*సూర్యగ్రహ జననం - 3*
🪷🪷🪷🪷🪷🪷🪷🪷
వైకుంఠం , శయన భంగిమలో వున్న శ్రీమహావిష్ణువు తటాలున లేచి కూర్చున్నాడు. శ్రీమహాలక్ష్మి హస్త పద్మాలకింది నుంచి ఆయన పాద పద్మాలు జారిపోయాయి. ఆమె నయన పద్మాలు ఆయన వైపు తిరిగి , ఆశ్చర్య కిరణాల్ని ప్రసరించాయి.
*"స్వామీ , ఇక్కడున్నారు. కానీ ఇక్కడే లేదు ! ఏం జరిగింది ?"* లక్ష్మి ప్రశ్నను ఆమె దరహాస ధ్వని పెనవేసుకుంది.
విష్ణువు నెమ్మదిగా ఆమె వైపు తిరిగాడు. *"లక్ష్మీ ! ఇలా... నా... కుడి కంటిలోకి "చూడు !"*
లక్ష్మి వినయంగా చూస్తూ కొద్దిగా ముందుకు జరిగింది.. ఆమె దృష్టి కిరణాలు పతిదేవుడి దక్షిణ నేత్రంలోకి దూసుకుంటూ వెళ్ళాయి.
*"చూస్తున్నాను. ఆ నల్లని కంటిలోని తెల్లని చూపుని !"* లక్ష్మి నవ్వుతో హెచ్చరించింది.
*"ఎవరు కనిపిస్తున్నారు !”* విష్ణువు ప్రశ్నించాడు.
లక్ష్మీదేవి ఎర్రటి పెదవులు చిరునవ్వుతో విచ్చుకుని ముత్యాల్లాంటి పళ్ళని స్వామికి చూపించాయి. *"ఇంకెవరు కనిపిస్తారు? మీ అర్ధాంగే !”*
శ్రీమహావిష్ణువు తల అటుయిటూ వూగింది. మకరకుండలాలూ అందంగా ఊగిసలాడుతూ ఆయన నీలి రంగు చెక్కిళ్ళకు బంగారు రంగు పూశాయి.
*"నువ్వు కాదు ! నీ స్థానం మా నయనం కాదు - హృదయం! మరిచిపోయావా ?”*
విష్ణువు కంఠంలో చిరునవ్వు పలికింది. *"ఎందుకు మరచిపోతాను ? విష్ణుహృదయం యీ విష్ణుప్రియ శాశ్వత నివాస స్థానం ! అయినప్పటికీ నాపతి దేవుల అణువణువులోనూ నేనుంటాను. మీ సర్వమూ నాదే. మీ సర్వస్వంలోనూ ఉంటాను !"* లక్ష్మి నవ్వింది. విష్ణువు చిన్నగా నవ్వాడు. *"అది భావ పరాకాష్ట ! వ్యక్తీకరణలో అతిశయోక్తి సుమా !"*
అయితే మీ దక్షిణ నేత్రంలో నేను లేనంటారు ! ఇంకెవరున్నారో చెప్పండి ! ఎందుకైనా మంచిది , ముందుగా తెలుసుకుంటాను !"* లక్ష్మి మొహాన్ని *'అలకరంగు'* అలుముకుంది.
*"సూర్యుడు !"* విష్ణువు నవ్వుతూ అన్నాడు.
*"సూర్యుడా !"* లక్ష్మి ఆయన కుడికంటిలోకి తన చూపుల్ని గుచ్చుతూ , అంది. *"సూర్యుడే ! సూక్ష్మ రూపంలో వున్నాడుగా !"*
*"ఔను ! మీ పద్మనయనంలోకి చూస్తూ వుంటే - ఏవో ఊహాలోకాలలోకి ఎగిరి పోయాను !"* లక్ష్మి నవ్వుతూ అంది. *"కుడికంటిలో సూర్యుణ్నీ , ఎడమ కంటిలో చంద్రుణ్ణి వుంచుకున్నారుగా !"*
*"శుభవార్త విను , లక్ష్మీ !"* విష్ణువు లక్ష్మినే తదేకంగా చూస్తూ అన్నాడు. *“మా దక్షిణ నేత్రంతో సూక్ష్మ రూపంలో వున్న సూర్యుడు స్థూల రూపంతో , సశరీరంగా – జన్మించాడు !”*
*"అలాగా !"* లక్ష్మి మొహం వికసించింది. *"ఇది నిజంగా శుభవార్తే , స్వామీ !”* లక్ష్మి ఆగి , పతిదేవుడి కుడికంటిలోకి దేనికోసమో వెతుకుతున్నట్టు చూసింది. *"అయితే... ఇప్పుడింక ఆ సూర్యుడు సూక్ష్మరూపంలో మీ నేత్రంలో లేడన్నమాట. నన్నెందుకు చూడమన్నారు ?”*
విష్ణువు లక్ష్మి అమాయకత్వానికి నవ్వుతున్నట్టుగా - పెదవులమీద చిరునవ్వు వెన్నెల చిందించాడు. *“ఎందుకు లేడు ? ఉన్నాడు. శాశ్వతంగా వుంటాడు !"*
*“ఇక్కడ వుంటూ , ఎక్కడో జన్మించాడు కాబట్టి , ఇక్కడ మీ కంటిలో అతని కాంతి కొంత తగ్గి వుంటుంది. కాదా స్వామీ ?"* లక్ష్మి సందేహాన్ని వ్యక్తం చేసింది.
*"నీ అమాయకత్వం చూస్తూంటే మాకు ముచ్చటేస్తోంది ! నీ సందేహంలో ఒక పరమార్థంలాంటి సందేశం దాగి వుంది !”* విష్ణువు సాలోచనగా అన్నాడు. *“నీ సందేహాన్ని నీ ద్వారానే నివృత్తి చేద్దాం. అదిగో అక్కడున్న దీపాలను చూడు. ఒక దీపంలోని మంటతో రెండో దీపాన్ని వెలిగించు !"*
లక్ష్మిదేవి దీపాలవైపు చూసింది. *"రెండు జ్యోతులూ వెలుగుతున్నాయిగా , స్వామీ !”* అంది నవ్వుతూ, నాథుని వైపు చూస్తూ.
*"చూడు ! నీ చేత మళ్ళీ వెలిగించబడే అదృష్టం కోసం ఒక దీపం ఆరుతోంది !"* శ్రీమహావిష్ణువు నవ్వుతూ అన్నాడు.
లక్ష్మి చూసింది. ఒక దీపకళిక సన్నగిల్లుతోంది... ఆరిపోతోంది... ఆరిపోయింది ! ఆమె మొహం ప్రాణేశ్వరుడి వైపు తిరిగింది. ఆమె వెలుగుతున్న జ్యోతుల్లాంటి విశాల నేత్రాల మీద , బోర్లించిన అరచేతుల్లా వున్న అందమైన కనుబొమలు కదిలి , మధ్యలో కలుసుకుని ముడిపడి , ప్రశ్నార్థకంగా మారాయి.
*"లే లక్ష్మీ ! వెళ్ళి , జ్యోతిని వెలిగించు !"* తాను ధరించే విల్లులా వున్న లక్ష్మిదేవి కనుబొమ్మల్ని పారవశ్యంగా చూస్తూ అన్నాడు శ్రీహరి.
లక్ష్మి బంగారు ప్రమిదలపు వయ్యారంగా అడుగులు వేసి , వెలుగుతున్న దీపంతో , ఆరిన దీపాన్ని వెలిగించింది. విష్ణువు లేచి , ఆమె దగ్గరగా నడిచాడు. భుజాల మీద రెండుచేతులూ వేసి , ఆమెను వెలుగుతున్న జ్యోతుల వైపు తిప్పాడు. వెనుక నిలుచుని , కొద్దిగా వొంగి , ఆమె భుజం మీద తన గెడ్డాన్ని ఆన్చాడు.
కెందామర రేకులాంటి తన చెంపతో , నల్ల కలువ రేకులాంటి తన నాథుడి చెంపను ప్రేమగా అదిమింది లక్ష్మి అప్రయత్నంగా.
*"లక్ష్మీ... జాగ్రత్తగా ఆ జ్యోతుల్ని చూడు !"* శ్రీ మహావిష్ణువు హెచ్చరించాడు. *"రెండు దీప కళికలూ సమానంగా వెలుగుతున్నాయి కదూ. నీ కళ్ళ లాగా ?”*
*"ఔను !"* లక్ష్మి జ్యోతుల్నే చూస్తూ అంది.
*"మొదటి దీపం లోని కాంతిని ఉపయోగించి , రెండవ దీపాన్ని వెలిగించావు ! జాగ్రత్తగా చూసి చెప్పు ! మొదటి దీపం కాంతి తరిగిపోయిందా ?”* విష్ణువు ప్రశ్న లక్ష్మి చెవిలో ప్రతిధ్వనించింది.
*"లేదు..."* లక్ష్మి దీపకళికనే చూస్తూ అంది.