలోనే సముద్రగర్భం నుంచి అమృతాన్ని దొంగలించినందుకుగాను వినాయకుడికి " కళ్ళల్ వినయగర్ " అనే పేరు వచ్చింది.
ఇక్కడ కళ్ళల్ అంటే దొంగ అని అర్ధం.
అదేవిధంగా యమధర్మరాజు నుంచి మార్కండేయుడిని కాపాడటం కోసం పరమశివుడు ఏకంగా యమధర్మరాజును సంహరించడం వల్ల ఈ ఆలయంలో వెలసిన స్వామివారిని కాల సంహారకుడు అని పిలుస్తారు.
ప్రతి ఏటా ఈ ఆలయంలో స్వామి వారికి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా కార్తీకమాసం, దసరా, శివరాత్రి వంటి పర్వదినాలలో ఈ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.