నాగుల చవితి - Nagula Chaviti

P Madhav Kumar

 


దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని,పామును - ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకొంటూ! పూజిస్తూ వస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే ... అందులో భాగంగానే ' నాగుపాము" ను కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు.
మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.
ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుబాము' అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే ' శ్రీమహావిష్ణువు" నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ... ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని చెప్తారు.

నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజచేసి చలిమిడి, చిమ్మిలి

(నువ్వులతో చేస్తారు) అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు , తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు. ఆ సందర్భంగా పుట్టవద్ద " దీపావళి" నాడు మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు, టపాసులు మొదలైనవి చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు. సాగరతీరంలో పుట్టలో కోడిగుడ్లను వేయడం ఆచారం. నాగరాజుకు హారతి పట్టడం గాని, వేడి పదార్థాల ఆరగింపు గాని పనికి రాదు.

మన భారతీయుల చాల ఇళ్ళల్లో ఇలవేల్పు " సుబ్రహ్మణేశ్వరుడే ఆరాధ్య దైవంగా పూజిస్తారు కాబట్టి వారి పేరును చాల మంది నాగరాజు, ఫణి, సుబ్రహ్మణ్యం, సుబ్బారావు వగైరా పేర్లు పెట్తుకుంటూ ఉంటారు.

పాముల ఉపయోగాలు : ప్రతి జీవి ఇంకొక జీవికి ఏదోవిధం గా ఉపయోగపడుతూ ఉంటుంది . దీనినే సమన్వయ సహకారము (Symbiosis ) అంటాము . అన్ని జీవుల మాదిరిగానే పాములూ ' జీవపరిణామ క్రమము '(Theory of Evaluation of species(life))లో భాగం గానే ఉద్భవించాయి అని అనడం లో సందేహము లేదు .

నాగుపాము కుబుసానికి కూడా మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నాయని, గరళాన్ని ఆయుర్వేద మందులలో తగుమోతాదులతో ఉపయోగిస్తారని ఆయుర్వేదశాస్త్రం చెబుతోంది. ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి " నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా " రైతు " కు పంటనష్టం కలగకుండా చేస్తాయట!. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.

వ్రతం ఆచరించే పద్ధతి / ఫూజ చేయు విధానము : దైవారాధన ఒక నమ్మకము ... ఏనాడూ నమ్మకము మూడనమ్మకము కాకూడదు !. మూడనమ్మకాలు జీవితం లో అనర్ధాలకు దారితీయును . నమ్మకము ... మనశ్శాంతిని , మనోబలాన్ని ఇస్తుంది .

నాగులచవితి రోజున ఉదయాన్నే లేచి తలంటు పోసుకొని ఇంట్లో దేవుని వద్ద దీపారాధన చేయాలి. ... , ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. తర్వాత పూజామందిరము, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. పూజామందిరంలో కలశమును ఏర్పాటు చేసి దానిపై ఎరుపు వస్త్రాన్ని పరుచుకోవాలి. నాగేంద్రస్వామి (పాముపడగ) ప్రతిమను గానీ, లేదా ఫోటోనుగానీ పూజకు ఉపయోగించాలి.

పూజకు మందారపూల, ఎర్రటి పువ్వులు, కనకాంబరములు.. నైవేద్యమునకు చిన్నచిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటిపండ్లు, చలిమిడిలను సిద్ధం చేసుకోవాలి. ఉదయం 9 గంటలలోపు పూజను పూర్తి చేయాలి. పూజకు ముందు నాగేంద్ర అష్టోత్తరము, నాగేంద్ర స్తోత్రము, నాగస్తుతిః, నాగేంద్ర సహస్రనామములను పఠించడం ద్వారా సకలసంతోషాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. స్తోత్రములు పఠించేందుకు వీలుకాని పక్షములో "ఓం నాగేంద్రస్వామినే నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
దీపారాధనకు నువ్వులనూనెను వాడాలి. 7 దూదివత్తులు, ఆవునేతితో సిద్ధం చేసుకున్న దీపముతో హారతినిచ్చి నైవేద్యమును సమర్పించుకోవాలి. పూజ ముగిశాక నాగేంద్ర స్వామి నిత్యపూజ అనే పుస్తకమును తాంబూలముతో చేర్చి ముత్తైదువులకు అందజేయాలి.
తరువాత దగ్గరలో ఉన్న పుట్టవద్దకు పోయి దీపం వెలిగించి పుట్టలో పాలుపోసి పూజ చేయాలి. పూజ అయిన తరువాత నైవేద్యం పెట్టి ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి. ఇది వ్రతం ఆచరించే పద్ధతి.

నైవేద్యానికి ప్రత్యేకంగా చలిమిడి ముద్దలు, చిమ్మిరి ఉండలు పెడతారు.పాలను పుట్టలో పోస్తూ నన్నేలు నాగన్న నాకులము నేలు నాకన్న వారల నాయింటి వారల ఆప్తుల మిత్రుల నందరను నేలు పడగ త్రొక్కిన పగ వాడనుకోకూ నడుము త్రొక్కిన నా వాడనుకొనుమూ తోక త్రొక్కిన తొలగుచు పొమ్ము ఇదిగో! నూకనిచ్చెదను మూకను నాకిమ్ము పిల్లల మూకను నాకిమ్ము అంటూ ఈ విధంగా ప్రార్థిస్తారు.

ఇకపోతే.. నాగుల చవితి రోజున నాగదేవతలకు పంచామృతములతో అభిషేకం చేయిస్తే సర్వం సిద్ధిస్తుందని నమ్మకం. అలాగే.. దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ, నాగేంద్ర సహస్రనామపూజలు చేయించడం శుభదాయకం. ఇంకా మోపిదేవి ఆలయం, నాగేంద్రస్వామి పుట్టలను నాగుల చవితి రోజున సందర్శించేవారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు అంటున్నారు. అందుచేత అందరూ నాగుల చవితి రోజున నాగదేవతలను నిష్టతో పూజిద్దాం..!.
చెవిబాధలు, కంటిబాధలు ఉన్నవాళ్లకు చవితి ఉపవాసం మంచిది. నాగవస్త్రాలు పుట్టమీద పెట్టి తీసి ధరిస్తే మనోరథాలు తీరుతాయి.బాలబాలికలు దీపావళి రాత్రి నాగదివ్వెలను వెలిగించే చవితిని స్మరించి ఆహ్వానిస్తారు. దీపావళి పండుగ వెళ్లిన నాలుగోనాడు మనకు నాగులచవితి వస్తుంది.
సంతానానికి సర్ప పూజకు గల సంబంధాన్ని తెలపడానికి బ్రహ్మ పురాణంలో ఒక కథ ఉంది. శూరసేనుడు చంద్రవంశపు రాజు. శూరసేనుడు అతని భార్య సంతానం కోసం చాలా రోజులు తపస్సు చేశారు. చివరికి వారికి ఒక సర్పం పుట్టింది. ఆ సర్పాన్నే వీరు పెంచుతూ వచ్చారు. కొన్నాళ్లకు ఆ సర్పం మనుషుల భాషలో మాట్లా డింది. ఆ పాము తనకు ఉపనయనం చేయమని కోరింది. రాజు అలాగే చేశాడు. కొన్నాళ్లకు ఆ పాము తనకు పెళ్లి చేయమని కోరింది. ఖడ్గాన్ని పంపి ఒక రాకుమార్తెతో పెళ్లిచేసి రప్పించారు. ఆమె అత్తింటికి వచ్చి తన మగడు ఒక పాము అని తెలుసుకుంది.

ఆమె ఏమాత్రం భయపడక ఆ పాముతో కలసిమెలసి ఉంటూ ఉండేది. నన్ను చూసి నీవు ఎందుకు భయపడవు అని పాము ఆమెను అడిగింది. భర్త ఎట్టివాడైనా స్త్రీకి దైవసమానుడు. దైవాన్ని చూసి భయపడడం దేనికి అని సమాధానం చెప్పింది. అప్పుడు ఆ పాము శివుని శాపం వల్ల ఇలా అయ్యానని చెప్పి ఆమెతో కలిసి చవితి వ్రతం ఆచరించి గౌతమినదిలో స్నానం చేసి శివుని సన్నిధిలో శాపవిమోచనం పొందాడు.
పాముల పడగ నీడవల్ల పశువులకాపరులు ప్రభువులైన కథలు చాలా ఉన్నాయి. సర్వాయి పాపడు కథ ఇందుకు ఒక నిదర్శనం.
పశువు లను మేపుతూ చెట్టునీడలో నిద్రపోతూ ఉండిన పాపని విూదకు ఎండరాకుండా పన్నెండుపడగల నాగుపాము వచ్చి పడగెత్తి గొడుగుపట్టింది. తరు వాత అతనికి రాజయోగం పట్టింది. ఇటీవల కాలంలోనే జరిగిన కథ ఒకటి ఉంది. బరోడా రాణి జమునాబాయికి సంతతి లేదు. ఒక పశు వులకాపరికి పాము పడగ నీడ పట్టిన ఉదంతం విని ఆ బాలుడిని తనకు వారసునిగా చేసుకొ న్నది. అతడే సుప్రసిద్ధుడైన నయాజీరావు గైక్వారు.
----------------------------------------------

చలిప్రవేశించు నాగులచవితి నాడు మెరయు వేసవి రథసప్తమీ దివసమున అచ్చసీతు ప్రవేశించు పెరిగి మార్గశిర పౌష మాసాల మధ్య వేళ'' అని శివరాత్రి మాహాత్మ్యంలో శ్రీనాథుడు పేర్కొన్నాడు. చలికాలం ఆరంభమయ్యే కార్తీకమాసంలో చవితినాడు నాగపూజ చేయడం ఆంధ్రదేశంలో ప్రాచీనకాలం నుంచీ వస్తున్న సంప్రదాయం.

భవిష్యపురాణం 'నాగదష్టవ్రతం' గురించి చెబుతోంది.
''నాగదష్టో సరో రాజన్‌ ప్రాప్యమృత్యుం ప్రజత్యథః అధోగత్వా భవేత్సర్పో నిర్తిషో నాత్ర సంశయః''-
''రాజా! పాముకాటు పొందిన నరుడు మరణించిన పిదప పాతాళ లోకానికి పోయి విషరహితుడై సర్పజన్మ పొందుతా''డని సుమంతుడు చెప్పగా శతానీకుడు పాముకరచినవాని కుటుంబీకులు అతని మోక్షప్రాప్తికి ఏమి చేయాలని ప్రశ్నిస్తే నాగపూజను వివరించినట్లు కథ. కొన్నిచోట్ల నాగపంచమి ప్రాచుర్యం పొందితే, కొన్ని ప్రాంతాల ప్రజలు కార్తీక చతుర్థినాడు నాగపూజ చేయడం పరిపాటి. స్కందపురాణంలో దీనిని 'శాంతి వ్రతం' అన్నారు.
హైందవ సంప్రదాయంలోనే గాక జైన బౌద్ధధర్మాల్లోను నాగారాధనకు ప్రాముఖ్యం ఉంది. అమరావతీ స్తూపంలో ఫణీంద్రుడు పడగవిప్పిన చిత్రాలు ఉన్నాయి. దుర్గాదేవి పరివారంలో ఒక సర్పం కూడా ఉంది. శివుడు నాగభూషణుడు, అతని వింటినారి వాసుకి. శ్రీమహావిష్ణువు మేను వాల్చింది నాగతల్పం పైనే. వినాయకునికి సర్పం ఆభరణం, యజ్ఞోపవీతం కూడా. కుమారస్వామి వాహనమైన మయూరం కాళ్లకు సర్పాలు చుట్టుకొని ఉంటాయి.
ఆంధ్రదేశం దాదాపు 2500 సంవత్సరాల క్రితం నాగరాజుల ఏలుబడిలో ఉన్నట్లు, వారివల్లనే ఈ దేశానికి నాగభూమి అని పేరు ఏర్పడిందని బౌద్ధగాథలు వెల్లడిస్తున్నాయి. సర్పం జాతీయచిహ్నంగా గల ప్రాచీన తెగ నాగులని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. ఆంధ్రదేశంలో నాగపూజ పరంపరాగతంగా వస్తోంది. శాతవాహనుల నాటి బౌద్ధాచార్యుడు నాగార్జునుని పేరులో నాగశబ్దం ఉంది. నాగవరం, నాగపట్నం, నాగులపాడు మొదలైన గ్రామనామాలు; నాగయ్య, నాగమ్మ వంటి వ్యక్తి నామాలు; నాగులేరు, నాగరం, నాగుల చీర మొదలైన విశేషనామాలు తెలుగునాట ప్రసిద్ధం. అమరావతి స్తూపంలో నాగబు శాసనస్థమైన తొలి తెలుగు మాటగా వేటూరి ప్రభాకరశాస్త్రి గుర్తించారు. మహావిష్ణువు చాతుర్మాస్యానంతరం నిద్రలేచే ఉత్థానేకాదశికి ఈ నాగులచవితి దగ్గరగా ఉన్నందున కార్తీక శుద్ధ చవితి నాడే నాగపూజ ఆంధ్రుల ఆచారం. ఆనాడు జ్యోతిర్మండలంలో అనంత శయనాకృతి కనిపిస్తుందని చెబుతారు. ''నాగులచవితికి నాగన్న, స్నానం సంధ్యలు నాగన్న పువ్వులు పడగలు నాగన్న మడిబట్టలతో నాగన్న''-,

నాగారాధన ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉంది. సర్పం వర్షాధిదేవత అని రెడ్‌ ఇండియన్ల నమ్మకం. రోమన్లు పసాన అనే జాతి సర్పాన్ని సౌభాగ్య దేవతగా పరిగణిస్తారు. యూదులు, అరబ్బులు కూడా పాములను కూపాధిష్ఠాన దేవతలని నమ్మేవారు. అవి నదులను వాగులను ప్రవాహాలతో నింపగలవని విశ్వాసం. సర్పాలు పంటలను కాపాడే దైవాలుగా, నిధి నిక్షేపాలకు రక్షకులుగా కూడా భావిస్తారు.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat