మనసును అర్పించడమే నిజమైన పూజ. పటాటోపం కోసం చేసేది నిజమైన పూజ కాదు. త్రికరణ శుద్ధిగా, భక్తితో పూజావిధిని పాటించడం వల్ల మనలోని ఆత్మశక్తి ద్విగుణీకృతం అవుతుంది. మనలో ఉన్న ప్రాణశక్తిని ఎదురుగా ఉన్న దేవుడి ప్రతిమలో ఆరోపణ చేసి, దానిని పూజిస్తున్నాం అనుకోవాలి. అదే అసలైన పూజ. అయితే, చాలామంది నిత్యవిధిలో పూజలకు సరైన సమయం కేటాయించలేకపోతున్నారు. ఇలాంటి స్థితిని ముందే గుర్తించిన మన పూర్వికులు వివిధ ఉపచార విధానాలను అందించారు. వాటిలో ఏకోపచారం, పంచోపచార విధానాలు ముఖ్యమైనవి. ఏకోపచారం అంటే నమస్కారం చేయడం. ఆత్మసమర్పణమే ఏకోపచార పూజ. నిండు మనసుతో మనల్ని మనం దేవుడికి అర్పించుకోవడం కన్నా గొప్ప పూజ మరేం ఉంటుంది?
అందరూ ఆచరించదగినది పంచోపచార పూజా విధి. ఇందులో గంధం, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం సమర్పిస్తారు. మానసికంగానూ సమర్పించుకోవచ్చు.
లం పృథ్వీ తత్తాత్మనే గంధం పరికల్పయామి
హం ఆకాశ తత్త్వాత్మనే పుష్పం పరికల్పయామి
యం వాయుస్తత్తాత్మనే ధూపం పరికల్పయామి
రం తేజస్తత్తాత్మనే దీపం పరికల్పయామి
వం అమృత తత్తాత్మనే నైవేద్యం పరికల్పయామి
వీటిని దైవం ముందు మానసికంగా చెబుతూ నమస్కరించవచ్చు. ఈ మంత్రాల్లోని పరమార్థం పంచభూతాత్మకమైన ఈ దేహాన్ని పరమాత్మునికే అర్పణ చేస్తున్నామనే! గంధం, పువ్వులు, ధూపం, దీపం, నైవేద్యం ఈ ఐదింటిని సమర్పించి పై మంత్రాలను పఠించినా సరిపోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మంత్రోక్తంగా చేసేఉపచారాలు, దైవానికి స్వయంగా చేస్తున్నామన్న భావన ఉండాలి.