సనాతన ధర్మంలో ’స్త్రీ’ ఔన్నత్యం

P Madhav Kumar

శ్రీ గురుభ్యోనమః

నమస్తే 

 ప్రపంచంలో ఏ మతమూ, దేశమూ ఇవ్వనంత గౌరవం, మర్యాద, పూజనీయత కేవలం సనాతన ధర్మంలో మాత్రమే స్త్రీకి ఇవ్వబడింది. అసలు ఇంకా చెప్పాలంటే, పురుషునికన్నా స్త్రీనే ఒక మెట్టు ఎక్కువ అని ఎన్నోసార్లు చాటిచెప్పింది నా ధర్మం, నా దేశం, నాజాతి. అనాదియై, ఉన్నతమైన ఎన్నో భావాలు కలిగి ప్రపంచానికి, ఈ లోకానికే కాదు పారలౌకిక వాసులకీ సంస్కారం నేర్పిన గడ్డ ఈ గడ్డ. ఇక్కడ పుట్టినందుకు, జీవిస్తున్నందుకు గర్విస్తున్నాను.   

ఒక్క భారతదేశంలోనే,

ఒక స్త్రీ మూర్తిని చూస్తే మాతృమూర్తిగా గౌరవిస్తాం, ఏంటమ్మా అని పలకరిస్తాం.

ఒక స్త్రీ మూర్తిని చూస్తే అక్కగానో, చెల్లిగానో, పిన్నిగానో, వదిన గానో, అమ్మగానో, అమ్మమ్మగానో వరస కలిపి గౌరవించి మాట్లాడడం ఒక్క భారతీయజాతికి మాత్రమే తెలుసు.

ఒక స్త్రీ మూర్తి భారత దేశంలో కేవలం మనిషి కాదు, దైవం, పరాదేవత. సుహాసినీ పూజ చేసినా ఆమెకే, బాల పూజ చేసినా ఆమెకే.

ఒక స్త్రీ మూర్తి వివాహానంతరం భార్యాభర్త ఇద్దరూ సమం, అసలు ఆమెయే ఎక్కువ కూడా, మా వేదాలు, శాస్త్రాలు, ప్రమాణ గ్రంథాలు అలానే చెప్పాయి. ఆమెయే గృహం, అందుకే ఆమె గృహిణి, ఆమె ఇంటిలో ఉంటున్నందుకు అతడు గృహస్థు. పెళ్ళి అయ్యీ అవ్వగానే, ఆ వ్యక్తికి సంబంధించిన సమస్తమునకూ ఆమె యజమానురాలు. అదీ మాజాతి. అందుకు భిన్నంగా స్త్రీని ఒక భోగ వస్తువుగా చూడడం, ఆనక వదిలేయడం అవైదికమూ, భారతీయతా కాని, అనాగరికులు సంస్కార హీనులైన అన్య జాతులు, పాఖండ మతస్తుతల ఆనవాయితీ.

            నిజానికి సనాతన ధర్మంలో, స్త్రీ మూర్తి లేకుండా ఏ మంగళమూ లేదు, మన దేశంలో స్త్రీ మూర్తిలేని ఇల్లు గబ్బిలాల కొంప వంటిదని అభిప్రాయం. ఇంట్లో కళ కళ లాడుతూ స్త్రీమూర్తి తిరుగుతూ దీపం పెట్టిన ఇల్లే దేవాలయం. ఆమెయే దేవత. స్త్రీలేకపోతే మగవానికి గౌరవమే లేదు. ఎంత గొప్పవాడైనా తన పక్కన భార్యగా స్త్రీమూర్తిలేకపోతే ఏ వైదిక కార్యక్రమమూ చేయలేడు. అసలు సనాతన ధర్మంలో ప్రవర్తిస్తున్న భారతజాతిలో పురుషుడు ఏ కార్యం నిర్వహించినా చేసినా స్త్రీ గౌరవాన్ని ప్రకటించకుండా ఉండదు. (ఇది నిక్కం, తఱచి చూడండి, భారతీయ జీవన విధం విశ్లేషించండి. ఊసుపోక ఏదో గాలి రాతలు రాయడం నాకలవాటులేదు.) 

          అసలు సనాతన ధర్మానికి మూల ప్రమాణం వేదం, ఆ వేదాన్నే వేద "మాత" అని పిలుస్తాం. అన్య మత గ్రంధాలలో ఒక్క గ్రంధాన్ని చూపండి ‘అమ్మగా’ కొలవబడే గ్రంథాన్ని. అసలు ఒక సంవత్సర కాలంలో జరగవలసిన ఉపాసనకు ఆది "దేవీ నవరాత్రులతో" స్త్రీని అమ్మవారిగా పూజించడంతో మొదలు. అంత గొప్పది నాజాతి, నా ధర్మం, అంత గొప్పతనం మా స్త్రీ మూర్తులది. స్త్రీమూర్తులు అంత గొప్పగా కీర్తించి పూజించబడ్డారు నాదేశంలోనే! మరే దేశంలోకాదు, మరే మతంలో కాదు. అసలు భక్తి విశ్వాసాలు పక్కన పెట్టండి, స్త్రీలను గారవించాలనే కనీస విశాల దృక్పథం అలవడడానికి కూడా నోచుకోని సంస్కార హీనమైన జాతులు ఎన్నో, వారు  మన దేశ ఔన్నత్యాన్నీ, సనాతన ధర్మ ఔన్నత్యాన్నీ తెలుసుకుని మారి, వారి దేశాలు వదిలి ఆధ్యాత్మికత, "సంస్కారం కోసం" మన దేశం పట్టారు. మనం మనది కాని తక్కువదాన్ని ప్రోగు చేసుకోవడం కోసం ఎదురు దారి పట్టాము.

    ఈ అవైదిక వాదనలు ప్రబలి కట్టుబాట్లు సడలి సినిమాలు, దిన, వార, పక్ష, మాస పత్రికల పేర్న అశ్లీలం జొప్పించే సాహిత్యం వలన అక్కడక్కడా కొందరు సంస్కార హీనులై రాక్షసులలాగా ప్రవర్తిస్తుంటే, అది చూపించి, అదిగో మీ జాతి అని అభాండాలు వేస్తున్నారు. అది మా జాతి కాదురా, మీరూ, మీ పిచ్చి రాతలు, అలవి మీరిన స్వాతంత్ర్యం వల్ల, మీరు తయారు చేసిన విషపు పురుగులు అని గట్టిగా మనం చెప్పగలగాలి. భారతీయత, సనాతన ధర్మము రెండూ అవిభాజ్యములే, ధార్మిక జీవనపు సిద్ధాంతాలు తప్పుగా తోచేవాళ్ళు ఎత్తిచూపేది ఆచరణలో కలిగిన లేదా కలిపింపబడిన వైక్లవ్యాలను. ఢిల్లీలో నిర్భయపై దాడి జరిగినంత ఢిల్లీవారు లేదా భారతీయులందరూ ఆ దోషులవంటివారా? మన సంస్కృతిమీద అన్యజాతుల దాడి లేనపుడు వెల్లివిరిసిన గౌరవ మర్యాదలు, సంస్కృతీ సంప్రదాయాలు తదనంతరం దెబ్బతినడానికి ధర్మ వ్యతిరిక్త భావజాల ప్రచారమే కదా! చరిత్రచూసి కాదని చెప్పగలమా!? 

          సంస్కార హీనులైన అన్యులు గెరిల్లా యుద్ధాల లాగా ఈ భారత గడ్డమీద యుద్ధం చేసినా, ఎదిరించాం, ఓడినా ఓర్చుకున్నాం ఎందుకంటే అప్పటికే ఈ జాతి నాగరికమైన, సంస్కారవంతమైన జాతి, పోతేపోనీలే మళ్ళీ సంపాదిస్తాం అనుక్కున్నాం తప్ప, తప్పుడు యుద్ధాలు, కుట్రలు ఎరుగని జాతి ఇది. ఓర్పు, క్షమ, ఔదార్యం, సంస్కారం అంటే ఏమిటో మన నరనరాల్లో, మన రక్తంలో ఉన్నది. మనమే కావాలనుక్కుంటే, భూప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకునే వారం, కానీ పూర్వులచే పొందిన సంస్కారంతోటి, శాంతి కాముకత్వం వలన యుద్ధాలకి వ్యతిరిక్తులైన జాతి నా జాతి. ఇప్పుడు నాగరిక జాతి అని చెప్పుకుంటున్నవారంతా ఎటువంటి అనాగరికులో కుసంస్కారులో వారి యుద్ధరీతుల్ని, మోసపుటాలోచనలని చూస్తేనే తెలుస్తుంది. అంత నష్టం జరిపినా ఇంకా భారత జాతి హిమాలయ పర్వతంలా గంభీరంగానే నిలబడి ఉంది, ఆధ్యాత్మికంగా, రాజకీయంగా, నాగరికంగా, ముఖ్యంగా సంస్కారవంతంగా..... అందుకు కుళ్ళుకుంటున్న కుళ్ళు జాతుల మతాలు, వీళ్ళు ఎంత తొక్కినా పడగెత్తి పైకి లేస్తున్నారన్న అక్కసుతో మన ధర్మంపై కత్తిగట్టి, లేనిపోనివి ప్రచారం చేసి తిరిగి మనలో మనకి తగవులు తెస్తున్నారు. పిపీలికాన్ని బ్రహ్మాండం చేసి చూపుతున్నారు. తస్మాత్త్ జాగ్రత్త వీళ్ళబారిన పడకండి.         

          మనలో ఓ వందమందిలో ఒకరిద్దరు తప్పుడు నడవడి, తప్పుడు చేతలున్నవారు, రాతలు రాసేవారు, మాటలు మాట్లాడే వాళ్ళుండవచ్చు. వారి తప్పుడు మాటలను చేష్టలను మన జాతి అందరిమీదా, మన ధర్మంలోని అందరికీ, మన ధర్మానికీ ఆపాదించే ప్రయత్నాలు చేసి సంస్కృతినే తప్పని ఎంచే ప్రయత్నం ముమ్మరంగా సాగుతున్న పరిస్థితులు, తస్మాత్త్ జాగ్రత్త. అందునా మన వేళ్ళతోనే మన కళ్ళు పొడవడానికన్నట్లు మనవారినే మనకి వ్యతిరేకంగా వారి కుబోధలచే ఆకర్షించి వారి వేపుకు తిప్పుకుని మనపై ఏనాటినుండో యుద్ధం సాగిస్తున్నారు. గత కొన్నేళ్ళుగా మన సోదరులు అంతర్జాలంలో ఈ యుద్ధాన్ని ఎదిరిస్తూనే ఉన్నారు, వారు మహమ్మద్ ఘోరీలా, ఖిల్జీలా, మ్లేఛ్ఛులలా సంస్కారహీనులు, కుట్ర పూరితంగా, మోసంతో, నీతి నిజాయితీ వదిలినవారు కాబట్టి ఓడినా తిరిగి ఏదో ఒక విధంగా మనని ఇబ్బంది పాల్జేయడానికి, మన సంస్కృతిని దెబ్బకొట్టడానికీ వస్తూనే ఉన్నారు. ఇకనైనా, తస్మాత్ జాగ్రత్త! జాగ్రత్త! ఇటువంటి ఆపదలు వచ్చినప్పుడు హుందాగా, గంభీరంగా వ్యవహరించాల్సిన మనం మన స్వస్థితిలోనుండి జారిపోరాదు. మనకి మనం పరాకు చెప్తూనే స్వధర్మాన్ని కాపాడుకోవలె. అన్య సంస్కృతి, లేని అసమానతలు ఎంచి చూపే విషభావజాల ప్రచారమే కదా స్త్రీని మాతృమూర్తిగా దర్శించే దర్శనాన్ని తోసిరాజని ఆడతనం చూసే దిశగా తరాలుగా యువతలో విషపుటాలోచనలు రేకెత్తించినదీ, రేకెత్తిస్తున్నదీ....

         కన్న తల్లి దండ్రులను బహిరంగంగా అంతర్జాలంలో తిడుతూ వ్యాసాలు రాసే నియతిలేని కమ్యూనిష్టులనెరుగుదును, అటువంటి నియతిలేని మనుషులు కూడా సుద్ధులు చెప్పడానికి, మన ధర్మంలో లోపాలెంచటానికి కంకణం కట్టుకున్నారు. మనం వారిలా విషం కక్కనక్కరలేదు, కుళ్ళు కుతంత్రాలు చేయనక్కరలేదు.మన దగ్గర ఉన్న అమృతతుల్యమైన సంస్కృతీ సంప్రదాయాలు, ధార్మిక జీవన విధానాల విషయాన్ని, సనాతన ధర్మ ఔన్నత్యాన్నీ, హిమాలకన్నా ఎంతో ఉన్నతమైన భారతీయ సంప్రదాయపు సంస్కారాన్నీ ప్రకటించడం ద్వారా వారి విషవాక్కులకు విరుగుడు కలగించడం మేలైన పద్ధతులలో ఒకటి.     

         సరి అది వేరు విషయంగా విశ్లేషించవచ్చు.. ప్రస్తుత విషయంలో అసలు ’స్త్రీ’ మూర్తులగూర్చి మన వాజ్ఞ్మయం ఎలా కీర్తించింది, మన దేశంలో స్త్రీ మూర్తులు ఎట్లా గౌరవించబడ్డారు/గౌరవించబడుతున్నారో తెలిసినంత తెలియబడినంత ప్రకటించాలని ప్రయత్నం. ఉన్న 99.9999999......9% మంచిని కనీసంగానైనా చూపక ఆ మిగిలిన ఫ్రాక్షన్ శాతం చెడును భూతద్దంలో 100%గా చూపి దాన్ని సనాతన ధర్మంలో చరించే అందరికీ ఆపాదించే కుసంస్కృతిని నిలువరించటానికే చిఱు ప్రయత్నం. ఆపై జగజ్జనని, పరాదేవత అనుగ్రహం.       

     "మన అమ్మ పలురకాల చీరలు కట్టినా మనం అమ్మను ఒకేవిధంగా చూస్తాము . అమ్మకూడా తన బాధ్యతలరీత్యా ఒకరికి కూతురుగా ఒకరికి భార్యగా ,మనకు అమ్మగా, బాబాయిలకు వదినగా, నానమ్మకు కోడలుగా, బహురూపాలుగా విధులునిర్వర్తిస్తున్నా అమ్మమాత్రం ఒకటే." (బ్లాగు మిత్రులొకరు తమకు స్త్రీ మీదున్న గౌరవాన్ని ఇలా ప్రకటించారు..)

       ఈ జాతిలో పుట్టిన ఏ వ్యక్తికైనా ప్రతి స్త్రీ అమ్మయే. అలా ఎలా అండీ, అందరినీ తల్లి అనుక్కున్నా భార్య భార్యే కదా తల్లి ఎలా అవుతుందీ అని అంటారా? అదీ మాధర్మం, మా శాస్త్రం గొప్పదనం అవి అలానే అంత గొప్పగానే చెప్పింది. అదీ మా ఐడియాలజీ? సనాతన ధర్మపు ఐడీయాలజీని ఒక వర్ణానికి పరిమితం చేసి తిట్టాలనుక్కునే "జస్ట్ కప్ & సాసర్" తరహా మార్క్స్ ఐడియాలజీ కాదు మాది. పెళ్ళినాటి మంత్రాలలో పెళ్ళికొడుకు, పెళ్ళికూతురిని అడిగే కోరిక అదే. నీకు గంపెడు మంది పిల్లలు పుట్టినా నీకు చివరి కొడుకును నేనే అవ్వాలి అని వరమడుగుతాడు. కారణం బయట ఉద్యోగం, వ్యవసాయం చేసి సంసారాన్ని సాకడంవల్లనో, అలసట వల్లనో, అహంకారం వల్లనో, మూర్ఖత్వం వల్లనో, చాదస్తం వల్లనో ముసలివాడినయ్యాక అలిగినా, బుంగ మూతి పెట్టుకున్నా, నీకు ఓపిక లేకున్నా, గంపెడు మంది సంతానాన్ని పెంచి పెద్ద చేసిన అనుభవమున్న కారణాన "ఈ వయసులో ఏమిటీ చాదస్తం, వెర్రి వేషాలు అనుక్కోకుండా అప్పటికి ముసలివాణ్ణయిన నన్నూ నీ చిన్న కొడుకులాగా ప్రేమగా చూసుకో అని ప్రమాణ పూర్తిగా, పెద్దలముందు అడుగుతాడు". అదీ నాజాతి ’స్త్రీ మూర్తి’ కిచ్చిన గౌరవం. ఊరికే పక్క దేశాలనుంచి అరువు తెచ్చుకున్న ఎరుపుదనం, నల్లతనం, ఇంకా అవతలి వేపు నుంచి తెచ్చుకున్న విచ్చలవిడి స్వాతంత్ర్యంతో నోటికొచ్చినట్లు పొల్లు మాట్లాడిన జాతి కాదు నా జాతి.        

         ’మాతృదేవోభవ’ అని చెప్పి స్త్రీ మూర్తికి మొట్టమొదటి పెద్ద పీటవేసిన వాజ్ఞ్మయం మా సొత్తు. యత్రనార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని నొక్కి వక్కాణించే ధర్మం మాది. విచ్చలవిడితనం, విశృంఖలత్వం హెచ్చు మీరిపోయి, ఇండివిడ్యుయాలిటీ పేర పెద్దలమాట వినకపోవడం, ఎదురుతిరగడం, తప్పు చేయడం గొప్ప అని చెప్పుకోవడం వంటివి ప్రచారం జరిగి నేటి యువత ఆలోచనా పద్ధతులను మార్చడానికి సైద్ధాంతిక దాడులు జరిపి వక్రమార్గాలలో నడిపిస్తున్నవి ఆ అవైదిక విధానాలే. మన నుంచి, మన పిల్లలనుంచి మనదైన సంస్కృతిని, భారతీయ జీవన విధానాన్ని దూరం చేసి, మన ధర్మం మీద మనకే నమ్మకంపోయేలా కొందరు చేస్తున్న దురాగతం.

         అందరూ కలిసిమెలసి జీవించడం, ఒకరినొకరు గౌరవించుకోవడం, కలిసి ఆడడం, కలిసి పని చేయడం, కలిసి భోజనం చేయడం, ప్రసాద బుద్ధితో జీవించడం, ఒకరికొకరు తోడు నిలవడం, బండికి ఒక చక్రం తండ్రైతే ఇంకో చక్రం తల్లిగా మెలిగే కుటుంబ నేపథ్యం మా సొత్తు. అందరిలోనూ దేవుడున్నాడు, దేవుడు లేడు, ధర్మం లేదు అనేవాళ్ళలో కూడా మూర్ఖనారాయణుడున్నాడు అని చాటి చెప్పి తన భార్యలోనే జగదంబను దర్శించిన  'శ్రీ రామకృష్ణ పరమహంసాదులు' మా ధర్మ వనంలో పూసిన పూలు (ఎప్పటి ఉదాహరణలో ఐతే ఆకాలం వేరు ఈకాలం వేరంటారు). వారు మాకు ఆదర్శం. క్షమ, ఓపిక, ఔదార్యం మా ఆస్థులు. మాలో ధీరులెందరో ఉన్నారు, అవసరార్థం ధర్మంపై జరుగుతున్న కుయుద్ధంలో అవైదిక వాదనలనీ, కుట్రలనీ, కుతంత్రాలనీ, ధర్మ పరంగానూ, చట్ట పరంగానూ ఎద్రుర్కొనే వీరులు. 

"అర్థం భార్యా మనుషస్య - భార్యా శ్రేష్ఠ తమ సఖాః

భార్యా మూలం త్రి వర్గస్య - భార్యామూలం తరిష్యతః"

         సనాతన ధర్మంలో పురుషుని జీవితంలో భార్య అర్థ భాగం. సహజీవనంలో, సంతాన పాలనంలో, సంసార యాత్రలో అన్నిటా సగభాగం భార్య. అందుకే ఆమె అర్థాంగి. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులే అర్థనారీశ్వరతత్త్వంతో స్త్రీ పురుషుల స్థితిని లోకానికి చాటుతున్నారు. అదీ భారతీయత. ప్రతి పురుషునికీ జీవితంలో అందరినీ మించిన స్నేహితురాలు ఎవరయా అంటే భార్య. గొప్ప స్నేహితులుండవచ్చు, భార్యనుమించిన స్నేహితురాలుండదు. అల స్నేహాన్ని నెరపాలి. భార్య భగవంతుడిచ్చిన ఒక జీవిత కాలపు 'నెచ్చెలి' అన్నది మా జాతి మాట. ధర్మ, అర్థ, కామములనే పురుషార్థముల సమన్వయాన్ని సాధించి నాలుగవ పురుషార్థమైన మోక్షాన్ని పొందటానికి  మూలం భార్య. ఆమె మూలంగానే పురుషుడు తరిస్తాడు, మరి ఆవిడ? ఆమే అంతే వినయంగా అతనిననుసరిస్తుంది. అదీ సనాతన ధర్మంలో భార్యా భర్తల సంబంధం. స్త్రీకున్న గొప్పదనం. సనాతన ధర్మంలో స్త్రీపురుషుల మధ్య పవిత్ర ధర్మ బంధం 'వివాహం' తప్ప అన్యస్తులలా కేవల "ఆడమగ సంబంధం"కాదు, "ఆ ఆడమగ సంబంధాన్ని కేవలం చట్టబద్ధం" చేయడమూకాదు.

"స్త్రీ యాంతు రోచమానాయాం - సర్వమ్ తద్రోచతే కులమ్" ఎక్కడ స్త్రీ సంతోషముతో ఉంటుందో ఆ వంశము ఆనందంగా ఉంటుంది.

        "సదా ప్రహృష్టయా భావ్యం... గృహ కార్యేషు దక్షయా" ఇంటిలో సదా ఆనందంగా ఉంటూ, అందరినీ ఉల్లాస పరుస్తూ, ప్రహృష్టమైన వదనంతో ఇంటిల్లిపాదినీ చక్కగా చూసుకునే పెద్దదిక్కు (వయసులో చిన్నైనా) ఆయింటి యింతి. గృహ నిర్వహణలో ఎవరికేమి కావాలో, ఏది ఎవరికి ఎలా సమకూర్చాలో దక్షతతో నిర్వహించగలిగేది స్త్రీ మాత్రమే      

 పెళ్ళినాటి మంత్రాలలో కూడా, నేను సంపాదించినది తీసుకువచ్చి నీకిస్తాను, ధనాన్ని ఖర్చు చేయటంలోనూ వృద్ధి చేయటంలోనూ సంపూర్ణ అధికారం నీకిస్తున్నాను. నీవే ఈ గృహానికి యజమానివి. గృహ నిర్వహణలో నీదే ప్రధానమైన స్థాయి, కుటుంబ వ్యవహారంలో శిష్ఠాచారమును నెరపి కుటుంబ పోషణము, రక్షణ చేయడానికి పూర్తి అధికారము నీకే ఇస్తున్నాను. అని భర్త తన భార్యతో అంటాడు.

   అంతెందుకు, ధర్మ సూత్రాలలో కూడా, పెళ్ళిళ్ళు, లేదా ఇతర ఏ వైదిక సంస్కారాదులలోనైనా ధర్మ సూత్రాలలో చెప్పనిది ఏదైనా ఉంటే, కులస్త్రీలనాశ్రయించడం ద్వారా శాస్త్రములందు చెప్పబడని శిష్ఠాచారములను తెలుసుకొని ఆచరించమని చెప్పబడింది. ధర్మ శాస్త్రాలలో ఏదేని ఆచారము తెలియకపోతే తెలుసుకోవలసినది ఆ ఇంటిలేదా కుటుంబములోని శిష్ఠాచారులైన స్త్రీల వల్లనే. అంత పెద్ద పీట స్త్రీలకు నా ధర్మం ఇచ్చింది.  

  నాకు తెలుసు చాలా తక్కువే వ్రాయగలిగానని, మన వాజ్ఞయంలో సగానికి పైగా స్త్రీ ఔన్నత్యమే ఉన్నది.. రామాయణం అసలు పేరు గొప్పనైన సీతా చరితం......    

 నేలకి మూడు వానలు కురవాల్సినవి ధర్మ లోపం వల్ల కురవకపోయినా, అప్పుడో ఇప్పుడో ఇంకా కురుస్తున్నవి మాత్రం ఎక్కువపాళ్ళు ఖచ్చితంగా ఈ గడ్డమీది ధార్మిక 'స్త్రీ' నడవడివల్ల మాత్రమే! అట్టి మాతృమూర్తులందరికీ ప్రణిపాతం చేస్తూ...

-శంకరకింకర

జనవరి 2013

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat